Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 25

 

    పురాణ కధ:

    పూర్వము భీముఁడను మహాబలవంతుడైన రక్షసుఁడుండెను. వాడు సర్పజన భయంకరుడై జననియగు కర్కటితో సహ్యపర్వత  శిఖరములపై నివసించుచుండెను. ఒకనాడు వాడు తన తల్లించి గాంచి 'అమ్మా! నా తండ్రి యెవ్వఁడు? ఎక్కడ నున్నాడు? నీవీ కొండపై నొంటరిగా నుండుటకు హేతువే?" మని ప్రశ్నించెను. కర్కటి కుమారునితో నిట్లు చెప్పెను. "పుత్రకా! లంకాధినాధుండైన రావణుని తమ్ముడు కుంభకర్ణుడు మీ తండ్రి. మహాపరాక్రమోపెతులైన మీ తండ్రిని పేదతండ్రిని దుర్మార్గుఁడైన శ్రీరాముడు సంహరించెను. మా తండ్రి కర్కటుఁడు. తల్లి పుష్యసి. విరాధుఁడు నా ప్రధమ భర్త వానిని కూడా పూర్వమున శ్రీరాముడే హతమార్చేను. ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్యమహర్షి శిష్యుఁడైన సతీక్షుని పట్టుకొని భక్షింపబోయిరి. మహాతపస్వియగు వాఁడు క్రుద్దుఁడై నా జననీజనకులను భస్మము చేసినాడు. నేను దిక్కుమాలిన దాననై ఒక్కతేనే బిక్కుబిక్కుమని కాలము గడుపుచుంటిని. ఆట్టి యెడ జగజెట్టి రావణుని తమ్ముడు కుంభకర్ణుఁడిచ్చటికీ వచ్చి నన్ను బలాత్కారముగ చేపట్టినాఁడు. తత్పలముగ నీవు పుట్టితివి. నీ తండ్రి మాహావీరుఁడు తండ్రిని మించిన కొడుకువై తన వంశమునకు పేరు తెమ్ము."
    తల్లి పలుకులు విని భీముడు కుపితుడైనాడు. తన వంశమును  ధ్వంస మొనర్చిన  విష్ణుమూర్తిని, ఆయన భక్తులను సర్వనాశనము చేయవలెనని సంకల్పించినాడు. దేవతలను మహర్షులను మట్టు పెట్టవలెనని పట్టుపట్టినాడు. బ్రహ్మదేవుని గురించి వెయ్యి సంవత్సరాలు తదేకదీక్షతో తపస్సు చేసినాడు. పద్మసంభవుడు ప్రత్యక్షమై రాక్షసరాజునకు నిరూపమాన పరాక్రమము, నిరవధికధైర్యము వరములుగా ప్రసాదించి యద్రుశ్యుడైనాడు.
    పరగర్వితుడైన భీమాసురుడు సురలోకముపై దండెత్తి దేవేంద్రుని పదభ్రష్ణుని గావించినాడు. దేవతలను పరభూతుల నొనర్చి దేవలోకము నాక్రమించుకొనినాడు. స్వర్గవిజయానంతరము భూలోకమన జైత్రయాత్ర సాగించి సాధువులగు భక్తులను బాదించినాడు. పూజ్యులగు మహర్షులను వేధించినాడు.
    ఆకాలములో సుదక్షిణుడు మహారాజు కామరూపదేశము నేలుచుండెను. అయన పరమశివ భక్తాగ్రగన్యుడు. అఖండ తపస్సంపన్నుడు. భీముడు కామరూపాధిపతిపై దండెత్తి యోడించి ధర్మాత్ముడైన యధారణీనాధుని కారాగారబద్ధుని గావించెను. శివపూజ దురంధరుఁడైన సుదక్షిణుడు నిర్భంధములోనే నిరంతరము పరమశివుని పార్దివలింగస్వరూపుని పూజించుచు పంచాక్షరీ మంత్రమును భక్తీపూర్వకముగ జపించుచుండెను.
    ఒక దినము భీముడు సుదక్షిణుని సమీపించి "ఓరీ! రాజాధమా! ఈ జపములేమీ! ఈ తపములేమీ! ఈ శివపూజలేమి!" అని గర్జించెను. సుదక్షిణుడు నిశ్చలముగా నిర్భయముగా శివపూజ చేసి కొనుచుండెను. రాక్షసున కొడలుమండెను. వాడు పండ్లు, పటపట కోరుకుచూ ఓర నుండి కరవాలము తీసి "ఓరి ,ముర్ఖా! ఏమిటీ మౌనము? మాటడవేమి' అని యఱచెను. సుదక్షిణుడు ప్రసన్నముగా కన్నులు తెరచి "రాక్షసరాజా! ఈ చరాచర సృష్టి కంతటికీ ప్రభువు పరమశివుడు. ఆ పరమేశ్వరుడే సమస్తమునకు కర్తయు, భర్తయు, హర్తయునై యున్నాఁడు. నేనా జగదీశ్వరు నారాధించుచున్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్నేమియు చేయజాల" వని పలికెను.
    ఆ పలుకులు విని భీముడు మహోగ్రుడై యట్టహసము చేసెను. చేతనున్న చంద్రహాసమును ఝుళిపించుచు "వీడా నీ శివుడు! నీ రక్షకుడు. ఐనచో కాచుకోనుము. వీనినిప్పుడే నా కరవాలముతో ఖండ ఖండములు గావించుచుంటి" నని శివలింగముపై ఖడ్గము విసరెను. తక్షణమే శివలింగములో నుండి ఫాలాక్షుడు సాక్షాత్కరించి రూక్షవీక్షణములతో నా రాక్షసుని భస్మము గావించెను.
    సుదక్షిణుడు భక్తీపారవశ్యముతో పార్వతీపతి పాదముల పైబడి సమస్కరించెను. ఆనంద భాష్పాములతో స్వామి చరణముల నభిషెకించెను. పరిపరి విధముల ప్రస్తుతించెను.
    పరమశివుని కరుణాకటాక్షము వలన దుష్టరాక్షస సంహారము జరిగినది. లోకముల పీడ వదలినది. ఇంద్రాది దేవతలు తమతమ స్థానము లలంకరించిరి. మహర్షుల జపతపముల నిర్విఘ్నమూలాయ్యేను. సకల లోకములకు శాంతి భద్రతలు సమకూరెను. సుదక్షిణుడు ప్రాప్తరాజ్యుడై యదాపూర్వముగ ప్రజాపాలన మొనర్చెను. ఇంద్రాది దేవతలు నారదాది మహర్షులు సుదక్షిణాది భక్త పుంగవులు పరమశివుని ప్రస్తుతించి జ్యోతిర్లింగరూపములో నిక్కడే యుండుమని ప్రార్ధించిరి. పరమేశ్వరుడు వారి ప్రార్ధన మన్నించేను.

