క్రిందటి వత్సర మ్మడవికీన్ జనుదెంచిన కొంతమంది గో
బృందము మేపు మా పొరుగు పిల్లలు వింతలు విన్నవింప నా
డెందము పొంగిపోయి చనుదెంచితి; అందరి కంటె ముందు మీ
ముందర మోకరిల్లితిని; మ్రొక్కితి; గుండెలు క్రుమ్మరించితిన్.
తీయని గుండెలో పరుగుతీసెడు కోరిక పుత్త్రరూపమై
యూయుల కెక్కెనేని రుచులూరగ వండి సుగంధపూర్ణమౌ
తీయని పాయసమ్ము గొని తెచ్చి యుపాయన మిత్తు నంచు నే
దోయిలి మోడ్చితిన్ చిరకుతూహలముల్ కనులన్ స్రవింపఁగన్.
చదువులు రాని యీ పరమ జానపదాంగన భక్తిపూర్ణమౌ
హృదయములోని లోతులు గ్రహించిరొ లేదొ ఎరుంగజాల; ఆ
పెదవులలోని పల్కు వినిపింపదుగాని రసప్రసన్నముల్
కదలెను చల్లఁగా ప్రభువు కన్నులు మంజుల మౌనముద్రలో.
పండెను నా పురాకృతతపస్సు; మనస్సున మాధురీసుధల్
నిండెను; ప్రాప్తమయ్యె జననీత్వము నేఁటికీ; కన్నుదోయికిన్
పండువు చేసినాఁడు పసిపాపఁడు; సాపడుఁడయ్య! తియ్యగా
వండిన పాయసమ్ము గొనివచ్చితి మ్రొక్కిన మ్రొక్కు తీర్పఁగన్.
పూర్ణను బంపుకొంటిని ప్రభూ! తమ యున్కి నెరుంగగోరి; అ
భ్యర్ణవనంబునందె గలరంచు నెరింగితి పొంగిపోతి; క్షీ
రార్ణవ మయ్యె నాదు హృదయమ్మిది; పాయసపాత్రమో కృపా
పూర్ణ! గ్రహింపవే! చవులు పుట్ట భుజించి యనుగ్రహింపవే!"
అని వినయము భక్తియు తన
మనమున పెనగొన సుజాత మధురాన్నము నిం
డిన పాత్ర స్వామి కొసఁగెను
కనుగొనల ప్రమోద బాష్పకణములు నిండన్.
పాయసపాత్రము గొని ఆ
ప్యాయముగా ఆరగించు "అమితాభుని" కం
దోయి నవచ్చవి మెరసెన్;
కాయము సురుచిర సువర్ణకాంతులు గురిసెన్.
మార పరాజయము
మాయలసూత్రధారుఁడగు మారుఁడు గౌతముదీక్ష భగ్నముం
జేయ కృతప్రతిజ్ఞుఁడయి చిత్రవిచిత్ర మహేంద్రజాలమౌ
స్వీయబలంబుతోడ నురువేల వనంబున కేగె; ఆ మహా
మాయ కుమారుఁ డీ చిలిపిమాయలు గీయలు లెక్కసేయునే?
అజ్ఞుఁడగు మారుఁడా స్థితప్రజ్ఞు మీఁద
పొంచి శాస్త్రాస్త్రముల్ ప్రయోగించె నెన్నొ;
తత్ర్పయుక్తంబు లస్త్రశస్త్రములు పూల
మాలలై వ్రాలె స్వామి పాదాల మ్రోల.
మారుఁ డంపినట్టి మాయ అప్సరసలు
ఆడి పాడి తగవు లాడినారు;
కాళ్ళు కండె గట్టె; గళము బొంగురువోయె;
కనులు తెరువలేదు గౌతముండు.
మారుకాంతల చారు శృంగారనాట్య
భంగిమమ్ముల కట శృంగభంగమయ్యె;
మారమహిళల మంజు మంజీర రవము
వ్యర్ధమై పోయెనందు సిద్దార్దు ముందు.
