సునంద లలిత భుజం మీద చెయ్యి వేసి కూర్చో పెట్టింది.
"కూర్చో! ఎక్కడికి? ఆ విషయాలన్నీ పనికట్టుకొని వెళ్ళి చెప్పక్కర్లేదు. నువ్వు మాత్రం కృత్రిమంగా ప్రవర్తించకు. పై మెట్టు మీద నిల్చున్నవ్యక్తిని చూసి మనం నిల్చున్న మెట్టు మర్చిపోయి, మూడు మెట్ల పై మెట్టుమీద కాలువెయ్యబోయి, నాలుగుమెట్లు కిందకు దిగజారకు. మనమెట్టు ఎక్కడుందో తెలుసుకొని నిలబడితే చాలు. వాళ్ళే తెలుసుకుంటారు" అన్నది సునంద.
తలుపు ఎవరో ధన ధన కొడుతున్నారు. సునంద వెళ్ళి తలుపు తెరిచింది.
ప్రభ సింగారించుకొని సుడిగాలిలా లోపలకు వచ్చింది.
లలితనూ, సునందనూ ఆశ్చర్యంగా మార్చి మార్చి చూసింది.
"ఏమిటి లలితా? ఎందుకలా వున్నావ్? బజారు వెళ్దామన్నావ్? సుజాత కూడ తయారై పోయింది. ఐస్ క్రీం పార్టీతోపాటు సినిమాకూడా చూపించాలి తెలిసిందా! ఊ! లే! త్వరగా కానియ్!" గుక్కతిప్పుకోకుండా మాట్లాడేసింది ప్రభ.
లలిత మౌనంగా చూస్తూ వుండిపోయింది.
"ఏమిటోయ్ ఆ షేక్స్ పియర్ ముఖమూ నువ్వునూ! అరే ఏడ్చావా? కళ్ళేమిటి అలా వాచిపోయాయ్? ఇంతవరకూ గమనించనేలేదు?" నొచ్చుకుంటూ అన్నది ప్రభ.
"వాళ్ళ అమ్మగారికి వంట్లో బాగాలేదట" అన్నది సునంద.
"అలాగా? ఏం జబ్బు? ఎవరు చెప్పారు? ఇందాక వచ్చిన నౌకరు చెప్పాడా?"
లలిత చివ్వున తలెత్తింది. ముఖం జేవురించింది. ఏదో అనబోయి సునంద కళ్ళతోనే వారించడంతో ఆగిపోయింది.
"పెద్ద జబ్బేం కాదులే. ఏదో కొంచెం సుస్తీ చేసి తగ్గిందట. గారాలపట్టి గదా! ఆ భాగ్యానికే ఒకటే ఏడుపు. మానిపించే సరికి నా తలప్రాణం తోకకి వచ్చింది" సర్ది చెప్పింది సునంద.
"ఓస్ అంతేగదా! అయితే లే బయలుదేరు. చీర కొన్నాక సినిమాకు వెళ్దాం!" అన్నది ప్రభ.
"నేను ఇవ్వాళ రాలేను ప్రభా!" అన్నది లలిత.
"చీర కొనవా? నీ కోసమేగా బయలుదేరాను?" కొంచెం చిరాకుగా అన్నది ప్రభ.
"చీర కొనదల్చుకోలేదు. వున్న చీరలు చాలు. ఈ డబ్బు పొదుపుగా వాడుకోవాలి."
లలిత మాటలకు ప్రభ విస్తుబోయి చూసింది.
టక్ టక్ హైహీల్స్ శబ్దం విని అందరూ తిరిగి చూశారు.
జరీ పువ్వులు కుట్టిన ఫారెన్ నై లెక్స్ చీర కట్టుకొని, ముత్యాల నగలు పెట్టుకొని రాణి ప్రవేశించింది.
ప్రభ ఆశ్చర్యంగా రాణీని చూసింది. రాణీకి హాస్టల్లో స్నేహితురాళ్లెవరూ లేరు. అందరూ ఆమెను మహా గర్విష్టి అనుకుంటారు.
రాణీ లలితకోసం వచ్చివుంటుందనే భావం మనసులోకి రాగానే మనసులో ఈర్ష్య తలెత్తింది.
