శాంతమ్మ చూస్తూ నిలబడిపోయింది.
"వాడు పార్టీకి రాజీనామా యిచ్చాడు."
"పోనియ్ నాయనా, చల్లనివార్త వినిపిమ్చావు. సుఖంగా బిడ్డ ఇంటిపట్టునయినా ఉంటాడు."
"ఏం చల్లనివార్త? నీచుడు - తను నమ్మిన ఆదర్శాలకూ తనను నమ్మిన పార్టీకి కూడా ద్రోహం చేశాడు. పార్టీకి రాజీనామా యివ్వటమే కాదు, పార్టీ రహస్యాలను కూడా బయట పెట్టాడు. ఎంతోమంది అరెస్టయ్యారత! ఎంతమంది ప్రాణాల్ని కూడా కోల్పోయారో ఎవరికి తెలుసు? పిరికిపంద, ద్రోహి!" కసిగా అన్నాడు సీతాపతి.
శాంతమ్మ నమ్మలేనట్లు చూసింది.
"రాజాగాడు అంతపని చేస్తాడంటే నీకు నమ్మకం కలగటంలేదు కదూ? అవును ముందు నాకూ అలాగే అనిపించింది. ఆనాడు వాడు 'నాలో బలహీనత ఏర్పడింది అన్నప్పుడు అర్ధం చేసుకోలేడు. ఈనాడు నాకు అర్ధం అవుతుంది - ఆ బలహీనత ఏదో!" గతాన్ని నెమరువేసుకుంటున్నాడు సీతాపతి చిన్నగా.
శాంతమ్మ అలాగే వింటూ నిల్చుంది.
"తన పార్టీకి, తన ఆదర్శాలకూ, నమ్మకాలకూ ద్రోహం చేసినవాడు ఎవరికి చెయ్యడు? అవును, ద్రోహం చేసేవుంటాడు. సందేహం లేదు." తనకు తనే నచ్చచెప్పుకుంటున్నట్లు అంటూ నిల్చున్న సీతాపతివైపు బెదురుగా చూసింది అరుంధతి.
సీతాపతి వాలకం చూస్తుంటే శాంతమ్మకు భయం వేసింది. అతను అన్న చివరిమాటల్లో ఏదో నిగూఢ అర్ధం వున్నట్లనిపించింది అరుంధతికీ, శాంతమ్మకూ.
అరుంధతికి ఆ రాత్రి గదిలోకి వెళ్ళాలంటేనే భయం వేసింది. గంటల్లో భర్త రూపంలోనే ఏదో మార్పు వచ్చినట్లనిపించి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి.
18
పేపర్లో వార్త చదివిన నాటినుంచీ సీతాపతి మరీ మారిపోయాడు. ఎప్పుడూ మౌనంగా రాతిమనిషిలా కనిపిస్తున్నాడు. తల్లితోకూడా అంతగా మాటాడడు. అడిగినదానికి జవాబిస్తాడు. అరుంధతి అతనికి చాలాదూరంగా, వీలయినంతవరకు ఎదురుపడకుండా ఉంటూంది. సీతాపతి పిల్లను కూడా అంత పలకరించటంలేదు. మాధవి మరీ అల్లరిచేసి చేతులు చాస్తే తప్పనిసరిగా ఎత్తుకుని ఇట్టే దించేస్తాడు. మరీ తోచనప్పుడు పిల్లతో కబుర్లు చెబుతూ కూచుంటాడు. శాంతమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. లోలోపల కుమిలిపోతుంది.
ఆ రోజు సాయంత్రం మాధవిని ఆడిస్తూ శాంతమ్మ సావిట్లో కూచుంది. రంగడు సంధ్యకసువు చిమ్ముతున్నాడు. అరుంధతి స్తంభానికి ఆనుకొని నిల్చుంది. ఏమీ తోచక రంగడితో మాటలు పెట్టుకుంది.
"ఒరేయ్ రంగడూ! నీకు పెళ్ళయిందిరా?" అడిగింది అరుంధతి.
రంగడు వూడుస్తూ వూడుస్తూ లేచి నిల్చున్నాడు, చేతిలో చీపురు పట్టుకొని. వాడి ముఖంలో విచార రేఖలు చిక్కుపడుతున్నాయి.
