"సభ దగ్గరకు."
"ఎవర్నడిగి వెళుతున్నావ్?"
"ఇంత చిన్న విషయంలో అనుమతి తీసుకోవాల్సి వుంటుందనుకోలేదు. ఆ మాత్రం స్వాతంత్ర్యం నాకు వుందనే అనుకుంటున్నాను. ఇరుగు పొరుగు ఆడవాళ్ళు వెళుతున్నారు. నేను వస్తానని చెప్పాను."
"మాటలు చాలా నేర్చావు! పుస్తకాల్లో చదివిన మాటలేనా నువ్వు వల్లిస్తూంది?"
"కాదు జీవితం నేర్పిన పాఠం." ధైర్యాన్ని కూడదీసుకుంటూ అంది అరుంధతి.
"అట్టే వాగక లోపలకు వెళ్ళు!" అతని స్వరంలో కాఠిన్యానికి భయంవేసింది అరుంధతికి. అలా నిల్చునిపోయింది.
"నీకే చెబుతూంది పో లోపలకు!" కోపంతో రొప్పుతున్నాడు సీతాపతి.
"వెళతాను సభకు! వెళ్ళి తీరతాను మీరెవరు నన్ను వద్దనేదానికి?" మొండిగా ప్రశ్నించింది అరుంధతి.
ఒక నిముషం చేష్టలుడిగి నిల్చుండిపోయాడు సీతాపతి. అరుంధతి నుంచి అలాంటి మాటల్ని ఆశించలేదు.
"నేనెవర్నా? నీకు తాళిగట్టిన మొగుణ్ణి! ఆ మాట అనటానికి సిగ్గులేదూ?" సీతాపతి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి.
"తాళి కట్టడం అంటే పశువు మెళ్ళో పలుపు కట్టడం కాదు. స్త్రీ పురుషులిద్దరూ కలిసి జీవించటానికి సమాజం నిర్ణయించిన ఒక బంధం. స్త్రీ పురుషుడికి బానిస కాదు. భార్య. ఆమెకూ ఒక వ్యక్తిత్వం వుంది. స్త్రీ ఇష్టానిష్టాలను కూడా పురుషుడు గౌరవించటం నేర్చుకోవాలి." గబగబా ఉద్రేకంగా అనేసింది అరుంధతి.
పెద్దపెద్ద మాటలే నేర్చావు. ఈ పాఠాలన్నీ ఎక్కడ నేర్చుకున్నావో తెలుస్తూనే వుంది. నేను నీకు భర్తను. నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు బయటకు అడుగు పెట్టటానికి వీల్లేదు-" శాసిస్తున్నట్టు అన్నాడు.
"పోనీయ్ రా! వెళ్ళిరానియ్ రాదూ?" వ్యవహారం శ్రుతిమించుతూందని గ్రహించిన శాంతమ్మ కొడుకును మందలించబోయింది.
"నువ్వూరుకో! దానికి ఏమిటా తల బిరుసుతనం?" అన్నాడు సీతాపతి పెద్దగొంతుతో.
శాంతమ్మ కోడల్ని బ్రతిమాలుకుంది. లాభం లేదని తెలిసి నోట్లో పమిట చెంగు కుక్కుకుంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకొనే ప్రయత్నంలో అక్కడనుంచి వెళ్ళిపోయింది.
"నీకే చెబుతూంది, పద లోపలకి!" గర్జించాడు సీతాపతి.
"అనవసరంగా గొంతు చించుకోకండి. నేను వెళుతున్నాను." గబగబా ముందుకు నడిచింది.
ఓ నిముషం నిర్ఘాంతపోయి నిల్చున్నాడు సీతాపతి. మరునిముషంలో ఒక్క అంగలో దాదాపు ప్రహరీ వాలికివరకూ వెళ్ళిన అరుంధతి చేతిని భుజంకిందుగా మొరటుగా పుచ్చుకున్నాడు. "పో లోపలకు!" ఒక్కతోపు తోశాడు. అరుంధతి పడబోయి నిలదొక్కుకుంది. కోపంతో దహించుకుపోయింది. పట్టుదల ఎక్కువయింది.
