Previous Page Next Page 
పిపాసి పేజి 15


    ఎక్కడ బృందావనంలో ఉన్నారా?" కొంటెగా అన్నాడు మధన్.


    "అవును మదనగోపాలుడి సమక్షంలో" గోముగా అంటూ ఫక్కున నవ్వింది.


    "ఊ అయితే నాకు చాలా జెలసీగా వుంది ఆ మదనగోపాలుడిమీద" అన్నాడు ఆమె ముఖకవళికలను చదవడానికి ప్రయత్నిస్తూ మధన్.     


    "ఏం ఎందుకూ?" బుంగమూతి పెట్టింది రాధిక.


    "ఎందుకా? ఈ రాధమ్మ మనస్సును అలా ఉన్నపళంగా లాగేస్తున్నాడే అని."


    "అయితే ఆ పటంలోని రాధమ్మ మీద నాకూ ఈర్ష్యగానే వుంది."


    "ఏం ఎందుకూ?"


    "ఎందుకా ఈ మదనుడి మనస్సుని, అమాంతంగా తనవైపుకే తిప్పేసుకుందని."


    "ఎలా?"


    "ఎలా ఏమిటి? ధ్యాసంతా ఆమె మీదే కేంద్రీకరించనిదే పటంగియ్యటం ఎలా సాధ్యం? మనస్సునంతా అలా కేంద్రీకరింపజెయ్యగలిగింది అంటే మరేమిటి?"    


    "అయితే తమకెందుకో ఈర్ష్య" అన్నాడు కొంటెగా ఆమె కళ్ళలోకి చూస్తూ.


    రాధిక వెంటనే నాలిక్కరుచుకుంది. సిగ్గుతో తలవంచుకుంది" రాధీ ప్రేమించే హృదయానికి, మాటలు మనం నేర్పించనక్కరలేదు. మాటలవే వొస్తాయి.      


    రాధిక సిగ్గుతో మొహానికి చేతులడ్డంగా పెట్టుకుంది. సిగ్గుతో మల్లెమొగ్గలా ముడుచుకుపోయింది.


    వెంటనే మధన్ కలం తీసుకుని రాధిక కళ్లు మూసుకున్న దృశ్యాన్ని తెల్లకాగితం మీద వేసేశాడు.   


    రాధిక కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగా పెట్టి బొమ్మ చూపించాడు మధన్.


    "ఇంకా పటంలోని ఆ రాధమీద ఈర్ష్యగానే వుందా." అడిగాడు మధన్. సిగ్గుతో తలవంచుకుంది.


    "మధన్, నువ్వొక గొప్ప కళాకారుడివి. అయిదు నిమిషాలలో నా బొమ్మని ఇంత చక్కగా గీశావు."


    "రాధీ, ఒక్క పాట పాడవూ?"


    "ఏం పాట పాడను?"


    "నీ యిష్టం"  


    "మనసాయెరా మాధవా, నినుజూడా మనసాయెరా" అంటూ మోహనరాగంలో పాడింది. గారెలు ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ తినాలని ఎలా వుంటుందో. మాధవుని చరిత్ర, ఎన్నిసార్లు ఎన్ని రకాలు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనే వుంటుంది. భక్తితో కొలిచే రుక్మిణికి కట్టుబడి, అధికారంతో ఆజ్ఞాపించే సత్యకి లోబడి, ఆవేదనతో ఆదరించే రాధకి దాసుడై. అందరినీ పరవశింపజేసే ఆ పరమాత్ముని చరిత్ర ఎవరిని పులకింప చెయ్యదు? ఆ మహాత్ముని చూడాలని ఎవరికనిపించదు?" మనోహరంగా, మోహన రాగంలో పాడిన ఆ పాట, మధన్ ని, మరో లోకానికి తీసుకుపోయింది. "రాధి..... ఎంత బాగా పాడావ్? అన్నాడు ఆనందంతో పులకించిపోతూ.


    అవునమ్మా..... చాలా బాగా పాడావ్, భోజనానికి పిలుద్దామని ఒచ్చి, నీ పాట విని ఇక్కడే ఆగిపోయాను. పదండి భోం చేద్దాం" అంది రాజేశ్వరమ్మ.