"అయిందమ్మగోరూ?" అన్నాడు దిగులుగా.
"అదేమిటిరా, పెళ్ళి అయిందని అంత దిగులుగా చెబుతావు." అంది అరుంధతి.
"అయిందమ్మగోరూ! కాని సంతోషం ఎక్కడ?"
"ఏం? ఏమయింది?"
"అది ఇంకోడితో మారుమనువు కట్టుకుని వెళ్ళిపోయిందమ్మగోరూ!" దిగులుపడుతూ అన్నాడు రంగడు.
"మంచిపని చేసింది!" అంది ఠపీమని అరుంధతి.
చివ్వున తలెత్తి చూసింది శాంతమ్మ. రంగడు చేతిలో చీపురు వదిలేశాడు.
విన్న వాళ్ళంతా "అయ్యో పాపం!" అని జాలి పడటం తెలుసు రంగడికి. ఇంతవరకూ ఆ మాట అనలేదు. అందుకే అయోమయంగా చూశాడు.
"ఎందుకు పోయిందిరా?" ఆలోచిస్తూ అడిగింది అరుంధతి.
"ఏమోనమ్మా! నాకేం తెలవదు. ఆడంటే దానికి మనసు వుందేమో!" ఆ విషయం గురించి ఏనాడూ ఆలోచించని రంగడికి అది కొత్త ప్రశ్నలాగే ఉంది.
"అందుకే అది వెళ్ళిపోయింది. దానికేం కావాలో నీకు తెలియదు. నువ్వొక అడవిమనిషివి" అంది అరుంధతి.
"అవేం మాటలే! దానికి పొగరెక్కి అది పోతే వాణ్ణి అడవిమనిషి అంటావు!" శాంతమ్మ నోరు తెరిచేసింది.
అరుంధతి నిర్లక్ష్యంగా శాంతమ్మవైపు చూడకుండానే ఉండిపోయింది.
"మళ్ళీ పెళ్ళి చేసుకుంటావా?" అరుంధతి శాంతమ్మ ఉనికినే గుర్తించనట్లు మళ్ళీ రంగడ్ని ప్రశ్నించింది.
రంగడి నల్లటి మొరటు మొఖంలో సిగ్గుతెరలు రెపరెపలాడాయి. పెళ్ళి పేరు అనగానే ఎంత ఆనందమో? అనుకుంది అరుంధతి.
"ఏరా సిగ్గుపడతావు? రెండో పెళ్ళి అంటేకూడా అంత సిగ్గుపడాలా?" అంది అరుంధతి.
"చేసుకుంటా నమ్మగోరూ! వచ్చే మాఘమాసంలో చేసుకోవాలనుకుంటున్నాను" అన్నాడు రంగడు. వంగి చీపురు అందుకుని తన పనిలో మునిగిపోయాడు.
"ఒరేయ్ రంగడూ! అదికూడా పారిపోతే ఏం చేస్తావురా? ఒక పెళ్ళాన్ని ఏలుకోవటం చేతగానివాడికి రెండో పెళ్ళాన్ని కాపాడుకోవటం మాత్రం తెలుస్తుందా?" అంది అరుంధతి అదోలా నవ్వుతూ. ఆ మాటలు కేవలం రంగణ్ణి ఉద్దేశించి అన్నట్లు అనిపించలేదు శాంతమ్మకు. ఆమె కళ్ళప్పగించి చూస్తూ కూచుంది. రంగడు బిక్కముఖం వేశాడు. మళ్ళీ గబగబా పెద్దపెద్ద బారలువేసి వూడవసాగాడు.వాడికి రోషం వచ్చిందని తెలుసుకొని అరుంధతి నవ్వుకుంది.
"ఇదిగో పాపా! ఈ కాగితం మీ అమ్మకు ఇవ్వు-" అంటూ ఒక కరపత్రాన్ని మాధవి చేతికి అందించాడు సీతాపతి. మాధవి కరపత్రాన్ని అందుకొని మడిచి నోట్లో పెట్టుకోబోయింది. అరుంధతి గబగబా వెళ్ళి తీసుకొని ఆ కరపత్రాన్ని ఆత్రంగా చదవసాగింది. అది చదువుతుంటే అరుంధతి కళ్ళు సంతోషంతో మిలమిలలాడటం నీరెండలో స్పష్టంగా కనిపించింది సీతాపతికి. తల పంకించాడు.
