Previous Page Next Page 
సంధియుగంలో స్త్రీ పేజి 7


    "ఆయన మగవాడు."
    "నీ ఆడ మనస్తత్వం పోనంత వరకూ ఎంత చదివినా మానసిక బానిసత్వం నుంచి విముక్తి లేదు. నువ్వూ మగవాడిలాగే ఉద్యోగం చేసి సంపాదిస్తున్నావు. అయినా మగవాడు అధికుడనీ, ఇంటి పనుల్లో సాయం చెయ్యడం మగవాడి పని కాదనీ ఎందుకనుకుంటావ్?"
    జానకి భావాలు సుందరమ్మకు అర్థం కావు. పలక్కుండా ఫైలు విప్పింది.
    "నువ్వూ అందరిలాగే జీతం తీసుకుంటున్నావ్. రోజూ ఆలస్యంగా వస్తే అందరికీ నీ మీద ఈర్ష్యగా ఉంటుంది. ఉద్యోగం కావాలనుకుంటే టైంకు రా! లేదా మానేసి ఇంట్లో కూర్చో! అంతేగాని ఉద్యోగాలు చేసే ఆడవాళ్లందర్నీ మాటలు అనిపించకు" విసుక్కుంది జానకి.
    సుందరమ్మ అలారం పెట్టుకుని ఐదు గంటలకు నిద్ర లేస్తుంది. భర్తాపిల్లలు లేచే సరికి సగం వంట పూర్తి అవుతుంది. భర్తకు కాఫీ, పిల్లలకు పాలూ ఇస్తుంది. అత్తగారు ఉంటే పిల్లలకు స్నానాలు చేయిస్తుంది. లేకపోతే ఆ పనికూడా సుందరమ్మే చేస్తుంది. పిల్లలకూ భర్తకూ భోజనాలు పెట్టి, మధ్యాహ్నం కోసం టిఫిన్ కట్టి, ఎవరి టిఫిన్ వాళ్ళకు అందించి పిల్లల్ని స్కూలుకు పంపిస్తుంది.
    భర్తకు కూడా టిఫిన్ బాక్స్ అందించి, అతను ఆఫీసుకు బయలు దేరాక, తను ఆదరాబాదరాగా రెండు మెతుకులు గొంతులో వేసుకొని ఆఫీసుకు బయలుదేరుతుంది.
    చంటివాణ్ణి పనిమనిషికి అప్పగించి వస్తుంది. ఆఫీసులో కూర్చున్నా ఆమె మనసు ఇంటి మీదే ఉంటుంది. ఆ పనిమనిషి ఒకరోజు పిల్లవాడి పాలలో సగం తాగిస్తే, మరోరోజు బిస్కెట్లు తినేస్తుంది. పిల్లవాడికి సుస్తి చేస్తే ఇక సరేసరి. సెలవు పెట్టలేదు. ఆఫీసులో కూర్చోనూ లేదు, పనిమనిషి రాకపోతే సెలవు పెట్టక తప్పదు.
    హైదరాబాద్ లాంటి పట్నాలలో ఆఫీసుకు ఒక గంట ముందు బయలుదేరాలి. బస్సులు సమయానికి అందవు. అతి కష్టం మీద బస్ లో స్థలం దొరుకుతుంది. దాదాపు బస్ లన్నీ స్టాప్ ను దాటి కొంతదూరం వెళ్ళి ఆగుతాయి. మగవాళ్ళు పరుగెత్తికెళ్ళి ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ఆడవాళ్ళు నాలుగు అడుగులు వేసేసరికి మళ్ళీ ఆ బస్  బయలుదేరుతుంది.
