"ఆఆ మెల్లగా" అన్నాడు.
అమూల్యకు జీవితమంతా అతని పక్కన అలాగే నడవాలనిపించింది.
పల్లెటూరు చూసి తను హడలిపోతుందనుకున్నాడు నాన్న. ఇందులో ఇంత థ్రిల్ ఉందని తను కూడా ఊహించలేదు. శ్రీధర్ పక్కన ఉంటే ఈ పల్లెటూరే ఏమిటి? అరణ్యాలలో కూడా తను ఉండగలదు. ఆమాటే నాన్నతో చెప్పేస్తుంది.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?" శ్రీధర్ మృదువుగా అడిగాడు.
"ఆ ఏంలేదు"
"మా ఊరు ఎలా వుంది"
"వండర్ ఫుల్ వెరీ థ్రిల్లింగ్"
"నాలుగైదురోజులు వుంటే అలాగే వుంటుంది."
అమూల్య చివ్వున తలెత్తి శ్రీధర్ ముఖంలోకి చూసింది.
శ్రీధర్ కు తను ఇక్కడకు వచ్చిన కారణం తెలిసిపోయిందా?
ఎలా తెలుస్తుంది? ఊరికే అని వుంటాడు. మరే ఉద్దేశంతోనూ అని ఉండదు. కాని అతని కంఠంలో ఏదో ధ్వని ఉన్నది. ఆ ధ్వని తనను హెచ్చరిస్తున్నట్టుగా వుంది.
అందరూ ఇల్లు చేరేసరికి శ్రీధర్ తండ్రి వచ్చి వున్నాడు.
అమూల్యను ఎంతో ఆదరంగా పలకరించాడు. దగ్గర కూర్చోబెట్టుకుని అమూల్య తండ్రీ తనూ చిన్నప్పుడు ఆ పల్లెటూర్లో ఎలా అల్లరి చేసేవాళ్ళో చెప్పారు.
"అంకుల్ మీరూ తాడిచెట్టు ఎక్కుతారా?"
"ఇప్పుడు ఇంకేం ఎక్కుతానమ్మా ఒక్కప్పుడు ఎక్కేవాళ్ళం"
"మా డాడీ?"
"మీ డాడీ నేనూ పందెం వేసుకుని చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం"
"నిజంగా" మా డాడీ ఇప్పుడు తాడిచెట్టు ఎక్కితే ఎలా..." కడుపు పట్టుకొని నవ్వసాగింది. శ్రీధర్ తండ్రి ఆమెతో శృతి కలిపాడు.
అందరూ ఆరుబయట మంచాలు వేసుకుని పడుకున్నారు. అలా పడుకోవాలంటే ఆమెకు భయం వేసింది.
"నగలు తీసి లోపల పెట్టండి" అన్నాడు శ్రీధర్.
"తీశాను. చుట్టూ దూరం దూరంగానూ- దగ్గిరగానూ కన్పించే చెట్లను భయంభయంగా చూస్తూ పడుకుంది అమూల్య.
"మనం లోపల పడుకుంటే...?" అన్నది విమలతో.
"భయంగా వుందా? వేసవికాలం మేం ఇలాగే పడుకుంటాం అన్నది కమల.
"టేబుల్ ఫాన్ పెట్టుకుని మీ ముగ్గురూ లోపల పడుకోండి. లేవండి. మంచాలు లోపల వేస్తాను" అన్నాడు శ్రీధర్.
అమూల్య గుండెలనిండా గాలిపీల్చుకుంది.
పొద్దుపోయేదాకా కమలా, విమలా చెప్పే కబుర్లు వింటూ పడుకుంది. కాని మరోవైపు ఆమె ఆలోచనలన్నీ శ్రీధర్ గురించే.
తనంటే శ్రీధర్ కు ప్రేమ వుంది. ప్రతి నిమిషం తను చెప్పకుండానే తన ఇబ్బందుల్ని కనిపెడుతున్నాడు.
అమూల్య ఆలోచిస్తూనే వున్నది.
కమలా, విమలా నిద్రపోయారు.
అమూల్య ఆలోచనల నుంచి నిద్రలోకి, నిద్రలో నుంచి కమ్మని కలలలోకీ జారిపోయింది.
తెలతెలవార వస్తూండగా శ్రీధర్ అమూల్యను లేవమనీ, త్వరగా బయలుదేరాలనీ హడావుడి చేశాడు.
అమూల్య బద్ధకంగా లేచి ముఖం కడుక్కుని కాఫీ తాగింది. స్నానం చెయ్యకుండానే బయలుదేరింది.
"మళ్ళీ ఎప్పుడొస్తావ్?" కమలా, విమలా ఒకేసారి ప్రశ్నించారు.
"మీ అన్నయ్యను అడగండి" అంది కొంటెగా శ్రీధర్ ను చూస్తూ.
విమల కమల్ని మోచేత్తో పొడిచింది.
శ్రీధర్ ఆ మాట వినిపించుకోనట్లే ఉండిపోయాడు. "మనం త్వరగా బయలుదేరాలి" అన్నాడు.
"యూ ఆర్ వెరీ క్రూయల్"
తెల్లబోయి అమూల్య ముఖంలోకి చూశాడు.
"అర్థం కాలేదు కదూ?" అంటూ అదోలా మళ్ళీ నవ్వింది.
కమలా, విమలా ముఖాలు చూసుకుని కళ్లతోనే మాట్లాడుకున్నారు.
శ్రీధర్ కు అక్కడ నిల్చోవాలంటే చిరాకుగా వుంది.
అంతలో శ్రీధర్ తల్లి అమూల్యకు కుంకుమబొట్టు పెట్టింది. అమూల్య ముఖం అదోలా పెట్టింది.
శ్రీధర్ తల్లి అమూల్య చేతిలో పసుపుకొమ్ములూ, కుంకుమ పొట్లం పెట్టి రెండు రవిక గుడ్డలు ఇచ్చింది. పసుపు కొమ్ములూ, కుంకుమ పొట్లం కమలకు ఇచ్చేసి రవిక గుడ్డలు తీసుకుంది అమూల్య.
"థ్యాంక్సండీ" అని అంతలోనే నాలుక కరచుకుంది.
"ఏమిటమ్మా?" శ్రీధర్ తల్లి అడిగింది.
"అవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతుంది" అన్నది కమల తమ ఇంగ్లీషు జ్ఞానాన్ని అమూల్య ముందు వెలిబుచ్చే అవకాశం లభించినందుకు ఆనందిస్తూ.
"అవేమిటమ్మా? అలాంటి బట్టలు వారి ఇళ్ళలో పనిమనుషులు వేసుకుంటారు" అన్నాడు శ్రీధర్ ఉద్రేకంగా.
"అదేమిటిరా నీది మరీ చోద్యం! ప్రేమతో మన శక్తికి తగినట్టు ఆడపిల్ల రాకరాక ఇంటికి వస్తే ఇస్తాం అన్నది.
"కరెక్టు అత్తయ్యా! మీ అబ్బాయికి డబ్బు ఉన్న వాళ్లంటే కోపం అనుకుంటాను" ముసిముసిగా నవ్వుతూ అన్నది అమూల్య.