Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 26

 

        శ్లో|| స్రష్టా త్వం సర్వజగతాం రక్షితా సర్వదేహినామ్
        హర్తా చ సర్వభూతానాం త్వాం వినైవాస్తి కో పరః ||
        అణూనామప్యణీయాం స్త్యం మహాంస్త్వం మహతా మపి
        అంతర్భహి స్త్వమెవైతజ్జగ దాక్రమ్య వర్తసే||
        నిగమా స్తవ నిశ్వాసా విశ్వం తే శిల్పవైభవమ్
        స్వర్గస్త్య మపవర్గస్త్వం  త్వమోంకార స్త్యంమధ్వరం||
        త్వం యోగ స్త్యం పరా సంవిత్ కిం త్వం న భవసీశ్వరా!
        త్వమాదిర్మధ్య మంతశ్చ తస్తుషాం జగ్ముషా మపి||
    
    ఓ పరమేశ్వరా! సమస్త జగత్తులకు నీవు సృష్టికర్తవు. సర్వప్రాణులకు నీవే సంరక్షకుడవు. సర్వభూతములు నీయందే లయించుచున్నవి. సర్వమును నీవే. నీకంటే మరెవ్వరు లేరు. "అణో రణీయాన్ మహతో మహీయాన్" అను శ్రుతికి నీవే యేకైక లక్ష్యమవు. లోపల వెలుపల నాక్రమించి సమస్త బ్రహ్మాండమున వర్తించుచున్నావు. వేదములు నీ యుచ్చాసనిశ్వాసములు . ఈ విశాల విశ్వ మంతయు నీ సుందర శిల్ప రచనము. నీవే యజ్నమూర్తివి. నీవే యాగము. నీవే సచ్చిదానందమయ పరబ్రహ్మము. నీవు కాని దేదియు సృష్టిలో లేనే లేదు. చరాచర మహా ప్రపంచమునకు 'అది మధ్యాంతములు" నీవే.
    శ్రీమన్నారాయణుని స్తుతి వాక్యములకు పరమశివుఁడు సంతుష్టుఁడయ్యేను. బ్రహ్మ విష్ణాది దేవతా ప్రార్దితుడైన పరమేశ్వరుడు విశ్వేశ్వరజ్యోతిర్లింగమై వారణాసి యందు విరాజిల్లెను.
    
                                    త్ర్యంబకం గౌతమీ తటే

    క్షేత్రమహిమ :

    జగత్ర్పసిద్దమైన త్ర్యంబకేశ్వరజ్యోతిర్లింగము నాసిక మండలమున సహ్యగిరి శిఖరాగ్రమున వెలసియున్నది. తత్పరిసరము నందే పంచవటి యున్నది. ఆ స్థానమునే లక్షణుడు శ్పూర్పణఖ నాసికాకర్ణములను గోసినాడట. సీతాపహరణ మిచ్చోటనే జరిగినది. ఇప్పటికీ కొలది దూరమున బ్రహ్మగిరిపై గోదావరి ప్రభవించినది.  
    ఉత్తర భారతములో గంగానది వలె దక్షిణ భారతములో గోదావరీ స్రవంతి 'పాపవియోచని' గా ప్రసిద్ది గాంచినది. భగీరధుని తపఃఫలముగా భాగీరధీ యవతరించినట్లే గౌతముని త్యాగఫలముగా గౌతమి యావిర్భవించింది. గౌతమ మహామునిచే గౌనిరాబడుటచే గోదావరికి గౌతమీ సామాఖ్య సంపన్నమైనది.
    గోదావరీ గౌతమమునీంద్రుల ప్రార్ధన మన్నించి భక్త వత్సలుఁడైన పరమ శివుడు త్ర్యంబకేశ్వర రూపములో నిచ్చట విచ్చేసియిన్నాడు. త్ర్యంబకేశ్వర దేవాలయములో మూడు చిన్న చిన్న లింగకృతులున్నవి. వీనిని బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకములుగ భక్తులు భావింతురు. త్ర్యంబకేశ్వర సందర్శనం పూజనముల వలన నైహికముష్మిక ఫలములు ప్రాప్తించునని ప్రాజ్ఞవచనము. బ్రహ్మగిరి పైనున్న 'రామకుండము' 'లక్ష్మణకుండము ' దర్శనీయములు. దురితపరిహారకములు. బ్రహ్మగిరిపైకి నేక్కుటకు సువిశాలములగు నేడువందల సోపానములున్నవి. పైకేక్కిన వెంటనే గోముఖ సముద్గత గోదావరి కన్నుల పండువుగ కనిపించును.