    సుందరమ్మ తనకు ఒంట్లో బాగాలేకపోయినా ఆఫీసుకు వస్తుంది. కాని బంధువులు వచ్చినా, పనిమనిషి రాకపోయినా, పిల్లవాడికి ఆరోగ్యం సరిగా లేకపోయినా, భర్తకు తలనొప్పి వచ్చినా సెలవు పెడుతుంది. సుందరమ్మ భర్త పైన చెప్పిన కారణాలకు సెలవు తీసుకోడు. ఆ అవసరం అతనికి ఉండదు.
    సుందరమ్మ సోమవారం నుంచీ వచ్చే ఆదివారం చెయ్యవలసిన పనుల లిస్టు తయారు చేసుకుంటుంది. ఇళ్ళు కడిగించుకోవాలి. పిల్లలకు తలలు అంటి నీళ్లు పొయ్యాలి. బట్టలు ఇస్త్రీ చెయ్యాలి, వంటిల్లు సర్దుకోవాలి. ఇలా ఎన్నో వూహించుకొంటూ ఉంటుంది.
    కానీ తీరా ఆదివారం వచ్చేసరికి ఎవరో ఒకరు వస్తారు. భర్త ఏ స్నేహితున్నో భోజనానికి పిలుస్తాడు. ఆ రోజు అనుకున్న పనుల్లో ఏ ఒక్కటి కాదు.
    ఈ విధంగా ఉంటుంది సుందరమ్మ దినచర్య. ఇది సుందరమ్మ దినచర్యే కాదు. ఈనాడు ఉద్యోగాలు చేస్తున్న చాలామంది స్త్రీల దినచర్య ఇలాగే ఉంటుంది.
    నా స్నేహితురాలు ఒకామె మద్రాసులో ఉద్యోగం చేస్తున్నది. ఒకరోజు ఆమె తనగోడు వినిపించింది.
    ఆమె తెల్లవారుజామున మూడుగంటలకే నిద్రలేస్తుంది. నీళ్లు అప్పుడు వస్తాయి. నీళ్ళు పట్టుకుని, కొంచెంసేపు నడుంవాల్చి మళ్ళీ లేస్తుంది. కాఫీలు ముగించి వంట చేస్తుంది. ఇంట్లో అత్తగారు ఉన్నది. ఎప్పుడూ ముక్కుతూ మూలుగుతూనే ఉంటుంది. భర్తలేచి కాఫీ తాగి ఈజీ చైర్లో కూర్చుని పేపరు చదువుకుంటాడు.
    తొమ్మిదిన్నరకు భోజనం చేసి ఆఫీసుకు వెళ్తాడు. ఆమె పది గంటలకు ఆఫీసుకు బయలుదేరుతుంది. బాగా అలసిపోయి ఆరుగంటలకు తిరిగి వచ్చిన ఆమెతో అత్తగారు అంటుంది." ఇవ్వాళ నీ కొడుకు ఒకటే ఏడుపు. నేను పట్టుకోలేకపోయాను. అసలే నా ఆరోగ్యం అంతంతమాత్రం. నీ పిల్లవాణ్ణి చూసుకో తల్లీ? నేను కాలక్షేపానికి (హరికథకు) వెళ్తున్నాను" అత్తగారు హరికథ వినడానికి వెళ్ళిపోతుంది.
    ఒక గృహిణి ఉద్యోగం చేస్తూ ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నదో చూడండి: అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో అన్ని సమస్యలతో పాటు "స్త్రీలు -- ఉద్యోగాలు" అన్న విషయం మీద కూడా చర్చలు జరిగాయి.  
    ఉద్యోగం చేసే స్త్రీలకు, పురుషులకు లేని ప్రత్యేక సమస్యలు ఏమి వుండవు అని కొందరన్నారు. కొందరు ఆఫీసుల్లో స్త్రీలు ఎదుర్కొనే సమస్యల్ని గోరంతల్ని కొండంతలుగా చేసి వర్ణించారు. కాని ఉద్యోగం చేసే స్త్రీ బయట ఎదుర్కొనే సమస్యలకంటే యింట్లోని సమస్యలతోనే సతమతమయిపోతుంది.
