"అత్తయ్యా అంటూ చుట్టరికం కూడా కలిపేసింది" మనసులోనే అనుకున్నాడు శ్రీధర్.
వస్తూ వస్తూ కమలకూ, విమలకూ రెండు చీరలు ప్రజంట్ చేస్తూ "మీ అన్నయ్యకు కోపం ఎక్కువనుకుంటాను" అంది.
"అవును ముక్కు మీదే ఉంటుంది" అన్నది కమల.
"లేదమ్మా నా బిడ్డకు అభిమానం ఎక్కువ అంతే" సర్దింది శాంతమ్మ.
"మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా?" అన్నది వాకిట్లోకి వచ్చి ఆగిపోయి శాంతమ్మ.
"నీ పెళ్ళికి మమ్మల్ని పిలుస్తావు కదూ?" ఒక్కసారే అన్నారు కమలా విమలా.
"మీరు లేకుండా నాపెళ్ళి ఎలా జరుగుతుంది?" కొంటెగా శ్రీధర్ ను చూస్తూ అన్నది అమూల్య.
"మా తల్లే అంతమాట అన్నావు అదే చాలమ్మా" ఆమె మాటల్లోని అంతరార్థం అర్థంకాని శాంతమ్మ అన్నది అమాయకంగా.
"వస్తానండీ అత్తయ్యగారూ. మామయ్యగారికి నమస్కారాలు చెప్పండి. వస్తాను" అంటూ కమలకూ, విమలకూ షేక్ హేండ్ ఇచ్చింది.
కారు బయలుదేరింది. శ్రీధర్ గంభీరంగా ఉన్నాడు. అద్దంలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. అమూల్య శ్రీధర్ ముఖంలోకి చూస్తూ కూర్చుంది.
ఎంత అందంగా ఉన్నాడు. సీరియస్ గా ఉన్నప్పుడు ఇంకా బాగుంటాడు. తన చుట్టూ తిరిగే కుర్రాళ్లు ఇంత మాన్ లీగా కన్పించరు. ఇలాంటి భర్తనే తను ముందునుంచీ కోరుకున్నది. ఆదిత్య అంటే తనకు ఇష్టమే. కాని ఆ ఇష్టం కాదు. తనను "మూడీ డాల్" అంటాడు. ఒకసారి బాగాలేనా అని తను అంటే "అది నీ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది" అన్నాడు ముఖం చిన్నబుచ్చుకొని.
శ్రీధర్ లో ఉన్న ఆ హుందాతనం వారిలో లేదు. ఒక్క అందమే కాదు. అతని హుందాతనం కూడా తనను ఆకర్షించింది. ఇతనికి డబ్బున్న వాళ్ళంటే కోపంలా వుంది. తనను వివాహం చేసుకోవడానికి అంగీకరించకపోతే?
"ధనవంతులు బీదవాళ్ళను ఎందుకంత చులకనగా చూస్తారో? ప్రతివాడూ బిచ్చం కోసం చేతులు చాచుకొని ఎదురుగా నిల్చుంటాడని మీ భావం! మీ అహంకారం అది. అంతేకాని బీదవారందరూ అభిమానం లేనివారు అనుకోకండి."
అమూల్య ఆలోచనల నుంచి త్రుళ్ళిపడింది. అయోమయంగా చూసింది.
"మీ తప్పు కాదు. మీకు ఉన్న ఆ డబ్బుదే తప్పంతా"
"ఏమిటి మీరంటున్నది?"
"నేను బీదవాణ్ని. ఉద్యోగం కోసం మీ నాన్నను ఆశ్రయించిన మాట నిజమే-"
"మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు."
"అంతమాత్రాన నాకు స్వంత అభిప్రాయాలు వుండవనీ... వ్యక్తిత్వం ఉండదనీ అనుకోవడం పొరపాటు"
అమూల్య ముఖం చిన్నబుచ్చుకున్నది.
సరిగ్గా చెప్పండి నేను మిమ్మల్ని ఏ విషయంలోనైనా బాధ కలిగిస్తే..."
"మా చెల్లెళ్లు మీలా చదువుకోలేదు. మీ నాన్న మీ కోరికల్ని తీర్చగలడు. కాని వాళ్లకు వయసుతోపాటు కోరికలున్నా మా నాన్న తీర్చలేడు. మా నాన్న మీ నాన్నలా జడ్జికాదు. ఒక బడిపంతులు."
