Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 17


    "ఐదేళ్ళు" విస్కీ సిప్ చేస్తూ అన్నాడు సురేశ్.


    "ముందు కెనడా వెళ్ళాను. భారతీయుల పరిస్థితి అంత బాగుండదు అక్కడ. అక్కడ టీచర్లకూ, డాక్టర్లకూ, నర్స్ లకూ ఉద్యోగాలు దొరుకుతాయి. మిగతావాళ్లకు తెల్లవారి దొరికే పనేమిటో తెలియదు. ఇంగ్లండు వాళ్ళకంటే కెనడా వాళ్ళు భారతీయుల్ని ఎక్కువ అసహ్యించుకుంటారు"


    "మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అంతమంది? వేణు అమాయకంగా ప్రశ్నించాడు.


    "ఎందుకా డబ్బు సంపాదన కోసం! మేము విదేశాల్లో ఎలా బతుకుతున్నామో మాకు తెలుసు. అక్కడి నుండి భారతదేశం వస్తే ఫారెన్ రిటర్న్ డ్ అని చాలా గొప్పగా చూస్తారు. మేమూ గొప్పవాళ్ళంగానే ఫోజు వేస్తాం! ఎందుకంటే అక్కడ కడుపు మాడ్చుకొని డబ్బు సంపాదించి పట్టుకొస్తాంగా!" అన్నాడు గ్లాసు ఖాళీ చేస్తూ సురేశ్.


    గౌతమ్ సురేశ్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.


    బేరర్ వచ్చి సురేశ్ గ్లాసు నింపిపోయాడు. "మీరు చాలా స్లో అన్నాడు వేణు గ్లాసు కేసి చూస్తూ...


    "నాకు పెద్దగా అలవాటు లేదు" సిగ్గుపడిపోతూ అన్నాడు వేణు.


    "ఈ దేశంరాగానే జీతం గురించి అడుగుతారు. కొన్ని వేలు చెప్తాం. అక్కడ కూలిచేసి కూడా నేలకు రెండువేలు సంపాదించవచ్చు"


    "నిజంగా?" ఆశ్చర్యంగా అడిగాడు వేణు.


    "అవును! మీరూ వెళ్ళండి డాక్టరీ పూర్తి అయ్యాక"


    "వెళ్ళాలనే ఉన్నది" అన్నాడు వేణు.


    "డబ్బు సంపాదించు కోవడానికేనా? మనదేశంలో వెయ్యి రూపాయలు సంపాదించేవాడు.


    బాత్ రూందగ్గరనుంచీ మేమే శుభ్రం చేసుకుంటాం. మనవాళ్ళు అక్కడ ఐస్ క్రీం అమ్ముతారు. హోటళ్ళలో ప్లేట్లు కడుగుతారు. కూరగాయలు దుకాణం పెడ్తారు. ఇక్కడి వాళ్ళకు వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళుగా కన్పిస్తారు.


    "మీరు ఎంతకాలం విదేశాల్లో ఉన్నారు?"  


    "మొత్తం ఎనిమిదేళ్ళు! ముందు కెనడాలో మూడేళ్ళు ఉన్నాను. ఆ తరువాత అమెరికా వెళ్ళాను. అక్కడ ఐదేళ్ళు ఉన్నాను"


    "అమెరికాలో ఏం చేసేవారు?"


    "ప్రొఫెసర్ గా పని చేశాను"


    "ఇంటులెక్చుయర్స్ అంతా విదేశాలకు ఎందుకు పరుగులు తీస్తున్నారు!"


    "చెప్పానుగా డబ్బు కోసం!"

    
    "మీరు?"


    "ఈ దేశంమీద కోపంతో"


    "అదేమిటి?"


    "ఆశ్చర్యంగా ఉంది మీ ప్రశ్న వినడానికి. మీరు ఈ దేశంలోనే ఉన్నారు. చదువుకుంటున్నారు. చూడటానికి లోయర్ మిడిల్ క్లాసుకు చెందినవారిలాగే ఉన్నారు! అయినా మేధావులు ఈ దేశం నుంచి ఎందుకు పారిపోతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నారా?"


    గౌతమ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు.


    "ఉన్నత విద్యనూ పొందినవారికి ఈ దేశంలో క్లర్కు ఉద్యోగం కూడా అతి కష్టంమీద దొరుకుతుంది. నాకెన్నో డిగ్రీలు ఉన్నాయ్. ఇక్కడ నెలకు నాలుగువందలు కూడా సంపాదించలేకపోయాను"


    "ఎందుకని?" వేణు అడిగాడు.


    "ఎందుకా! ఇక్కడ నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారు"


    "ఎవరు వాళ్ళు?" ఆశ్చర్యంగా అడిగాడు వేణు.


    "ఒకటి బీదతనం. రెండు పెద్దల అండ లేకపోవడం! లంచం ఇవ్వలేను. సిఫారసు చేయించుకోలేను"


    "మీ కోపం వ్యక్తిగతమైంది."