"ఏమిట్రా నాయనా అది? మళ్ళీ ఏమొచ్చింది?" శాంతమ్మ భయంతో గుండెలు చిక్కపట్టేస్తుంటే ప్రశ్నించింది.
"ఆ రాజాగాడికి ఈ ఊళ్ళో సన్మానం చేస్తున్నారట!"
"నిజంగా!" సంతోషంగానే ప్రశ్నించింది శాంతమ్మ.
"నిజమే! ఎందుకు చెయ్యరూ? ఇప్పుడు వాడు అధికార పార్టీలో చేరాడు. ఎం.ఎల్.ఎ.గా నిల్చుంటున్నాడు. మన ఊళ్ళో వాళ్ళంతా ఆ పార్టీ వాళ్ళేగా, ఘనంగా సన్మానం చెయ్యబోతున్నారు" అన్నాడు సీతాపతి.
"అంత గొప్పవాడయాడా రాజా!" అంది శాంతమ్మ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.
"గొప్పవాడు కాలేదు. పతనం అయాడు. అధికార పిపాస బాగా నెత్తికెక్కింది. అందుకే ఈ పార్టీలోకి వచ్చాడు. ఒకసారి కాలు జారింది. ఎంత కిందకు పడిపోతాడో చూడాలి" అన్నాడు సీతాపతి.
శాంతమ్మకు అర్ధంకాలేదు. కొడుక్కు రాజారావుమీదవున్న కోపంకొద్దీ ఏదో అంటున్నాడనుకుంది.
అరుంధతికి భర్తమీద కోపం వచ్చింది. "వెధవబుద్ధి, కుళ్ళుబుద్ధి!" అనుకుంది.
19
అరుంధతి కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూసినరోజు- రాజాకు సన్మానం జరిగేరోజు - రానేవచ్చింది. ఇందుపల్లి గ్రామాన్ని రెండు రోజుల ముందునుంచే అలంకరించారు. ఆ ఏర్పాట్ల గురించీ, అలంకరణ గురించి రంగణ్ణి చాటుగా మాటుగా అడిగి తెలుసుకుంటూంది. ఊరు బయట గేటుకూడా కట్టారట! వింటూంటే అరుంధతి తనువెల్లా పులకించిపోయింది. రాజా గొప్పవాడని తను ఏనాడో గుర్తించింది. రాజాకోసం ఆ ఊరినే అలంకరించారు.
రాజాకు అందరూ పూలమాలలు వేస్తారు. పొగిడేస్తారు. అందరి కళ్ళూ అటే వుంటాయి. ఆనాడు ఊరంతా రాజాను చూట్టానికి ఒకచోట చేరతారు. అటువంటి రాజా ముందు తమ ఇంటికే వస్తాడు. దాంతో ఆ వూళ్ళో తమ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. పరిపరి విధాల రాజాను గురించిన ఆలోచనలతోనే ఆ వారం అంతా గడిపింది. కాలం నడక చీమ నడకలా అనిపించింది ఆమెకు.
బుధవారం ఉదయం నుంచే రాజా వస్తాడని ఎదురుచూసింది అరుంధతి. శాంతమ్మ కూడా ఉదయమే రాజా వస్తాడనీ, తన కొడుక్కూ రాజాకూ మధ్య ఏర్పడిన గండి మళ్ళీ పూడుతుందనీ ఆశించింది. మధ్యాహ్నం అయినా రాజా రాలేదు. శాంతమ్మ ఉండబట్టలేక కొడుకును అడగాలనుకుంది.
సీతాపతి సావిట్లో కూచుని చుట్ట కాల్చుకుంటున్నాడు. సీతాపతి అశాంతిగా వున్నాడని గ్రహించింది శాంతమ్మ. 'రాజా కోసమే చూస్తున్నాడు. ఎంతలేదన్నా వాళ్ళ స్నేహమే వేరు' అనుకుంది శాంతమ్మ.
