Previous Page Next Page 
వేసవి వెన్నెల పేజి 9


    అది పాతకాలపు మండువా లోగిలి.


    శ్రీధర్ చెల్లెళ్ళు ముఖంలోకి ఒకరికొకరు అర్థయుక్తంగా చూసుకున్నారు.


    పెద్ద చెల్లెలు కమలకు పదిహేడు ఏళ్ళు. విమలకు పదిహేను ఏళ్ళు. ఎనిమిది పాసైంది.


    అమూల్య ఆ ఇంటిని చూడసాగింది. ఒక మూల భోషాణం ఉన్నది. దానిమీద గోతాలూ, పాత పరుపులూ వున్నాయి. గోడలకు మాసిపోయి, అద్దాలు పగిలిపోయిన దేవుళ్ళ ఫోటోలు వేలాడుతున్నాయి. అమూల్యకు ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిల్చోవాలో బోధ పడనట్టు శ్రీధర్ ముఖంలోకి చూసింది.


    బంగారమ్మ చాప పరిచి "కూర్చో తల్లీ! కాఫీ తెస్తాను. ఆ తర్వాత స్నానం చేసి భోజనం చేద్దువుగాని" అంటూ లోపలికి వెళ్ళింది.


    కమలా, విమలా అల్లంత దూరంలోనే నిల్చున్నారు.


    "అక్కా ఆ అమ్మాయి, అన్నయ్యా ప్రేమించుకుంటున్నారు. ఎలా వుంది" అక్క చెవులో గుసగుస లాడింది విమల.


    "ఛా! అదేంకాదు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. జడ్జిగారు అమ్మాయి మన అన్నయ్యను ప్రేమిస్తుందా ఏమిటి?"


    "ప్రేమించుకోవడానికి బీదవాళ్ళు ఏమిటి?" చూసిన సినిమాలవల్ల కలిగే జ్ఞానాన్ని ప్రదర్శించింది విమల.


    "నిజమే? నాకు ఆ ఆలోచనే రాలేదు. చూడు! అన్నయ్య కేసి ఎలా చూస్తుందో?"


    "ఏమిటమ్మా మీరు అలా దూరంగా గుసగుసలాడుతున్నారు. ఆమె దగ్గర కూర్చోండి. ఆమెకు ఏం కావాలో చూసుకోవాలి మీరే" అన్నాడు శ్రీధర్.


    అమూల్య దగ్గరగా వచ్చి నిల్చున్నారు.


    "కూర్చోండి" అమూల్య నవ్వుతూ అన్నది.


    ఇద్దరూ అమూల్యకు చెరో పక్కన కూర్చున్నారు. క్రింద కూర్చునే అలవాటు లేని అమూల్య ఇబ్బందిగా కూర్చుంది.


    శ్రీధర్ వాకిట్లోకి వెళ్ళాడు.


    కమలా, విమలా జడలు బిగించి వేసుకున్నారు. జడ కుచ్చులో కట్టుకున్నారు. లంగా ఓణీలలో వాళ్ళను చూస్తుంటే తను సినిమాల్లో చూసి ముచ్చటపడే పల్లెటూరి పిల్లలు లాగున్నారు.


    కమల అమూల్య చీరను తాకించేస్తూ "ఇది షిఫాన్ కదూ?" అన్నది.


    "అవును"


    "చాలా బాగుంది"


    "వెండి గాజులు వేసుకున్నారేం?" అడిగింది విమల.


    "అది పట్నంలే" చెల్లెలి అజ్ఞానాన్ని ఎత్తి చూపింది అక్క.


    అమూల్య నవ్వుతూ కూర్చుంది.


    వాళ్ళు పట్నం గురించి ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు. ఆమె సమాధానాలు చెబుతున్నది.


    బంగారమ్మ కాఫీ గ్లాసు అందించింది.


    స్టీల్ గ్లాసులో కాఫీ తాగాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అమూల్యకు. ఒకవేపు గ్లాసు కాలుతుంది. కాఫీ నోట్లో పోసుకుంది. మందు మింగినట్టు మింగింది.


