Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 1

                                 


                              అర్ధరాత్రి సూర్యోదయం

                                                                          సి.ఆనందారామం

                        


    ఒక అక్టోబర్ సాయంత్రం.
    ఎత్తయిన కొండల మధ్య లోయలో ఉన్న ప్రమధపురిలో సూర్యకాంతి మసకబారి, బయటి వెలుతురు ఉండగానే అంధకారం అలముకొన్న భ్రాంతి కలిగిస్తోంది. వెలి మబ్బులతో తెల్లగా ఉన్న ఆకాశమూ, కొండలతో గుట్టలతో నల్లగా ఉన్న నేలా, ఏకమైనట్లు భ్రమ గొలిపే దిగంత రేఖ స్పష్టంగా కనిపిస్తోంది.
    తలెత్తి పైకి చూస్తే వెలుగు. తల దించుకుని చుట్టూ చూస్తే చీకటి.
    విసర్గ రమణీయత ఉట్టిపడే పరిసరాలు! మానవ ప్రవృత్తిలాగ ఎంతో సహనం, కొంత క్రౌర్యం.
    విచిత్రమైన ఆకర్షణ: కొంత వికృతి, రహస్యమయ అగాధాలూ, అతి సామాన్యమైన మైదానాలూ, ద్వంద్వాల సహజ సమ్మేళనంలా ఉంటుంది ప్రమధపురి!
    నామాలయ్య ఇంట్లోంచి మధురంగా సన్నాయి మేళం వినిపిస్తోంది. పురోహితుడు మంత్రోచ్చారణలో కలిసిపోయి, వినిపిస్తోంది అది! నామాలయ్య భార్య కలశం మీద దుర్గ బంగారు రూపు అమర్చింది. దానిని బొట్టూ కాటుకతో అలంకరించింది. జరీ బుటాలున్న కంచిపట్టుచీర. ఆ చీర కలశంలో అమర్చిన కొబ్బరికాయని కమ్మేసి, కిందికి జారింది. చీర జారిపోకుండా తన బంగారు వడ్డానం చీర చుట్టూ బిగించింది. తన కాసుల పేరు, దుర్గ మెళ్ళో వేసింది. ఆవు నేతిలో వెలిగించిన జ్యోతుల ముందు, దుర్గ రూపు ధగధగ మెరుస్తోంది.
    పక్కనే పీటమీద కూచుంది ఇళ. ప్లాస్టిక్ జరీ అంచులో ఉన్న తెల్లని పరికిణి అలాంటిదే జాకెట్టు. విజయదశమి నవరాత్రులలో ఆ రోజు మూలా నక్షత్రం. సరస్వతీ పూజ! ఇళని సరస్వతీ రూపంగా భావించి, పూజలో కూచోబెట్టారు, నామాలయ్య దంపతులు. శుభ లక్షణాలున్న ఆడపిల్లని పన్నెండేళ్ళు దాటని, దుర్గ ప్రతిరూపంగా భావించి పూజలో కూచోబెట్టి దుర్గని ఆమె మీదికి, మంత్రోచ్చారణతో ఆవహింపజేసి, పూజ చెయ్యటం కొన్ని ప్రాంతాలలో ఈనాటికి ఉన్న ఆచారం ప్రమధపురిలోనూ ఉంది. ఆ సంవత్సరం ఇళకి పదేళ్ళు నిండాయి. అంచేత బాలగా, వారాహీగా, కౌమారిగా కూచోబెట్టడం కంటే సరస్వతిగా కూచోపెట్టడం బాగుంటుందని, ఆ రోజు పూజలో కూచోబెట్టారు ఇళని. ఆ గ్రామంలో శతాబ్దాలుగా వెలిసి ఉన్న దుర్గ దేవాలయంలో పూజారి యోగనాధశాస్త్రి. ఆయన భార్య అచ్యుతమ్మ ఆ దంపతుల తొమ్మిదిమంది సంతానంలో ఏడోది ఇళాదేవి. ప్రతిభావంతుడైన శిల్పిచెక్కిన దేవతా విగ్రహంలాగే ఉంటుంది. ఆ పిల్ల బంగారంలో గులాబీలు పోసి కరిగించి పోత పోసినట్లున్న శరీరఛాయ కాంతివంతంగా మెరుస్తూ, ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నట్లు ఉండే కళ్ళుపోక చెక్కలాంటి చిన్ననోరు, స్వాతికమైన వ్యక్తిత్వం ఆ గ్రామ్మలో పూజచేసే స్థోమత ఉన్న గృహస్థులందరికీ, ఇళాదేవిని తమ పూజలో కూచోబెట్టుకోవాలనే ఉంటుంది. కానీ, నామాలయ్య ఆ గ్రామమంతటికి మోతుబరి రైతు గనుక, అతడి కోరిక నెగ్గుతుంది. సామాన్యంగా నాలుగేళ్ళ నుంచి నవరాత్రి పూజలలో, దుర్గ నవరూపాలలో ఒక రూపంగా నామాలయ్య ఇంట్లో పూజలందుకొంటుంది ఇళాదేవి. నల్లతాడులో కట్టిన రాగితాయెత్తు తప్ప మరో నగలేకపోయినా, సహజమైన కాంతిలో మెరిసిపోతోంది ఆ పిల్ల.

Next Page