Previous Page
ఏవమ్ ఇంద్రజిత్ పేజి 21

    విమల్ : ఇల్లు కట్టిస్తున్నాను. (సి . ఐ . టి. స్కీంలో స్ధలం కొన్నాను. దాని ఖరీదు ఆరున్నరవేలు. వేలం పాటలో తొమ్మిది వేలదాకా ఎక్కింది. స్ధలాల  వెలలగురించి అడక్కూడదు. ఇల్లు కట్టడానికి డబ్బు ఎక్కడనుంచి వస్తుంది చెప్పు?) గవర్నమెంట్ లోన్, ఇన్ ష్యూరెన్స్ లోన్, అన్ని లోన్సూ తీసుకున్నా రెండు అంతస్దులకంటే ఎక్కువ కట్టలేకపోతున్నాను.
    రచ : అసలు యిల్లు కట్టడం ఎందుకు తలపెట్టావ్ ?
    విమల్ : మరేం చెయ్యమంటావ్ ? (ఈ రోజుల్లో డబ్బుకు విలువ లేకుండా పోయింది.) ఇల్లుంటే పెద్దతనంలో తల దాచుకోటానికి ఇంత నీడైనా దొరుకుందని.
    (పిల్లల విషయంకూడా  ఆలోచించాలిగా?) వెళ్ళనా?
    ఆలస్యం అవుతుంది.
    [విమల్ వెళ్ళిపోతాడు. కమల్ ప్రవేశిస్తాడు]
    రచ : కమల్ ! ఎక్కడికి బయల్దేరావ్ ?
    కమల్ : చంద్రం ఆఫీసుదాకా. ఎవరో పైనాన్స్ చేసేవాడు వున్నాడని  చంద్రం చెప్పాడు. మాట్లాడదామని.
    ఇం : ఏం మాట్లాడతావ్ ?
    కమల్ : మంచి బిజినెస్ స్కీం ఒకటి వుంది. చాలా మంచి స్కీం. (ఇంపోర్టు లైసెన్సు దొరికేలా వుంది. అసెంబ్లింగ్ పెద్దకష్టం కాదు. చాలా మంచి మార్కెట్ వుంది.) వస్తువులు బజారు చూడనక్కరలేదు. అడ్వాన్సు బుకింగ్ దొరుకుతుంది. కేవలం పెట్టుబడి కావాలి.(నేనూ , చంద్రం కొంత అప్పు తీసుకున్నాం అది చాలదు.) ఫిఫ్టిన్ పర్సెంట్ మీద కూడా అప్పు పుట్టడం లేదు.
    రచ : డబ్బు లేకుండా వ్యాపారం ఎందుకు తలపెట్టావ్ ?
    కమల్ : మరి ఏం తినమంటావ్! భగవంతుడి దయవల్ల ఆరుగురు పిల్లలు పుట్టారు.
    (మా అమ్మాయి టైఫాయిడ్ లో వెయ్యి రూపాయిలు ఖర్చు పెట్టాను. మూడోవాడికి స్కూల్లో ప్రమోషన్  లేదు. ఒక సంవత్సరం ఫీజు దండగ అయింది. ఈ విధంగా ఎంతవరకు నడుస్తుంది.)
    ఆలస్యం అవుతుంది వెళ్తాను.
    [కమల్, రచయిత యిద్దరూ వెళతారు.]
    ఇం : అంతా యింతే ! అమల్, విమల్ , కమల్ .
    మా : వాళ్ళు నడుస్తూనే వున్నారు.
    ఇం : వాళ్ళంతా సుఖంగానే వున్నారు మానసీ! వాళ్ళకు  ఓ లక్ష్యం వుంది. ఆశలు వున్నాయి. స్వప్నాలు కంటున్నారు.
    మా : అవన్నీ నీకెందుకు లేవు.
    ఇం : అలాంటివేవీ నాకు లేవు.
    మా : ఎప్పుడూ లేవా?
