Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 19


    తీయఁగా స్వాగతం బీయవే కోకిలా!
        సర్వజ్ఞు లేతెంచు సమయ మిదియె;
    ఆడవే పురివిప్పి క్రీడా మయూరమా!    
        కరుణామయులు వచ్చు తరుణ మిదియె;
    పులకింపవే వేగ పుడమితల్లీ! ప్రేమ
        మూర్తి విచ్చేయు ముహూర్త మిదియె;
    పొంగవే రోహిణీ! చెంగు చెంగున, మనో
        విభుఁడు దర్శనమిచ్చు వేళ యిదియె;
    
    కనుఁడు కన్నులార కౌతూహలము మీర
    పొన్నలార! మావి గున్నలార!
    విశ్వబాంధవుండు వేంచేయుచున్నాఁడు
    వల్లులార! చిట్టితల్లులార!
    
    నాన్నా! రాహుల! నాన్న వచ్చునది యీనాఁడేనురా! పూజకై
    సన్నాహమ్ములు చేయుచుండి రపుడే శాక్యేశ్వరుల్; ప్రక్కపై
    కన్నుల్ విప్పుచు మూయుచుంటి విదిగో కన్నయ్య! యీ నిద్రయే
    నన్నున్ నిన్నును మోసగించినది యానాఁ డర్దరాత్రమ్మునన్.
    
    అదె మలికోడి కూసె; నుదయాచలవీథుల లోకబాంధవుం
    డుదయము నందు వేళ యగుచున్నది; తీయని కాంక్ష పద్మినీ
    హృదయము నిండె; పొంగి ప్రవహించుచునుండె ప్రజాప్రవాహముల్;
    కదలి కదల్చెరా యుగయుగాల మహస్సు జగాల నన్నిటిన్.
    
    రాగము లందుకొన్నది సరస్సలిలంబు; ప్రభాతగీతముల్
    సాగెను; నాట్యమాడె నవ జాగృతి దిక్కులా; పుల్కరించె పు
    న్నాగము; పారిజాతములు నవ్వుల పువ్వులు జల్లె; స్వామి వా
    రాగమనమ్ము సేయు సమయమ్ము; రయమ్మున లెమ్ము నాయనా!
    
    అరువదివేలు శిష్యనివహంబులు భక్తి భజింపఁగా జగ
    ద్గురువులు శాక్యరాజ్యమునకుం దయచేసిరి; కన్గొలంకులన్
    గరుణ దొలంకఁగా మనల గన్గొన వత్తురు నేఁడు; నాఁడు కన్
    దెరువని తండ్రి! నేఁడు గురుతింతువె చుక్కలలో సుధాకరున్!
    
    వేగమె రమ్ము తండ్రి! అరవిచ్చిన మల్లెలు సన్నజాజులున్
    తీగెలు త్రెంపకుండ విరిదేనెలు క్రింద స్రవింపకుండ నీ
    వే గొని తేవలెన్! బ్రతుకులే పులకింపఁగ నేఁడు స్వామికిన్
    స్వాగత మీవలెన్! మన భవమ్ములు ధన్యము చేసికోవలెన్!
    
    సన్నిధి సేయుచుండె మన సౌధములోనికి మింటి మీఁది ఆ
    పున్నమ చందమామ పరిపూర్ణ కళాకమనీయమూర్తియై;
    ఎన్నటినుండియో కలవరించెడి వెన్నెలవెల్గు నేఁడు నీ
    కన్నులముందు వెల్గు; క్షణకాలము చిత్తము చిక్కబట్టరా!
    
    దూరాన నిల్చి కేల్దోయి మోడ్తువు గాని,
        పరువెత్తి పోయి పైబడెదు సుమ్ము!
    వినయాన తలవంచి వీక్షించెదవు గాని,
        చేలాంచలము స్పృశించెదవు సుమ్ము!
    అమృత సందేశమ్ము నాలకింతువు గాని,
        పెదవి కదల్చి పల్కెదవు సుమ్ము!
    చివురాకు పూలదోసిళు లెత్తెదవు గాని,
        పదసరోరుహము లంటెదవు సుమ్ము
    
    తొగరు మునివ్రేళ్ళ చెక్కిళ్ళు తుడుచుకొనుచు
    నిలచి నా ముందు చూచుచుండెదవు గాని,
    'నాన్న మానాన్న' యని అమాంతముగ పరవ
    శించి స్వామి కౌఁగిలించెదవు సుమ్ము!"

                                                            సందర్శనము
    
    "బింబోష్ఠి! ఇతఁడటే లుంబినీవనములో
        మున్ను మాయాదేవి కన్నబిడ్డ?
    వనజాక్షి! ఇతఁడటే మన ప్రజావతి పెంచి
        పెద్దచేసిన చిన్ని ముద్దులయ్య?
    చంద్రాస్య! ఇతఁడటే శాక్యరాజ్యశ్రీని
        వీడిపోయిన రాచ కోడెకాఁడు?
    పూఁబోణి! ఇతఁడటే బోధివృక్షము క్రింద
        బుద్ధత్వమును గన్న సిద్ద యోగి?
    
