నేనెవర్ని?" అనే ప్రశ్న మృగం వెంటబడిన వేటగాడిలా వుండి వుండీ అతన్ని తరుముతూ వుంది.
మళ్ళీ బిచ్చగత్తె గుర్తువచ్చింది.
ఆమె తన తల్లి కాదు.
కాకూడదు.
ఏం? ఎందుకు కాకూడదు?
ఒకసారి కాలు జారిన స్త్రీ గతి ఇంతే!
"ఓ క్షణం శరత్ మనసులో స్త్రీ పట్ల ద్వేషభావం తలెత్తింది. నన్ను కన్న తల్లి తప్పు చేసింది. ఫలితం అనుభవించక తప్పదు.
కాని.... తన తండ్రి.... అదే - తన తల్లిని మోసం చేసిన ఆ మగవాడు.... చేసిన తప్పుకు ఫలితం అనుభవిస్తున్నాడా?
ఎందుకు అనుభవిస్తాడు? ఇది పురుషుడి ప్రపంచం.
ఈ సమాజం యుగయుగాలుగా స్త్రీని అణచివేస్తూంది. దీనికి కారణం సహజంగా చెప్పబడే శారీరక బలహీనత కానేకాదు. సంఘం, పెద్దలు, తల్లిదండ్రులు - వీళ్ళందరూ కలిసి నూరిపోసిన భావాలూ, మూఢనమ్మకాల ప్రభావమే!
ఆనాటి కుంతీదేవి నుంచి - ఈనాడు ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరం వరకూ.... స్త్రీ సాంఘిక జీవితంలో ఎంతపెద్ద మార్పు వచ్చింది? ఈ సంవత్సరంలో క్షణిక ఆవేశంలోనో, మోసంవల్లనో ఒక కన్య తల్లి అయితే క్షమిస్తుందా సమాజం?
ప్రతి యుగంలోనూ సామాన్యబుద్ధికి అందని న్యాయాలూ, ధర్మాలూ కొన్ని ప్రచారంలో వుంటున్నాయి.
భర్త వసువు మీద, పర పురుషులకు పిల్లల్ని కనే ఆ రోజుల్లో కూడా, కుంతీదేవి కన్యగా బిడ్డను కనడం అపరాధంగానే భావించబడింది. ఆ బిడ్డను లోక భీతికి నదిలో వదిలేసింది.
అది న్యాయం, ధర్మం.
ఆ బిడ్డను పెంచడం అన్యాయం, సంఘం క్షమించదు.
తండ్రి ఆనతితో దుర్వాస మహర్షికి ఎన్నో రోజులు సపర్యలు చేసింది.
ఆమె వద్దన్నా, భయపడినా, వినిపించుకోకుండా మంత్రం ఉపదేశించాడట.
ఏమిటా మంత్రం!
ఆ మంత్ర ప్రభావంతో సూర్యుడు దిగి వచ్చాడట, సద్యోగం వల్ల ఆమె బిడ్డను కన్నదట!
ఈ వైజ్ఞానిక యుగంలో ఇది ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది?
అంతా కట్టుకథ, అబద్ధం!
నిజం ఇది.
ఆ ముని ముచ్చు ఉపదేశించిన మంత్రం ఏమిటి? ఈనాటికి సన్యాసులు చూడటం లేదా?
వయసులో వున్న ఆ పిల్ల మగవాడికి సేవలు చేసింది. ఫలితం అమాయకురాలైన బాలికను మంత్రం పేరుతో వద్దని బ్రతిమాలుతున్నా వినిపించుకోకుండా....
ఆమెకు గర్భం వచ్చింది. పదినెలలు మోసి కన్నబిడ్డను నీటిలో విడిచింది!
ఆ తల్లి హృదయం ఎంతరంపపుకోతను అనుభవించిందో వయసులో వున్న ఆడపిల్లను పరాయి మగవాడికి సేవలు చెయ్యమని అనడం ధర్మం! న్యాయం!
ఆ మగవాడు ఆమెకు బలవంతంగా మంత్రం ఉపదేశించడం కూడా ధర్మమూ, న్యాయమే!
ఆమె కన్యగా బిడ్డను కనడం మాత్రమే అధర్మం. అన్యాయం, అవినీతి.
అలాగే తన తల్లి కూడా ....
శరత్ కు మాక్విం గోర్కీ రాసిన కథ ఒకటి జ్ఞాపకం వచ్చింది. అడ్డం వచ్చిన ప్రతి వాళ్ళనూ హతమార్చి. రాజ్యాలను జయించిన ఒక కసాయివాడు (రాజు). ఒక సాధారణ స్త్రీ ముందు తల్లి ముందు తల్లి ప్రేమ ముందు తలవంచాడు.
ఈ సృష్టికి మూలం తల్లి.
తన తల్లిని మోసం చేసిన మగవాడు కూడా ఒక తల్లి ఒడిలో పెరిగిన వాడే!
కుంతీదేవిని మోసంచేసిన మగవాడికి జన్మనిచ్చింది కూడా ఒక ఆమే!
జంతువులు కూడా తను బిడ్డల్ని ప్రేమిస్తాయి.
ఆవులాంటి సాధుజంతువు కూడా ఈనినప్పుడు కొమ్ములు విసురుతుంది తన బిడ్డ రక్షణ కోసం.
స్త్రీ, మనసున్న మనిషి, తను కన్నబిడ్డ పుట్టగానే ఎందుకు గొంతు నుళుముతుంది.
ఏ మురికి కాలవ ప్రక్కనో ఎందుకు పారేస్తుంది?
కళాకారులూ, యోధులూ, ప్రవక్తలూ మహాత్ములూ అందరూ అమ్మ ఒడిలో పెరిగినవారే!
అయినా స్త్రీ పరిస్థితి సంఘంలో ఇంత హీనంగా ఎందుకు మారింది?
"సీతా కీ మా" (సీత తల్లి) అనే పేరుతో ఒక రచయిత హిందీలో రాశాడు. అతను యిలా రాశాడు.
"సీత కూడా అక్రమ సంతానమే."
ఆ తల్లి ఆ బిడ్డను పెంచలేదు, అయినా బిడ్డ సుఖంగా బతకాలని తల్లి ఆకాంక్ష. జనకమహారాజు పొలంలో ఓ చెట్టుకిందగా ఆ బిడ్డను పెంచుతుంది. దూరంగా నిలుచుని చూస్తూ వుంటుంది. ఆమె గుండెలు కొట్టుకుంటూ వుంటాయి. కళ్ళ వెంట నీరుకారిపోతూ వుంటుంది.