"అచ్చం నీ జబ్బులాంటిదే ఈమె జబ్బూను? అనాలనిపించింది జ్యోతికి. కాని శబరిని చిన్నబుచ్చడం ఇష్టంలేక అనలేదు.
"ఒకరోజు నా క్లాస్ మేట్ రాబర్ట్ మా ఇంటికి వచ్చాడు. ఒక పిల్ ఇచ్చి వేసుకోమన్నాడు. నేను మొదట సందేహించాను. స్వర్గం కనిపిస్తుంది అన్నాడు. నా సందేహాలకు సమాధానం కూడా దొరికుతుంది అన్నాడు. వేసుకున్నాను. నిజంగానే ఆ పిల్ నాకు స్వర్గం చూపించింది. ఆ స్వర్గంలో అశాంతి లేదు. అలజడి లేదు. అంతా ప్రేమ స్వరూపమే! ఆనందమే! ఆ పిల్ రోజూ వేసుకోవాలనిపించేది. కాలేజీ జీవితం బోర్ కొట్టసాగింది. ప్యాడ్ గురించీ, పాట్ గురించీ రాబర్ట్ చెప్పేవాడు. నేను డ్రగ్సుకు అలవాటు పడుతున్నానని నాన్న గ్రహించాడు. అమ్మకు అనుమానం కలిగింది. నన్ను కట్టడిలో పెట్టసాగారు. అప్పటికి నేను మైనర్నే!
ఆ రోజు నాన్న ఊళ్ళోలేడు! అమ్మ క్లబ్బుకు వెళ్ళింది చిన్నగా ఇంట్లోంచి జారుకున్నాను. రాబర్టును కలుసుకున్నాను. అతను నన్ను ప్యాడ్ కు తీసుకెళ్ళాడు. అక్కడ మొత్తం పదిహేనుమంది ఉన్నారు. అంతమందిలో ఒకే అమ్మాయి వుంది. నేను వెళ్ళేసరికి ప్యాడ్ కోలాహలంగా వుంది. అది నేను ఎరిగిన ప్రపంచంలా లేదు.
ఒకడు డ్రమ్ము వాయిస్తున్నాడు. మరొకడు నిల్చుని గిటార్ వాయిస్తున్నాడు. ముఖమంతా జుట్టుతో కప్పబడి వుంది! కొందరు మ్యూజిక్ అనుకూలంగా స్టెప్స్ వేస్తూ ఊగిపోతున్నాడు. ఒకడు పూర్తిగా నగ్నంగా వున్నాడు. అరుస్తూ గంతులేస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా దాదాపు నగ్నంగానే వుంది. చిన్న బట్ట చుట్టుకుంది. నగ్నంగా వున్న అతన్ని పట్టుకొని తనూ గెంతుతూ వుంది.
నేనూ కుతూహలంగా చూస్తూ నిల్చున్నాను. ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు కొంచెం జంకుతూ నిల్చున్నాను. ఆ జంకు నాకు ఎంతోసేపు లేదు.
ఒకడు పాట్ తాగుతూ నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఆహ్వానం వుంది. పలకరింపు వుంది. నేనూ నవ్వాను. ఇంకొకడు చేయి అందించాడు. నేను ఆ చేతిని చనువుగా అందుకున్నాను. ఆ స్పర్శలో ఏదో ఆప్యాయత గోచరించింది. మరొకడు నాకు పాట్ అందించాడు. ఒకసారి పీల్చి తిరిగి ఇచ్చేశాను. నాకు ఏమీ అన్పించలేదు. మొదట నన్ను చూసి చిరునవ్వు నవ్వినవాడు తన పాట్ ను అందించాడు.
ఒకసారి పీల్చాను. తమాషాగా అనిపించింది. రెండోసారి పీల్చాను. కళ్ళ ముందు రంగులు కన్పించాయి. మరోసారి పీల్చాను. ట్రిప్ బిగిన్ అయ్యింది. ఆ మత్తుమందు వాసనలూ, ఆ సంగీతం, వారిలోని ఆప్యాయతా అంతకు ముందే నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళాయి. ఇంతకాలంగా దేనిని నేను అన్వేషిస్తున్నానో అది వారికి లభించినట్టు అనిపించింది నాకు.