మారసైన్యంబులో నున్న శూర వీర
భూత బేతాళ డాకినీ వ్రాత మెల్ల
గౌతముఁడు కన్నులెత్తి తీక్షణముగ జూడ
కేక లుడిగి భయమ్ముతో తోక ముడిచె.
శుద్దోదనుఁడు వచ్చి "సిద్దార్ధ! ఇది యేమి
లెమ్ముర" మ్మని మందలించినట్లు,
రాణి యశోధర "ప్రాణేశ్వరా! నన్ను
మన్నింపు"మని వేడుకొన్న యట్లు,
అమ్మ ప్రజావతి అరుదెంచి "తప మేల?
చాలింపు" మని బ్రతిమాలి నట్లు,
"నన్నెత్తుకొ"మ్మని చిన్ని రాహులుఁడు క
న్నీళ్ళతో మునుముందు నిలిచినట్లు,
మారువేషాలు వేయించి మారుఁ డాడు
వికటనాటకములు నిరర్ధకము లయ్యె;
శుద్ధవిజ్ఞాన నియమ సంబద్ధ సుప్ర
బుద్ధమతి యైన సర్వార్ధసిద్ధు నెదుట.
మాయ మంత్రాలు వ్యర్ధమై పోయినంత
మారుఁడు చమూసమేతుఁడై మాయమయ్యె;
శాక్యసింహము నెదిరింప శక్య మగునె
మచ్చరపు మాయదారి గోమాయువులకు?
అంతట ధ్యానమగ్నుఁడగు నమ్మునిచంద్రుని నెమ్మొగమ్మునన్
శాంతి తరంగముల్ కదలసాగెను; పున్నమ పండువెన్నెలల్
స్వాంతము నిండె; భావనలు పాలసముద్రము భంగి పొంగి ఆ
శాంతము లంటె; సమ్మిళితమై ఒకటయ్యెను నింగి నేలయున్!
ఆ పరమప్రశాంత సమయాన నిమీలితనేత్రుఁడైన ఆ
తాపసరాజశేఖరు హృదంతర మందు సహస్రసూర్యసం
దీపిత మయ్యె జ్ఞానమయతేజము; శాక్యమునీంద్రచంద్రుఁ డా
దీపపు వెల్గులందు గురుతించెను సృష్టిరహస్య మంతయున్.
ఉల్లమున కాంతిపుంజముల్ వెల్లివిరిసె;
సత్య సౌందర్యదీప్తి దర్శన మొసంగె;
బుద్దుఁ డయ్యెను సర్వార్ధసిద్ధుఁ; డపుడు
బోధితరువయ్యె అశ్వత్ధ భూరుహంబు.
పునరాగమనము
"కన్నీరు గార్చకే చిన్నారి హరిణమా!
శ్రీవారు గారవించెదరు నిన్ను;
ఆరాట మందకే గారాల శశకమా!
శ్రీవారు బుజ్జగించెదరు నిన్ను;
కంగారు పడబోకె బంగారు శారికా!
శ్రీవారు పలుకరించెదరు నిన్ను;
తలదించుకొనకె అందాల మందారమా!
శ్రీవారు సంస్పృశించెదరు నిన్ను;
మందిరోద్యాన తరులార! కుందబోకుఁ
డందుకొందురు స్వామి మీ వందనములు;
బాధపడకుఁడు సోపానపంక్తులార!
ముద్దుగొందురు ప్రభుపదమ్ములను మీరు.
నవ్వవే కిలకిల నవమల్లికా! నీవు
శ్రీవారు నేఁడు విచ్చేతురంట;
కురియవే జలజల సురపొన్నరో! నీవు
గౌతముల్ నేఁడు వేంచేతురంట;
మెరయవే తళతళ మేఘమాలా! నీవు
అరుదెంతురఁట జగద్గురులు నేఁడు;
మల్లి! వాసంతి! వల్లీమతల్లులార!
చల్లఁగా పూలజల్లులు చల్లరమ్మ!
నాఁడు నను వీడి చనిన అందాల లహరి
నేఁడు ప్రవహించు నాదు మందిరము నందు.