Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 20


    తప్పదు. అమ్మనే అడగాలి.


    ఆమె బాధపడుతుంది.


    ఆమెను బాధపెట్టక తప్పదు! తప్పదు.


    మళ్ళీ శరత్ ఊహలు ఆ బిచ్చగత్తె వైపుకి వెళ్ళాయి.  


    ఆటో శబ్దం విని సుశీలమ్మ ఆత్రంగా గుమ్మంలోకి వచ్చింది.


    "వచ్చావా బాబూ?"


    ఏదో జరగబోతున్న ప్రమాదం నుంచి బయటపడినప్పుడు కలిగిన సంతోషం ఆమె కంఠంలో ధ్వనించింది.


    శరత్ తల్లి ముఖంలోకి చూశాడు.


    ఆమె ముఖంలో పుట్టెడు దిగులు కన్పించింది.


    కళ్ళు చూశాడు, అవి కురవడానికి సిద్ధంగా వున్న శ్రావణ మాసపు మేఘాల్లా వున్నాయి.


    శరత్ మనసు ఎలాగో అయింది.


    త్వరగా బట్టలు మార్చుకొనిరా! చాలా ఆలస్యం అయింది అన్నది సుశీలమ్మ.


    "నేను భోజనం చెయ్యను. ఆకలిగా లేదు."


    "ఏం తిన్నావురా? మీ నాన్నగారు కూడా నీకోసం కూర్చున్నారు. ఆయన కూడా యింకా భోజనం చెయ్యలేదు. తోచినమాత్రం తిందువు త్వరగా రా!"


    శరత్ ఆశ్చర్యంగా తల్లికేసి చూశాడు.


    అప్పటికే ఆమె వెనక్కి తిరిగింది.


    నాన్న ఇంకా భోజనం చెయ్యలేదా? తనకోసం ఎదురు చూస్తున్నాడా? నాన్న ఎప్పుడైనా తనకోసం భోజనం చెయ్యకుండా ఎదురు చూశాడా?  


    ఎందుకీ ప్రత్యేకత?


    ఏదో భయం పట్టుకుంది నాన్నకు.


    శరత్ బట్టలు మార్చుకొని, కాళ్ళూ చేతులూ కడుక్కొని తుడుచుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు.


    అప్పటికే రామనాధం కూర్చొని వున్నాడు.


    సుశీలమ్మ వడ్డిస్తూ వుంది.


    ఆ వాతావరణం సహజంగా లేదు.


    ఎవరికి వాళ్ళే. పరిచయంలేని వ్యక్తులదగ్గిర కూర్చున్నట్టు. సంభాషణ ఎలా ప్రారంభించాలో తోచనట్టు కూర్చున్నారు.    


    ఎవరికీ భోజనం సహించడం లేదు.


    శరత్ అంత మౌనాన్ని భరించలేకపోయాడు.


    తల్లిదండ్రుల మనసుల్ని తేలికపర్చే ఉద్దేశంతో "అమ్మా, తమ్ముడు అన్నం తిన్నాడా!" అడిగాడు.     


    సుశీలమ్మ కళ్ళు వెడల్పు చేసి చూసింది.


    "వాడు ఎక్స్ కర్షన్ కు ఉదయమే వెళ్లాడుగా! నీకు తెలియదా?" రామనాథం అన్నాడు.


    "ఆఁ అవును! మర్చిపోయాను. మళ్ళీ ఎప్పుడు వస్తున్నాడు?"


    "పదిరోజులు పడుతుందట."


    మళ్ళీ వారి మధ్య మౌనం రాజ్యం చెయ్యసాగింది.


    "బాబూ! రేపు ఒకసారి నన్నూ, మీ నాన్నగారినీ వాళ్ళింటికి తీసుకెళ్ళు" అన్నది సుశీలమ్మ ఆప్యాయంగా.


    శరత్ చివ్వున తలెత్తి తల్లిని చూశాడు.


    సుశీలమ్మ కొడుకు ముఖంలో ఏం చూసిందో చటుక్కున ముఖం తిప్పుకుంది.


    "ఆ అమ్మాయిని ఒకసారి చూస్తాను. మీ నాన్నగారు ఆ పిల్ల తండ్రితో మాట్లాడతారు" అన్నది పక్కకు చూస్తూ.


    మౌనంగా అన్నం కలుపుకొంటూ కూర్చున్నాడు శరత్.


    సుశీలమ్మ వ్యాకులపాటుతో కొడుకు ముఖంలోకి చూసింది.


    రామనాథం అదేమీ విననట్టే భోజనం చేస్తున్నాడు. ఆయన ముఖం చాలా గంభీరంగా వుంది.


    "ఎరా శరత్! మాట్లాడవేం?"


    శరత్ తలెత్తి తల్లి ముఖంలోకి చూస్తూ "చూడొచ్చులే! అంత తొందరెందుకు?" అన్నాడు నిర్వికారంగా.   


    "అదేమిట్రా అలా అంటావ్! ఆలస్యం ఎందుకు? ఈ నెల దాటితే మూఢం వస్తుంది" అన్నది సుశీలమ్మ.


    "మూఢం పోయాకే చూడొచ్చులే. పెళ్ళికేం తొందరలేదు."


    అని, చెయ్యి కడుక్కుని లేచాడు శరత్.


    సుశీలమ్మ భర్త ముఖంలోకి చూసింది.


    రామనాథం గదిలోకి వెళ్తున్న శరత్ ను చూస్తూ తల తిప్పాడు. భార్య కళ్ళతో తన కళ్ళు కలవగానే దోషిలా తల దించుకున్నాడు.


    శరత్ లైట్ తీసేసి పడుకున్నాడు.


    సాధారణంగా కొంతసేపు ఏదో పుస్తకం చదవకుండా పడుకునే అలవాటు లేదు. ఎప్పుడైనా బద్ధకించి అలా పడుకుంటే త్వరగా నిద్రపట్టదు.   


    శరీరం విశ్రాంతి కోరుతుంది.


    కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించసాగాడు.


    మనసు దిగులు దిగులుగా వుంది.


    మస్తిష్కంలో ఆలోచనలు బలిసిన గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి.

 Previous Page Next Page