    పురాణకధ :

    గౌతముడు మహాతపస్వే ఆ మహర్షి ధర్మపత్ని యహల్యాదేవి . మహా సాద్వియైన యహల్యతో గౌతమ మహర్షి బ్రహ్మగిరి శిఖరాగ్రమున శంకరుని గూర్చి సహస్ర సంవత్సరములు కఠోరతపము గావించెను. ఆ మహామహేశ్వరుడు మహేశ్వరాను గ్రహమునకు బాత్రుడయ్యెను.
    ఒకానొక సమయమున ననావృష్టి కారణముగా దేశము నలుమూలల క్షామదేవత ప్రళయతాండవ మోనర్చేను. త్రాగుటకు నీరు, తినుటకు తిండి లేక ప్రజలలో హాహా కారములు చెలరీగెను. పశువులకు పచ్చగడ్డి కరవయ్యేను. చెట్టు చేమలు మలమల  మాడిపోయెను. నేల బీటలు వారెను. సెగలు పొగలు గ్రక్కెను. సకల సృష్టి సంక్షుబ్ద మయ్యెను. ప్రపంచము పాడుపడినట్లయ్యేను.
    దేశమునందలి దైన్యమును గౌతముడు సహింపలేకపోయెను. ఆ కరుణామయుడు వరుణ దేవుని గూర్చి యారుమాసము లఖండతపముగావించెను. వరుణ దేవుడు ప్రసన్నుడై "మహర్షీ! నీ తపః కారణము గ్రహించితిని. నీవొక చిన్న సరస్సును నిర్మింపుము. నేను దానిని సలిల సంపూర్ణము చేయుదును. అందలి జలము లక్షయములై యెన్నటికిని తరుఁగవు ' అని పలికి యంతర్హితుఁడయ్యెను.
    గౌతముడు సరస్సు నిర్మించెను. వరుణదేవుని యనుగ్రహాముచే నది యక్షయ జల పరిపూర్ణమయ్యెను. గౌతముడా సరోజలములతో నిత్య నైమిత్తిక కృత్యముల నిర్వర్తించు కొను చుండెను. జపహోమతపః పూజా దికములు యధా పూర్వకముగా సాగించుచుండెను. సరోవర జలములచే పరిసరము లందలి తరులతాదులు చివురించెను. భూమి సస్యశ్యామల మయ్యెను. పశుపక్ష్యాదులకు బ్రదుకు లభించెను. ఆ సరస్సు చుట్టూ ప్రక్కల నొక చక్కని తపోవనము తయారయ్యెను.
    ఆ వనములో మరల నవజీవనము ప్రారంభమయ్యేను. గౌతమమహర్షి తపః ప్రభావము వలన నాయశ్రమమున నెల్లయెడల నవోల్లాసము వెల్లివిరిసేను.
    ఎక్కడెక్కడి ఋషులు నక్కడికే వచ్చిచేరిరి. మునిజన మంతయు గౌతమాశ్రమము చుట్టూ కాపురము పెట్టిరి. పర్ణశాలలు నిర్మించుకొనిరి. నిర్విచారముగా నిత్యకృత్యాములు జపతపములు నిర్వర్తించుకొనుచుండిరి. ఇట్లుండగా నొకనాడు ఋషిపత్నులు గౌతమ పత్నియగు సహల్యాదేవితో నకారణముగా వివాదమునకు దిగిరి. కలహాశీలలగు మునియిల్లాండ్రు లేనిపోని సాకులు కల్పించి యామె ననేకవిధముల నాడి పోసికొనిరి. గౌతమునిపై తమ భర్తల పురికోల్పిరి. విశ్వాస శూన్యులైన యా ఋషులు కరవు కాటకములచే మలమల మాడు తమకు నాశ్రయ మిచ్చి యాదు కొనిన గౌతమ మహర్షి పై కయ్యమునకు కాలు ద్రవ్విరి. ఆలోచనా రహితులై హాని తలపెట్టిరి. ప్రసన్న హృదయుడు పరమశాంత స్వభావుడగు గౌతముని మహర్షి ఋషుల రోష పూర్ణ భాషణములను దూషణములను సహించేను. గౌతముని సహనము ఋషులకు మరింత కోపహేతువయ్యేను.
    దుష్టులైన ఋషులు గౌతము నవమానింపకృతనిశ్చయులయిరి. కుట్రలు సాగించిరి. ఒక ముసలి గోవును గౌతముని పంటపొలములోనికి తోలిరి. ఆవు పంటపొలము పాడు చేయుట చూచి గౌతముడొక గడ్డి పరకతో దానిని తోలెను. ఆ శుష్కతృణము గోవును స్పృశించెనో లేదో అది గిరగిర తిరిగి ధరణిపై నోరిగి మరణించినది. ఇదంతయు రుషులందరూఋషుల పన్నాగమని గౌతముఁడేరుగ లేడయ్యేను.