    ఇద్దరూ ఉద్యోగం చేసే యింటికి మనం వెళ్ళి దిగితే వాళ్ళను యిబ్బంది పెట్టినట్టు అవుతుంది అని బంధువులు అనుకోరు. పైగా రాక రాక వస్తే ఆవిడ ఆఫీసుకు వెళుతుంది. అని ఆరళ్లు పెడ్తారు.  
    విదేశాల్లోలా స్త్రీ ఉద్యోగానికి వెళ్తూ పసిపిల్లల్ని అప్పగించి వెళ్ళడానికి క్రేషీలు మన దేశంలో లేవు.
    పురుషుడు తన మనస్తత్వాన్ని మార్చుకొని యింటి పనుల్లో భార్యకు సహాయం చెయ్యడు. యిలాంటి సమస్యలకు పరిష్కారాలు ఏమిటి?
    స్త్రీ ఆలోచించి తన సమస్యల్ని పరిష్కరించుకోవాలి. మానసిక బానిసత్వం నుంచి బయటపడితే గాని యిది సాధ్యం కాదు.
    టెలిఫోన్ రోమియోలు నగరాల్లో, పట్టణాల్లోని నివసించేవారికి ఇంట్లో టెలిఫోన్ ఉండటం వల్ల అనేక సౌకర్యాలతోపాటు కొన్ని ఇబ్బందులుగా కూడా ఉంటాయి.  
    ఇరుగుపొరుగు వాళ్ళు సమయం, సందర్భం చూడకుండా (ఎమర్జన్సీకి కాదు) టెలిఫోన్ చేసుకుంటామని వస్తారు. మొహమాటంతో 'సరే' అనాల్సి వస్తుంది. గంటల కొద్దీ హస్కు వేస్తారు. ఎక్కడ నుంచో ఫోన్ వస్తుంది. రంగారావును పిలవండి అంటారు. "ఈ ఇంట్లో రంగారావు అనే వ్యక్తి లేడండి" అంటే "ఇదే నంబరు ఇచ్చాడండీ. మీ కాలనీలోనే 108వ నంబర్ లో ఉంటాడు" అంటారు.
    ఈ రంగారావు ఎవరో తెలియదు. ఆ నూటా ఎనిమిది నంబరు ఇల్లు ఎక్కడ ఉందో అంతకన్నా తెలియదు. ఆమాట చెబితే ఒక పట్టాన వదలరు. ఇక తెలిసిన వాళ్ళను పిలవాలంటే కూడా వెళ్ళి పిలవడానికి సమయానికి ఇంట్లో మరోమనిషి ఉండదు. ఆ మాటే చెబితే నమ్మరు. ఆ తరువాత రెండు వైపుల నుంచీ నిష్టూరాలు వస్తాయి.    
    ఈ ఎస్.టి.డి. వచ్చాక ఫోన్ ఎవరికైనా ఇవ్వాలంటే ప్రతి వాళ్ళకూ భయంగానే ఉంటున్నది. ఫోన్ దగ్గిర కాపలా నిలబడి వాళ్ళు ఎన్ని నంబర్లూ డయల్ చేస్తూన్నారో లెక్క పెట్టుకోవాలి అవకాశాన్ని అందరూ దుర్వినియోగం చెయ్యరు. నిజమే కాని ఎవరు చేస్తారో తెలియదు. అందుకే అందర్నీ కనిపెట్టాల్సి వస్తుంది.  
    అలా చేస్తున్నందుకు మనసు బాధ పడుతుంది. అవతల వాళ్లు తన మనసులోని భావాన్ని ఎక్కడ పసిగడతారోననే భయంకూడా కలుగుతుంది.
