Previous Page Next Page 
ఏవమ్ ఇంద్రజిత్ పేజి 20


    రచ : చెప్పు యింద్రజిత్ !
    (ఇంద్ర అప్పటికే మాట్లాడడు. ఆ వెనకవున్న మైదానములోకి, అదే చెట్టుక్రిందకు వెళ్ళిపోతాడు. నిజామాబాద్ లో  వుండే  మానసి వస్తుంది.)
    మానసి : మాట్లాడు !
    ఇంద్ర : ఏం మాట్లాడను.
    మాన : యింతకు ముందు చెబుతున్న విషయమే !
    ఇంద్ర : యింతకు ముందు ఏం చెబుతున్నాను?
    మాన :అదే నీ సంసారాన్ని గురించి !
    ఇంద్ర : ఆఁ అవునుగదూ ! నా భార్య యింటిపనులు చూస్తూంది. నేను ఉద్యోగం చేస్తున్నాను. నా భార్య సినిమాకు  వెళుతుంది ! నేను  ఆమె వెనకే వెళతాను. నా భార్య పుట్టింటికి వెళుతుంది. నేను హొటల్లో భోజనం చేస్తాను. ఆమె తిరిగి వస్తుంది. నేను బజారుకు వెచ్చాలు కొనడానికి వెళతాను.
    మాన : ఇందతా ఎందుకు చెబుతున్నావు ?
    ఇంద్ర : నా సంసారాన్ని గురించి చెప్పమని నువ్వే అడిగావుగా?
    మాన : ఇలాంటి విషయాలనా నేను చెప్పమన్నది?
    ఇంద్ర : మరి ఎలాంటి విషయాలు ?
    మాన : నీ గురించి చెప్పు !
    ఇంద్ర : నా గురించా ? నేను ఒక్క రైల్వేట్రాక్ ను పట్టుకొని నడుస్తున్నాను. తిన్నగా రైల్వేలైను వెంట వెనక్కి తిరిగిచూస్తూ దూరంగా ఒక చోట ఆ రెండు పట్టాలూ కలిసినట్టు కన్పిస్తాయి. ఎదురుగా చూస్తాను, దూరంగా ఒక బిందువు దగ్గర పట్టాలు కలిసినట్టే కన్పిస్తాయి. నేను  ఎంత ముందుకు నడుస్తానో ఆ బిందువు కూడా  అంత ముందుకు జరుగుతూ కన్పిస్తుంది. వెనక కన్పించేదే ముందూ కన్పిస్తుంది. గతానికీ, భవిష్యత్తుకూ భేదం కన్పించదు. గతంలో కన్పించిందే, భవిష్యత్తులో వుంది.
    మా : ఆ తర్వాత ?
    ఇం : ముందునుంచిగానీ వెనకనుంచికానీ రైలు, ఏదైనా ఒక బండి వస్తుంది అనుకుంటూ వుంటాను.
    మా : బండివస్తే ఏం చేస్తావు ?
    ఇం : పట్టాలమీదనుంచి దూకి పక్కకు వెళతాను. లేకపరుగెత్తుతాను. అదీ యిదీ కాకపోతే బండికిందపడినలిగిపోతాను. ఏదో ఒకటి జరుగుతుందిగా? కాని అలా జరగదు. ఎందుకంటే ఆ లైనుమీదకు బండి  రాదని నాకు తెలుసు. అందుకే అనుకుంటూవుంటాను.
    మా : ఏమనుకుంటూవుంటావు ?
    ఇం : అనుకొంటూవుంటాను - ఇక నడవడం మానేద్దామని. నడవడంవల్ల ప్రయోజనం కనిపించదు. అంతగా అయితే ఆ లైనుమీద పడుకుంటాను.
    మా : (కొంచెంఆగి) అలా జరగటానికి వీల్లేదు ఇంద్ర్ !
    ఇం : ఏం ?
    మా : ఎదురుగా మార్గం  కనిపిస్తున్నప్పుడు ముందుకు నడిచితీరాలి.
    ఇం : చాలాదూరం నడిచాను.
    మా : ఇంకా చాలాదూరం నడవాలి ఇంద్ర్ !