చుట్టపారేసి లోపలకు వచ్చిన సీతాపతి "అమ్మా, కొంచెం మంచినీళ్ళివ్వు" అన్నాడు.
"రాజా ఇంకా రాలేదేంరా?" అంది శాంతమ్మ మంచినీళ్ళగ్లాసు అందిస్తూ. అరుంధతి కుతూహలంగా చెవులు రిక్కించటం చూశాడు సీతాపతి. లోలోపలే పళ్ళుకొరుక్కున్నాడు.
"ఇవ్వాలేగా రాజా వచ్చేరోజు?" మళ్ళీ శాంతమ్మే అడిగింది.
"ఊఁ" అన్నాడు సీతాపతి.
"మరి ఇంకా రాలేదేం?"
"ఇప్పుడే ఎందుకొస్తాడు-మీటింగు సాయంకాలం ఆరున్నరకయితే" అన్నాడు అరుంధతివైపు చూస్తూ.
"అదేంటిరా! మరీ ఆ సమయానికే వస్తాడా? ముందే రమ్మని రాయకపోయావు?" అంది శాంతమ్మ.
"తమ పార్టీవాళ్ళతో కలిసి కారుల్లో వస్తారు. వేసవికాలమేగా కార్లు ఊళ్ళోదాకా వస్తాయి. ఒక మంత్రిగారుకూడా వస్తున్నారట" అన్నాడు సీతాపతి. ఆ మాటలు శాంతమ్మకికాక ఇంకెవరికో వినిపిస్తున్నట్లు.
"కనీసం రాత్రి భోజనానికయినా వస్తాడుగా రాజా! అతనితో ఇంకెవరైనా వస్తారేమో కనుక్కొని కబురుచెయ్యి. వాళ్ళు రాగానే వంటచేస్తాం!" అంది శాంతమ్మ.
"అక్కర్లేదు. భోజనాల ఏర్పాట్లుకూడా ఊళ్ళో పెద్దలే అందరికీ చేస్తున్నారు" అన్నాడు సీతాపతి. స్వరం చాలా గంభీరంగా లోతుగా వినిపించింది.
"అయితే రెండురోజులు వుండి వెళ్ళమని చెప్పు!"
"అక్కర్లేదు. వాడు వట్టి నీచుడు. ద్రోహి. వస్తే వాడి ముఖం చూడను." పై పంచె దులిపి భుజంమీద వేసుకుంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు సీతాపతి.
శాంతమ్మ గుడ్లప్పగించి చూస్తూ నిల్చుండిపోయింది. అరుంధతి దిగాలుపడి గోడకు చేరబడి కూచుంది.
ఆ సాయంత్రం అరుంధతి హడావిడిగా ముస్తాబుకావటం శాంతమ్మా, సీతాపతి గమనిస్తూనే వున్నారు. ఇరుగు పొరుగు ఆడవాళ్ళు కూడా వెళుతున్నారని విన్న అరుంధతి బయటకు వెళ్ళటానికి సిద్ధం అయింది. పిల్లకు కూడా మంచి గౌను వేసింది. కాని మాధవి నిద్రకు పడింది. శాంతమ్మ బయలుదేరుతున్నట్లు కనిపించలేదు. పిల్లను ఇంటిదగ్గరే వదిలివెళ్ళే ప్రయత్నంలో వుంది అరుంధతి. సీతాపతి బోనులో పులిలా ఇంట్లో తిరుగుతున్నాడు.
"అమ్మాయ్! ఎక్కడకు బయలుదేరావు?" శాంతమ్మ కోడల్ని ప్రశ్నించింది చిన్నగా కొడుకు వినకుండా.
బొట్టు పెట్టుకుంటున్న అరుంధతి పలకలేదు. శాంతమ్మ జవాబు కోసం నిల్చుంది.
"సభకు వెళుతున్నాను."
"వాడికి ఇష్టంలేనట్లుంది. అందుకే నేను మానేశాను. వాడూ వెళ్ళే ప్రయత్నంలో లేడు."
"అయితే అందుకు నన్నేం చెయ్యమంటారు?"
"నువ్వు కూడా వెళ్ళటం మంచిదికాదు. వాడిది అసలే పిచ్చికోపం. రాకరాక వస్తే వళ్ళూ పైనా తెలియదు" అంది శాంతమ్మ సిగులుగా.
