శ్రీధర్ చిన్న తాటిచెట్టు నుంచి లేత ఆకు కోసి తెచ్చి వేశాడు. "కూర్చోండి" అన్నాడు.
అమూల్య శ్రీధర్ ముఖంలోకి చూసింది.
"అదెందుకు?" కమల పక్కగా కూర్చుంది. అరికాళ్ళు చూసుకుంది.
"అబ్బ ఎంత ఎర్రబడ్డాయో?" అన్నది విమల.
శ్రీధర్ ఆమె కాళ్ళకేసి, ముఖంకేసి మార్చి మార్చి చూశాడు.
"పల్లెటూరంటే ఇదే. ఇక్కడ ఉండటంలో ముఖ్యంగా మీలాంటివారికి సుఖంగా ఉండదు" అన్నాడు శ్రీధర్.
అమూల్య ముఖం ఎర్రబడింది.
"నాకు బాగానే వుంది. చాలా థ్రిల్లింగ్ గా ఉంది" అన్నది.
శ్రీధర్ అదోలా నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
"అబ్బ ఎన్ని ముంజకాయలో?" అన్నది అమూల్య తాటికేసి చూస్తూ.
"వాటి రుచి చూపించటానికే ఇంతదూరం నిన్ను తీసుకొచ్చాం"
"నిజంగా? వాటినెవరు కోస్తారు?"
"మా అన్నయ్య"
అమూల్య కమల ముఖంలోకి నమ్మలేనట్టు చూసింది.
దూరంగా ఉన్న గుడిసెలోకి వెళ్ళి కొడవలి తెచ్చాడు శ్రీధర్.
ధోవతి మడచి మోకాళ్ళపైకి బిగించాడు. తలపైకెత్తి లేత గెలలు వున్న చెట్టు దగ్గిర కెళ్ళాడు. కాళ్ళకు తాడు మెలికవేసి కట్టుకొన్నాడు. తుండు భుజం మీద నుంచి తాటికి ముడి వేశాడు. చేతులు పైకెత్తి తాటిని పట్టుకొని పైకి పాకుతున్న శ్రీధర్ ను ఊపిరి బిగబట్టి చూడసాగింది అమూల్య.
వీపుకూ తాటికి వేసిన తుండు ముడి ఊడిపోతే కాళ్ళకు ముడి వేసిన తాడు తెగిపోతే? చేతులు పట్టుతప్పి కిందకు జారితే? ఆ తాడి ఎంతో ఎత్తుగా ఉంది. మెడ వెనక్కు విరచి భయం భయంగా చూస్తూన్న అమూల్య చెవులకు 'ధన్'మన్న శబ్దం విన్పించింది.
"కెవ్వున" అరిచింది. కళ్ళు తిరిగి పడిపోయింది. కమలా,విమలా గాబరా పడిపోయారు.
"ఏమండీ ఏమండీ" అంటూ ఆ అమ్మాయిని కదప సాగారు.
"ధన్ ధన్ మంటూ నాలుగు గెలలు కిందపడగానే శ్రీధర్ సర్రున కిందకు దిగాడు.
"అన్నయ్య త్వరగా రా" చెల్లెళ్ళు ఏడుపు ముఖంతో కేకలు పెట్టారు.
శ్రీధర్ గబగబా వచ్చాడు.
"ఏమిటి? ఏమైంది?" ఆతృతగా అడిగాడు.
"ఏమో తెలియదు. నిన్ను తలెత్తి చూస్తూ ఉందా? అంతలోనే కెవ్వున అరిచి పడిపోయింది"
"రాముని అడిగి ఒక గ్లాసు నీళ్లు తీసుకురా"
విమల పరుగు తీసింది. గ్లాసుతో నీళ్లు తెచ్చింది. శ్రీధర్ అమూల్య తలను తన తొడమీద పెట్టుకుని నీళ్లు చల్లి తుండుతో తుడిచాడు. అమూల్య చిన్నగా కళ్ళు తెరిచింది.
"ఎలా వుంది?"
ఆ కంఠం వినగానే త్రుళ్ళిపడి లేచి కూర్చుంది. శ్రీధర్ ను కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది.
"ఏమిటి అలా చూస్తున్నారు?"
"మీరు...మీరు...బాగానే వున్నారా?"
