లలిత తల్లిదండ్రులకు ఏకైక పుత్రిక. వివాహమైన చాలా కాలానికి జన్మించిన సంతానం. ఆ దంపతుల ఆశలన్నీ ఆ పిల్ల చుట్టూనే అల్లుకొని వున్నాయ్! లలిత చదువుకూ, దుబారా ఖర్చులకూ వున్న ఆ కొద్ది ఆస్తి కరిగిపోయింది. మిగిలిన ఆ రెండెకరాల మాగాణి కూడా తాకట్టులో వుంది. యీ సంవత్సరం కూడా ఎలాగో, లలిత చదువు పూర్తి చెయ్యగలిగితే ఒడ్డున పడినట్టే! చదువు పూర్తి కాగానే లలితకు మంచి ఉద్యోగం వస్తుందనీ, తమ కష్టాలు గట్టెక్కుతాయనీ ఆ అమాయకుడి ఆశ.
ఆ రోజునుంచీ సునంద లలితను గమనిస్తూనే వుంది. ఒకటి రెండుసార్లు దుబారా ఖర్చు చెయ్యవద్దని హెచ్చరించింది. లలిత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది.
జాడీలు సర్ది లలిత మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంది. కళ్ళలో అశాంతి స్పష్టంగా కనిపిస్తున్నది. దిగాలుపడి కూర్చున్నది.
సునంద కూడా లలిత పక్కన కూర్చుంది. లలిత విసుగ్గా, చురుగ్గా సునంద ముఖంలోకి చూసింది.
"నన్నెందుకిలా వేటాడతావ్?" అని నిలదీసి అడిగినట్టుంది లలిత చూపు.
సునంద అదేమీ గమనించనట్టే "మీ నౌకరు చాలా మంచివాడు!" అన్నది లలిత ముఖంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ.
లలిత వీపుమీద కొరడాదెబ్బ తగిలినట్టు ఉలిక్కిపడింది.
"అవునవును!" గాబరాగా మరోవైపుకు చూస్తూ అనేసింది లలిత.
"మీ నాన్నగారు చాలా ధనవంతులటగా?" సునంద కంఠం అదోలా ధ్వనించింది.
లలిత చివ్వున తలతిప్పి, సునంద ముఖంలోకి చూసింది. లలిత ముఖం వెలవెల పోయింది.
"నాకు ఎలా తెలిసిందని ఆశ్చర్యంగా వుందా?" రెట్టించింది సునంద.
"ఎవరు చెప్పారు?" దెబ్బతిన్నట్టు వుంది లలిత కంఠం.
"మీ సర్వెంటే చెప్పాడ్లే!" అన్నది సునంద విరక్తిగా నవ్వుతూ.
లలిత స్థాణువులా బిగుసుకు పోయింది. కళ్ళప్పగించి సునంద ముఖంలోకి చూస్తూ వుండిపోయింది.
లలిత ముఖంలో మార్పు గమనించింది సునంద.
"మీ నాన్న చాలా డబ్బు పంపించినట్టున్నాడు?" లలిత సమాధానం చెప్పలేదు.
ఓ క్షణం ఆగి "అదృష్టవంతురాలివి" అన్నది సునంద. లలిత తల ఎత్తలేదు.
"ఆ డబ్బుతో పట్టుచీర కొంటావా?"
లలిత కింద పెదవిని పైపంటితో నొక్కుతూ తలవంచుకొని కూర్చుంది.
"ఇంకా చీర కొనడానికి బజారుకు వెళ్ళలేదేం? ఐస్ క్రీం పార్టీకూడా ఇస్తున్నావా?"
లలిత దెబ్బతిన్న లేడి వేటగాడ్ని చూసినట్టు సునంద ముఖంలోకి దీనంగా చూసింది.
"ప్లీజ్! దెబ్బమీద దెబ్బకొట్టకు, నీకు పుణ్యం వుంటుంది?" అని ప్రాధేయ పడుతున్నట్టు అనిపించింది సునందకు.
సునంద ఆశించిన మార్పు లలితలో కన్పించింది.
"మీ అమ్మగారికి నువ్వంటే ఎంత ప్రేమో? ఎప్పుడూ తినడానికి ఏదో ఒకటి పంపిస్తూనే వుంటుంది. ఈసారి ఏం పంపించింది లలితా? నాక్కూడా పెట్టవూ?" అన్నది సునంద లలిత ముఖంలోకి చూస్తూ.
లలిత ముఖం వర్షించటానికి సిద్ధంగావున్న మేఘావృత ఆకాశంలా వుంది.
"బోర్ కొడ్తున్నానా? బజారుకు వెళ్ళాలి గదూ? తయారవు!"