"అనవసరంగా కేకలు వెయ్యకండి. అలాంటి కేకలకు భయపడేదాన్ని కాదు. ఇంతవరకూ వచ్చాక నేను వెళ్ళకుండా వుండను. దారికడ్డం రాకండి. మర్యాద వుండదు." కనకదుర్గలా కళ్ళెర్రజేసినా అరుంధతిని చూస్తుంటే సీతాపతికి నిజంగా భయంవేసింది.
"బాగా ఆలోచించుకుని అడుగు బయట పెట్టు. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఈ గుమ్మం ఒకసారి దాటాక, మళ్ళీ లోపల అడుగు పెట్టలేవు. మరొకసారి ఆలోచించుకో!" అన్నాడు సీతాపతి దృఢమైన స్వరంతో.
అరుంధతి ఆలోచిస్తూ నిల్చుంది ఒక నిమిషం. కదిలి బయటకు వెళ్ళిపోయింది. సీతాపతి కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయాడు.
చలనరహితంగా ఎంతసేపు అలా నిల్చుండిపోయాడో అతనికే తెలియదు.
20
అరుంధతి చకచకా నడిచిపోతూంది. వీధి తలుపులో ఆడవాళ్ళు కొందరు నిల్చొని వున్నారు. వాళ్ళవైపు తలెత్తి చూసే ఓపిక లేదు అరుంధతికి. వాళ్ళకోసం ఆగితే వాళ్ళతో మాట్లాడాలి. ఆమె మానసికస్థితి మాట్లాడే పరిస్థితిలో లేదు. తమను చూసీ చూడకుండానే వెళ్ళిపోతున్న అరుంధతిని చూసి నవ్వుకున్నారు ఆడవాళ్ళు. "ఎలాగయినా బస్తీ పిల్లగా?" అంది ఒక నడివయస్సు స్త్రీ.
రామమందిరం త్రివర్ణ పతాకాలతో, రంగురంగుల కాగితపుపూలతో అలంకరించబడి, పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతూంది. కొందరు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. మందిరం ముందు చాపలు పరిచారు. ఆడవాళ్ళకు స్థలం ప్రత్యేకించబడింది. పిల్లలు గోలగోలగా అరుస్తూవుంటే మందలిస్తున్నారు కార్యకర్తలు. అరుంధతి వెళ్ళేటప్పటికి కొంతమంది స్త్రీలు కూచుని ఉన్నారు. అరుంధతి అందర్నీ దాటుకొనివెళ్ళి, ముందువరసలో ముందుగా కూచుంది. అరుంధతికి అక్కడ వున్న స్త్రీలు ఎవరో తెలియదు. కాని వాళ్ళల్లో చాలామందికి అరుంధతి ఫలానావారి కోడలని తెలుసు. అరుంధతి తనను గురించి ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే పరిస్థితిలో లేదు.
ఆమె కళ్ళు రాజారావు కోసం ఆత్రంగా గాలిస్తున్నాయి. ఒక వ్యక్తి నిలబడి రాజారావునూ, మంత్రిగారినీ, మరో ఇద్దరినీ వేదిక అలంకరించవలసిందిగా కోరాడు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టగా అందరూ వేదిక మీదకు వచ్చారు. అరుంధతి మనస్సు ఆనందంతో వెల్లివిరిసింది.
ఆనాటి సభలో అందరూ రాజారావును గురించే మాట్లాడుతున్నారు. అతను ఆ నియోజక వర్గంలో నిలబడటం ఆ వూరి వూరికే గర్వకారణం అన్నారు. రాజారావును, అతను దేశంకోసం చేస్తున్న సేవను ప్రశంసించారు. రాజారావు కళ్ళు అప్రయత్నంగానే ఆడవాళ్ళవైపు ముందువరసలో కూచున్న అరుంధతి మీద పడ్డాయి. ఒక్కసారిగా అతని ముఖంలో వెయ్యివోల్టుల బల్బ్ వెలగటం చూసింది అరుంధతి. ఆమె హృదయంలో కూడా వెలుగు వ్యాపించినట్లనిపించింది.
