Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 18


    "పండి రాలడానికి సిద్ధంగా వున్న తాటిపండుమీద కాకివాలింది" అంటూ మిసెస్ వైకుంఠం పరమేశం ముఖంలోకి చూసి ఆగిపోయింది.

 

    "ఏమయితేనేం చెట్టు కింద కూర్చున్న నాలాటి ఓ అమాయకుడి బుర్ర బద్దలైంది. అంతేగా!" అన్నాడు పరమేశం.

 

    ఈ సంభాషణ పరమేశానికి అట్టే నచ్చినట్టు లేదని అర్ధం చేసుకుంది మిసెస్ వైకుంఠం.

 

    ఆమెను చూసేకగాని పుణ్యశ్రీకీ, లూకు ఆ విషయం అర్ధం కాలేదు.

 

    పుణ్యశ్రీ కళ్ళ అద్దాలు తీసి చొక్కాతో తుడుచుకొని మళ్ళీ పెట్టుకున్నాడు. చేతిలోవున్న ఆ వారం పత్రిక చిన్నగా అందించాడు పరమేశానికి.

 

    "వచ్చేవారం మన 'నీతో నిజాయితీ' జన్మదిన ప్రత్యేక సంచిక వెలువడుతుంది. మీగురించి ఓ ప్రత్యేక వ్యాసం రాస్తున్నాను సార్!" అని వినయంగా అన్నాడు పుణ్యశ్రీ.

 

    "నా గురించి ప్రత్యేక వ్యాసం రాస్తావా? నీకేమన్నా మతిపోయిందా ఏమిటయ్యా!" అన్నాడు, పరమేశం లోపలి సంతోషాన్ని బయట పడకుండా.

 

    "అమ్మమ్మ! ఎంతమాట! మీరలా అనకూడదు. నిజంగా మీ గురించి__అదే మీ గొప్పతనం గురించి, మీకే తెలియదంటే నమ్మండి సార్!" అన్నాడు లూ.

 

    "మధ్యలో నీ 'కాకా' ఏమిటయ్యా!" అన్నట్టు చూశాడు పుణ్యశ్రీ లూ ముఖంలోకి.

 

    నా గురించే కాదు. మీ గురించి కూడా నాకేం తెలియదని నమ్ముతున్నానయ్యా!" అని మిసెస్ వైకుంఠం కేసి చూసి "అవునా" అన్నాడు.

 

    మిసెస్ వైకుంఠానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక పైట సర్దుకుంది.

 

    "సార్! కాదనకండి! మీ ఫోటో ఒకటి ఇప్పించండి. మీగురించి తెలియనివారు మన టౌన్లో లేరని నాకు తెలుసు. నిజంగా మీగురించే రాస్తే మీ ఫొటో వేస్తే మా పత్రికకే వన్నెవస్తుంది" అన్నాడు పుణ్యశ్రీ వినయంగా ముఖంపెట్టి.  

 

    "అసలు సంగతి అది!" అనుకున్నాడు మనసులోనే కంట్రాక్టర్ లూ.

 

    "పుణ్యశ్రీగారూ! మీరు చెప్పదలచిందేదో సూటిగా చెప్పండి" అన్నాడు పరమేశం.

 

    "అదే మీకు కావాల్సిందేమిటో అడగమంటున్నారు" అంది మిసెస్ వైకుంఠం.

 

    "అదే సార్! అదే! మనపట్టణ జీవితం మునిసిపల్ 'డస్టుబిన్'లా అయిపోయింది. మునిసిపాలిటీ పాలిటిక్స్ గురించి నేను మీకు చెప్పనక్కర్లేదు. జనం ఈసారి ఎలక్షన్స్ లో ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్స్ లో ఒకడ్నీ బ్రతికి బయట పడనివ్వరు. జనంకూడా తెలివిమీరి పోతున్నారు సార్. ఈసారి చూడండి ఛైర్మనూ మట్టి కరుస్తారో లేదో! ఇక పోతే మనకు ఆల్ టర్ నేటివ్ లేదు. అదే పెద్ద సమస్యగా తయారైంది" క్వశ్చెన్ మార్కు ముఖంపెట్టి పరమేశం ముఖంలోకి చూశాడు పుణ్యశ్రీ.

 

    "అంటే మీ ఉద్దేశ్యం దేశం గొడ్డు పోయిందనా?" అన్నది మిసెస్ వైకుంఠం.

 

    "అని నేననడం లేదు. మహానుభావులున్నారు. నిస్వార్ధసేవా పరాయణులు వున్నారు. శక్తిసామర్ధ్యాలు కలవారు వున్నారు. నేను కాదనడంలేదే. కాని లాభం? వారు ముందుకు రావడం లేదు" పుణ్యశ్రీ పరమేశం ముఖంలో ఏదో చదవటానికి ప్రయత్నించాడు.