    ఇం : నేను  అలిసిపోయాను.
    మా : అయినా నడవాలి.
    ఇం : ఎందుకు? ఎందుకు ? ఎందుకు ? ఒకటేమార్గం - ఆ మార్గంలో నడుస్తున్నాను. నడుస్తూనే వున్నాను. అయినా నిష్కృతి
    అర్ధ హృదయం, క్షుధిత మధ్యాహ్నం
    ఖండితదినం
    నిర్జన నిద్రాహీనరాత్రి
    నేను  ఉన్నాను.
    ఇంకా మిగిలి ఉన్నాను -చైతన్యం వుంది.
    అన్నీ ఉన్నాయి జ్ఞాపకం
    ఇంకా జీవితం ఎంతోవుంది.
    కాంతి దూరమై శాంతి లభిస్తుందని
    ఆశపడుతూ ముందుకు నడుస్తున్నాను
    లేస్తూ పడుతూ అలిసిన రెక్కల
    మీద భారం వేస్తూ
    (క్షణక్షణానికీ కణకణం వ్యాపిస్తూ గతసౌభాగ్యానికి చూర్ణంచేస్తూ)
    నిరంతరం కాలాచక్రం తిరుగుతోంది.
    అబద్దాల బెలూన్ వున్నాను.
    గాలి ఊదుతూనే వున్నాను.
    అయినా నిష్కృతిలేదు.
    (నీకు తెలియందేమీ లేదు
    అన్నీ  తెలుసు నీకు
    నీతో పాటు మధురఝుంకారాన్ని తెస్తావు.
    ప్రకాశాన్నీ , మత్తునూ తెస్తావు
    శుభ్ర వస్త్రాల మాటున
    గప్పివున్న మురికి నీకు తెలుసు.)
    సమక్షంలోవుంది
    జీర్ణ వురాతన దారంలో గుచ్చిన
    పూలహారం-
    వాడటానికి సిద్దంగావున్న  పూలు
    నీకు  తెలుసు
    నా జీవితానికి అవసానం లేదనీ.
    నేనే ఒక మృత పదార్ధాన్ననీ
    అయినా అంటావు
    నడవమని...ముందుకు నడవమని
    నాకు యింకా నిష్కృతిలేదా ?
    ఇం : ఎందుకు నడవాలి?
    మా : ఎదురుగా మార్గంవుంది కనుక !
    ఇం : ఎందుకు నడవాలి? మార్గంచివర ఏముంది? దేనికోసం నడవాలి?
    మా : అందరూ ఎందుకు, దేనికోసం నడుస్తున్నారు?
    ఇం : అందరా ?
    (ఎదురుగా అమల్ వస్తాడు. రచయితను కలుసుకుంటాడు.)
    రచ : అమల్ ! ఎక్కడికీ  ప్రయాణం ?
    అమల్ : పరీక్ష వ్రాయడానికి వెళుతున్నాను.
    రచ : పరీక్షా ? ఈ  వరస్సులోనా?
    అమల్ : ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లెటర్ మన్ షిప్ పరీక్ష. పోయిన సంవత్సరంకూడా రాశాను. కాని పాసుకాలేదు. మరోసారి ప్రయత్నించి చూద్దామని కరస్పాండెన్స్ కోర్స్ తీసుకున్నాను.
    రచ : ఈ పరీక్ష ప్యాసయినందువల్ల లాభమేమిటి ?
    అమల్ : లాభంవుంది. ఈ పరీక్ష ప్యాసయితే ప్రమోషన్ వస్తుంది. (మేనేజరు అయే అవకాశంకూడా ఉంటుంది.) వస్తాను. ఆలస్యం అవుతుంది.
    (అమల్  వెళ్ళిపోతాడు. విమల్ వస్తాడు.)
    రచ : అరే ! విమల్ ! ఎక్కడకు ?
    విమల్ : సిమెంటు పర్మిట్ కోసం వెళుతున్నాను. (కాస్త తగాదా పడ్తేగాని పైలు కదల్దు.)
    రచ : సిమెంటు ఎందుకు?    

 Previous Page Next Page