    ఇం :  ఒకప్పుడు వుండేవి. నేను ఏదో చెయ్యాలనుకొంటూ వుండేవాణ్ణి. ప్రకాశవంతమైన ఒక నక్షత్రంలా ఆకాశాన్ని ఆ మూలనుంచి యీ మూలకు చీల్చుకొంటూ వెళ్ళాలనుకునే వాణ్ని. నక్షత్రం కాలి, నుసి  అయేదాకా వెలగాలనుకునేవాణ్ని.
    మా : నువ్విప్పుడు కాలి నుసి అయిపోయావా ?
    ఇం : కాలేదు. అసలు నక్షత్రంలా వేలగందే? ఆకాశంలో  నక్షత్రం...నేను భూమినుంచి ఆకాశంవైపుకి పయనించలేకపోయాను.
    మా : ఎందుకని?
    ఇం : నాకంత శక్తిలేదు. అలాంటి శక్తి సంపాదించాలని కలలు మాత్రం కన్నాను. నేను ఒక అతి సాధారణ మానవుణ్ణని తెలుసుకున్నాను. తెలుసుకోనంతవరకూ స్వప్నాలలో బ్రతికాను. ఈనాడు ఒప్పుకుంటున్నాను నా అల్పత్వాన్ని.
    మా : ఇంద్రజిత్ !
    ఇం : నన్ను ఆ పేరులో పిలవకు. నేను ఇంద్రజిత్ ను కాను. నా పేరు నిర్మల్ ! అమల్, విమల్ , కమల్, నిర్మల్ నేనూ వాళ్ళలాటివాణ్ణే!
    (మాట్లాడుతూ వ్యాకులపడతాడు. రచయిత వచ్చి వెనక నిల్చుంటాడు. మానసి కూర్చొని వుంటుంది.)
    రచ : ఇంద్రజిత్ !
    ఇం : మీరు మర్చి పోయినట్లున్నారు - నా పేరు నిర్మల్ .
    రచ : నన్ను గుర్తించలేదా ? ఇంద్రజిత్ !
    ఇం : ఎవరు ? నువ్వా ? కవి !
    రచ : నేను నాటకం పూర్తి చెయ్యలేకపోతున్నాను ఇంద్రజిత్!   
    ఇం : పూర్తిచేసి ప్రయోజనం ? దాని మొదలూ, తుదీ ఒకటిగానే వున్నప్పుడు ? దానికి ముగింపు వుంటేగా?
    రచ : అయినా వ్రాయాలిగా ?
    ఇం : వ్రాయాలనుకుంటే వ్రాయి. నాకేం సంబంధం లేదు. నేను నిర్మల్ ని.
    రచ : నీకు సంబంధం ఏమీలేదా? ఇల్లు, ప్రమోషన్, బిజినెస్ ఇవేమీ అక్కర్లేదా? ఆలాంటప్పుడు నువ్వు నిర్మల్ ఎలా అవుతావు?
    ఇం : నేను  కూడా అతి సామాన్యమైన వ్యక్తినే !
    రచ : కావచ్చు. కానినువ్వు నిర్మల్ వి కాదు. నేనూ సామాన్యమైన వ్యక్తినే అయినా నిర్మల్ ని  కాలేను. నువ్వూ, నేనూ, నిర్మల్ కాలేము.
    ఇం : మరి మనం దేని ఆధారంమీద బ్రతకాలి?
    రచ : కనిపించే మార్గమే మనకు ఆధారం. మనం నడవాలి. వ్రాయటానికి నాకు సామగ్రి లేదు - అయినా  రాస్తాను. మాట్లాట్టానికి నీకు విషయం లేదు. అయినా నువ్వు మాట్లాడుతావు. మానసికి జీవించటానికి ఆధారం లేదు - అయినా జీవిస్తుంది. మన ఎదురుగా మార్గం వుంది. మనం నడవాలి నడుస్తాం.