శ్రీధర్ గొల్లున నవ్వాడు.
"అన్నయ్యా మరేమో నువ్వు గెలకొట్టావా? అది 'ధన్' మంటూ కింద పడింది. అంతే ఈమె కెవ్వున కేక పెట్టింది" కమల అన్నది.
"ఓ అదా అర్థం అయింది. నేనే పడ్డాను అనుకున్నారు కదూ?" అంటూ అమూల్య కళ్ళలోకి లోతుగా చూశాడు.
అమూల్య 'అవును' అన్నట్టు తల ఊపింది.
కమలా, విమలా గొల్లున నవ్వేశారు. "ఇదేంటి? మా అన్నయ్య ఇంతకంటే పొడవు చెట్లు ఎక్కుతాడు తెలుసా?" అన్నది విమల గర్వంగా.
"ఏమో బాబూ! మీరు ఎక్కుతుంటే నాకు కళ్ళు తిరిగినట్టు అయింది" అన్నది అమూల్య.
"మా అన్నయ్యకు చిన్నప్పటినుంచి అలవాటే. మమ్మల్ని తోపులు తీసుకువచ్చి స్వయంగా కాయలుకోసి ముంజలు తినిపిస్తాడు" అన్నది కమల.
"చీకటి పడిపోతుంది. ఇక కబుర్లు మానేసి ముంజలు తినండి" అంటూ కుడిమోకాలు మీద తాటికాయలు పెట్టుకొని కొడవలితో ముచ్చికలు కొట్టి ముంజలు చిట్లకుండా తీసి ముంజకాయను అమూల్యకు అందించాడు.
అమూల్య అందుకున్నది. కాని ఎలా తినాలో తెలియక దిక్కులు చూడసాగింది. మరో రెండు కాయలు కోసి ఇద్దరు చెల్లెళ్ళకూ ఇచ్చాడు. వాళ్ళు అందుకొని కుడిచెయ్యి బోయన వేలు గుచ్చి ముంజను బయటకు తీస్తూ తినసాగారు.
అమూల్య చేతిలోని కాయను శ్రీధర్ తీసుకున్నాడు. కొడవలి ముక్కుతో ముంజల్ని పెకలించి మళ్ళీ ఆ కాయలోనే ఉంచి ఇచ్చాడు. ఆమె బిడియపడుతూ చిన్నగా తినసాగింది. ఆమె ఒకటి కూడా పూర్తిగా తినలేదు. కమలా, విమలా నాలుగు కాయల తాలూకు పన్నెండు ముంజలు బొటనవేలుతో పెకలించుకొని తినేశారు.
"అలా తింటేనే రుచి" అన్నాడు శ్రీధర్.
"నాకు చేతకాదు. ఎప్పుడూ చూడలేదు" అన్నది అమూల్య.
"ఒకటి ట్రై చెయ్యండి."
అమూల్య బొటనవేలు గోరు గుచ్చబోయింది. "ఆఆ మర్చిపోయాను. మీ గోరుకు రంగు వుంది. వద్దులెండి. నేను తీసి ఇస్తాను" అంటూ ఆమె చేతిలోని కాయను తీసుకున్నాడు.
అమూల్యకు అదంతా సరదాగా వుంది. ఏదో సినిమాలో చూస్తున్నట్టుగా వుంది.
తిరిగి వచ్చేటప్పుడు "చెప్పు వేసుకోండి. మీ అరికాళ్ళు బొబ్బలెక్కుతాయి" అన్నాడు శ్రీధర్.
చెప్పులు వేసుకుని ఎడమచేత్తో కుచ్చెళ్లు పట్టుకుని అడుగులో అడుగు వేస్తున్న అమూల్య పక్కనే నడుస్తున్నాడు శ్రీధర్. ఆమెకు ఆ అనుభూతి తమాషాగా ఉన్నది. మనసుకి రెక్కలు వచ్చినట్టు అన్పిస్తున్నది. పట్నంలో ఆదిత్యతో, రమేష్ తో టిస్టు డ్యాన్సులు చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభూతికానీ, ఆనందం కలగలేదు. ఎందుచేత?
అమూల్య పడబోయింది. శ్రీధర్ చటుక్కున పట్టుకున్నాడు.