ఇంకా బాగా చీకటి వుండగానే ఇంటి తలుపులు బార్లాగా తెరుచుకున్నాయి. అరుంధతి లోపలకు వెళ్ళబోయింది.
"ఆగు! ఎక్కడకూ?"
"ఇంట్లోకి!"
"ఈ యింట్లో నీకు స్థానం లేదు."
"ఏం? ఎందుకు లేదు?"
"నేను నీకు సంజాయిషీ ఇచ్చుకోనక్కరలేదు. నీలాంటి ఆడదానికి నా ఇంట్లో స్థానం లేదు. రాత్రే వెళ్ళిపోకుండా ఎందుకున్నావ్? రాత్రే వాడితో వెళ్ళిపోయావేమో ననుకున్నానే!" వ్యంగ్యంగా వుంది స్వరం.
అరుంధతి మనస్సు అసహ్యంతో చీదర చీదరగా అయింది. ఆమె తలెత్తి భర్తవైపు చూసింది. ఆ రూపం తనకు తెలిసిన రూపం కాదు. ఒక్క రాత్రిలో మనిషిలో ఇంత మార్పా!
"పో! ఇంకా నిల్చున్నావేం?"
"నేనెక్కడకు పోతాను? ఇది నా ఇల్లు" అందామనుకుంది. కాని "వెళతాను, కాని నాకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొనే వెళతాను" అనేసింది.
సీతాపతి నిలబడిపోయాడు, "వెళతాను, మొగవాడి అహంకారం ముందూ, అభిజాత్యం ముందూ అభిమానాన్ని చంపుకొని పడివుండే ఆడదాన్ని కాను నేను. మీ పాదాలమీద పడి ఇక్కడ ఇంత చోటు నివ్వమనీ, మీ యింట్లో దాసీగానైనా ఇంత చోటు నివ్వమనీ ప్రార్ధిస్తానని బహుశా మీరు ఆశించి వుంటారు." ఉద్రేకంగా అనేసింది అరుంధతి.
సీతాపతి లోపలకు వెళ్ళాడు. క్షణంలో ఆమె ట్రంకుపెట్టెను తెచ్చి విసిరికొట్టాడు.
"ఇవేగా నీ వస్తువులు! పో! తీసుకెళ్ళు!" అంటూ అరిచాడు ఆవేశంగా.
విసరటంతో తాళంలేని పెట్టె తెరుచుకుంది. అందులోని వస్తువులు చిందరవందరగా పడ్డాయి. రాజా ఫోటో దూరంగా వెళ్ళి పడింది. సీతాపతి ముఖం రాయిలాగా బిగుసుకుపోయింది.
"వీటికోసం కాదు నేను నిల్చుంది. నా బిడ్డకోసం నిల్చున్నాను" అంది అరుంధతి ఆవేశంగా.
శాంతమ్మ ముందుకువచ్చి, "బాబూ!" అంది.
"నువ్వు నోరుమూసుకో. ఈ విషయంలో ఎవరు అడ్డం వచ్చినా నరికేస్తాను." పిచ్చివాడిలా అరచాడు సీతాపతి.
"వెళ్ళిక్కడనుంచి!" అరుంధతి మీదకు దూకబోయి ఆగిపోయాడు.
"ఎందుకు పిచ్చి కేకలు? వెళ్ళిపోతాను. నా బిడ్డను నాకు ఇచ్చేయ్" అంది అరుంధతి గంభీరంగా.
"నీ బిడ్డ! పద ముందు బయటకు." సీతాపతి అరుంధతి మీదకు దూకి రెక్క పట్టుకొని బరబరా ఈడ్చుకెళ్ళి వీధి గుమ్మంలోంచి తోసేశాడు. అరుమ్దహ్తి వెళ్ళి నడిరోడ్డుమీద బొక్కబోర్లా పడిపోయింది. శాంతమ్మ ఆ దృశ్యం చూడలేక లోపలకు వెళ్ళిపోయింది గుండెలు తరుక్కుపోయేలా ఏడుస్తూ.
