Previous Page Next Page 
బొమ్మరిల్లు పేజి 16


    గౌతమ్ ఆసుపత్రికేసి నడిచాడు.


    వేణు హనుమంతరావు వెనుక వెళ్ళాడు.


                                       * * *


    గౌతమ్ హనుమంతరావు చెప్పిన సమయంకంటే ముందే వచ్చాడు.


    అప్పటికే వేణు వచ్చి ఉన్నాడు.


    వేణు ముఖంలో అంత సంతోషం కనిపించడం లేదు.


    హనుమంతరావు టీడ్ సూటు వేసుకున్నాడు. వేణు సాధారణమైన ఫ్యాంటూ, బుష్ షర్టూ వేసుకుని ఉన్నాడు.


    "హనుమంతరావు సూటు అరవు ఇవ్వనన్నాడా?" అడగాలనుకున్నాడు. కాని అసలే చిన్నబోయి ఉన్న వేణు ముఖం చూస్తూ అడగలేకపోయాడు.


    "రా!రా! గౌతమ్" హనుమంతరావు ఆహ్వానించాడు.


    "నాతో నిల్చుని అతిథుల్ని రిసీవ్ చేసుకుంటావా?"


    "ఊహూ! ఒక పక్కగా ఉన్న టేబుల్ దగ్గిర కూర్చుని మీ అతిథుల్ని చూస్తాను" అన్నాడు గౌతమ్ నవ్వుతూ.


    "అలాగే! నీ ఇష్టం!"


    "నేను వెళ్ళి గౌతమ్ దగ్గిర కూర్చుంటాను" అంటూ వేణు కూడా గౌతమ్ తోవెళ్ళి ఓ పక్కగా ఉన్న బల్ల దగ్గిర కుర్చీలో కూర్చున్నాడు.


    హనుమంతరావు అతిథుల్ని ద్వారం దగ్గిర రిసీవ్ చేసుకుంటున్నాడు. అతని తల్లిదండ్రులు షామియానాలో నిలబడి అందర్నీ పలకరిస్తున్నారు. హనుమంతరావు ఏ ఒక్కర్నీ వేణుకు పరిచయం చెయ్యడం లేదు. వేణు మనసులో కోపంగా ఉంది. చిన్నగా వెళ్ళి గౌతమ్ టేబుల్ ముందు కూర్చున్నాడు.


    "మనం వచ్చి ఉండకూడదు" అన్నాడు వేణు.


    "ఏం?" అడిగాడు గౌతమ్.


    "వాళ్ళంతా ఎంత టిప్ టాప్ గా వస్తున్నారో చూస్తున్నావుగా? వాళ్ళ ముందు మనం విద్యుద్దీపాల ముందు ఆముదపు దీపాలలా ఉన్నాం."


    గౌతమ్ చిరునవ్వు నవ్వాడు.


    వచ్చే అతిథులు ఒకర్నొకరు 'హల్లో' అంటూ కరచాలనం చేస్తూ పలకరించుకుంటున్నారు. సీతాకోకచిలకలా అలంకరించుకున్న ఆడవాళ్ళు "హాయ్! హాయ్!" అంటూ పలకరించుకుంటున్నారు. గౌతమ్ మౌనంగా కూర్చొని అందర్నీ పరిశీలనగా చూస్తున్నాడు.


    సన్నగా మ్యూజిక్ వినిపిస్తున్నది. అందంగా అలంకరించబడిన ఆ భవనం ఇంద్రభవనంలా ఉన్నది వేణు కళ్ళకు. వచ్చేవాళ్ళు తమ లోకానికి సంబంధించినవాళ్ళు కన్పించడంలేదు. ఆత్మహీనతా భావంతో కుంచించుకుపోతూ గౌతమ్ ముఖంలో చూశాడు. అతని ముఖంలో ఎలాంటి భావం కన్పించలేదు. వేణుకు అక్కడినుంచి చిన్నగా వెళ్ళిపోవాలని ఉన్నది. ఆమాటే గౌతమ్ తో అనాలనుకున్నాడు.


    గౌతమ్ చిత్రమైన వ్యక్తి! తనకంటే చాలా చాలా బీదవాడు. అతనికి ఏమీ అనిపించడం లేదా? ఎందుకు ఉండదూ? పైకి బింకంగా కూర్చున్నాడు! అంతే! గౌతమ్ ను గురించి ఆలోచిస్తున్నాడు వేణు.


    కలకలం బయలుదేరింది. దాదాపు ఓ ముప్పయ్ సంవత్సరాల వయసులో ఉన్న యువకుడితో లోపలకు వచ్చాడు హనుమంతరావు. అతను చాలా సింపుల్ గా ఉన్నాడు. చిన్న గడ్డం ఉన్నది. అతన్ని ఒక్కొక్కరికి పరిచయం చేస్తున్నాడు. అతనే ముఖ్య అతిథి సురేశ్ అని గౌతమ్ కు అర్థం అయింది.


