Previous Page Next Page 
మరీచిక పేజి 11


    "అసలు ఏమైంది డాక్టర్?" డాక్టర్ తోపాటు బయటికి వచ్చిన రంగారావు అడిగాడు.

 

    "పిచ్చిమాటలు మాట్లాడుతూ వుంది. అసలు ఆ చెరువు దగ్గిరకు వెలా వెళ్ళిందో తెలియడం లేదు" అన్నది రుక్మిణి.

 

    "ఇంతకుముందెప్పుడైనా ఇలా జరిగిందా?" ఆలోచిస్తూ అడిగాడు డాక్టర్.

 

    "లేదండీ!" అన్నాడు రంగారావు.

 

    "అసలు జబ్బేమిటి డాక్టర్?" రుక్మిణి ఆతృతగా అడిగింది.

 

    "జబ్బేమీ లేదు. కాని కాస్త కనిపెట్టి వుండటం మంచిది!"

 

    "అయ్యో ఏమైందండీ నా బిడ్డకు?"

 

    "మీరు భయపడాల్సిందేమీ లేదమ్మా! కాని అమ్మాయిని వంటరిగా కొంతకాలం ఎక్కడికి పంపకండి!"

 

    "ఏమిటి డాక్టర్! చెప్పరేమిటి? అసలు జబ్బేమిటి?" ఆదుర్దాగా అడిగాడు రంగారావు.

 

    "జబ్బేమీ లేదన్నానుగా!"

 

    "మరి?"

 

    "అమ్మాయి చాలా ఆరోగ్యంగా వుంది."

 

    "అయితే-?"

 

    "ఈమధ్య కాలేజీ పిల్లలు కొన్ని మత్తు మందులకు అలవాటుపడుతున్నారు."

 

    "డాక్టర్!"

 

    "అవును రంగారావుగారూ! ఇవాళ ఎవరో మీ అమ్మాయిచేత ఆ మందు తినిపించి వుంటారు!"

 

    రంగారావు డాక్టర్ ముఖంలోకి అయోమయంగా చూశాడు. రుక్మిణి తెల్లముఖం వేసింది.

 

    "మీ అమ్మాయి స్నేహితులు ఎలాంటివాళ్ళో మీకు ఏమైనా తెలుసా?"

 

    "మా అమ్మాయికి అలాంటి స్నేహితులు ఎవరూ లేదండీ!" రంగారావు అన్నాడు భూమిలోకి దిగిపోతున్నట్టు.

 

    "ఉన్నదండీ! ఓ చిత్రాంగి వుంది. దాంతో తిరక్కే అని నెత్తీనోరూ బాదుకున్నాను." రుక్మిణి బొంగురుకంఠంతో అన్నది.

 

    "ఎవరండీ?"

 

    "ఇంకెవరు? ఆ రమణమూర్తి కూతురు జ్యోతి! దాని మాటలే అదోలా వుంటాయి. నేను భయపడుతూనే వున్నాను!"

 

    "వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు. జ్యోతి మంచిపిల్ల. ప్రిన్స్ పల్స్ ఉన్న అమ్మాయి. మీరు పొరపాటు పడుతున్నారు!" డాక్టర్ అన్నాడు.

 

    "ఇది ఇవాళ జ్యోతి దగ్గరికే వెళ్ళింది!" రుక్మిణి కసిగా అన్నది.

 

    "నేను అలా అనుకోవడం లేదు. వేరే ఎవరైనా పెడమార్గం పట్టిన కుర్రాడితో పరిచయం ఉందేమో తెలుసుకోండి."

 

    "డాక్టర్! రుక్మిణి దాదాపు అరిచింది.

 

    "క్షమించండమ్మా! నేను వేరే ఉద్దేశంతో అనడంలేదు. ఈ మధ్య కొందరు యువతీ యువకులు మత్తు మందులకు బానిసలయి పోతున్నారు. ఈజబ్బు క్రమంగా యువతరంలో వ్యాపిస్తూ వున్నది. అదొక ఉద్యమంగా కొందరు ప్రచారం చేస్తున్నారు. మీ అమ్మాయి వేసుకున్నది. మామూలు మత్తుమందు కాదు!" డాక్టర్ ఆగాడు.

 

    రంగారావు తల వంచుకున్నాడు. రుక్మిణి వెర్రిచూపులు చూసింది.

 

    "అమ్మాయిని కాస్త కనిపెట్టి ఉండండి. అలవాటుపడితే ఆ తర్వాత కష్టం-" డాక్టర్ వెళ్ళిపోయాడు. రంగారావు తలపట్టుకొని కూర్చుండిపోయాడు. రుక్మిణి స్థాణువులా నిల్చుండిపోయింది.

 

    "అయ్యో! దీనికిదేంపోయేకాలం వచ్చింది? నలుగురికీ తెలిస్తే ఇంకేమయినా వుందా?" నెత్తీనోరూ బాదుకున్నది.

 

    రంగారావు మాట్లాడే స్థితిలో లేడు.

 

    "బెల్లంకొట్టిన రాయిలా అట్లా కూర్చుంటారేం? నారాత బాగుంటే-"

 

    "వాగకు" రంగారావు చాలాకాలానికి కస్సుమన్నాడు.

 

    "ఓ క్షణం భర్త ముఖంలోకి చూసి "నా రాత!" తలబాదుకుంటూ వెళ్ళిపోయింది రుక్మిణి.