అరుంధతి చివ్వున లేచి నిల్చుంది. నుదురుకు రాయి పొడుచుకొని రక్తం కారుతూంది. అరచేత్తో రక్తాన్ని తుడుచుకొని ఆ చేతివంకే ఓ క్షణం చూస్తూ ఉండిపోయింది. తలెత్తి చూసింది. భారీ విగ్రహం. వారికి అడ్డంగా క్రూరంగా చూస్తూ నిలబడివుంది.
"నువ్వు మగవాడివి" బలవంతుడివి. బలవంతుడు ఎప్పుడూ బలహీనులమీద దౌర్జన్యం చేస్తూనే ఉన్నాడు" అనాలనుకుంది. ఆవేశంతో పెదవులు మాత్రం కదిలి నిలిచిపోయాయి.
"ఆ బిడ్డ నీ కూతురు కాదు. నీది కానిదాన్ని ఎప్పటికీ స్వంతం చేసుకోలేవు."
సీతాపతి చుట్టూ జివ్వున ప్రాణాల్ని లాగేసే మంచు కొండలు లేచాయి. శరీరం అంతా తిమ్మిరికొయ్య అయింది. అతను నిలువెల్లా మంచుముద్ద....మంచుమనిషే అయ్యాడు.
అరుంధతి కసిగా నవ్వుకుంది. తన ఇంటి పరిసరాల్ని ఒక్కసారి కలయచూసింది. గిర్రున వెనక్కు తిరిగింది. కనుచీకటిలో కలిసిపోయింది.
శాంతమ్మ కొడుకును ఊపుతూ భయంతో కేకలు వేసింది. అప్పుడే వచ్చిన జీతగాడు రంగన్నా, శాంతమ్మా- చలనరహితంగా ఉన్న సీతాపతిని లోపలకు చేర్చారు.
21
గుంటూరు ట్రావెలర్స్ బంగళా జనంతో హడావిడిగా వుంది. బంగళా ముందు కొన్ని కార్లూ, రెండు జీపులూ ఉన్నాయి. డ్రైవర్లంతా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకొంటున్నారు. గొప్పవాళ్ళ రహస్యాలు చాలా వరకు వారి డ్రైవర్లకు తెలిసివుంటాయి. సాధారణంగా ఇద్దరు డ్రైవర్లు ఒక చోట చేరితే చాలా ఆప్యాయంగా మాట్లాడుకోవటం కనిపిస్తుంది. ఆఫీసర్లతో వచ్చిన బంట్రోతులు తమకు తెలిసినవారు లోపలకు వెళుతూంటే సలాంకొట్టి, అదే చేతిని ముందుకు చాపుతున్నారు. విద్యుద్దీపాల వెలుగులో బంగళా ముందున్న పూల మొక్కలూ, పువ్వులూ దాదాపు ఒకే రంగును వెదజల్లుతున్నాయి.
బెదురు బెదురుగా, భుజాలమీదుగా పైట కప్పుకొని బంగళాగేటులో కాలు పెట్టిన అరుంధతికి అనేక చూపులు గుచ్చుకుంటున్నట్లనిపించింది. బిక్కు బిక్కు మంటూ బంగళా వరండాలో కాలు పెట్టింది. బంట్రోతు ఒకడు ఎదురువచ్చి "ఎవరు కావాలి?" అన్నాడు. వాడి స్వరంలో సభ్యత అనే పదానికి ఎక్కడా ఆస్కారం లేదు.
"రాజారావు" అంది గొణుక్కున్నట్లు. గట్టిగా నిర్భయంగా చెప్పాలనుకుంది కాని అంతా కొత్త! మాట స్పష్టంగా పెగల్లేదు.
"ఆ కుర్చీలో కూర్చోండమ్మా!" అన్నాడు వినయంగా బంట్రోతు. ఈసారి అతని స్వరంలో తెచ్చి పెట్టుకున్న సభ్యత స్పష్టంగా ధ్వనించింది. వరండాలో ఆరేడు కుర్చీలు వేసివున్నాయి. అరుంధతి ఒక ఖాళీ కుర్చీలో కూలబడింది. అంతకుముందే అక్కడ నలుగురు పురుషులు కూచుని వున్నారు. ఆ నలుగురు మగవాళ్ళు తనను గుచ్చిగుచ్చి చూడటం అరుంధతి గమనించింది. అందరూ ఖరీదైన ఖద్దరు దుస్తుల్లోనే ఉన్నారు. ఎంత మొరటుగా కళ్ళప్పగించి చూస్తున్నారో! అరుంధతి మనస్సు జుగుప్సతో నిండిపోయింది. ఎన్నడూ ఆడమనిషినే చూడనట్లు అట్లా మిటకరించుకొని చూస్తారేం అనుకుంది.