రాజారావు లేచాడు. తనకు ఆ సన్మానంచేసిన వాళ్ళకు కృతజ్ఞతలను తెలుపుకున్నాడు. "ఈ ఊరికే నేను ఎంతో ఋణపడి వున్నాను. ఈ ఊళ్ళో ఒకప్పుడు నాకు లభించిన ఆదరణా, ప్రేమానురాగాలూ జన్మలో మర్చిపోలేనివి" అంటూ అప్రయత్నంగానే రాజారావు అరుంధతిని చూశాడు. అరుంధతి తల వంచుకుంది. కొంచెం ఆగి మళ్ళీ అన్నాడు- "నా కళ్ళు తెరిచింది కూడా ఈ ఊరే, నా రాజకీయ జీవితం, దాంతోపాటు ఆశయాలు, ఆదర్శాలూ మారటానికి కారణంకూడా ఈ వూరే!" రాజారావు కంఠంలో అపశ్రుతి పలికింది. ఆ తరువాత ఏం మాట్లాడాడో అరుంధతికి వినిపించలేదు.
రాజారావు తను వూహించినట్లు సంతోషంగా లేడు. తన రాజకీయ జీవితంలో వచ్చన మార్పుకు సంతోషిస్తున్నట్లు అనిపించలేదు.
"ఏమిటి ఇంకా కూర్చున్నావ్?"
త్రుళ్ళిపడి లేచి నిల్చుంది అరుంధతి. అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. అందరూ లేచారు. తను ఒక్కర్తే కూచుని వుంది. అరుంధతికి సిగ్గనిపించింది.
"వాడెక్కడ?"
రాజారావు ఎవరిని ఉద్దేశించి ఆ ప్రశ్న వేశాడో అరుంధతికి వెంటనే అర్ధం అయింది. కాని జవాబు ఏం చెప్పాలో తోచలేదు. అందరి కళ్ళూ రాజారావువైపు ఉన్నాయనే విషయాన్ని ఇద్దర్లో ఎవరూ గ్రహించేస్థితిలో లేరు.
"సీతాపతి ఏడీ?"
"రాలేదు."
రాజారావు అర్ధంకానట్లు చూశాడు.
"ఊళ్ళోలేడా?" మళ్ళీ ప్రశ్నించాడు.
"ఉన్నారు."
"వంట్లో బాగాలేదా?"
"బాగానే వుంది."
రాజారావుకు అర్ధం అయింది. సీతాపతి కావాలనే రాలేదు. మరి అరుంధతి ఎలా వచ్చింది?
"నిన్ను మాత్రం వెళ్ళమన్నాడా?" ఆలోచిస్తూ ప్రశ్నించాడు.
"వెళ్ళవద్దన్నారు!" అంది అరుంధతి నిశ్చలంగా.
రాజారావు ఓ క్షణం మౌనంగా ఉండిపోయాడు.
"వద్దంటే ఎందుకొచ్చావు? వాడు నాకు ఉత్తరం రాశాడు-ఈ ఊరు రావద్దనీ, వచ్చినా తన గడప తొక్కవద్దనీను."
అరుంధతి దెబ్బతిన్నట్లు చూసింది.
"చాలా తొందరపడ్డావు. వెంటనే వెళ్ళిపో. నిన్ను చూసి వాడు కూడా వచ్చి ఉంటాడని సంతోషించాను."
అరుంధతి మాట్లాడలేదు.
"నిన్ను మళ్ళీ చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మరోసారి వస్తాను. ఇక్కడ మహిళామండలి పెట్టించాలనుకుంటున్నాను. నీలాంటివాళ్ళు ముందుకొచ్చి పని చెయ్యాలి."
అరుంధతి మౌనంగా వింటూ నిలబడింది.
"వెళ్ళు అరూ! సీతాపతికి కోపం వస్తే ముందూ వెనకా ఆలోచించడు. మంత్రిగారు నాకోసం నిల్చొని ఉన్నారు. ఎక్కువసేపు మనం ఇలా మాట్లాడుతూ నిలబడటం కూడా మంచిది కాదు" అన్నాడు రాజారావు.
"రేపు ఉంటారా?" ఎలాగో అనగలిగింది అరుంధతి.