    ఇం : దేవరాజు జూపిటర్ యిచ్చిన శాపఫలితంగా  'సిసిఫస్' ప్రేతాత్మ. ఒక పెద్ద బండరాతిని నెట్టుకుంటూ కొండశిఖరాన్ని చేరుతుంది. కాని  కొండశిఖరం చేరగానే ఆ రాతిబండ క్రిందకు దొర్లిపోతుంది. మళ్ళీ అతని ప్రేతాత్మ ఆ రాతిని నెట్టుకొంటూ కొండశిఖరం చేరుతుంది. మళ్ళీ ఆ రాయి క్రిందకు దొర్లుతుంది.
    రచ : మనంకూడా అలాంటి ప్రేతాత్మలమే ! ఆ రాయి దొర్లుతుందని మనకు తెలుసు. రాతిని నెట్టుకొంటూ పైకి వెళ్ళిన మనకు మన  శ్రమంతా అర్ధం లేనిదని మనకు  తెలుస్తుంది. కొండశిఖరానికి కూడా ప్రయోజనం లేదని మనకు తెలుసు.
    ఇం : ఇంత తెలిసీ మనం ఆ రాతిని నెట్టాల్సిందేనా ?
    రచ : అవును. తెలిసీ చెయ్యాల్సిందే! మనకు ఆశలు లేవు. ఎందుకంటే భవిష్యత్తు ఏమిటో మనకు తెలుసు. మన దృష్టిలో గతానికీ, భావిష్యత్తుకూ భేదం లేదు. అంతా  ఒకటే. మన వెనక వున్నదే ముందూ వున్నదనే విషయాన్ని మనం తెలుసుకున్నాం.
    ఇం : అయినా బ్రతకాలంటావ్ ?
    రచ : అవును. తప్పదు. మన ముందు మార్గంవుంది. మనం నడుస్తూనే వుండాలి. మనకు తీర్ధంలేదు - తీర్ధయాత్ర మాత్రమే వుంది.
    (మానసి వచ్చి రచయిత, ఇంద్రజిత్ ల మధ్యలో నిల్చుంటుంది. ముగ్గురుదృష్టి తిన్నగా చూస్తుంది. కొంచెం  పైకి వుంటుంది. ప్రేక్షాగారపు గోడను చీల్చుకుంటూ ఎక్కడికో చాలా దూర తీరాలకు పయనిస్తున్నట్లు  ఉంటుంది. మార్గపు యిరువైపు రేఖలూ  ఎక్కడో కలిసే చోటును చూస్తున్నట్లు వుంటుంది. వారిదృష్టి నాలుగువైపుల అంధకారం, ఒక క్షీణ ప్రకాశ రేఖ వారిమీద పడుతుంది. దూరంగా పాట వినిపిస్తుంది.)
    అనంతమైనదీమార్గం
    ఆగని పయనం
    దూరంగా దేవలోకాన్ని పొందే
    ఆశలేని ప్రయాణం
    అందుకే అర్ధహీనమైంది ఈ ప్రయాణం
    ఉద్దేశ్యం హీనం.
    అయినా లేదు  విచారం.
    సాగుతూనే వుంటుంది ఈ ప్రయాణం.
    అభీష్టం, ప్రశ్నలు అన్నీ
    పడిపోయాయి అంతుతెలియని లోతులో
    దుఃఖం మర్చి పోయాను
    జీవితపు స్వర్ణోదయంలో
    తీసుకున్నాను దీక్ష
    చేస్తున్నాను అనంత ప్రయాణం
    జీవన సంధ్య ప్రవేశంతో
    మరువలేను యిది కేవలం
    తీర్ధయాత్రయే, తీర్ధంకాదని
    లక్ష్యంలేదు. మార్గం వుంది.
    ఇదే తీర్ధమార్గం.
    ఇదే అభీష్టం.
    ఇదే గంతవ్యం.
                                                           (శుభం)

 Previous Page