అరుంధతికి ఓ తెల్లకాగితం ముక్క అందించబోయాడు బంట్రోతు.
"ఎందుకూ?" అంది అరుంధతి అర్ధంకాక.
"మీ పేరు రాయండి!"
అర్ధంకానట్లు చూసింది. బంట్రోతు వస్తున్న నవ్వును ఆపుకుంటూ, "మీ పేరు రాసిస్తే ఆ చీటీ అయ్యగారికిస్తాను. మీ వంతు వచ్చినప్పుడు పిలుస్తారు" అన్నాడు. వాడి ధోరణి అరుంధతికి నచ్చలేదు. ఆ కుర్చీల్లో ఉన్న మగవాళ్ళుకూడా ముసిముసిగా నవ్వుతున్నట్లు తోచింది అరుంధతికి. అవమానంగా తోచింది.
"అక్కర్లేదు, ఆయనతో చెప్పు నేను వచ్చానని!" బింకంగా అన్నది. దాంతో బంట్రోతు బిక్కచచ్చిపోయాడు.
అయ్యగారికి స్వంతం కాబోలు అనుకున్నాడు.
"తమరి పేరు చెప్పండి. ఇప్పుడే చెప్పొస్తాను" అన్నాడు అతివినయంగా.
"అరుంధతి!"
కుర్చీలో వాళ్ళంతా ఇప్పుడు అరుంధతిణి చూట్టంలేదు. అటూ ఇటూ దిక్కులు చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు. బంట్రోతు లోపలకు వెళ్ళాడు. మరునిముషంలో లోపలనుంచి బాగా వళ్ళు గల పెద్దమనుషులు ముగ్గురు బయటకు వచ్చారు. వాళ్లు బయటకు వెళ్ళగానే ఒక కారూ, ఒక జీపూ రొదచేస్తూ దూసుకుని పోయాయి కాంపౌండు బయటకు.
ఆయన్ను కలుసుకోవటానికి ఎంతమంది వస్తున్నారో! అరుంధతి మనస్సు గర్వంతో నిండిపోయింది. తనను చూసి ముందు ఆశ్చర్యపోతాడు. ఆ తరవాత సంతోషంతో పొంగిపోతాడు.
"అయ్యగారు రమ్మంటున్నారు!"
అరుంధతి లేచింది. బంట్రోతు వెనకే నడిచింది. బంట్రోతు తెలుపు తెరచి పట్టుకొని నిల్చున్నాడు. అరుంధతి లోపలకు అడుగు పెట్టిందో లేదో- ఎదురుగా గుండ్రని టేబులు వెనగ్గా ఎత్తయిన కుర్చీమీద కూచుని కనిపించాడు రాజారావు. ఆమె కళ్ళకు రాజా అచ్చం రాజులాగే కనిపించాడు. అరుంధతి ఉద్వేగంతో ముందుకు నడిచింది. రాజా తనను చూసి లేచి ఎదురువస్తాడని ఆశించింది కాని అది జరగలేదు. రాజా కుర్చీలోంచి లేవలేదు. అతని కళ్ళు కాంతివిహీనంగా వున్నాయి. అతని ముఖం భావరహితంగా, తెల్లకాగితంలా వెలవెలబోతూ వుంది.
"కూర్చో అరూ!" అన్నాడు ఉత్సాహంలేని కంఠంతో.
తను రావడం రాజాకు ఇష్టం లేదా? తనకోసం ఒకనాడు కన్నీరు కార్చిన రాజా తను వస్తే ఇంత స్తబ్దంగా వున్నాడేం? యాంత్రికంగా ఎదురుగా వున్న కుర్చీలో కూచుంది.