 

    "రాకపోతే ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మనది" అన్నది మిసెస్ వైకుంఠం అర్ధయుక్తంగా.

 

    "అవును! మేడం చెప్పింది అక్షరాల నిజం!" అన్నాడు లూ ఆమె మాటల్లోని అంతరార్ధం అర్ధం కాక పోయినా.

 

    "ఆ కార్య సాధనకే మన పత్రిక 'నీతి-నిజాయితీ'ని అంకితం చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో పత్రికకంటే బలమైన సాధనం మరొకటి లేదు. మన పట్నంలోవున్న అన్ని వర్గాల ప్రజలకు అర్ధమయే భాషలో చెబుతాను. మన పరమేశంగారంటే ఏమిటో ఆబాల గోపాలానికి తెలిసేట్టు చెప్తాను." అన్నాడు పుణ్యశ్రీ ఉత్సాహంగా.

 

    "జాన్సన్ గొప్పతనాన్ని బాస్వెల్ చెప్పినట్టు!" అందుకుని అన్నది మిసెస్ వైకుంఠం.

 

    "అంటే నీవుద్దేశం-నువ్వు నా ఫొటోవేసి నా గురించి నీ పత్రికలో రాస్తే గొప్పవాణ్ణి అవుతాననేగా?" చిరుకోపం అభినయిస్తూ అన్నాడు పరమేశం.

 

    "అమ్మమ్మ! ఎంతమాట! ఎంతమాట! అంతమాట నేనంటానా సార్!" అన్నాడు పుణ్యశ్రీ గుటకలు మింగుతూ.

 

    "స్వయం ప్రతిభా సామర్ధ్యాలున్న మీలాంటి వారు రాజకీయాల్లో ప్రవేశిస్తే ఇహ అడ్డు అంటూ వుంటుందా?" అన్నది మిసెస్ వైకుంఠం మురిపెంగా పరమేశాన్ని చూస్తూ.

 

    "అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ నరుక్కురాగల సమర్ధులు అన్నాడు లూ.

 

    "చాల్లే! నువ్వొచ్చిన పనేమిటోచెప్పు!" అన్నాడు పరమేశం కొంచెం చురుగ్గా.

 

    ఆయిల్ మిల్లు తాలుకు బిల్స్ ముందుపెట్టి "ఈరోజు శనివారం లేబర్ కు బట్వాడా ఉంది" అన్నాడు లూ నసుగుతూ.

 

    పరమేశం పుణ్యశ్రీ వైపు చూస్తూ "నీక్కావాల్సింది నా ఫొటోయేగా?" అన్నాడు.

 

    పుణ్యశ్రీ గతుక్కుమన్నాడు.

 

    "అవును సార్!" కొంచెం ఆగి "మరో చిన్న రిక్వెస్టు అన్నాడు పుణ్యశ్రీ జంకుతూ.

 

    "చల్లకొచ్చి ముంత దాస్తా వెందుకయ్యా! చెప్పు!"

 

    "స్పెషల్ ఇష్యూ! ఆయిల్ మిల్లు....అనాధ శరణాలయం కనీసం రెండు ఫుల్ పేజీలయినా...." నట్టుతూ అన్నాడు పుణ్యశ్రీ.

 

    "ఆయిల్ మిల్లుకూ, అనాధ శరణాలయానికీ అడ్వర్ టైజ్ మెంట్ ఎందుకయ్యా? కావాల్సిందేదో సూటిగా అడిగి తీసుకో."  

 

    "చిత్తం! అలాగేనండీ!"

 

    "రెండు పేజీలు అనవసరంగా అడ్వర్ టైజ్ మెంట్సుతో ఎందుకు ఖరాబు చేస్తావ్? ప్రజలకు ఉపయోగపడే విషయాలు రాయి."

 

    "గుడ్ ఐడియా సార్!"

 

    "ఏం రాస్తావ్?"

 

    "తమరే చెప్పండి సార్! ఏం రాయమంటారు?" అడిగాడు పుణ్యశ్రీ.    

 

    "ఇహ అదికూడా నేనే చెప్పాలా! నువ్వేం జర్నలిస్టువయ్యా?"

 

    ఏదో అనబోయి మాటలు రాక గుటకలు మింగాడు పుణ్యశ్రీ.

 

    "అయితే విను. ఈ రోజుల్లో మన గొప్పతనాన్ని గురించీ, మంచితనాన్ని గురించీ చెబితే వింటారయ్యా జనం. మన జనానిది మంచిని త్వరగా మర్చిపోయే తత్వం. చెడును గురించి చెప్పు.... ఎంతయినా చెప్పు, ఆహారం-నీళ్లూ లేకుండా కూడా వింటారు" అంటూ ఓ క్షణం ఆగి అందర్నీ మార్చి మార్చి చూశాడు పరమేశం.