    అన్నిటికంటే మరో భయంకరమైన సమస్య ఉన్నది నేను కూడా (దాదాపు ఫోను ఉన్న వాళ్ళందరూ అనుభవించే ఉంటారు) ఆ సమస్యను ఎన్నోసార్లు ఎదుర్కోవాలసి వస్తుంది. ఆ రోజునా ఫోన్ డెడ్ అయింది. కంప్లైంట్ ఇవ్వడానికి సుశీలా వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళింట్లో నుంచి ఫోన్ ఎత్తేసినట్లు ఆమె చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. బాగా డబ్బు ఉన్న వాళ్లు ఫోన్ లేకుండా (ముఖ్యంగా ఇంట్లో ఫోన్ అలవాటు అయాక) ఎలా మేనేజు చేస్తున్నారో?
    "ఆ ఫోన్ వల్ల నానా బాధలూ పడ్డాం. అందుకే ఎత్తేశాం" అన్నది సుశీల.
    సుశీలకు ఇద్దరు వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు. హైస్కూల్లో చదివే మగపిల్లవాడున్నాడు.
    "పిల్లలతో పడలేకన్నా? చదువు సంధ్యామాని వీళ్ళు గంటలకొద్ది స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. కొత్తగా సినిమా కథ నుంచి పరీక్షలో ఇవ్వబోయే ప్రశ్నల వరకూ సంభాషణ నడుస్తుంది."
    "అది కాదు నా బాధ."
    "మరి." సుశీల చెప్పిన కథ ఇది --
    సుశీల పెద్ద కూతురు లావణ్య చాలా అందంగా ఉంటుంది. కాలేజీలో చదువుతున్నది. కుర్రాళ్ళ ఫోన్లు ఎక్కువయ్యాయి. అసభ్యకరంగా మాట్లాడటం, సినిమాకు వస్తావా పబ్లిక్ గార్డెన్ కు వస్తావా అని అడగటం -- లావణ్య చాలా మంచిపిల్ల. తల్లిదండ్రులకు ఆ అమ్మాయి మీద అనుమానం లేదు. ఆ ఫోన్లు చేసే వాళ్ళెవరో కూడా లావణ్యకు తెలియదు. ఒక్కొక్కప్పుడు ఫోన్ లో బెదిరించడం కూడా చేస్తుంటారు. లావణ్య కాలేజీకి వెళ్ళడానికి కూడా భయపడ సాగింది..... ఆ తరువాత లావణ్య ఫోన్ ఎత్తడం మానేసింది. సుశీల ఫోన్ ఎత్తేది. సుశీల కంఠం విని ఎవరూ మాట్లాడేవారుకాదు. ఫోన్ పెట్టగానే మళ్ళీ రింగ్ అవుతుంది. విసుగుతో ఒకటి రెండు సార్లు తిట్టేసింది. తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పుకుంది. కొంతకాలం అలా జరిగిన ఆ రోమియోలు సుశీలతోనే అసభ్యంగా మాట్లాడసాగారు.
    కొందరు రోమియోలు పన్నెండేళ్ళ మగపిల్లవాడు (స్వరం ఆడపిల్ల స్వరంలా ఉంటుంది. కనక) హలో అన్నా, పద్దెనిమిదేళ్ళ ఆడపిల్ల పలికినా, ఏభయ్ ఏళ్ళ స్త్రీ పలికినా, ఒకేలా మాట్లాడతారు. తమ అజ్ఞాత లైలా మగపిల్లవాడో, వృద్ధురాలో కూడా తెలియదు ఈ మజ్నూలకు. సుశీల భర్తకు చెప్పడానికి భయపడింది. ఎక్స్చేంజికి ఫోన్ చేస్తే అబ్జర్వేషన్ ఫోన్ పెడితే కాని పెట్టుకోలేమన్నారట. చివరికి ఆ బెడద భరింపలేక సుశీల భర్తతో చెప్పేసింది. ఆయన ఫోన్ కట్ చేయించేశాడు. ఆయన చాలా అనుమానస్తుడు కూతుర్ని తిట్టాడు.  

 Previous Page Next Page