    సమయము చిక్కినది. ఋషులందఱు పరుగుపరుగున వచ్చిరి. గోహత్య గావించితివని గౌతమమహర్షిని నానావిధముల నిందించిరి. దుర్మార్గుడవని దూషించిరి. దురహంకారివని పరుషవాక్కులు భాషించిరి. వెనువెంటనే ఈ వనము విడిచిపోవలసిందని శాసించిరి. ధర్మమూర్తియైన గౌతముడు చేయునది లేక సతీ ద్వితీయుడై యాశ్రమము విడిచి యల్లంతదూరమున నొక కుటీరమును నిర్మించుకొనెను. దురహంకారులైన మునులు గౌతముని పర్ణకుటీరము కడ కరిగి "నీ శిరమున గోహత్యాపాతకము తాండవించుచున్నది. నీ ముఖము చూచిన పంచమహాపాపములు ప్రాప్తించును. నీ దర్శనము సర్వానర్ద హేతువు. నీ సామీప్యముచే మే మర్పించు హవ్యకవ్యములు దేవతలు , పితృదేవతలు గ్రహించుట లేదు. ఇతనిక్కడ నుండుటకు నీ కర్హత లేదు. నీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసికొను " మని గద్దించిరి. గౌతముడు "మిత్రులారా! నా పాపమునకు ప్రాయశ్చిత్తము కూడ మీరే సెలవిం" దని పలికెను. ఋషులు గౌతముని చూచి "నీవు మూడు పర్యాయములు భూప్రదిక్షిణము చేసి రావలెను. ఒక నెల నిరాహారుఁడై తపోదీక్ష సాగింపవలెను. ఈ బ్రహ్మగిరి చుట్టు నూటోక్క పర్యాయములు తిరిగిరావలెను. ఇక్కడకు గంగకు కొనిరావలెను. తజ్జలములలో మజ్జన మొనర్చి కోటి శివలింగములను పూజించవలెను. తరువాత వందబిందెల జలములతో నిందు శేఖరునభిశేకింపవలెను. అప్పటికి గాని నీ గోహత్యామహాపాతకము తొలగిపోదు" అని కఠోరముగ వాక్రుచ్చిరి.
    గౌతముఁడు ఋషుల యాదేశమును శిరసావహించెను. వారు చెప్పిన కార్యములన్నియి కొనసాగించెను. పత్నీ సహితుఁడై బ్రహ్మగిరిపై చేరి పార్ధివ లింగాకారములో నున్న పరమశివుని భక్తీ పూర్వకముగా పూజించెను. పరమేశ్వరుడు గౌతముని ధర్మాసక్తిని, దైవభక్తికి, సహనశక్తికి సంతోషించెను. ప్రధమ గణ పరివృతుఁడై పార్వతీ పతి ప్రత్యక్షమయ్యెను. గౌతముడు గంగాధరునకు కరములు మోడ్చి నమస్కరించెను. మహాదేవుడు మహర్షితో "నీ భక్తికి మెచ్చితిని. నీ వాంచిత మీడేర్పవచ్చితిని. వరము కోరుకొనుము" అని పలికెను. గౌతముడు పరమానందభరితుడై "ప్రభూ! నీ సందర్శనమునే నా జన్మము చరితార్ధమైనది. నన్ను గ్రహించితివఅని  ఇంక నాకేమి కావలెను."  అని పరమ శివుని పాదములు పట్టుకొని ప్రార్ధించెను. శివుడు "నాయనా! నీవు ధన్యుడవు మునిజన మూర్ధన్యుడవు. సకల లోకమన్యుడవు. రురహంకారులైన నీతోడి ఋషులు నీ యాభ్యుదయము సహింపలేక విన్ననేకవిధముల హింసించిరి. వారి యజ్ఞానమును క్షమింపు" మని పలికెను. గౌతముడు ప్రాంజలియై "స్వామీ! వారు నాకు మహోపకారమే చేసిరి. అట్లు కానిచో జగత్కల్యాణకరమైన స్వామి సందర్శనము నాకు కాదు గదా?" అనెను.

 Previous Page Next Page