"ఇవన్నీ ఎందుకు చెబుతున్నట్టు? నేను మా నాన్న గొప్పవాడనీ, మీ నాన్న తక్కువవాడనీ అనలేదే?"
"మీరు మా చెల్లెళ్ళకు చీరలు ఇవ్వడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?
ఒకరోజు ఆతిధ్యం ఇచ్చాం దానికిబదులు తీర్చుకున్నారా? లేక..."
"ఓ మై గాడ్ అదా ఇంకేమిటోనని హడలి చచ్చిపోయాను" అన్నది రిలీఫ్ గా అమూల్య.
శ్రీధర్ సమాధానం ఇవ్వలేదు.
"శ్రీధర్ మీరు నన్ను సరిగా అర్థం చేసుకోలేక పోతున్నారు. నేను నా ఆధిక్యతను చూపించడానికి ఆ చీరలు ఇవ్వలేదు. ఒకరోజు మీ ఆతిధ్యం పొందినందుకు అంతకంటే కాదు. మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. అందువల్లనే నేను ఏ పనిచేసినా, ఏం మాట్లాడినా అందులో మీకు నా డబ్బు వాసన అదే దాన్నే ఏదో అంటారు కదూ...ఆ బూర్జువా వాసన వస్తున్నది. మీ బీదతనాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. అలాగే ప్రతి నిమిషం నేను డబ్బుగలదాన్ని అనే విషయాన్ని కూడా మరవలేకుండా వున్నారు. నన్ను అర్థం చేసుకోలేరు. బహుశా మీకు నాముందు ఉన్నప్పుడు కలిగే ఆత్మన్యూనతా భావం పోయేంతవరకూ నన్ను అర్థం చేసుకోలేరు."
శ్రీధర్ ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశారు. మాటకు ముందు గలగల నవ్వుతూ, టిస్టు డాన్సులు చెయ్యడం, హాయ్ హాయ్ అంటూ తిరగడం తప్ప తెలియని ముగ్ధ అనుకున్నాడు అమూల్యను. అమూల్యకు జీవితాన్ని గురించి ఆలోచించగల వివేకం కూడా ఉన్నదా?
"మాట్లాడరేం?" రెట్టించింది.
"నాలో ఆత్మన్యూనతా భావం లేదు. డబ్బు వున్న వాళ్ళంటే కసి ఉన్న మాట నిజమే. ఆ కసైనా వ్యక్తిగత బీదతనం వలన కలిగింది కాదు. సాంఘిక అన్యాయం పట్ల-"
"ప్లీజ్ స్టాప్ ఇట్. మరీ అంత పెద్దపెద్ద విషయాలు మాట్లాడకండి. నాకు అర్థం కావు."
"నీకు అర్థం అవుతాయి. కాని అర్థం చేసుకొనే అవకాశం నీకు లేదు. అంతే?"
"నాకు రాజకీయాలు అర్థం కావు. బోరింగ్"
"నేను మాట్లాడుతున్నది రాజకీయాలు కావు."
"నాకు ఆ వాసనే వస్తున్నది. అది సరే నా సంగతి వదిలెయ్. నువ్వు మాత్రం చేస్తున్నది ఏమిటి? ఎదుటి మనిషి మనసును అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నావా? ఆ అవసరం నీకు లేదు కదూ? మరొకరి మనసును గాయపర్చడం న్యాయమా? నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నేను మీ ఊరు ఎందుకు వచ్చానో ఆలోచించడానికైనా ప్రయత్నించావా?"
శ్రీధర్ అదోలా నవ్వాడు.
"మీకు నవ్వులాటగా వుందా?"
"లేదు. కాని ఫలితం అదేనని నాకు తెలుసు. నేనూ ఆలోచించగలను. కళ్ళు మూసుకుంటే గాని కలలు రావు. కళ్ళు తెరిస్తేగాని వాస్తవం కనిపించదు. వాస్తవాన్ని చూడగల నా కళ్ళు, కలల్ని చూడటానికి అలవాటు పడలేదు. కాని ఆ విషయం గురించి ఆలోచించడం శుద్ధ దండగ అని కూడా నాకు తెలుసు."
"ఎందుకని?"
"కళ్ళు తెరిచి వాస్తవాన్ని చూస్తే నీకే అర్థం అవుతుంది."
"అదంతా నాకు తెలియదు. ఐ లవ్ యూ" అని చటుక్కున తల దాచుకున్నది అమూల్య. చెంపలు చెవుల వరకూ ఎర్రబడ్డాయి.