"ఏమిటి అరూ! ఇలా వచ్చేశావు?" అప్పటికి షాక్ నుంచి కొంతవరకు తేరుకున్న రాజారావు అడిగాడు, అరుంధతిని పరీక్షగా చూస్తూ. అరుంధతి మాట్లాడలేదు, కళ్ళల్లో నీరు తిరిగింది.
"చెప్పు అరూ! ఏం జరిగింది? వంటరిగానే వచ్చావా?" ఆదుర్దాగా ప్రశ్నించాడు రాజారావు.
"అవును. వంటరిగానే వచ్చాను, వచ్చేశాను" అంది. బరువుగా వుంది కంఠం.
"వచ్చేశావా? అంటే?" విస్మయంగా ప్రశ్నించాడు.
"అంటే వచ్చేశాననే! శాశ్వతంగా ఆ ఇంటినుంచి బయటకు వచ్చేశాను. మీ దగ్గరకు వచ్చేశాను." ఆవేశంగా అంది.
రాజారావు ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు. రెండుసార్లు గదిలో అటూ ఇటూ అశాంతిగా తిరిగాడు. అరుంధతి కూచున్న కుర్చీ దగ్గరకు వచ్చి నిల్చున్నాడు.
"అంతపని ఎందుకుచేశావు అరూ?" చిన్నగా, సన్నగా అడిగాడు.
"మీ కోసమే చేశాను."
"నా కోసమా! నా కోసమా! ఎంతపనిచేశావు?' రాజారావు కంఠం గంభీరంగా మారింది. ఆ కంఠంలోనుండి వచ్చిన మాటలు మంద్రస్థాయిలో సరిగ్గా వినిపించనంత గంభీరంగా వున్నాయి. అరుంధతి రాజారావుకేసి నిదానంగా, నిశితంగా చూసింది. అతని కళ్ళల్లో నీరుతిరగడం కనిపించింది. అరుంధతి కళ్ళముందు ఆనాటి "నా నుండి నిన్ను రక్షించమని నీ భగవంతుణ్ణి కోరుకో!" అన్న నాటి రాజారావు కనిపించాడు. తాము చేసుకొన్న నిర్ణయం గుర్తుకొచ్చింది.
"చాలా తొందరపడ్డావు అరూ! నా మాట విను. తిరిగి వెళ్ళిపో! పద నేను కూడా వచ్చి సీతాపతితో మాట్లాడతాను" అన్నాడు రాజారావు ఉద్వేగంతో.
అరుంధతి అదోలా నవ్వింది.
"అలా నవ్వకు అరూ! అంత వ్యంగ్యాన్ని నేను భరించలేను. నేను స్వార్ధపరుణ్ణి కావచ్చు, నమ్మిన ఆదర్శాలకు ద్రోహం చేసి ఉండవచ్చు. కాని ప్రాణమిత్రుడికి ద్రోహం తలపెట్టే నీచుణ్ణిమాత్రం కాదు. నీ కోసం మళ్ళీ సీతాపతి దగ్గరకు వస్తాను. నమ్మిన స్నేహితుణ్ణి పోలీసులకు అప్పగించిన ద్రోహి! ఆ నీచుడి ముఖం ఈ జన్మలో చూడకూడదనుకొన్నాను. కాని అతని కాళ్ళు పట్టుకొని ప్రార్దిస్తాను నీకోసం అరూ! కేవలం నీకోసం." రాజారావు కంఠంలో మాటలు వుండచుట్టుకుపోయాయి.
"లాభంలేదు, ఆ యింటి తలుపులు శాశ్వతంగా మూసుకున్నాయి. అందులో నేను ప్రవేశించలేను" అంది అరుంధతి తాపీగా.
"అసలు ఏం జరిగిందో చెప్పు అరూ!" అన్నాడు ఆత్రంగా.
అరుంధతి జరిగిందంతా చెప్పింది. రాజారావు అంతవరకూ చూడని అరుంధతి నుదుటిమీదవున్న గాయంవేపే చూస్తున్నాడు. అరుంధతి తలెత్తి రాజారావు నిర్ణయం కోసం చూసింది. రాజారావు ముఖంలో మొదటి బేలతనం లేదు. కళ్ళల్లో ఆదుర్దా లేదు. ముడిపడిన కనుబొమల్లో కోపం చిక్కుపడింది. కళ్ళలోంచి కసి బయటకు దూకుతుంది.!