    ఇంతి! ఇతఁడటె! ఇతఁడే నటే! సుజాత
    మంచి యాఁబాల వండి వడ్డించినట్టి
    తీయ తీయని గోర్వెచ్చ పాయసంబు
    కడుపునిండా భుజించిన కరుణమూర్తి!
    
    అరుదెంచెనమ్మ! గాయము మాన్పి రాయంచ
        బ్రతుకు నిల్పిన దీనబాంధవుండు;
    దయచేసెనమ్మ! అందాలరాణిని వీడి
        వనవాటికలకు సాగిన విరాగి;
    చనుదెంచెనమ్మ! యజ్ఞముల రక్తము నాపి
        యమృతమ్ము జిందు దయాపయోధి;
    అదె విజయంచేసెనమ్మ! చోరుల మహో
        దారుల గావించు ధర్మరాజు;
    
    కలికి! విచ్చేసెనమ్మ! లోకులకు నెల్ల
    మేలుకోలిచ్చు విశ్వవైతాళికుండు;
    వెలఁది! వేంచేసెనమ్మ! పృథ్వీవిపన్ని
    వర్తకుఁడు ధర్మచక్రప్రవర్తకుండు."
    
    స్వామి భిక్షాటనమునకై సాగువేళ
    ఆ కపిలవస్తు నగర హర్మ్యాల నుండి
    కాంచు తరళేక్షణలు కురిపించినారు
    హర్షవాక్కులతో పుష్పవర్షములను.
    
    చంచ దుత్ఫుల్ల లలిత నేత్రాంచలముల
    గాంచి తమలోన తాము భాషించుకొనెడి
    మించుబోణుల వాక్యాలు వించు, నతులు
    గొంచు, శుద్దాంతమును సమీపించె స్వామి.
    
    ఖేద మోదాశ్రు మిశ్ర సంవేదనుండు
    రాజు శుద్దోదనుఁడు మునిరాజును గనె;
    అతిశయవిషాదవతి ప్రజావతి విశీర్ణ
    మతి జగన్నుతుఁడగు ప్రియసుతుని గాంచె.
    
    కనుల కాటుక, కరముల కంకణములు,
    అలిక ఫలకాన కుంకుమ తిలక కళిక,
    జడలు కట్టిన కేశపాశమ్ముతోడ
    నిశ్చలముగ యశోధర నిలిచియుండె.
    
    ఉవిదమిన్న వియోగినియో! తపస్వి
    నియొ! మనస్వినియో! పూజనీయ పుణ్య
    గేహినియొ! నిస్తరంగ నిరీహ కరుణ
    వాహినియొ! నాగ నిలిచె సర్వజ్ఞు ముందు.
    
    ఒక్కొక బాష్పబిందువది ఒక్కొక్క భావము చిందు ఛందమై
    చెక్కుల జాలువార నిలిచెన్ చెలి శాక్యమునీంద్రు సన్నిధిన్,
    దృక్కులు పూలమాలల గతిన్ ప్రభు పాదములందు వ్రాలఁగా
    చెక్కిన శిల్పమో! పరవశించిన మౌనవిపంచియో! యనన్.
    
    వెన్నెలవాకలో కరఁగి, విచ్చిన చక్కదనాల కల్వపూ
    గిన్నెల నిండ తేనె చిలికించెడి శారదరాత్రి భంగి, వా    
    ల్గన్నుల నిండ బాష్పములు గ్రమ్మ యశోధర చూచె నెట్టులో
    సన్నిధి నున్న శాక్యకులచంద్రుని, గౌతమసంయమీంద్రునిన్.
    
    "స్వామి!" యను మాట చెలినోట సగము గూడ
    వెడలెనో లేదొ బాష్పముల్ వెడలె కనుల;
    పతి "యశూ" యని పలికెనో పలుక లేదొ
    సతి కరమ్ములు ప్రభు పదాబ్జములు ముట్టె.
    
    పంజరములోని చిలుక దంపతులు తప్ప
    ఈ రహస్యము నెరుగ రెవ్వారు గూడ;
    రాలినవి ప్రేమమూర్తి నేత్రాల నుండి
    అశ్రు బిందువుల్ రెండు ప్రేయసి శిరాన.
    
                                           * * *
    
    కన్నతండ్రిని గన్న బంగారుతండ్రి
    రాహులుఁడు కొంత వింత సంభ్రమము తోడ
    తడబడుచు పోయి స్వామి పాదములు కనుల
    కద్దుకొనె; తండ్రిచేతులు ముద్దుగొనెను.

 Previous Page Next Page