                                     8


    శబరి రెండోరోజు ఉదయం బద్ధకంగా లేచింది. వళ్లంతా తేలిపోతున్నట్టున్నది. కాలేజీకి వెళ్ళలేదు. తలిదండ్రులు ఎంత బ్రతిమాలినా క్రితం రోజు ఏం జరిగిందో చెప్పలేదు.

 

    "ఏదైనా మత్తుమందు తిన్నావాతల్లీ! ఏమీ అనం! చెప్పు" తండ్రి తల నిమురుతూ అడిగాడు.

 

    "ఛ! మత్తుమందు తినడం ఏమిటి నాన్నా! కళ్ళు తిరిగి పడిపోయాను.

 

    "మరి చెరువుగట్టు కెందుకెళ్ళావమ్మా?"

 

    "ఆ అదా! జ్యోతి ఇంట్లో లేదు. సరదాగా వెళ్ళాలనిపించింది. అలా వాకింగ్ గా వెళ్ళాను!" అన్నది శబరి.

 

    రంగారావుకు శబరి అబద్ధం చెబుతున్నదని అర్థం అయింది. అయినా రెట్టించి అడగలేకపోయాడు. రుక్మిణి శబరి మాటలు నమ్మింది.

 

    "ఆ డాక్టర్ చూడండి ఎంత అభాండం వేశాడో మన అమ్మాయి మీద?" అన్నది రుక్మిణి.

 

    "అభాండం ఏముందిలే! ఆయనకు అలా అన్పించి వుంటుంది!"

 

    "లేచి ముఖం కడుక్కొని కాఫీతాగు!"

 

    "బద్ధకంగా వుంది. ఇక్కడికేకాఫీ పంపించు. తర్వాత ముఖం కడుక్కుంటానులే."

 

    రుక్మిణి విసుక్కుంటూ గదినుంచి వెళ్ళిపోయింది. ఆ రోజంతా శబరి ముఖం కడుక్కోలేదు. స్నానం చేయలేదు. మట్టికొట్టుకున్న బట్టలు మార్చుకోలేదు. క్రితంరోజు యల్.యస్.డి. వేసుకున్నప్పుడు కలిగిన అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ పడుకుంది. హిప్పీల మాటలూ, వాళ్ళ జీవిత విధానంపట్ల ఆకర్షణ పెరిగింది. మరోసారి యల్.యస్.డి. వేసుకుంటే? వాళ్ళు ఏమైపోయారు? రిక్షావాడు తనను తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు చూడలేదా? చూసే ఊరుకున్నారా? చూసి వుండరు వాళ్లు. దూరంగా స్వర్గంలో వున్నారుగా! అందుకే చూడలేదు.

 

    సాయంత్రం అయింది. శబరికి బయటికి వెళ్ళాలని వుంది. వాళ్ళను కలుసుకోవాలని వుంది. మళ్ళీ యల్.యస్.డి. వేసుకోవాలని వుంది. శబరి లేచి అద్దం ముందు నిల్చుంది. తన ప్రతిబింబం తనకే కొత్తగా కన్పించింది. ఆమెకు తను సగం హిప్పీగా మారినట్టు అనిపించింది. ప్రతి బింబాన్ని తన్మయురాలై చూస్తూ నిలుచుంది.

 

    "ఏమిటే బేరీ ఆ రూపం! పిచ్చిదానిలా వున్నావ్! వెళ్ళి స్నానం చేసి త్వరగా తయారవు!"

 

    తల్లికేసి బద్ధకంగా చూసింది శబరి.

 

    "ఇవ్వాళ సికింద్రాబాదు క్లబ్బులో ఆదిత్య అందరికీ డిన్నర్ ఇస్తున్నాడు!" అంటూ జుట్టుముడి సర్దుకోసాగింది రుక్మిణి.

 

    తల్లికేసి అలంకరణను కొత్తగా చూస్తున్నట్టు చూస్తూ నిల్చుంది శబరి.

 

    "ఏమిటే అలా చూస్తావ్? చెబుతుంది నీక్కాదూ? త్వరగా వెళ్ళి స్నానం చేసిరా! ఈ లోపల బట్టలూ, నగలూ తీసి వుంచుతాను."

 

    "అంత పెద్ద చీరతో, నగలతో ఎందుకమ్మా ఈ శరీరాన్ని అంత బాధపెడ్తావ్?"

 

    రుక్మిణి కూతురి ముఖంలోకి చూసింది.

 

    "తాటికాయలా అంత పెద్దముడి నెత్తిన బరువుగా లేదూ?"

 

    రుక్మిణికి చర్రున కోపం వచ్చింది.

 

    "ఏమిటే నీ వాగుడూ? వస్తావా రావా?"

 

    "నేను రాను మమ్మీ!"

 

    "ఏం? ఎందుకు రావూ?"

 

    "ఆ మనుషులూ, ఆ మాటలూ, ఆ గంగిరెద్దుల వేషాలూ, ఆ డిన్నర్లూ చెడ్డ బోరింగ్ గా ఉంటాయి."

 

    "నిజంగానే నీకు పిచ్చి పట్టేలా వుంది. ఎవరే నీకివ్వన్నీ నేర్పిస్తుందీ?"

 

    "ఏమిటి మళ్ళీ అమ్మాకూతుళ్ళు గొడవ పడుతున్నట్టున్నారు?" రంగారావు ప్రశ్నించాడు.

 

    "నా రాత... నా కర్మ!" నెత్తిబాదుకొని, చరచరా బయటికి నడిచింది రుక్మిణి.

 Previous Page Next Page