"నీచుడు, అంతపని చేశాడా? నేనంటే వాడు అంత చులకనగా చూస్తున్నాడా? హూఁ! సరే నేనేమిటో చూపిస్తాను." తనలో తనే అనుకుంటున్నట్లు గొణుక్కున్నాడు. అరచేత్తో నుదురును రుద్దుకుంటూ, తల వెనక్కువిరిచి ఆలోచిస్తూ ఉండిపోయాడు కొంచెంసేపు.
"ఇప్పుడే వస్తాను. బయట కొందరు నాకోసం ఎదురుచూస్తున్నారు. పంపించి వస్తాను" అంటూ బయటకు వెళుతున్న రాజారావును చూస్తూ కూచుంది అరుంధతి. మునుపటికంటే కొద్దిగా వళ్ళు వచ్చింది అనుకుంది. ఐదు నిముషాల్లో తిరిగి వచ్చాడు.
"అరూ! ముందు కర్తవ్యం గురించి ఏమైనా ఆలోచించావా?" అన్నాడు రాజారావు, అరుంధతి కూర్చుని వున్న కుర్చీ వెనుక నిల్చొని.
"మీ నిర్ణయమే నా నిర్ణయం!" అంది అరుంధతి వెనక్కు తిరక్కుండానే. రాజారావు మాట్లాడలేదు. అరుంధతి రాజారావు నుంచి అలాంటి ప్రశ్నను ఆశించలేదు. తన మనిషిగా తన నీడలోకి ఆదరణతో తీసుకుంటాడని ఆశించిన అరుంధతి అహంమీద దెబ్బ తగిలింది.
"నాకు మీ పార్టీద్వారా ఏదైనా చిన్న పని యిప్పించండి నేను కూడా కార్యకర్తగా పనిచేస్తాను మీ ఎలక్షన్స్ లో" అంది అభిమానంగా.
త్రుళ్ళిపడ్డాడు రాజారావు-ఏదో వినరాని మాట విన్నట్లు.
"నువ్వు మా పార్టీ కార్యకర్తగా పనిచేస్తావా?" అందులో అంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏముందో అరుంధతికి అంతుపట్టలేదు.
"అదెలా సంభవం?" తనకు తనే ప్రశ్నించుకున్నట్లు అన్నాడు.
"ఎందుకు సంభవం కాదు?" వెనక్కు తిరక్కుండానే ఎదురుప్రశ్న వేసింది అరుంధతి.
"అందులోని సాధక బాధకాలు నీకు అర్ధంకావు."
"ఏమిటి అంత అర్ధంకాని సాధకబాధకాలు?" అరుంధతి స్వరం తీవ్రంగా ఉంది.
"ఇది ప్రపంచం! ప్రజల నోళ్ళు మూయడం చాలా కష్టం. ఎంతకాదనుకున్నా కొన్ని విషయాల్లో సంఘానికి భయపడక తప్పదు."
అరుంధతి గిర్రున వెనక్కు తిరిగి చూసింది. ఈ రాజారావు తనకు తెలిసిన రాజారావేనా అన్నట్లు అనుమానంగా చూసింది. ఆమె చూపు తప్పించుకుంటూ అన్నాడు రాజారావు:
"నా రాజకీయ జీవితం నేను ఎన్నడూ వూహించని మలుపు తిరిగింది. దానికి బాధ్యుడు సీతాపతి."
అర్ధంకాలేదు అరుంధతికి.
"ఆనాడు సీతాపతి నన్ను పోలీసులకు పట్టియిచ్చి వుండకపోతే నేను నా పార్టీకి ద్రోహం చేసేవాణ్ణి కాదు. ఆ బాధ నన్ను వెంటాడేది కాదు."
"అబద్ధం! నీలో నిజాయితీ కొరవడింది. స్వార్ధం పెరిగింది. బలహీనత ఏర్పడింది. అందుకే పార్టీ మార్చావు. అధికార పార్టీలో చేరావు-" అనాలని ఆమె మనస్సు ఆక్రోశించింది. కాని అనలేకపోయింది. మౌనంగా వింటూ కూచుంది.