Previous Page Next Page 
మరీచిక పేజి 12


    అబ్బబ్బ! మమ్మీ... అదేమాట... అదే నెత్తి బాదుకోవడం..."

 

    "ఏమిటమ్మా నీ అల్లరి మరీ రోజు రోజుకూ ఎక్కువైపోతూ వుంది. త్వరగా తయారవు!"

 

    "ఏం ఇలా వస్తే?"

 

    "ఇలాగా?" ఆశ్చర్యంగా చూశాడు రంగారావు.

 

    "మీరు వెళ్ళండి డాడీ. నేను రాను! బద్ధకంగా వుంది. నిద్రపోతాను." వెళ్ళి మంచంమీద పడుకొని కళ్ళు మూసుకున్నది. తల్లీ, తండ్రి వెళ్ళిపోయాక శబరి మేడదిగి కిందకు వచ్చింది. ఇంటిముందున్న లాన్ లో, పూలమొక్కల మధ్యగా పచార్లు చేస్తూ వుంది. తెల్లగులాబీ మొక్క పక్కగా ఏదో పచ్చగా పసుపుముద్దలా పడివుండటం కన్పించి, శబరి దగ్గరకు వెళ్ళి చూసింది చిన్నపిట్ట. రెక్కలు రక్తంతో తడిసి వున్నాయి. మరణ వేదన పడుతూ వుంది. శబరి వంగి, దాన్ని పదిలంగా అందుకొని, అరచేతిలో పెట్టుకుంది. అది కొన ఊపిరితో వుంది. శబరి కళ్ళలో నీరు తిరిగింది.

 

    "హల్లో! శబరీ! ఏం చేస్తున్నావ్? ఇవాళ కాలేజీకి రాలేదేం?" జ్యోతి దగ్గరగా వచ్చింది.

 

    "హల్లో!"

 

    "నిన్న ఎక్కడికి వెళ్ళావోయ్! మీ నాన్న నువ్వు ఇంటికి రాలేదనీ, మా ఇంటికి వచ్చావేమోనని ఫోన్ చేశారట మా నాన్నకు."

 

    శబరి మాట్లాడలేదు.

 

    "ఏమిటోయ్ అది?" శబరి చేతిలో వున్న పిట్టను చూస్తూ అడిగింది జ్యోతి.

 

    "చూడు ఎంత ముద్దుగా వుందో? పెద్ద పక్షులేవో గాయపర్చినట్టున్నాయ్!" గద్గద కంఠంతో అన్నది శబరి. జ్యోతి శబరి ముఖంలోకి చూసింది. ఆమె కళ్ళవెంట నీరు కారుతూ వుంది. "ఈ పిట్టకోసం ఏడుస్తున్నావా?" జ్యోతి కంఠం అదోలా ధ్వనించింది.

 

    "నీకు ఏడుపు రావటంలేదూ? పిచ్చిముండ! ఎంత ముద్దుగా వుందో చూడు!"

 

    "నాకు అలాంటి ఫూలిష్ సెంటిమెంట్సు లేవు. పిట్టకోసం ఏడవటం ఏమిటి?"

 

    'నీ మనసు ఎంత కఠినమైంది జ్యోతీ! అయ్యో చచ్చిపోయింది!"

 

    శబరి గొంతులో ఏదో అడ్డుకున్నట్టు అయింది.

 

    "ఛ! అవతల పారేయ్!"

 

    శబరి జ్యోతి ముఖంలోకి తిరస్కారంగా చూసింది.

 

    "ఇంత పిచ్చి పనికిరాదు. అవతల పారేయ్!"

 

    "ఇది పిచ్చా? ఈ అమాయక ప్రాణి చచ్చిపోయినందుకు బాధపడటం పిచ్చా? ఎంత ముద్దుగా ఉందో?"

 

    "కాక మరేమిటి? ఇదే కాకి అనుకో! మరి ఏడుస్తావా?"

 

    "ఛ! కాకిని ముట్టుకోవాలంటేనే అసహ్యం."

 

    "ఏం ఎందుకూ? దానిది మాత్రం ప్రాణం కాదా? దెబ్బ తగిలితే, ప్రాణం పోతుంటే బాధపడదా అది?"

 

    "ఏమో అది నాకు తెలియదు. కాకి చస్తే ఏడుపు రాదు."

 

    "ఎందుకూ? అది అందంగా వుండదనేగా? వెధవ సెంటిమెంటు!"

 

    "పూర్ బర్డ్!" తన ధోరణిలో అన్నది శబరి బాధగా.

 

    "హూ! పూర్ బర్డ్!" అన్నది జ్యోతి వ్యంగ్యంగా.

 

    శబరి మాట్లాడలేదు.

 

    "పూర్ పీపుల్ అనవేం అష్ట దరిద్రాలను చూసినప్పుడు? రోజుకు ఎన్ని వందలు, వేలమంది దరిద్రులు ఈ దేశంలో ఈ బర్డ్ కంటే దారుణంగా చస్తున్నారో ఎప్పుడయినా ఆలోచించావా?" ఉద్రేకంగా అన్నది జ్యోతి. శబరి మాట్లాడలేదు.