    శ్లో|| ఇత్యేవం ప్రార్ధిత శ్శంభు ర్లోకానాం హితకారకః
    తత్రైవ స్థితవాన్ ప్రీత్యా స్వతంత్రో భక్తవత్సలః ||
    భీమాసుర విజయ చిహ్నముగ భీమశంకర జ్యోతిర్లంగ స్వరూపమును ధరించి భక్తవత్సలుడైన బాలచంద్రశేఖరుడు డాకినీ శిఖరాగ్రమునందు ప్రకాశించుచుండెను.

                                 వారాణస్యాం తు విశ్వేశమ్

    క్షేత్రమహిమ :

    సకల స్పౌభాగ్యరాశియైన కాశియందు విశ్వేశ్వరజ్యోతిర్లింగము విరాజమానమై యున్నది. కాశీ క్షేత్రమునాకు "వారణాసీ ,  వారాణసి , అవిముక్తము, ఆనందకాసనము , మహాశ్మశానము, రుద్రవాసము, కాశిక, తపస్తలి, ముక్తిభూమి, క్షేత్రపురి, శివపురి, త్రిపురారి రాజనగరి" యను నామములు ప్రసిద్ధములు. 'వరణ' 'అసి' అనునదీద్వయ మిరుపంకల బ్రవహించుటచే వారణాసి యను నామము కాశీ క్షేత్రమున కన్వర్దమగుచు న్నది.
    మోక్షదాయకములగు సప్తక్షేత్రములలో కాశి ఖ్యాతి గాంచినది. వేదపురాణములలో కాశీమహిమ వివిధ రీతుల నభివర్ణితమైనది. "అప ఇవ కశినా సమగృహీతాః" (ఋగ్వేదము) మఘవన్ కాశిరిత్తే (ఋగ్వేదము) యజ్ఞః కశీనాం భారతః సాత్వతామివ (శతపధ బ్రాహ్మణము) "సా కాశీ త్రిపురారి రాజనగరీ పాయాదపాయాజ్జగత్" (కాశీఖండము)
    ప్రళయకాలమున పరమేశ్వరుడు తన త్రిశూలగ్రమున నీ నగరము నుద్దరింఛి ధరించు నని యభిజ్జవచనము, కాశీక్షేత్రమున మరణించిన వారికీ ముక్తి కరతలామలకమని విశ్వనాధుడు దక్షిణకర్ణమున తారకమంత్రంతోపదేశమొనర్చునని పురాణ ప్రమాణము.
        