"లేదు. ఈ రాత్రి భోజనాలు కాగానే వెళ్ళిపోతున్నాం. రేపు గుంటూరులో పబ్లిక్ మీటింగు వుంది. ఈ రాత్రికే గుంటూరు వెళుతున్నాం. వస్తాను" అంటూ రాజారావు గబగబా వెనక్కుతిరిగిచూడకుండా మంత్రిగారిదగ్గరకు వెళ్ళిపోయాడు.
అరుంధతి మనస్సులో దిగులు పుట్టుకొచ్చింది. రాజారావు మునుపటి రాజారావు కాదు అనిపించింది. దుఃఖం పొంగి పొర్లింది. అతిప్రియమైన వస్తువు, ఇంతకాలం తన హృదయంలో పదిలంగా వున్న వస్తువు, ఏదో జారిపోయినట్లూ, హృదయంలో ఖాళీ ఏర్పడినట్లూ అనిపించింది.
ఒక్కొక్క అడుగే బరువుగా పడుతూంది. అరుంధతి ఇంటివైపుకు నడుస్తున్నది. కాళ్ళు ఇసుకలో కూరుకుపోతున్నట్లు బరువుగా ఎత్తివేస్తూంది. నిజంగానే భర్త తనను ఇంట్లోకి రానివ్వకపోతే? ఇంట్లోకి రానివ్వకపోవటానికి తను, కానిపనేం చేసింది? ఏదో కోపంలో అన్నారు. రాజారావులో మొదటి ఆప్యాయత లేదా? కాదు-తనే పొరపాటుగా ఆలోచిస్తూంది. అంతమందిలో - ఆ పరిస్థితిలో అంతకంటే ఏం మాట్లాడగలడు? ఎంత మనస్సును సర్దిచెప్పుకున్నా ఓ మూల భర్త లోపలకు రానిస్తాడో లేదోనన్న భయం పీడిస్తూనే ఉంది. అల్లంత దూరం నుంచి తమ ఇంటి వీధి అరుగు మీద తలగుడ్డ చుట్టుకొని పొడుగాటి కర్రపట్టుకొని కూర్చున్న వ్యక్తి క్రీనీడలో కనిపించాడు అరుంధతికి. అరుంధతి విచ్చిపోతున్న గుండెల్ని కూడదీసుకుంటూ ముందుకు నడిచింది. దగ్గరకు వస్తున్న అరుంధతిని చూసి అరుగుమీద వ్యక్తి గబుక్కున దిగాడు. అరుంధతి గతుక్కుమన్నది. కొంచెం దగ్గరగా వచ్చిన ఆ వ్యక్తిని వెంకన్నగా పోల్చుకున్న అరుంధతి తేలిగ్గా నిట్టూర్చింది.
"ఏం వెంకన్నా, ఇంటికి వెళ్ళలేదు!" అంది.
"చిన్నమ్మగోరూ! అయ్యగోరికి ఇట్టంలేకుండా సభకు పోయారెందుకమ్మా?" అన్నాడు వెంకన్న.
"అయితే ఏమయింది?" అంటూ ముందుకు నడిచింది అరుంధతి.
"అటెల్ల కండమ్మ! ఇయాల్టికి నా ఇంటికి రండి తల్లీ! దొరగోరు మండిపడుతున్నారు. పెద్దమ్మగోరే మిమ్మల్ని నాతో పిలుచుకెల్లమని చెప్పారు" అన్నాడు వెంకన్న.
మౌనంగా నిల్చుంది ఆలోచిస్తూ. రెండడుగులు ముందుకు వేస్తూ, "ఫరవాలేదులే వెంకన్నా! నేను ఎక్కడకూ రాను. ఏం జరుగుతుందో చూస్తాను" అంది.
"తల్లీ, నా మాట ఇనుకోమ్మా! దొరగోరు పిచ్చికోపంతో తిరుగుతున్నారు" అన్నాడు వెంకన్న.
ప్రాణాల్ని దహించివేస్తున్న ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకుంటూ ముందుకెళ్ళి తలుపు నెట్టింది. వీధి తలుపు లోపల గడియపెట్టి వుంది.
