Previous Page Next Page 
రాబందులూ - రామచిలుకలు పేజి 15


    లలిత మనస్సు కలత చెందింది. ఆ కళ్ళను చూడలేక తన కళ్ళను దించుకుంది.

 

    "అన్నం తిన్నావా నాన్నా!" అని కూడా కూతురు అడగలేదు. వృద్ధుడి మనస్సులో ఏదో కలుక్కుమన్నది.

 

    "పసిది! దానికేం తెలుసు మర్యాదలు చెయ్యడం! అయినా తాను కన్న తండ్రి! తనను కూతురు మర్యాద చెయ్యడం ఏమిటి?" బాధపడుతున్న మనస్సును తండ్రి హృదయం ఓదార్చింది.

 

    "మీ అమ్మకు బొత్తిగా ఒంట్లో బాగుండటం లేదమ్మా! నిన్ను చూడాలని ఒకటే ఇదై పోతుంది" అన్నాడు తండ్రి.

 

    "పరీక్షలు కాగానే వచ్చేస్తాగా! ఇంకా ఎన్నాళ్ళు?'

 

    "అమ్మకు ఏంజబ్బు నాన్నా? మందు తీసుకుంటుందా?" అంటూ కూతురు ఆదుర్దా పడుతుందనుకొన్న తండ్రి, ఆ జవాబుకు విస్మయంగా కూతురు ముఖంలోకి చూశాడు.

 

    "వంట్లో బాగుండక పిండివంటలేమీ చెయ్యలేదని చెప్పమన్నది మీ అమ్మ!" అంటూ కూతురి ముఖంలోకి చూశాడు.

 

    "సరేలే నాన్నా! అమ్మను అడిగానని చెప్పు!" అంటూ తండ్రిని త్వరగా సాగనంపే ఉద్దేశ్యంతో బయటికి నడిచింది.

 

    లలితకు భయంగా వుంది. గాబరాగా వుంది.

 

    తన స్నేహితురాళ్ళెవరైనా వస్తే? ఈయనెవరిని అడిగితే? తనేం చెబుతుంది? ఇతనే తన తండ్రి అని వాళ్ళకు తెలిసిపోతే? ఇంకేమైనా వుందా? తనకు కొంచెమైనా గౌరవం వుంటుందా?

 

    అందరూ తనను శ్రీమంతురాలు అనుకుంటున్నారు. తను కూడా అలాగే ప్రవర్తిస్తోంది. ప్రవర్తించడం ఏమిటి? అందరికీ చెప్పింది కూడా. తమకు బోలెడంత ఆస్తి వుందని చెప్పింది. మేడలూ, మిద్దెలూ ఉన్నాయని చెప్పింది. ఇంకా ఏవేవో కోతలు కోసింది. ఇప్పుడు వాళ్ళెవరైనా తన తండ్రిని చూస్తే? అసలు రంగు బయటపడితే? ఇంతకాలం ఎలాగో మేనేజ్ చేసింది. మరో మూడు నెలలు గడిస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళెక్కడో, తనెక్కడో?

 

    ఎప్పుడూ సాయంత్రమో, ఉదయమో వచ్చే నాన్న ఇవ్వాళ భోజనం సమయంలోనే రావాలా?

 

    వరండా మెట్లు దిగుతూ ఆగి వెనక్కు చూశాడు.

 

    "ఏమిటి నాన్నా?" సాధ్యమైనంత వరకు మనసులోని విసుగు కనిపించకుండా అడిగింది.

 

    "జాగ్రత్త తల్లీ! డబ్బు దుబారా చెయ్యకు?"

 

    "అలాగేలే! ఇక వెళ్లు. నేను త్వరగా భోజనంచేసి బజారు వెళ్ళాలి."

 

    ఓ క్షణం నిల్చుని కూతురి ముఖంలోకి చూశాడు. మరుక్షణంలో వెనక్కు తిరిగి మెట్లు దిగాడు.

 

    భోజనంచేసి ప్రభ, సుజాత వస్తున్నారు. వాళ్లు కనిపించగానే లలిత నవనాడులూ కృంగిపోయినట్టయింది.

 

    నడవలేక నడుస్తూ వెళ్తున్న ముసలాయన్ని చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు ప్రభ, సుజాత.

 

    "మీ సర్వెంటు వచ్చాడే? మళ్ళీ ఈసారి ఏం పంపించాడే మీ నాయన లలితా?" ప్రభ అల్లంత దూరంనుంచే అరుస్తూ అడిగింది.

