Previous Page Next Page 
పిపాసి పేజి 14


    "అప్పుడే యిల్లొచ్చేసిందా? అంటూ తడబడుతూ టాక్సీ దిగింది రాధిక. డబ్బిచ్చి టాక్సీని పంపించేశాడు మధన్.    


    సూట్ కేసు పట్టుకుని, మధన్ వెనకాలే నడిచింది రాధిక.


    "అమ్మా..... ఎవరొచ్చారో చూడూ" అంటూ. పెద్ద పెద్ద కేకలు పెట్టుకుంటూ హడావిడి చేశాడు మధన్. వంట యింట్లోంచి, తడి చేతులు కొంగుకి తుడుచుకుంటూ గబగబా వచ్చింది రాజేశ్వరమ్మ.    


    ఒక్క నిమిషం ఆ అమ్మాయికేసి అలాగే చూస్తూ నిలుచుండిపోయింది, ఆశ్చర్యంగా.


    "ఏమిటి? రాధికేనా? ఎంత అందంగా వుంది. పాలరాతి బొమ్మలా వుంది." అనుకుంది మనసులో.


    రాధిక ఆమెని చూస్తూ కన్నార్పకుండా అలాగే వుండిపోయింది. "అత్తయ్య ఎంత హుందాగా వుంది. కట్టు, జుట్టూ, నుదుటున పెద్ద బొట్టూ, పార్వతీదేవిలా వుంది" అనుకుంది.     


    "ఇదేమిటి ఇలా వుండిపోయారేమిటి ఒకరిని ఒకరు చూసుకుంటూ" అన్నాడు మధన్.     


    "అమ్మా, రాధికా, ఎంతదానివయ్యావమ్మా నిన్నూ నీ అందాన్నీ చూసి ఎంత మురిసిపోతుందో మీ అమ్మ" అంటూ కౌగిలించుకుని నుదుటున ముద్దు పెట్టుకుంది రాజేశ్వరమ్మ.


    "అత్తయ్యా మా అమ్మ ఎంత మురిసిపోతుందో మిమ్మల్ని చూసి వూహించుకోగలను. మిమ్మల్ని చూస్తూ వుంటే మా అమ్మని చూసినట్టుగానే వుంది" అంటూ పాదాలకు నమస్కరించింది రాధిక.


    ఇదంతా చూసీ చూడనట్టు పక్కగదిలోంచి చూస్తూనే వున్నారు సాంబశివరావుగారు.


    "అత్తయ్యా.... మామయ్యేరీ".... అంటూ గదిలో కూర్చునున్న సాంబశివరావుగారి దగ్గిరికెళ్ళి "మామయ్యా, నేను రాధికని--- మళ్ళీ ఈ జన్మలో మిమ్మల్నందర్నీ చూస్తాననుకోలేదు" అంటూ అతని పాదాలకి నమస్కరించింది.   


    "ఒద్దమ్మా, లే.....లే" అంటూ లేవనెత్తారు సాంబశివరావుగారు.


    "మామయ్యా, నాకీ ప్రపంచంలో ఎవరులేరు. నేనొకనీచురాలిని. నీచమైన చోటపడున్నాను. అని నాలో నేను కుళ్ళిపోతున్న సమయంలో దేవుడిలా నన్ను నరకం నుంచి తప్పించి నేనూ ఒక మంచి కుటుంబానికి చెందినదాన్నేననీ, నాకూ నావాళ్ళందరూవున్నారని చెప్పి, నన్ను మనిషిని చేశాడు మధన్. అటువంటి కొడుకుని కన్న మీరు ధన్యులు"---- మరి మాట్లాడలేకపోయింది. గొంతు బొంగురు పోయింది. కన్నీరు చెంపలమీదిగా కాలువలు కట్టాయి.


    "మంచివాళ్ళనెప్పుడూ దేముడు అన్యాయం చెయ్యడు. కళ్ళు తుడుచుకోమ్మా" అన్నారు అప్రయత్నంగానే సాంబశివరావుగారు.


    "రా అమ్మా, కూర్చో" అంటూ చెయ్యిపట్టుకు లోపలకు తీసికెళ్ళింది రాజేశ్వరమ్మ.