 

    "బ్రహ్మాండం సార్!" అన్నాడు 'లూ'.

 

    తను అనాల్సిన మాటలు లూ అన్నందుకు పుణ్యశ్రీకి చిర్రెత్తి పోయింది. లూ కేసి చురచురా చూశాడు.

 

    "తమరు చెప్పండి సార్!" అన్నాడు పుణ్యశ్రీ.

 

    "అందుకని మన ప్రత్యర్ధి చంద్రమౌళి అవినీతి, కళ్ళూ గురించి ఆ రెండు పేజీల్లో చెప్పు. చాలకపోతే నా గురించి రాయదల్చుకున్న పేజీలు కూడా అతని కుళ్ళుతోనే నింపేయ్. మన ప్రత్యర్ధిని ప్రజలు ఎంత అవినీతిపరుడనీ, అసమర్ధుడనీ భావిస్తారో, అంతకు రెండింతలు మనల్ని నీతి పరులనీ, సమర్ధులనీ అనుకుంటారు. ఆ మాటకొస్తే, అసలు మనల్ని గురించి ప్రజలకు తెలియనక్కర్లేదోయ్. అవతలివాడి చెడుగురించి తెలిస్తే చాలు" అన్నాడు పరమేశం.

 

    "హాట్సాఫ్ సార్! నా ఈ ఇరవై ఏళ్ళ అనుభవం వృధా అని తెలుసుకున్నాను ఈ రోజు. పత్రికా రచనలో మొదటి పాఠం ఈ రోజే మీనుంచి నేర్చుకున్నాను. మూడు దిన పత్రికల్లోనూ, అయిదు వార పత్రికల్లోనూ పనిచేశాను. అందులోనూ హేమాహేమీలయిన సంపాదకుల దగ్గర పనిచేశాను. కాని ఒక్కడికి - ఒక్కడి కూడా పత్రికా రచనలో ప్రాధమిక సూత్రాలు కూడా తెలియవు. అందుకే స్వంత పత్రిక పెట్టి నానా గడ్డి కరుస్తున్నాను" పుణ్యశ్రీ పరమేశానికి సాష్టాంగపడి లేచినవాడి వాలకంలో ఉండిపోయాడు.

 

    మిసెస్ వైకుంఠం ఉక్కిరి బిక్కిరి అయిపోతూ సిగ్గును అభినయించింది.

 

    ఆమె సిగ్గుపడటం పంటే ఏమిటో మర్చిపోయి చాలా ఏళ్ళయింది. అందుకే అవసరం అయినప్పుడు అభినయిస్తూ వుంటుంది.

 

    బయట కారు హారన్ మ్రోగింది. పోర్టికోలో కారు వచ్చి ఆగింది.

 

    "ఒరేయ్ అప్పన్నా అమ్మాయి వచ్చినట్టుంది! డ్రైవర్ కు చెప్పు. మిసెస్ వైకుంఠంగార్ని ఇంటి దగ్గర దింపి రమ్మని" పరమేశం నౌకర్ని కేకవేసి చెప్పాడు.

 

    రాణి సునందను వెంట బెట్టుకొని హాల్లోకి వచ్చింది. అప్పన్న కార్లో నుంచి చీరలున్న అట్టల పెట్టెలు తీసుకొని వెనకే వెళ్లాడు.

 

    రాణి విశాలమైన ఆ హాల్లో పైన వ్రేలాడుతున్న ఛాండ్లియర్ క్రిందగా గర్వంగా, వయ్యారంగా నడుస్తూ, సునంద చెయ్యిపట్టుకొని రెడ్ కుషన్ కార్పెట్ పరిచివున్న మెట్ల దగ్గరకు తీసుకొచ్చింది.

 

    సునంద నిర్లిప్తంగా, ముభావంగా రాణి పక్కనే నడిచి, మెట్లెక్కి పైన మరొక గదిలో ప్రవేశించింది.

 

    రాణి తన ప్రతి మాటలోనూ, ప్రతి కదలికలోనూ తన అంతస్థునూ, నాగరికతనూ ప్రదర్శిస్తూ వుంది.

 

    "ఒరేయ్ అప్పన్నా! లక్ష్మిని పిలువ్! అని నౌకరుకు చెప్పి సునందకేసి తిరిగి "ఏమిటలా నిల్చున్నావ్?" అంటూ భుజాలమీద చేతులు వేసి డన్ లప్ బెడ్ మీద కూర్చోపెట్టింది.

 Previous Page Next Page