"నేను వెళతాను, వెళ్ళి తీరతాను!"
"తప్పమ్మా! ఈ వంశంలో భర్తకు ఇష్టంలేని పనులు భార్యలు ఏనాడూ చెయ్యలేదు. అందుకే డబ్బుకు తక్కువే అయినా ఈ ఊళ్ళో అన్ని ఇళ్ళకంటే ఎక్కువ గౌరవం వుంది- ఈ ఇంటికి!" అంది శాంతమ్మ బాధగా.
"గౌరవం! గౌరవం! భార్యల్ని బానిసలుగా చూడటం గౌరవమా? వాళ్ళ దాసీలుగా పడివుండటం గౌరవమా? స్త్రీ పురుషుడి జీవిత భాగస్వామినేగాని, దాసీ కాదు. స్త్రీకీ ఒక వ్యక్తిత్వం ఉంటుందనీ, ఆమెకూ ఇష్టానిష్టాలు వుంటాయని ఎందుకు ఆలోచించరు? నేను చేస్తున్న పని- కానిపనికాదు. ఊళ్ళో అందరూ వెళ్ళే మీటింగుకే వెళుతున్నాను. ఆయనకు ఇష్టంలేకపోతే వెళ్ళరు. నేనెందుకు మానేయాలి?"
శాంతమ్మ తెల్లముఖం వేసింది. తనకోసం పెద్దలు గీచిన గీట్లమధ్యలోనే, పెద్దలు తనకోసం ఆలోచించి ఏర్పాటుచేసిన ఆచారాల్లోనే కాలం అంతా వెళ్ళబుచ్చింది శాంతమ్మ. ఆమెకు స్వంత ఆలోచనలు అంటూ ఎప్పుడూ రాలేదు. భార్య భర్త ఇష్టానికి అనుకూలంగా నడవాలని మాత్రమే ఆమెకు తెలుసు. శాంతమ్మకు అరుంధతి మాటలు అర్ధం కాలేదు. ఒక స్త్రీ అలా మాట్లాట్టం ఆమె ఎప్పుడూ వినలేదు. కనీసం చదవలేదు. ఏ పుస్తకంలోనూ, భారత, రామాయణగాథల్లో ఎక్కడా ఏ స్త్రీ భర్తఇష్టాన్ని ధిక్కరించలేదు. శాంతమ్మకు కళ్ళు బైర్లుకమ్మాయి. "ఇదేదో మంచికి రాలేదు" అనుకుంటూ వెళ్ళిపోయి వంటింటి గడపలో మండిగం మీద తల పెట్టుకొని పడుకుంది.
అరుంధతి ఓ క్షణం ఆలోచించింది. నిజంగా తను వెళ్ళటం మంచిదికాదా. అనవసరంగా కలతల్ని రేపినట్లవుతుందేమో? అసలే బ్రతుకు ఎడముఖాలు, పెడముఖాలుగా వుంది ఈ ఇంట్లో. కాని తను వెళ్ళకుండా వుండలేదు. రాజాకు అంత గౌరవం తన కళ్ళముందే జరుగుతుంటే, తను గట్టిగా కళ్ళు మూసుకొని కూచోగలదా? తన బిడ్డకోసం ప్రాణాలమీదకు తెచ్చుకొన్న వీరుడు, తనకోసం కన్నీరు కార్చిన ప్రేమజీవి! అతనికి ఊరంతా నీరాజనా లర్పిస్తుంటే తన దూరంనుంచయినా చూట్టానికి నోచుకోలేదా? తను వెళుతుంది! తను వెళ్ళి తీరాల్సిందే. ఇప్పటికే ఆలస్యం అయింది.
గబగబా ముందుకు అడుగులు వేస్తున్న అరుంధతి సింహగర్జనలాంటి అరుపుతో ఆగి నిల్చింది గడపలోనే.
"ఆగు! ఎక్కడికి?"
అరుంధతి మాట్లాడలేదు. భయం కలిగించేలా వుంది కోపంలోవున్న భర్తరూపం.
"మాట్లాడవేం? ఎక్కడికి?"