నిండుకుండ భళ్ళున బద్దలైంది. రెండు చేతుల్లో ముఖం కప్పుకొని బోరుమంది లలిత.
సునంద సంతృప్తిగా లలిత ముఖంలోకి చూసింది. లేచివెళ్ళి గది తలుపు వేసివచ్చి లలిత కుర్చీపక్కగా నిల్చొని భుజంమీద చెయ్యివేసింది.
"ఛ! ఏమిటిది లలితా! ఊరుకో!"
సునంద లాలింపుకు లలిత దుఃఖం కట్టలు తెంచుకుంది.
"ఊరుకో లలితా! నన్ను క్షమించు! నీ మనస్సును నొప్పించాను" ఆర్ద్రంగా అన్నది సునంద.
"నేను....నేను పాపిష్టిదాన్ని....కన్నతండ్రిని...." వెక్కిళ్ళ మధ్య అన్నది లలిత.
సునంద మౌనంగా లలితను చూస్తూ నిల్చుంది.
మళ్ళీ బావురుమన్నది లలిత. కదిలి కదిలి ఏడ్వసాగింది.
సునంద లలిత చేతుల్ని ముఖం మీదనుంచి బలవంతంగా లాగి పట్టుకున్నది.
"ఇప్పుడేమయింది లలితా! ఊరుకో!" బ్రతిమాలుతూ అన్నది సునంద.
"ఇంకా ఏంకావాలి? కన్నతండ్రిని నౌకరని చెప్పాను. ఎండలో వచ్చిన తండ్రిని తరిమితరిమి కొట్టాను. అమ్మకు జబ్బుచేసిందని చెబితే ఏంజబ్బని కానీ, ఇప్పుడెలావుందని కానీ అడగలేదు."
మళ్ళీ భోరుమన్నది లలిత.
సునంద లలిత చేతుల్ని అనుకోకుండా వదిలేసింది.
"మీ అమ్మకు జబ్బు చేసిందా? ఏం జబ్బు అని కూడా అడగలేదా?" "నువ్వు మనిషివికాదు. పిశాచానివి" అనట్టుంది సునంద కంఠం.
"నన్ను చూస్తూంటే నీకు అసహ్యం వేస్తుంది గదూ? నాన్నను త్వరగా పంపించెయ్యాలనే ఆత్రంలో అమ్మ గురించి అడగలేదు. ప్రభ ఎక్కడ నాన్నను చూస్తుందోనని భయపడిపోయాను" బెక్కుతూ అన్నది లలిత.
"ఏం ప్రభ మీ నాన్ననుచూస్తే? ఏమైనా ప్రమాదం జరుగుతుందా? భయం ఎందుకు? కన్నతండ్రిని తండ్రిగా పదిమందిలో గుర్తించటానికి సిగ్గుపడుతున్నావా? ఎందుకూ? మీ నాన్న తెల్లబట్టలు వేసుకోలేదనా? లేక ఖద్దరుసిల్కు లల్చీతో కార్లో రాలేదనా?" రెట్టించింది సునంద.
"ఒకసారి ప్రభతో అబద్ధం చెప్పాను. అంతకుముందే ప్రభ నాన్నగారు కార్లోవచ్చి వెళ్ళారు. నన్ను పరిచయం చేసింది. ఆ హుందా....ఆ ఠీవీ చూసి....నాకూ అలాంటి నాన్న వుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాను. అదేరోజు మా నాన్న వచ్చాడు. ప్రభచూసి ఎవరని అడిగింది. వెంటనే మా నాన్న అని చెప్పలేకపోయాను. ఏదో బలహీనత నన్ను అలా చెప్పనివ్వలేదు. తడుముకోకుండా 'మా నౌకరు' అనేశాను. పైగా హాస్టల్లో చేరిన కొత్తలో నన్నందరూ శ్రీమంతుల బిడ్డని అనుకొన్నారు. నేనూ అలాగే ప్రవర్తిస్తూ వచ్చాను. మా నాన్ననుచూస్తే మేమెంత బీద వాళ్ళమో తెలిసిపోతుందనే భయం పట్టుకుంది. అందుకే అబద్ధం చెప్పాను. అప్పటినుంచి నాన్న ఎప్పుడొచ్చినా ఆప్యాయంగా పది మాటలు కూడా మాట్లాడలేని అసహాయురాల్ని అయ్యాను. నీచురాల్ని, పాపిష్టిదాన్ని" లలిత కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. చివరి మాటలు కంఠంలో గరగరలాడాయి.