 

    "ఉండటానికి ఇల్లులేకా, తినడానికి తిండిలేకా మనలాంటి మనుషులు, పశువులకంటె హీనంగా బతుకుతున్నారు. కుక్కలకంటే హీనంగా దిక్కులేని చావులు చస్తున్నారు."

 

    'ఈ మనుష్యులన్నా, ఈ సమాజం అన్నా, ఈ విలువలన్నా నాకు పరమ అసహ్యం వేస్తూ వుంది!" శబరి ఠపీమని.

 

    జ్యోతి కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. శబరి చేతిలో వున్న పిట్టను అతి భద్రంగా ఆకుల మధ్యన పెట్టింది.

 

    "అవును! ఈ సమాజం అంటే నాకు ఇష్టం లేదు. ఈ బూజుపట్టిన విలువలమీద గౌరవం లేదు. ఈ సమాజాన్ని మార్చాలి. ఈ దోపిడీ వ్యవస్థను..."

 

    "ఈ సమాజంనుండి పారిపోవాలి!" మధ్యలోనే అందుకొని అన్నది శబరి.

 

    "పారిపోయి ఏం చేస్తావ్?"

 

    "స్వేచ్చగా ఈ కుళ్ళు సమాజానికి దూరంగా బతుకుతాను. ఈ కృత్రిమమైన కుళ్ళు కంపుకొట్టే... బూజుపట్టిన విలువలకు దూరంగా... ఈ జీవితానికి దూరంగా... కొత్త ప్రపంచంలో... సహజ వాతావరణంలో పక్షిలా, పువ్వులా, పువ్వులోని పుప్పొడిలా, పూలబాలనై బతుకుతాను.

 

    "పూలబాలా?" ఆశ్చర్యంగా అడిగింది జ్యోతి.

 

    "అవును! ఫ్లవర్ చిల్డ్రన్ మధ్యలో నేనూ ఒక..." అంటూ ఆగి జ్యోతి ముఖంలోకి చూసింది. జ్యోతికి అర్థం అయింది. ఆ మాట ఎవరు అంటారో జ్యోతికి తెలుసు. శబరి ముఖంలోకి జాలిగా, బాధగా చూసింది.

 

    "ఏమిటలా చూస్తావ్?"

 

    "అంటే, అంటే నువ్వు హిప్పీగా మారిపోతావా?"

 

    "అవును! దృఢంగా జవాబిచ్చింది శబరి.

 

    "ఛఁ హిప్పీస్! డర్టీ క్రీచర్స్! వాళ్ళను ఏమంటారో తెలుసా?"

 

    "ఏమంటారు?"

 

    "ఈ ఇరవయ్యవ శతాబ్దపు సంస్కృతికి జన్మించిన వికృత శివుసులు అంటారు."

 

    "ఆ జీవితంలో అందాన్నీ, ఆనందాన్నీ అర్థం చేసుకోలేని మూర్ఖులు అంటారు అలాగని."

 

    "కాదు, ఆ మాట ఒక మేధావి అన్నాడు. అది సరే వాళ్ళు స్నానం చెయ్యరు. వంటినిండా బట్టలు వేసుకోరు. విశృంఖలంగా తిరుగుతూ, దొరికింది తింటూ, మత్తులో దొర్లుతూ మురికి బతుకులు బతుకుతారు."

 

    "అదొక స్వర్గం! ఆ స్వర్గం గురించి నీకేం తెలుసు?"

 

    జ్యోతి చివ్వున తలెత్తి శబరి ముఖంలోకి లోతుగా చూసింది.

 

    "ఆనందమా? స్వర్గమా? అది నీకెట్లా తెలుసు?"

 

    "తెలుసు! అనుభవించాను. కావాలంటే నీకు చూపిస్తాను స్వర్గం ఎలా వుంటుందో!"

 

    శబరిని తేరిపార చూసింది. జుట్టు చిక్కుపడి ముఖంమీదపడుతూ ఉన్నది. బట్టలు మురిగ్గా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పాదాలకు చెప్పులు లేవు. జ్యోతికి అర్థం అయింది.

 

    "ఈ రూపం ఏమిటి?"

 

    శబరి చిరునవ్వు నవ్వింది.

 

    "నువ్వు స్వర్గం చూశావా?"

 

    "చూశాను!"

 

    "ఎప్పుడు?"

 

    "నిన్న."

 

    "ఎలా?"

 

    "యల్.యస్.డి. వేసుకున్నాను."

 

    "అది నీకెలా దొరికింది."

 

    "నా బోయ్ ఫ్రెండు ఇచ్చాడు."

 

    "వాడెవడు?"

 

    "గౌతమ్!"

 

    "గౌతమా? ఆ పేరు గలవాడెవడూ మన కాలేజీలో లేడే?" సాలోచనగా అన్నది జ్యోతి.

 

    "అయ్యో రామ! మన కాలేజీలో ఆ మాత్రం సాహసం చేసే వాళ్ళుంటే ఇంకేం. అందరూ చవటలే. దద్దమ్మల ఫోజులూ, వాళ్ళూ చూస్తూనే వళ్ళు మండిపోతుంది.

 

    "మరి అతనెవరు?"

 

    "ఎవరో నాకు తెలియదు."

 

    "తెలియదా? తెలియకుండానే స్నేహం చేస్తున్నావా?"

 

    "అవును! అందులోనే వుంది థ్రిల్!"

 Previous Page Next Page