 

    ప్రభ మాటలు లలిత తండ్రి కాళ్ళను బంధించాయి. ఆగిపోయాడు. స్థాణువులా నిల్చుండిపోయాడు.

 

    అప్పుడే భోజనానికి కిందకు దిగివచ్చిన సునంద ప్రభ మాటలు విని ఆశ్చర్యంగా లలిత వెనక నిలబడిపోయింది.

 

    స్థాణువులా నిలబడివున్న వృద్ధుడికేసి జాలిగా చూసింది.

 

    లలిత గాబరా పడిపోతున్నది.

 

    అది గమనించకుండా "లక్కీ గర్ల్ చీర కొనాలనుకున్నావ్! మీ నాయన డబ్బు పంపించాడు" అన్నది సుజాత లలిత చేతిలోని నోట్లకట్టను చూస్తూ.

 

    "లలితకేమే బంగారు పిచ్చుక. వాళ్ళ నాయన ఎంత కావాలంటే అంత పంపిస్తాడు. మానాన్న చూడు! ఎంత ఐశ్వర్యం వుంటేనేం లెక్కలు అడుగుతూ వుంటాడు. దొంగ లెక్కలు చెప్పలేక తలప్రాణం తోకకు వస్తుంది" అన్నది ప్రభ.

 

    ఇంకా ఆలస్యం ఎందుకు? త్వరగా భోజనం చెయ్యి బజారుకెళ్దాం! చీరకొన్నాక తాజ్ లో ఐస్ క్రీం పార్టీ ఇవ్వాలి. తెలిసిందా?" సుజాత అన్నది ఉత్సాహంగా.

 

    లలితకు చెమట పడుతున్నది.

 

    "ఏమే లలితా? మీ నాన్నగారు ఒక్కసారి కూడా రాలేదేం? ఎప్పుడూ యీ ముసలి నౌకర్నే పంపిస్తారేం?" అన్నది ప్రభ దూరంగా నిల్చున్న వృద్దుణ్ణి చూస్తూ.

 

    "ఆఁ ఆఁ ! మా నాన్నగారికి తీరికుండదు!" తత్తర బిత్తర లాడుతూ అనేసింది లలిత.

 

    లలిత తండ్రి చివుక్కున వెనక్కు తిరిగి చూశాడు. మరుక్షణంలో ముందుకు కదిలాడు.

 

    లలిత తండ్రికేసి చూసింది. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ, భారంగా కదిలిపోతున్నాడు. కాళ్ళను భూదేవి కిందకు లాగేస్తున్నట్టు నడుస్తున్నాడు.

 

    లలిత పరుగులాంటి నడకతో విజిటర్స్ రూంలోకి వెళ్ళింది. నేతి తపేళా, బుట్టా తీసుకొని పైకి వెళ్ళబోతూ సునందను చూసి తెల్లబోయింది. ముఖం తిప్పుకుని గబగబా పైకి వెళ్ళిపోయింది.

 

    ఆమె వెనకే ప్రభా, సుజాతాకూడా వెళ్ళిపోయారు.

 

    సునంద లలిత తండ్రిని చూసింది. నడుస్తూనే వున్నాడు. కాని పది గజాలు కూడా నడవలేదు.

 

    సునంద గబగబా వరండా మెట్లు దిగివచ్చింది.

 

    "బాబాయ్!" లలిత తండ్రిని పిల్చింది.

 

    ఆయన వినిపించుకోలేదు.

 

    రెండడుగుల్లో అతన్ని కలుసుకొని "బాబాయ్!" అన్నది.

 

    ముసలాయన ఆగిపోయాడు. వెనక్కు తిరిగి చూశాడు. సర్వస్వం కోల్పోయిన వాడిలా దిగాలుపడి కన్పించాడు.

 

    "బాబాయ్ ! ఎంతసేపయింది వచ్చి?" సునంద అడిగింది. ఆమె కంఠంలోని ఆత్మీయతకు ఆ వృద్ధుడి హృదయం కదిలిపోయింది.

 

    కళ్ళు చెమ్మగిల్లాయి.

 

    "అమ్మా! ఇప్పుడే వచ్చానమ్మా!" గొంతులో ఏదో గరగర లాడింది.

 

    "ఇంత ఎండలో వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నావేం? భోజనంచేసి వెళ్లు బాబాయ్?" సునంద కంఠం జాలిగా పలికింది.

 

    కృతజ్ఞత నిండిన కళ్ళతో సునంద ముఖంలోకి చూశాడు. మరుక్షణంలో కన్నీటిపొరలు కమ్ముకున్నాయి.