"బీదవాళ్ళుగా పట్టటం పాపంకాదు లలితా! దారిద్ర్యాన్ని చూసి సిగ్గుపడాల్సింది దరిద్రులు కాదు. సిగ్గుపడాల్సిన వాళ్ళు సిగ్గుపడటంలేదు. పైగా తలలెత్తుకొని తిరుగుతున్నారు. సమాజంలో పై అంతస్థులో కూర్చుని దరిద్రుల్ని చూసి నవ్వుతున్నారు. కర్మ సిద్దాంతాన్ని బోధించి వాళ్ళ స్థానం పది కాలాలపాటు పదిలంగా వుండేటట్టు చూసుకుంటున్నారు" సునంద ఉద్రేకంతో ఆగిపోయింది.
ఓ క్షణం ఆగి మళ్ళీ అన్నది.
"పేదరికం పాపంకాదు, కాని దాన్ని కప్పిపుచ్చుకోవడం పాపం! ఆత్మను చంపుకోవడం అపరాధం! మమతల్నీ, మమకారాల్నీ అణుచుకోవడం నేరం! లేమికి సిగ్గుపడాల్సిన పనిలేదు. ఒకవైపు లేమితో కృంగిపోతూ, పైకి శ్రీమంతుల్లా నటిస్తున్నందుకు సిగ్గుపడాలి. మిథ్యాడంబరాల కోసం అర్రులు చాస్తున్నందుకు సిగ్గుపడాలి. ఉన్నవాళ్ళతో పోటీపడి, విలాసాల వ్యామోహంలో పడి, కన్న తండ్రిని తండ్రిగా చెప్పుకోవడానికి సిగ్గుపడటమే సిగ్గులేని తనం!"
సునంద ఆగి లలిత ముఖంలోకి చూసింది.
లలిత తలవంచుకొని కూర్చుంది. కన్నీరు చెంపల్ని తడుపుతూ వుంది.
"వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి లలితా! కృత్రిమ అంతస్తుల్ని పెంచుకొని మానవత్వపు విలువల్ని మర్చిపోవడం అవివేకం. శ్రీమంతులతో స్నేహం చేసినంత మాత్రాన సమాజంలో మన అంతస్తు పెరిగి పోతుందనుకోవడం అజ్ఞానం! డబ్బుతోనే విలువలు పెరుగుతాయని తాపత్రయం మానేసి, మనిషిగా బ్రతకటం నేర్చుకోవాలి" అంటూ సునంద లలిత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది.
లలిత పసిబిడ్డలా సునంద చేతులకు చుట్టుకుపోయి వెక్కి వెక్కి ఏడ్వసాగింది.
లలిత తలను మృదువుగా నిమురుతూ ఓదార్చింది సునంద.
"లే లలితా! లేచి ముఖం కడుక్కో. ఎవరైనా వస్తే బాగుండదు అన్నది సునంద.
కుర్చీనుంచి లేచిన లలితను సునంద ఆప్యాయంగా కౌగలించుకుంది. ఇంతకాలంగా వారిద్దరి మధ్యావున్న గోడలు కూలిపోయాయి. రెండు హృదయాలూ మనస్సు విప్పి మాట్లాడుకున్నాయి.
"వెళ్లు! బాత్ రూంలోకెళ్ళి ముఖం కడుక్కురా! అన్నం కూడా తినలేదు. హార్లిక్స్ కలుపుతాను" మెత్తగా వుంది సునంద కంఠం.
లలిత ముఖం కడుక్కొని వచ్చింది. టవల్ తో ముఖం తుడుచుకుంటూ కుర్చీకి చేరబడింది అలసటగా. మనస్సు మాత్రం తేలిగ్గా, మబ్బులు విడిచిన ఆకాశంలా నిర్మలంగా వుంది.
సునంద ఇచ్చిన హార్లిక్స్ గ్లాసు అందుకొని గటగటా తాగేసింది. కొంత సేద తీరింది.
సునంద మనసుకూడా హాయిగా వుంది. లలితలో వచ్చిన మార్పుకు గర్వంగా వుంది.
"సునందా! ఇప్పుడు నాకు హాయిగా వుంది. మనస్సు తేలిగ్గా వుంది. ఇక భేషజాలకు పోయి అబద్ధాలు చెప్పను. అందుబాటులో లేని విలాసాల కోసం చేతులు చాపను. ఇప్పుడే వెళ్ళి ప్రభకూ, సుజాతకూ అసలు సంగతి చెప్పేస్తాను. నేను బీద కుటుంబంలో పుట్టాననీ, మధ్యాహ్నం వచ్చిన వ్యక్తి మా నాన్నగారేననీ గర్వంగా చెబుతాను" లలిత ఉద్రేకంగా లేచి నిల్చుంది.