    వంటింట్లో పీటవేసి రాధికని కూర్చోబెట్టి కాఫీ కలపడానికి వెళ్ళింది.


    "అత్తయ్యా, నేను కాఫీ కలుపుతాను మీరు కూర్చోండి అంటూ గబుక్కున లేచింది రాధిక.


    "ఫరవాలేదమ్మా, నువ్వు కలపడమేమిటి నేనున్నాగా" అంది రాజేశ్వరమ్మ.


    "మీరు పెద్దవారు మీరు కూర్చోండి."


    "లేదమ్మా మా మధన్ కి నేను కలిపివ్వడమే అలవాటు అంది నవ్వుతూ రాజేశ్వరమ్మ.


    ఇదంతా చూసి, నవ్వుతూన్న మధన్ కేసి చూస్తూ "ఓహో అలాగా. మీ అబ్బాయి మీచేతి కాఫీ తప్ప తాగకపోతే కష్టమేనే. రేపొద్దున్న కోడలొచ్చినా మీకీ కష్టం తప్పదన్నమాట "కొంటెగా మధన్ కేసి చూస్తూ అంది రాధిక.         


    "ఆ..... కోడలొచ్చాక వాడే తాగుతాడు. పెళ్ళాం చేతి కాఫీ అమృతంలా వుంటుందప్పుడు" నవ్వుతూ అంటూ కాఫీ కలపడం పూర్తిచేసి కప్పులో పోసి" అందరికీ అందించింది రాజేశ్వరమ్మ.      


    సాంబశివరావుగారు ముభావంగా వూరుకున్నారు యిదంతా వినిపించనట్టు.


    కాఫీ తాగటం పూర్తవగానే కూరల బుట్ట ముందేసుకుని కూర్చుంది రాధిక.


    "నువ్వెళ్ళు మా మధన్ ఎంత బాగా బొమ్మలు వేస్తాడో తెలుసా? నిన్ను చూస్తే నీ బొమ్మలే. అదో ప్రపంచం వెళ్లు. నేను గబగబా వంటచేసేసి వొస్తాను" అంది రాజేశ్వరమ్మ.


    ఆమె చూపే ఆదరణా, ఆప్యాయత , రాధికని ముగ్ధురాలను చేసింది. ఆ యిల్లంతా స్వర్గంలాగా ఆ యింట్లో వాళ్ళంతా దేవతల్లాగా కనిపించారు రాధికకి.     


    "సరే"నంటూ లేచింది రాధిక.


    అప్పుడే స్నానంచేసి తెల్లటి పైజమా, లాల్చీ వేసుకుని వరండాలో నుంచున్న మధన్ దగ్గిరికి వెళ్ళింది."


    "మధన్ - నీ పెయింటింగ్సు చూపించవూ?"


    "ఓ పద" అంటూ రూములోకి తీసికెళ్ళాడు.


    "ఈగదంతా గజిబిజిగా వుంది. తమరికి అభ్యంతరం."


    "మరేం ఫరవాలేదు. ఆర్టిస్టు గది అని తెలుస్తోందిలే" అంటూ చుట్టూ చూడ్డం మొదలెట్టింది. గదిలో నాలుగువైపులా పెద్ద పెద్ద పెయింటింగ్సు వరసగా అమర్చి వున్నాయి. ఒక్కొక్కటే చూడ్డం మొదలెట్టింది. రాధాకృష్ణ, భక్తమీరా, శకుంతల, గీతోపదేశం మొదలయినవన్నీ ఒకవైపున, చక్కని ప్రకృతి దృశ్యాలొకవైపున అమర్చి వున్నాయి. వాటిని చూస్తూ తన్మయురాలయింది రాధిక.  


    ఆనందంలో తేలిపోతున్న రాధిక వెనకాలే చేతులు కట్టుకునుంచున్న మధన్ రాధిక దగ్గరగా వెళ్ళి "రాధాదేవిగారు ఈలోకంలో లేనట్టున్నారు! అన్నాడు మధన్ మెల్లగా చెవిదగ్గర నోరుపెట్టి.


    "అవును. ఎక్కడో వున్నాను మరోలోకంలో కాదు బృందావనంలో" రాధాకృష్ణుల పటాన్ని చూస్తూ మెల్లగా అంది.      

 Previous Page Next Page