Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 10


    అమూల్యకు అక్కడ స్నానం చెయ్యడం ఓ పెద్ద యజ్ఞంలా అన్పించింది. అక్కడే బట్టలు కట్టుకుంది. బయటికి వచ్చి చూస్తే కుచ్చెళ్లు నిండా బురదే.


    "అయ్యో చీరంతా బురదైంది" అంది విమల.


    అమూల్య గదిలోకి వచ్చి చీర మార్చుకుంది.


    నిద్రలేచేసరికి బంగారమ్మ గారెలు పళ్ళెం, నేతి గిన్నే ముందు పెట్టింది.


    "తినమ్మా వేడి వేడి గారెలు. నేతిలో ముంచుకొని తిను" ఆప్యాయంగా అన్నది.


    అమూల్యకు గారెలు నేతిలో ముంచుకొని తినడం కొత్త. ఇంట్లో నెయ్యి బలే రుచిగా అన్పించింది. కాని మొహమాట పడుతూ రెండు మాత్రమే తిన్నది.

    శ్రీధర్ బయటికి వెళ్ళి ఇంకా రాలేదు.


    అమూల్య ముఖం కడుక్కొని బట్టలు మార్చుకుంది. కమలకూ, విమలకూ తల దువ్వి జుట్టు వదిలేసి పైన రిబ్బన్లు కట్టింది.


    సాయంత్రం అయింది. ఆ పల్లెటూరి వాతావరణం చూస్తూ వాకిట్లో నిల్చుంది అమూల్య. కమల్నీ, విమల్నీ పిల్చింది.


    "వాకిట్లో నిల్చుంటే బాగుండదు. అన్నయ్యా, అమ్మా తిడతారు" అన్నారు కమలా,విమలా.


    ఇందులో తిట్టడానికి ఏముందో అర్థంకాలేదు అమూల్యకు.


    గొడ్లూ గోదా తిరిగివస్తున్నాయ్. దూరంగా కన్పించే రావిచెట్టు మీద కొంగలు వాల్తున్నాయ్. లేస్తున్నాయ్. వచ్చే పోయేవాళ్ళూ సందె కనువు ఊడుస్తున్న ఆడవాళ్ళూ అమూల్యను కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే తమాషాగానూ, గర్వంగాను అనిపించింది.

    
    శ్రీధర్ దూరంగా కన్పించాడు. నీరెండలో నడిచి వస్తున్న అమూల్య కళ్ళకు సినిమాలోని హీరోలా కన్పించాడు.


    "ఏమిటి ఇక్కడ నిల్చున్నారు?"


    "ఏం నిల్చోకూడదా?"


    "అబ్బే అదికాదు?" ఏదో అనబోయి మానేసి ఊరుకున్నాడు.


    "ఒరే అబ్బాయ్ అమ్మాయిని మన తాడితోపుకు తీసుకెళ్ళి ముంజలు తినిపించిరా" అన్నది తల్లి.


    "అవును అన్నయ్యా వెళ్దాం" చెల్లెళ్లిద్దరూ ఒకేసారి అన్నారు.


    చెల్లెళ్ళ వేషాలు కళ్ళు పెద్దవి చేసుకొని చూశాడు.


    ఇద్దరూ అన్న ముఖంలోకి భయం భయంగా చూడసాగారు.


    "ఏమిటా వేషాలు" అన్నాడు శ్రీధర్.


    చెల్లెళ్ళు ముఖం ముడుచుకున్నాయి.


    "ఏం బాగాలేదా? నేనే....."


    "అహా అదికాదు. ఇది పల్లెటూరు...."


    "అయితే?" రెట్టించింది అమూల్య.


    "ఇవాల్టికి సరే రేపటినుంచి..." చెల్లెళ్ళ ముఖాలు చూసి ఇంకేమీ అనలేకపోయాడు.


    "తాటితోపుకు వెళ్దాం. ఈ ఊరు వచ్చింది ఇంట్లో కూర్చోడానికేనా?" అన్నది అమూల్య.


    "గతుకుల బాటలో కొంత దూరం నడవాలి."


    "నడుస్తాను" ఉషారుగా చిన్నపిల్లలా అన్నది అమూల్య.


    శ్రీధర్ లోపలకు వెళ్ళి పంచ కట్టుకొని పైన ఒక తుండు వేసుకొని వచ్చాడు. పంచ కట్టుకున్న అతన్ని చిత్రంగా చూసింది అమూల్య.


    అందరూ కారులో బయలుదేరారు.


    కారును రోడ్డు మీద ఆపి కొండక నడవసాగారు.


    శ్రీధర్ పంచె కుచ్చెళ్లు ఒక చేత్తో పట్టుకొని చకచక నడుస్తున్నాడు.


    కమల,విమల కూడా చకచక నడుస్తున్నారు.


    ఆ భుజం మీద తుండు ఎందుకో అనుకుంటూ, కాళ్ళకింద కుచ్చిళ్ళు పడుతూ వుంటే ఎత్తు మడమల జోడులో అవస్త పడుతూ నడుస్తున్నది.


    శ్రీధర్ వెనక్కి తిరిగి చూశాడు.


    అమూల్య నడవలేనట్టు నిల్చుంది.


    అమూల్య సిగ్గుపడుతూ మరో అడుగు వేసింది. కుడికాలు మెలిక పడింది. పడబోయి తమాయించుకొని నిల్చుంది. ముఖం ఎర్రబడింది.


    శ్రీధర్ అమూల్య దగ్గరకు వచ్చాడు.


    "చెప్పులు కార్లో వదలాల్సింది" అన్నాడు.


    "అవును"


    "నడవలేరా?"


    కమలా, విమలా వెనక్కు వచ్చారు. వాళ్ళ కాళ్ళకు చెప్పులు లేవు. వెండి గజ్జల పట్టీలు ఉన్నాయ్.


    అమూల్య కిందకు వొంగి చెప్పులు చేత్తో పట్టుకుంది.


    గచ్చు మీద కూడా చెప్పులు లేకుండా నడవడం ఎరగని అమూల్యకు గతుకుల డొంకలో చెప్పులు లేకుండా నడవడం కష్టంగా ఉన్నది. పాదాలు ఎత్తి వేస్తూ నడుస్తున్నది. పైగా చీరకు కుచ్చెళ్లు కాళ్ళకింద పడుతున్నాయ్.


    "ఆ చెప్పులు ఇలా ఇవ్వండి. మీరు కుచ్చెళ్లు పట్టుకొని జాగ్రత్తగా నడవండి" అన్నాడు శ్రీధర్ చెయ్యి చాపుతూ.


    అమూల్య నిల్చుంది. కాని చెప్పులు శ్రీధర్ చేతికి ఇవ్వలేకపోయింది.


    "నేను తెస్తాను" అంటూ విమల అమూల్య చేతిలోని చెప్పుల్ని లాక్కుంది.


    ఎడం చేత్తో చీర కుచ్చెళ్లు పట్టుకొని అతి జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడవసాగింది అమూల్య. అమూల్య పాదాలకింద మట్టిగడ్డ పడినా ప్రాణం పోయినట్టు అన్పించసాగింది. తాటితోపులోకి వచ్చారు.


    "ఇదే మా తాటితోపు." అంటూ కింద చతికిలబడింది కమల. ఆమె పక్కనే విమల కూర్చుంది. అంత మట్టిలో కూర్చోవడమా? అమూల్య సందేహిస్తూ నిల్చుంది.

 Previous Page Next Page