    ఇద్దరూ లేచి మంత్రముగ్ధుల్లా మౌనంగా, ఆమె వెనకాలే వెళ్లారు, రకరకాల ఊహలలో తేలిపోతూ.     


    ఆ రోజు సెలవు పెట్టి మధన్ యింట్లోనే వున్నాడు. "పోస్ట్" అన్న కేకే విని బయటికొచ్చాడు. రిజిష్టర్డు ఎక్స్ ప్రెస్ డెలివరీ ఉత్తరాలు రెండున్నాయి. సత్తెనపల్లి నుంచి శ్రీహరిగారు రాసినవే ఆయన పేరు మీదా వచ్చాయి... సంతకం చేసి పుచ్చుకున్నారు. సాంబశివరావుగారి కొచ్చింది శుభలేఖ ఉత్తరం. మధన్ తప్పకుండా ఉత్తరాన్ని విప్పి చదవసాగాడు. ఆత్రుతగా చూస్తోంది రాధిక. "రేణుక ఎలా వుంటుందో! అదృష్టవంతురాలు. అమ్మా నాన్న దగ్గర పెరిగి, వారి చేతులమీదిగా యిల్లాలు కాబోతుంది. ఆనందంతో పొంగిపోయింది రాధిక.


    ఉత్తరం చదువుతున్న మధన్ ముఖకవళికలు  మారిపోయాయి. "ఏం రాశారు?" ఆదుర్దాగా అడిగింది రాధిక. ఉత్తరాన్ని రాధిక చేతికిచ్చాడు. గబగబా చదవడం మొదలెట్టింది రాధిక. ఉత్తరం చదవడం పూర్తిచేసి, చేతిలో ముఖాన్ని పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. "ఏం రాసార్రా" అంది రాజేశ్వరమ్మ, మధన్ కేసి చూసి, అర్థంకాక."మరి ఆదివారం నాడు రేణుకకి పెళ్ళి. అందుకని ఈ సమయంలో అదీ రాధిక అక్కడికి వస్తే రాధిక ఇన్నాళ్లు వుండొచ్చిన వాతావరణం అదీ తెలిసి ఒకవేళ పెళ్ళివారు పెళ్ళి ఆపేస్తే. రేణుక జీవితం నాశనమైపోతుంది కనక, ఎలాగో ఈ పెళ్ళి జరిగిపోయేదాకా, రాధికని అక్కడే వుంచితే ఆ తరువాత వాళ్ళొచ్చి తీసుకెళతారట, మరచిపోయిన రాధిక మళ్ళీ తిరిగిరావడం, మా అదృష్టమే, కానీ యీ సమయంలో రావడం, వెంటనే మేము చూడలేకపోవడం మా దురదృష్టం" అని రాశారు.


    రాజేశ్వరమ్మ ఏం మాట్లాడలేదు. ఆలోచిస్తూ వుండిపోయింది. ఒకవిధంగా వాళ్లు చెప్పిందీ నిజమేనేమోననిపించింది ఆమెకి. సాంబశివరావుగారు అంతావిని, ఏమీ అనకుండా, తనగదిలోకి వెళ్ళిపోయారు.      


    "రాధీ.... ఎందుకు ఏడుపు? అమ్మా నాన్నకీ నీ మీద ప్రేమలేదనుకున్నావా?"


    "ఏడుపుకాక మరేం వుంది మధన్. అమ్మనీ నాన్ననీ చూడ్డానికి కళ్ళల్లో ఒత్తులు వేసుకు కూర్చున్నా. కానీ ఈ ఉత్తరం చదివాక నా బ్రతుకేమిటో నాకు అర్థమయింది."    


    "ఏం మాటలవి రాధీ"


    "కాక మరేమిటి? కన్నతల్లిదండ్రులే నన్ననుమానిస్తే ఇంక ఈ సిగ్గులేని బ్రతుకు బ్రతకడం కన్నా చావు మేలు." వెక్కి వెక్కి ఏడుస్తోంది రాధిక.    


    "రాధీ..... ఏమిటి నీ పిచ్చి భ్రమ? మీ అమ్మ, నాన్న నిన్ను అనుమానిస్తున్నారనుకుంటున్నావా?"


    "లేకపోతే అసహ్యించుకుంటున్నారు." ఏడుస్తూనే అంది రాధిక.

 Previous Page Next Page