 

    అతనికి ఎదురుగా నిల్చున్న సునంద కదిలిపోయిన ఫొటోగ్రాఫులా కన్పించింది.

 

    సునంద కళ్ళు చెమ్మగిల్లాయి.

 

    "వద్దమ్మా! వద్దు! కడుపు నిండిపోయింది తల్లీ! ఇహచాలు!" కంఠం దుఃఖంతో పూడిపోయింది.

 

    "బాబాయ్!" సునంద బాధగా పిల్చింది.

 

    వృద్ధుడు సునంద ముఖంలోకి చూసి పేలవంగా నవ్వాడు. తను చెయ్యని అపరాధానికి ఉరికంబం ఎక్కబోయే ముందు ఖైదీ నవ్వే నవ్వులా వుంది.

 

    "వస్తాను తల్లీ!" గిర్రున వెనక్కు తిరిగి, చరచర నడిచిపోయాడు.

 

    అలా వెళ్ళిపోతున్న ఆ వృద్ధుణ్ణి చూస్తూ, "దగాపడిన తండ్రి" - సునంద గొణిగింది.

 

    సునంద భోజనంముందు కూర్చుంది. కళ్ళముందు లలిత తండ్రి నిల్చున్నట్టు అనిపించసాగింది. ముద్ద గొంతుదిగటం లేదు. లేచి చెయ్యి కడుక్కుంది.

 

    గదిలో కాలుపెట్టిన సునందకు, గడ్డం కింద చెయ్యి పెట్టుకొని విచారంగా కూర్చుని వున్న లలిత కన్పించింది.

 

    లలిత దీర్ఘంగా ఆలోచిస్తూ వుంది. సునంద రావడం గమనించలేదు.

 

    సునంద లలిత ఎదురుగా నిల్చుని ఓ క్షణం పరకాయించి చూసింది.

 

    లలిత బాధపడుతోందా? ఎందుకు? తన తండ్రిని నౌకరని చెప్పినందుకా? కాదు....బహుశా ఆ మాటలు తండ్రి విన్నందుకై వుండాలి.

 

    "ఏమిటి లలితా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?" లలిత పక్కకు కుర్చీ లాక్కుని కూర్చుంది సునంద.

 

    లలిత అదిరిపడింది. "ఆఁ ఆఁ ! ఏం లేదు" తత్తర బిత్తర లాడుతూ అన్నది.

 

    సునంద లలిత కళ్ళలోకి తీవ్రంగా చూసింది.

 

    లలిత హడావిడిగా లేచివెళ్ళి తాటాకు బుట్టలోవున్న సామాను సర్దుకోసాగింది.

 

    సునంద కూడా లేచివెళ్ళి లలిత పక్కగా నిల్చుంది. అలమారులో పెట్టబోతున్న చిన్న జాడీని లలిత చేతుల్లో నుంచి అందుకుంది సునంద.

 

    జాడీ మూత తీసి చూసింది.

 

    "ఉసిరిగాయ పచ్చడి. నాకు చాలా ఇష్టం!" అంటూ సునంద జాడీ అలమారులో పెట్టింది.

 

    "అయితే నువ్వే తీసుకో!" అన్నది లలిత జాడీ తీసి సునంద చేతిలో పెడుతూ.

 

    ఆ ధోరణి "త్వరగా నన్ను వదులు" అన్నట్టుంది.

 

    "ఇదంతా నాకెందుకూ? మీ అమ్మగారు నీ కోసం పాపం ఎంతో ప్రేమతో పంపించారు. నీ దగ్గరే వుంచు. తినాలనిపించినప్పుడు తీసుకుంటాలే!" అన్నది సునంద. జాడీ అలమారులో పెట్టింది.

 

    సునంద నేతి తపేళా మీది మూతతీసి వాసన చూసింది.

 

    "అబ్బ! ఎంత కమ్మగా వుందో!" అన్నది సునంద.

 

    "అయితే! తీసుకో!" అన్నది లలిత కొంచెం విసుగ్గా.   

 

    లలితకు సునందను త్వరగా వదిలించుకోవాలని వుంది. అది గ్రహించిన సునంద వదలకుండా సంభాషణ పొడిగించ సాగింది.

 

    సునందకు లలిత తండ్రి తెలుసు. ఒకసారి వచ్చినప్పుడు లలితలేదు. సినిమాకు వెళ్లింది. సునంద చూపించిన ఆప్యాయతకు కరిగిపోయిన లలిత తండ్రి తన గోడంతా వెళ్ళబోసుకున్నాడు. తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితులు చెప్పాడు.

 Previous Page Next Page