"సరే వెళదాం? చాలా పొద్దుపోయింది." రాజేశ్వరి చివ్వున లేచి నిల్చుంది.
"కోపం వచ్చిందా రాజూ!" అంతకంటే ఏమనాలో తోచనివాడిలా అన్నాడు.
ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు.
ఎవరికీ మాట్లాడాలని లేదు.
ఇద్దరికీ దిగులుగా వుంది.
రాజేశ్వరి ఇంటిముందుకు వచ్చి ఆగారు.
ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు.
ఆమె కళ్ళలో నీరు తిరిగింది.
ఎర్రబడుతున్న కళ్ళను ఓ క్షణంమూసి తెరిచాడు శరత్.
"మళ్ళీ ఎప్పుడు కన్పిస్తావ్?"
"చెప్పలేను."
"శరత్." దాదాపు ఏడుస్తున్నట్టే అన్నది.
"అవును రాజూ! నా కోసం ఎదురు చూడకు మంచి సంబంధం చూసి-"
"శరత్! ఎంత తేలిగ్గా అనేశావు?" ఆ తర్వాత మాటలు పెగల్లేదు.
"గుడ్ బై!"
అంటూ పరుగులాంటి నడకతో లోపలికి చరచరా వెళ్ళిపోయింది. రాజేశ్వరి.
అలా వెల్తున్న ఆమెను చూస్తూ నిట్టూర్చాడు శరత్.
7
శరత్ రాజేశ్వరి ఇంటినుంచి చిన్నగా కదిలాడు. శరత్ కు తిరిగి వెళ్ళి రాజేశ్వరిని ఓదార్చాలని వుంది. ఆమెను గుండెలకు హత్తుకొని కళ్ళు తుడవాలని వుంది. మనసును అదుపులో పెట్టుకొనే ప్రయత్నంలో నడక వేగం పెంచాడు.
రాజేశ్వరి అన్నమాటలు గుర్తొచ్చాయి.
తన తల్లి బ్రోతల్ హౌస్ లో వుందా?
లేక బస్ స్టాపులో బిచ్చం ఎత్తుకుంటూ వుందా?
చటుక్కున, సాయంత్రం బస్ స్టాండ్ లో తనను ఓ పది పైసలు ఇవ్వమని ప్రాధేయపడిన స్త్రీ గుర్తొచ్చింది.
"బాబూ! రెండు రోజుల నుంచి తిండిలేదు. ఒక్క పది పైసలు ఇవ్వు బాబూ?" స్త్రీ కంఠం.
తను చిరాగ్గా వెనక్కు తప్పుకున్నాడు.
ఆమె మళ్ళీ ముందుకొచ్చింది.
"బాబూ! బాగా బతికిన దాన్ని. ఈ రోజు ఈగతి పట్టింది ఒక్క పదిపైసలు-"
తన మనసు అసలే చిరాకుగా వుంది.
"ఏయ్! పో అవతలకు." చీదరించుకున్నాడు.
ఆ స్త్రీ గొణుక్కుంటూ వెళ్ళిపోయింది.
మరొకర్ని పీడించడం చూశాడు.
శరత్ కు ఆ స్త్రీ కంఠం విన్పిస్తున్నట్టు అనిపించింది.
ఆమె కంఠం ఎంత దీనంగా వుంది.
బాగా బతికిందా!
ఈ రోజు ఈ గతి పట్టిందా?
అంటే?
ఏదో చిన్న పొరపాటు చేసి ఇంత శిక్షను అనుభవిస్తోందా?
తన తల్లి కూడా....
ఆమె తన తల్లేమో?
శరత్ వెన్నెముకలో ఏదో జరజర పాకినట్టయింది.
ఆమె తన తల్లేనేమో? ఎందుకు కాకూడదు!
పక్కగా వెళుతున్న ఆటో ఆపాడు.
ఆటో బస్ స్టాండ్ వైపుకు పోతోంది.
అతని మనసు అంతకంటే వేగంగా పరుగులు తీస్తూంది.
ఆమె రూపాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించసాగాడు. చింపిరి జుట్టూ, చిరిగి మురిగ్గా, పీలికలు వేలాడుతున్న బట్టలు - అంతకంటే ఏమీ గుర్తురావడం లేదు.
తను ఆమెను చీదరించుకున్నాడు.
సాధారణంగా తను బిచ్చగాళ్ళను చీదరించుకోడు. చిల్లర డబ్బులుంటే లేదనకుండా ఇస్తూ వుంటాడు. అతని స్నేహితులు "దానకర్ణుడు" అంటూ ఎగతాళి చేస్తూ వుంటారు.
అటువంటి తను ఆమెను చీదరించుకున్నాడు. ఆమె తన తల్లే అయితే....!
ఆటో బస్ స్టాండ్ దగ్గిర ఆగింది.
శరత్ కళ్ళు ఆత్రంగా బిచ్చగాళ్ళకోసం వెతికాయి. ఒక ముసలివాడూ, ఇద్దరు పిల్లలూ, పిల్లవాడిని ఎత్తుకొని ఒక స్త్రీ అడుక్కుంటూ కన్పించారు. వాళ్ళు శరత్ దగ్గరకు వచ్చారు. చిల్లర తీసి అందరికీ ఇచ్చాడు.
"బాబూ! పదిపైసలు! బాగా బతికినదాన్ని." అంటూ ఎవరూ రాలేదు.
ఆత్రంగా బస్ స్టాండు అంతా చూశాడు.
పక్కగా పోతున్న ఆటోను పిల్చి ఎక్కాడు. దరిదాపుల్లో వున్న బస్ స్టాపులు వెదికాడు. ఆమె కన్పించలేదు.
"ఛ! ఏమిటి తను మరీ ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నాడు? ఆమె తన తల్లి కావాలని ఎక్కడుంది? అలాంటివాళ్ళు ఎంతమంది ఉండరు?
తన ప్రయత్నానికి ఒక కొస అంటూ దొరికితే దాన్ని పట్టుకొని ముందుకు పోగలడు.
ఆ కొసే దొరకడం లేదు.