"రా! రాణీ? కూర్చో! ఐదు నిముషాల్లో తయారై వస్తాను" అంటూ సునంద రాణీని ఆహ్వానించింది.
రాణి సునంద కోసం రావడం ప్రభకు మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
తమలాంటి శ్రీమంతుల బిడ్డల్ని కూడా లక్ష్యపెట్టదు రాణి. అలాంటి రాణి సునందలో ఏంచూసి ఆమెను వెతుక్కుంటూ వచ్చిందో?
"లలితా! పోనియ్ చీర కొనవద్దులే సినిమాకు వెళ్దాం పద!" ప్రభ బ్రతిమాలుతున్నట్టు అడిగింది.
"నేను రాను! ఇవ్వాల్టినుంచి సినిమాలు, షికార్లూ బంద్. బుద్ధిగా చదువుకొని క్లాసు తెచ్చుకుంటాను."
లలిత మాటలకు ప్రభ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది.
"ఓహో! సునంద గాలి బాగా సోకినట్టుంది!" అక్కసు వెళ్ళబోసుకుంది ప్రభ.
లలిత చిన్నగా నవ్వింది. సునంద లలితవైపు గర్వంగా చూసింది.
"రేపటినుంచి బుద్ధిగా వుండొచ్చులే ఇవ్వాల్టికిరా!" బలవంతం చేసింది ప్రభ.
"ప్లీజ్ ప్రభా! నాకు తలనొప్పిగా వుంది. నన్ను వేధించకు. కాసేపు పడుకుంటాను" అంటూవెళ్ళి మంచం మీద పడుకుంది లలిత.
ప్రభ రుసరుసలాడుతూ బయటికి వెళ్ళిపోయింది.
"లలితా మాతో వస్తావా?" రాణి అడిగింది.
"లలిత రాదులే. వంట్లో బాగాలేదు" సునందే సమాధానం చెప్పింది.
లలిత చిరునవ్వు నవ్వింది.
సునంద బయలుదేరుతూ "విశ్రాంతి తీసుకో! నేను త్వరగానే వచ్చేస్తాను. అనవసరంగా ఆలోచిస్తూ మనస్సు పాడుచేసుకోకు!" హెచ్చరించింది సునంద.
తలుపులు దగ్గిరగా లాగి సునంద రాణీతో వెళ్ళిపోయింది.
11
పట్నంలో చెప్పుకోతగ్గ పాష్ లొకాలటీల్లో గాంధీనగరం ఒకటి. గాంధీ నగరంలో పావురాల మేడ అంటే తెలియని వారు చాలా అరుదుగా వుంటారు. విశాలమైన కాంపౌండులో లాన్స్, ఫౌంటెన్సూ, రోజ్ గార్డెన్ తో చిన్న సైజు రాజభవన్ లా ఉంటుంది. ఆ ఇంటికి వచ్చే పోయే వాహనాలకూ, మనుషులకూ అంతువుండదు. ఆ ఇంటిని శేఖరం తండ్రి రాజబహుదూర్ ఏనాడో కట్టించాడు. పరమేశం ఆ ఇంటిని ఎన్నో మార్పులు చేసి అధునాతనంగా తీర్చి దిద్దాడు.
స్థానిక వారపత్రిక సంపాదకుడు పూజల సుబ్రహ్మణ్యమూ మహిళా సంఘం సెక్రటరీ, సోషల్ వర్కరూ అయిన మిసెస్ వైకుంఠమూ కంట్రాక్టరు వేంకటేశ్వర్లూ వారానికోసారన్నా పరమేశంగారి దర్సనం చేసుకుపోతూ వుంటారు. పరమేశానికి వచ్చే పోయేవాళ్ళతో మాట్లాడటంతోనే సగంరోజు గడిచి పోతుంది.
డ్రాయింగ్ రూంలోకి ప్రవేశిస్తున్న పరమేశాన్ని చూస్తూనే అంతవరకూ అక్కడ కూర్చున్నవాళ్లు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు.
అందరికంటే ముందుగా పరమేశంచూపు మిసెస్ వైకుంఠం మీద వాలింది.
"నమస్కారమండీ!" ఆమె కంఠం మృదుమధురంగా లేకపోయినా, తియ్య తియ్యగానే వుంది.