    శ్లో|| కదా కాశీం గమిష్యామి కదా ద్రక్ష్యామి శంకరమ్
    ఇతి బ్రువాణ స్సతతం కాశీ వాసఫలం లఖేట్||
    "ఎప్పుడు కాశికి వెళ్ళుడును! ఎప్పుడు విశ్వనాధుని సందర్శింతును !" అని యెల్లప్పుడు పలుకుతున్న మాత్రముననే కాశీ నివాస మహాఫలము మానవునకు సంప్రాప్తించును.
    
    తే||గీ|| కాశి కల్యాణముల కాది కారణంబు
    కాశి యణి మాదిసిద్దుల కాటపట్టు
    కాశి జనలోక సంకల్ప కల్పవల్లి,
    కలుష పిశితంబు మెసపు రాకాసి కాశి.
    అని కవి సార్వభౌములు కాశిని కొనియాడినారు. "కలి ప్రవేశింపదానందకాననమున" "శ్రీనివసంబు వారణాసి పురంబు". "ముక్తి సంధాయకం బవిముక్తకంబు" అని కాశీనగరము కవుల కైవారములందుకొన్నది. "వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసియైన పెద్ద ముత్తైదువ" అన్నపూర్ణాభవాని అకొన్నవారికి అమృతపాయసాన్నములు వారణాసీ నగరమున వడ్డించునట! కాశీ క్షేత్రమున నసంఖ్యాకములగు పుణ్యతీర్ధములున్నవి . వానిలో

    శ్లో|| విశ్వేశం మాధవం దుండిం దండపాణిం చ భైరవమ్
    వందే కాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికామ్ ||

    శ్రీ విశ్వనాధ జ్యోతిర్లింగము, బిందుమాధవుడు, కాలభైరవుడు, కుమారస్వామి, గంగ, అన్నపూర్ణభవాని, మణికర్ణిక విశేషసమదర్శనీయములు - సమారాధనీయములు.

    పురాణ కధ :

    సచ్చిదానందస్వరూపుఁడైన పరమశివుఁడు ప్రపంచమును సృష్టింప సంకల్పించెను. ఆ పరబ్రహ్మము సగుణరూపములో శివ స్వరూపుడై యావిర్భవించెను. స్త్రీ పురుష రూపములలో ప్రకటితమైన యాయాదిమ పరబ్రహ్మమే శక్తిగా శివుడుగా రూపొందేను. ఆ శివశక్తులు ప్రకృతి పురుషులను సృష్టించిరి. ఆ పకృతి పురుషులు తమ జననీజనకులను తెలిసికోనలేక విచారించుచుండిరి. ఆ సమయామున నిర్గుణపరబ్రహ్మ మగు పరమశివుడు "మీ రిరువురు తపస్సు చేయుడు. బ్రహ్మాండమును సృష్టింపుడు " అని పలికెను.
    ప్రకృతి పురుషులు "ప్రభూ! తపస్సు చేయుటకు స్థానమెక్కడ?' అని ప్రశ్నించిరి. పరమశివుడు పంచక్రోశ పరిమితమైన యొక సుందరనగరమును నిర్మించి వారికిచ్చెను. అమహానగరము ఆ పురుశును సమీపమున ఆకాశము నందు నిలిచెను. ఆ పురుషుడు శ్రీమహావిష్ణువు. ఆ నగరమే కాశీక్షేత్రము. విష్ణుదేవుడు ఆ నగరము నందుండి మహాసృష్టికి సంకల్పించి పరమశివుని గూర్చి పెక్కు సంవత్సరములు తపస్సు చేసెను. ఆ సమయమున తపశ్చర్యచే నలసిపోయిన శ్రీమహవిష్ణువు శరీరమునందుండి యసంఖ్యాకములగు శ్వేత జలధారలు ప్రవహించి సువిశాల గగనంగాణమున వ్యాపించెను. ఆ విచిత్రదృశ్యమును చూచి శ్రీ మహావిష్ణువు చకితుడై శిరశ్చాలనముచేసెను. అప్పుడా శ్రీహరి దక్షిణ కర్ణము నుండి మణి భూషణము జారిపడెను. ఆ కర్ణమణి పడిన స్థానము "మణికర్ణిక" యను మహాతీర్ధమయ్యేను. ఆ మహాజలరాశిలో మునిగిపోవుచున్న పంచక్రోశిని పరమశివుడు తన త్రిశూలగ్రమున ధరించెను. మహావిష్ణువు తన పట్నియగు ప్రకృతితో నచ్చోట నిద్రించెను. అయన నాభి నుండి చతుర్ముఖ బ్రహ్మ యావిర్భవించెను. చతుర్ముఖుడు శివాజ్ఞాను పొంది బ్రహ్మాండమును సృష్టించెను. మహావిష్ణువు పరమశివునీ క్రింది విధముగా స్తోత్రము చేసెను.

 Previous Page Next Page