    గౌతమ్ పక్క టేబుల్ ముందున్న వాళ్ళకు పరిచయం చేస్తున్నాడు సురేశ్ ను హనుమంతరావు. హనుమంతరావు తల్లిదండ్రులు కూడా అతనితో ప్రతి టేబుల్ దగ్గరకూ వస్తున్నారు.


    "మిస్టర్ దత్తా! దాసప్రకాశ్ హోటల్ యజమాని!"


    సురేశ్ కరచాలనం చేశాడు.


    "ఈమె మిసెస్ దత్తా!" ధగ ధగలాడే అలంకరణలో ఉన్న స్త్రీని పరిచయం చేశాడు.


    "హాయ్! హౌడూ యూడూ!" అంటూ కరచాలనం కొరకు చెయ్యి చాచింది.


    సురేశ్ రెండుచేతులూ జోడించి నమస్కరించాడు.


    ఆమె ముఖంలో రంగులు మారాయి. తమాయించుకుని చిరునవ్వుతో "మీ స్నేహితుడు ఆర్కిటెక్ట్ లా లేడు. సినిమా హీరోలా ఉన్నాడు. హాయిగా సినిమాల్లో వేషాలు వెయ్యొచ్చు" అన్నది మిసెస్ దత్తా సురేశ్ ను పసివాడు బర్త్ డే కేక్ కేసి చూస్తున్నట్టు చూస్తూ.


    "వెయ్యొచ్చును. కాని ఇప్పటికే ముప్పయ్ ఏళ్ళు దాటిపోయాయి" అన్నాడు సురేశ్ నవ్వుతూ.


    గౌతమ్ వారి సంభాషణను కుతూహలంగా వింటున్నాడు.


    హనుమంతరావు మిసెస్ దత్తాతో ఏదో జోక్ చేశాడు. అందరూ పకపక నవ్వారు. సురేశ్ పక్క టేబుల్ కేసి చూశాడు. ముందు రెండు అడుగులు వేశాడు. హనుమంతరావు గౌతమ్ నూ, వేణునూ పరిచయం చేశాడు. సురేశ్ గౌతమ్ ఎదురుగా కూర్చున్నాడు. హనుమంతరావు తల్లీ దండ్రీ ముఖముఖాలు చూసుకున్నారు.


    "మీరు కుమార్ రాజా గారి దగ్గర కూర్చుంటే బాగుంటుంది" అన్నాడు హనుమంతరావు తండ్రి.


    "వారిని కలిశానుగా? కాసేపు ఇక్కడ కూర్చుని వస్తాను" అన్నాడు సురేశ్.


    వేణుకు ఇప్పుడు హాయిగా ఉన్నది.


    హనుమంతరావు అతిథి సత్కారంలో పడిపోయాడు. అందరికీ అన్నీ అందాయో లేదో చూస్తున్నాడు. విస్కీగ్లాసులు వచ్చాయి.


    గౌతమ్ తనకు అక్కర్లేదని చెప్పాడు. వేణు తీసుకున్నాడు.


    "మీరు డ్రింక్ తీసుకోరా?" సురేశ్ గౌతమ్ కేసి పరిశీలనగా చూస్తూ ప్రశ్నించాడు.


    "అలవాటు లేదు"


    "విస్కీనీ ఆడదాన్ని అందుబాటులో ఉన్నప్పుడు వదలకూడదు భాయ్" అన్నాడు సురేశ్.


    సురేశ్ ను చూడగానే గౌతమ్ కు ఒక గౌరవభావం ఏర్పడింది. ఈ మాటతో చివ్వున తలెత్తి చూశాడు.


    "నేను వచ్చేప్పుడు నాలుగు విస్కీ బాటిల్స్ తెచ్చాను. ఒక్కటి కస్టమ్స్ ఆఫీసరుకు ఇచ్చాను"


    "మిగతా మూడూ వదిలేశాడా?" వేణు అడిగాడు.


    "భారతీయ కస్టమ్స్ ఆఫీసర్ ఒక పార్కర్ పెన్ లేక స్కాచ్ విస్కీ బాటిల్ తో సంతృప్తిపడ్తాడు"


    గౌతమ్ చూస్తూ ఉండిపోయాడు.


    "మిసెస్ దత్తా కాస్త వయసు ముదిరినా కొబ్బరిలా బాగానే ఉన్నట్టుంది" పక్కకు చూస్తూ చిన్నగా అన్నాడు.


    వేణు పకపక నవ్వాడు.


    గౌతమ్ కు అతనిని చూస్తుంటే ఏవగింపు కలగసాగింది. విదేశాలకు వెళ్ళి వీళ్ళు నేర్చుకొని వచ్చే కల్చర్ ఇదేనా?"


    "అమెరికాలో ఎంతకాలం ఉన్నారు?" అడిగాడు మాట మారుస్తూ గౌతమ్.

 Previous Page Next Page