"నా మాట ఇనండమ్మా! ఈ రాత్రికి మా ఇంటికి రండి తల్లీ!" వెంకన్న భయంతో ప్రాధేయపడసాగాడు.
"నేను ఎక్కడకూ రాను. ఇది నా ఇల్లు. నా ఇంట్లో నాకున్న స్థానాన్ని ఎవరు కాదంటారో చూస్తాగా?" అంటూ తలుపు కొట్టింది. కాని అవి ఎంతకూ తెరవబడలేదు. మరీ గట్టిగా కొట్టాలంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కడ వస్తారోనని జంకింది.
"వెంకన్నా! ఆ గోడమీదగా పోయి ప్రహరీ తలుపు తియ్యి" అంది.
వెంకన్న ఆలోచిస్తూ నిల్చున్నాడు.
"నీకే చెబుతూంది. నన్నే గోడ ఎక్కి దూకమంటావా?"
"అయ్యో, ఎంతమాట తల్లీ!" అంటూ వెంకన్న ప్రహరీ గోడ దిగి వీధి తలుపు గడియ తీశాడు శబ్దం కాకుండా.
"ఇక నువ్వు వెళ్ళిపో!" ఆజ్ఞాపిస్తున్నట్లు అంది అరుంధతి.
ఇంటి తలుపు కొట్టాలా వద్దా ఆలోచిస్తూ నిలబడింది. తను లోపల ప్రవేశించింది అతనికి తెలియకుండా వుందా? తెలిసే పలక్కుండా వున్నాడు. ఇప్పుడు తలుపు కొడితే రభస కావచ్చు. అసలే పట్టుదల మనిషి. ఈ రాత్రికి ఎలాగో సావిట్లో పడుకుంటే సరి! రేపటికి ఆయన కోపం చల్లబడిపోతుంది. సావిట్లో నులక మంచం ఓ మూలగా వాల్చుకొని పడుకుంది. ఒకటే పేడ వాసన! గొడ్లవాసనా! దోమలు కుడుతున్నాయి. మరో పక్క చలిగా వుంది. ప్రొద్దుపోయినకొద్దీ అక్కడ పడుకోవాలంటే ఉలిక్కిపడుతూంది.
భర్తమీద కోపం కట్టలు తెంచుకుంటూంది. అతని మొరటుతనానికి అసహ్యం వేస్తూంది. అంతలో మాధవి ఏడ్పు వినిపించింది. అప్పుడైనా తలుపు తీస్తారని ఆశించింది. మాధవి అమ్మ కావాలంటూ ఒకటే ఏడుపు. తండ్రి కసురుకోవటం, శాంతమ్మ ఓదార్చటం వినిపిస్తూనే వుంది. సన్నగా మాధవి ఏడుపు ఒక్కసారిగా తారాస్థాయి నందుకుంది. అరుంధతి అశాంతిగా లేచి కూచుంది. ఇంటి గుమ్మం దగ్గరి కొచ్చింది.
"ఊరుకోరా! పసిదాన్ని అంతేసి దెబ్బలు కొడతావేం? నీ కోపం పసిదాని మీదనా? నా తల్లీ, వూరుకోమ్మా!" అంటూంది శాంతమ్మ.
"ఆ తలుపు తెరవకు!" గద్దించాడు సీతాపతి.
శాంతమ్మ బిడ్డనెత్తుకుని బయటకు రాబోతుంటే వారించాడని అర్ధం అయింది అరుంధతికి. అంటే-తను అక్కడ వున్నట్లు తెలుసునన్నమాట! పిల్ల ఏడుపు మానలేదు. అరుంధతి ఎవరో గుండెలు పిండేస్తున్నట్టుంది. తిరిగి వెళ్ళి నులక మంచం మీదు కూచుంది. "పశువు, దయా దాక్షిణ్యాలులేని అడవిమనిషి!" కసిగా తనలో తనే అనుకుంది. ఏడ్చి ఏడ్చి మాధవి నిద్రపోయింది. అరుంధతి మాత్రం మంచంమీద, చలిలో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది. మనస్సు కోపంతో భగభగ మండిపోతూంది. తలలో నరాలు అదురుతున్నాయి.