చరస్ - యల్.యస్.డి. అంత ఘాటుగా లేదు. ట్రిప్ స్లోగా మొదలయింది. నన్ను నేను మర్చిపోయాను. నా శరీరానికి, మనసుకూ సమాజం ఏర్పర్చిన హద్దులు చెరిగిపోయాయి. అంతే. ఆనాటినుంచీ, ప్రేమమయమైన ఈ రంగుల ప్రపంచంలోనే ఉండిపోయాను. మీదేశం వచ్చాను. ఇక్కడకు వచ్చి ఆరు నెలలైంది.
"అతనేనా రాబర్ట్?" జ్యోతి దూరంగా నేలమీద పడుకొని ఉన్న అతన్ని చూస్తూ అడిగింది.
"కాదు. ఇతని పేరు జోసఫ్!"
"రాబర్ట్ ఈ దేశం రాలేదా?"
"వచ్చాడు!"
"మీతోనే వున్నాడా?"
"మొన్నటివరకూ ఉన్నాడు!"
"ఇప్పుడేమైనాడూ?"
"జైల్లో ఉన్నాడు!" నిర్లిప్తంగా అన్నది మేరీ!"
"జైల్లోనా ఎందుకూ?" భయంగా అడిగింది శబరి.
"ఎందుకేమిటి మత్తుమందుల కోసం ఏ దొంగతనమో చేసి వుంటాడు!" అన్నది జ్యోతి.
"దొంగతనం చెయ్యలేదు. స్మగుల్డు గూడ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు!"
"నీ దగ్గిర డబ్బుందా?"
"లేదు!"
"అంటే నువ్వూ ఎప్పుడో జైలు కెళ్తావన్నమాట!"
మేరీ ముఖం ఎర్రగా అయింది.
"ఆ అవసరం వుండదు!" జాన్ అందుకొని సమాధానం ఇచ్చాడు.
"ఏం? ఎందుకుండదూ? డ్రగ్స్ లేకుండా ఉండగలరా?"
"కనీసం వారానికో కొత్త మెంబరైనా మాలో కలుస్తాడు. అతను తన దగ్గిర ఉన్నది అందరికీ పంచుతాడు! అంతవరకెందుకూ రేపు ఈ బేబీ - ఎల్లుండి నువ్వూ - ఇలా అనంతంగా సాగిపోతాం!"
"షటప్!" జ్యోతి అరిచింది.
"ఎందుకు బేబీ అలా ఉద్రేకపడ్తావ్?" కళ్ళమీద పడుతున్న జుట్టును వెనక్కు నెడుతూ అన్నాడు జాన్.
"నన్ను అలా పిలవొద్దని చెప్పాను!" తీవ్రంగా వుంది జ్యోతి కంఠం.
"ఎందుకు జ్యోతీ పాపం వాళ్ళను అలా కసురుకుంటావు? శబరి జాలి ఉట్టిపడే స్వరంతో అన్నది.
"నీకూ వీళ్లతో కలిసిపోవాలనే అనిపిస్తోందా!" శబరి ముఖంలోకి లోతుగా చూస్తూ అడిగింది జ్యోతి.
"నీకు మాత్రం అన్పించటం లేదూ-" శబరి ఎదురు ప్రశ్న వేసింది.
"నాకా? వీళ్ళతోనా? ఈ కుళ్ళు బతుకులతోనా? జ్యోతి ఏవగింపుగా అన్నది.
"యూ ఆర్ వెరీ క్రూయల్? ఎదుటి మనిషిని పరుషమయిన మాటలతో బాధపెడతావ్!" బాధపడుతూ అన్నది మేరీ.