    "అవును! మీకు తెలియదు. నేను ఎన్ని బాధలు పడి చదువుకున్నానో, వారాలు తిని చదువుకున్నాను. తండ్రి చిన్నప్పుడే పోయాడు. మా అమ్మ వంట పని చేసి నన్ను పోషించింది. సాయంత్రాలు నేను ట్యూషన్స్ కూడా చెప్పేవాణ్ణి. అంత కష్టపడి చదువుకున్న నాకు ఉద్యోగం దొరకలేదు.


    నాకు భవిష్యత్తు కన్పించలేదు. విదేశాలు వెళ్తేనే విద్యకు గుర్తింపు ఉంటుందని నాకు తెలుసు. అలాంటప్పుడు ఎందుకు వెళ్ళను. లంచగొండి నాయకులు వేదికలు ఎక్కి జనానికి నీతిని బోధిస్తారు. అర్థాకలితో ఉన్న టీచర్ లు భావి పౌరులను తీర్చిదిద్దాలనీ, నిజాయితీతో పని చెయ్యాలనీ బోధిస్తారు"


    "కాని మన దేశ పరిస్థితుల్లో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ప్రగతి పథంలో"


    "పయనిస్తున్నాం" అంటూ వాక్యం పూర్తి చేశాడు సురేశ్. అతని కంఠంలో వ్యంగ్యం ధ్వనించింది.


    "శిక్షితులైన యువకులు విదేశాల నుంచి తిరిగివస్తే వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుందనే గ్యారంటీ లేదు. ఆటమిక్ ఎనర్జీలో ప్రవీణుడైన యువకుడు ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న విషయం విన్నారా?"


    గౌతమ్ వేణు ముఖంలోకి చూశాడు.


    "విని ఉండరు. బుద్ధిగా క్లాసు పుస్తకాలు చదువుకుంటారు..దేశంలో ఏం జరుగుతుందో మీలో చాలా మందికి తెలియదు.


    "అతను ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు?"


    "అతని ప్రతిభను ఓర్చలేని పెద్ద ఆఫీసర్లు చేసే అవమానాలను భరించలేక...."


    "ఆ తర్వాత?"


    "ఆ తరువాత ఏముందీ? అంతా మామూలే! పార్లమెంటులో కొందరు సభ్యులు గొడవ చేశారు. వన్ మాన్ కమిటి వేశారు. ఎంక్వయిరీ ప్రారంభం అయింది. అది పూర్తి అయ్యేసరికి జనం అతని సంగతి మర్చిపోయారు"


    "అన్యాయం!" అన్నాడు గౌతమ్.


    సురేశ్ చిరునవ్వు నవ్వాడు.


    "బాగా సంపాదించుకున్నారా డాలర్స్" అడిగాడు వేణు.


    "బాగా అనలేను కాని సంపాదించాను. ఒక ప్రఖ్యాత ఫర్మ్ లో జూనియర్ ఆర్కిటెక్ట్ గా పని చేస్తూ డాక్టరేట్ సంపాదించుకున్నాను. తర్వాత ప్రొఫెసర్ను అయ్యాను. చాలా బిల్డింగులకు ప్లాన్సు వేశాను. కాని నాకు పేరు రాలేదు. ఆ పేరంతా ఆకంపెనీకే వచ్చింది. ఆయన డబ్బు సంపాదన బాగానే ఉన్నది. భారతీయులందరిలాగే పిసినారిగా జీవించాను. అవసరాల్ని వీలయినంత వరకు తగ్గించుకొని డబ్బు చేర్చాను. విదేశీయులు పిసినారిగా చిన్నచూపు చూసినా లక్ష్యపెట్టలేదు. మరి ఆ డబ్బు కోసమేగా దేశాన్ని వదలి అంత దూరం వెళ్ళేది! ముప్పయి వేల డాలర్స్ ఉన్నాయ్. ఈ దేశంలో మార్చుకుంటే రెండు లక్షలు సంపాదించుకోగలను.


    నేను ఎయిర్ కండిషన్డ్ ఇంపాలా కారు తెచ్చుకున్నాను. దాన్ని నేను రెండువేల డాలర్లు అంటే పదిహేను వేలకు కొన్నాను. దాన్ని ఇక్కడ అమ్మి తేలిగ్గా మరో లక్ష సంపాదించుకోగలను. ఇంకా మూవీ కెమెరా, టెలివిజన్, నయాగరా టేప్ రికార్డర్ వగైరా చిన్న చిన్న వస్తువులు చాలా  సంపాదించాను. వాటిని అమ్మితే కనీసం మరో లక్ష వస్తుంది.


    నేను అక్కడికి వెళ్ళలేదనుకోండి. అతి కష్టం మీద ఉద్యోగం సంపాదించినా ఈ దేశంలో ఇన్ని సంవత్సరాల్లో ఒక ఐదు వేలయినా బ్యాంకులో వేసుకొనే స్థితిలో ఉండే వాణ్ణి కాదేమో?"

 Previous Page Next Page