    "ఇక్కడ కాఫీ గ్లాసుల్లోనే తాగాలి" నవ్వుతూ లోపలకు వచ్చి శ్రీధర్ అన్నాడు.


    "అదేంటిరా అబ్బాయ్ అయితే నాకు తెలియక అడుగుతున్నాను పట్నంలో గలాసుల్లో కాఫీతాగరంట్రా?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది బంగారమ్మ.


    "అవునమ్మా పింగాణీ కప్పులూ, సాసర్లు ఉపయోగిస్తారు" అంటూ కాఫీ తాగలేక అవస్థ పడుతున్న అమూల్యను చూసి "బాగాలేకపోతే వదిలెయ్యండి. అంత బాధ ఎందుకూ?" అన్నాడు.


    "కాఫీ బాగా లేదు తల్లీ! చిక్కటి పాలే పోశామ్?" అన్నది బంగారమ్మ.


    "ఛ ఛ బాగుందండీ" అంటూ గటగట తాగబోయింది. పొలమారి ఉక్కిరిబిక్కిరి అయింది. అమూల్య బంగారమ్మ తల నిమిరింది.


    కమలా, విమలా ఎంతో అపురూపంగా కాఫీ తాగుతున్నారు.


    వాళ్ళకు రెండోసారి కాఫీ దొరకదు. ఎవరైనా బంధువులు వస్తే తప్పించి.


    "ఇకలేమ్మా స్నానం చెయ్యి. మంచి ఎండన పడి వచ్చారు. రెండు ముద్దలు తిని పడుకుందువు గాని" అన్నది బంగారమ్మ.


    శ్రీధర్ బయటికి వెళ్ళాడు.


    అమూల్య లేచి పెట్టె తెరిచి తీసుకుంటూ ఉంటే, శ్రీధర్ చెల్లెళ్లిద్దరూ ఎదురుగా కూర్చొని ఒక్కొక్క చీరే పట్టుకు చూస్తూ వాటి పేర్లూ, ధరలు మొదలుపెట్టారు. అమూల్య  విసుక్కోకుండా నవ్వుకొంటూ సమాధానాలు ఇవ్వసాగింది. వాళ్ళు అలా అడుగుతూ ఉంటే ఆమెకు కూడా సరదాగానే ఉన్నది.


    అమూల్య బట్టలూ టవలూ, సబ్బు వగైరా తీసుకొని నిల్చుంది.


    "ఏం సబ్బూ ఇది?" అన్నది ముక్కు దగ్గిర పెట్టుకొని పైకి ఎగబీలుస్తూ విమల.


    "యుడిక్యులోన్ సోప్"


    "ఏంటర్రా ఆ అమ్మాయిని ముందు స్నానం చెయ్యనిస్తారా లేదా? కమలా స్నానాల దొడ్డి చూపించు?" అన్నది బంగారమ్మ.


    ఇంటి వెనకవైపు గోడ చుట్టూ తడికిలతో ఉన్న స్నానాల దొడ్డిని చూపించింది. కమల కాళ్ళు ఎత్తి ఎత్తి చూస్తూ తడిలో నడుస్తూ వచ్చి దడి దగ్గిరే ఆగిపోయింది అమూల్య.


    "బట్టలు ఇలా ఇవ్వు" అంటూ ఆమె చేతిలో నుంచి తీసుకొని తడికె మీద వేసింది కమల.


    అమూల్య లోపలకు వెళ్ళింది. క్రిందంతా బురదగా ఉన్నది. మధ్య ఒక వెడల్పాటి నాపరాయి ఒకటి. తడికలకేసి చూసింది. కన్నాలు వున్నాయ్. తడిక తలుపులు ముందుకునెట్టి "ఎవరూ రారులే" స్నానం చేసిరా, నేను ఇక్కడే నిల్చుంటాను" అన్నది కమల.


    "ఒద్దు నువ్వు లోపలకు వెళ్ళు" అన్నది అమూల్య గాభరాగా.

 Previous Page Next Page