"మాది కుళ్ళు బతుకా? అన్నీ వుండి తిన్నదరక్క, చౌకబారు సెక్స్ పుస్తకాలు చదివి, మతి పోగొట్టుకుని, భార్య చాటుగా ఏ వంటమనిషి రాజమ్మతోనో ప్రేమ కలాపాలు సాగించే పెద్ద మనుషుల బతుకు కుళ్ళు బతుకు కాదా?"
చివ్వున తలెత్తి జాన్ ముఖంలోకి చూసింది.
"మొగుళ్ళు సంపాదించి పడేస్తుంటే, మెత్తటి పరుపులమీద దొర్లుతూ కారు డ్రైవర్లను భర్త చాటుగా గదుల్లోకి పిలిపించుకొనే భార్యల బతుకు మురికి బతుకు కాదా?"
జ్యోతి జాన్ ముఖంలోకి విస్మయంగా చూసింది.
"కట్టలు, కట్టలు బ్లాక్ మనీ వచ్చి పడిపోతూవుంటే, దానిమీద పైటలూ, లంగాలూ, ఎగిరిపోతూ వుంటే స్వర్గ సుఖంకోసం అర్రులు చాచే శ్రీమంతుల బతుకులు కుళ్ళు బ్రతుకు కాదా?"
జ్యోతి ఆశ్చర్యంగా వింటూ వుండిపోయింది.
"పెద్ద పెద్ద డిగ్రీలతో పెద్ద కుర్చీలలో కూర్చున్న అధికారులు మందుకోసం, మగువలకోసం సంతకాలు పెట్టడం ఏమంటావ్?"
జ్యోతి కళ్ళు పెద్దవి చేసుకొని జాన్ ముఖంలోకి చూసింది. జాన్ అంత తెలివిగా మాట్లాడుతున్నందుకు శబరి కళ్ళలో మెరుపు కన్పించింది.
"ఒకవేపు వేదికలెక్కి ఆర్ష సాంప్రదాయాన్ని గురించీ, హిందూ సంస్కృతి గురించీ ఉపన్యాసాలు ఇస్తూ, మరోవైపు క్లాసు రూమ్స్ లో ఆడపిల్లల్ని చూస్తూ, రంభా, ఊర్వశి కథలు చెపుతూ, లొట్టలు వేసే పిలక పండితుల్ని ఏమని పిలవాలి?" జాన్ ఉద్రేకంతో వూగిపోతూ మాట్లాడుతున్నాడు. జ్యోతి విస్మయంగా జాన్ కేసి చూస్తూ నిల్చుంది.
"ఆసామిని పొలం పంపించి, పాలేర్లను బెడ్ రూముల్లోకి పిలిపించుకునే భూస్వాముల భార్యల్ని ఏమనాలి? అదంతా కుళ్ళుకాదూ? నువ్వు ఉంటున్న ఈ సమాజంలో కుళ్ళు లేదూ?"
"కుళ్ళు లేదని నేను అనడం లేదే? అందుకే యీ వ్యవస్థ మారాలంటున్నాను!"
"మేమూ అదే అంటున్నాము. అందుకే యీ వ్యవస్థను తిరస్కరించాం! ఎదురుతిరిగాం!"
"మీకు ఒక లక్ష్యమంటూ లేదు."
"ఎందుకు లేదూ! మాకూ లక్ష్యం వుంది."
"ఏమిటది?"
"నిర్వాణం! విముక్తి! ఈ కుళ్ళు వ్యవస్థనుంచి విముక్తి! ఈ హిపోక్రసీ నుంచి విముక్తి! హిప్పీలు కాకపోయినా, హిప్పీల మెంటాలిటీ నుండి, ఒప్పుకొనే ధైర్యంలేని పిరికిపందలనుంచి దూరంగా వెళ్ళిపోవడం ఇదే మా లక్ష్యం!" అన్నాడు జాన్.
ఇక వీళ్ళతో వాదించి లాభంలేదని గ్రహించింది జ్యోతి.
"శబరీ! వెళదాం పదా!" జ్యోతి చిరాగ్గా అన్నది.