ప్రతి నమస్కారం చూపులతోనే చేశాడు పరమేశం.
"నమస్కారం సార్!" అన్నాడు, ఆమెకు కుడిపక్కగా విలబడి వున్న మిస్టర్ 'లూ' !"
కాంట్రాక్టర్ అయాక వేంకటేశ్వర్లు, తన పేరు మొదలంటా నరికి కొస లూ మాత్రం వుంచుకున్నాడు.
సమాధానంగా తల ఊపాడు పరమేశం.
"నమస్తే! నమస్తే!" అన్నాడు, పుణ్యశ్రీ జారిపోతున్న కళ్ళజోడు పైకి తోసుకుంటూ.
పూజల సుబ్రహ్మణ్యం పత్రికారచనకు పూనుకొన్నాక ముద్దుముద్దుగా పెట్టుకున్న పేరు "పుణ్యశ్రీ".
అందర్నీ ఓసారి పరికించి చూసి చిరునవ్వుతో తల ఆడించి అందర్నీ కూర్చోమన్నట్టు చెయ్యి ఊపి, తను కూర్చున్నాడు పరమేశం.
"ఊఁ ఏమిటి విశేషం? త్రిమూర్తులు కలసి వచ్చారు?" అన్నాడు హుందా ఉట్టిపడే స్వరంతో.
"త్రిమూర్తులా మేమిద్దరం సరేననుకోండి? మరి మిసెస్ వైకుంఠంగారూ...."
అంటూ 'లూ' సాగదీస్తూ వుంటే పుణ్యశ్రీ అందుకొని "త్రిమూర్తుల్లో ఒకడు అర్ధనారీశ్వరుడేగదయ్యా?" అన్నాడు.
తన ఛలోక్తికి తనే విరగబడి నవ్వసాగాడు.
"అబ్బ! అబ్బ! ఏం చెప్పారు సార్! నిజంగా మీలాంటి జర్నలిస్టును ఇంతవరకూ చూడలేదు సార్!" అన్నాడు కప్పలా నోరు తెరిచి లూ.
పుణ్యశ్రీ తన తెలివికి తనే ఆనందిస్తూ వుండగా, మిసెస్ వైకుంఠం, అది పొగడ్తో, విసురో తెలుసుకోలేక, మెలికలు తిరగబోయి, అందుకు భారీ శరీరం సహకరించకపోగా ఆగిపోయింది.
"ఊఁ ఊఁ చెప్పండి ఏమిటి విశేషం?" వస్తూన్న నవ్వును దిగమింగి అడిగాడు పరమేశం.
"మేము కలిసి రాలేదు సార్! ఎవరిపాటికి వాళ్ళమే వచ్చాం! కాని ఇక్కడే కాకతాళీయంగా కలిశాం?" అన్నాడు పత్రికా సంపాదకుడు పుణ్యశ్రీ.
"కాకతాళీయం అంటే ఏమిటిసార్?" అడిగాడు కంట్రాక్టరు లూ.
"అదికూడా తెలియకుండానే వేలకువేలు ఎలా సంపాదిస్తున్నారయ్యా?" అన్నాడు ముసిముసిగా నవ్వుతూ పుణ్యశ్రీ.
పుణ్యశ్రీ కేసి చూసిన మిసెస్ వైకుంఠం "కాలాంతకుడు. పెదవులు నవ్వుతుంటాయి, నొసలు వెక్కిరిస్తుంటాయి" అనుకుంది.
"కాంట్రాక్ట్స్ చెయ్యటానికి కాకతాళీయానికి అర్ధం తెలియనక్కర్లేదు సార్!" అన్నాడు.
"ఇసుకా సిమెంటుపాళ్ళు, ఇంజనీర్ల వీక్ నెస్లూ తెలిస్తే చాలుకాదూ మిస్టర్ లూ" అన్నది మిసెస్ వైకుంఠం.
"చంపేశారు మేడం? ఆ "కాక" అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. కాని ఆ "తాళీయం" అంటేనే తెలియదు. కాస్త చెప్పండి" అన్నాడు లూ మిసెస్ వైకుంఠానికి కొంచెం దగ్గరగా సోఫాలో జరుగుతూ.