Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 19

    'రేపే వెళ్తున్నానని చెప్పాడా?'
    'లేదు. నాకు చెప్పడానికి మొహమాట పడివుంటాడు.'
    'మరి మీకెలా తెలిసింది!'
    'మొన్న త్రిపురయ్య కన్పించి చెప్పాడు. మీవాడు ఏదో పూజ వుంది రమ్మన్నాడు. వేరే ఇంటికి వెళ్తున్నాడటగా అని అన్నాడు.'
    'చూశారా! చంద్రం కూడా ఎంత పనిచేశాడు? వీడు అందరిలాంటివాడు కాదనుకున్నాను. ఒక్క బిడ్డయినా మనతో వుంటాడని ఆశ పడ్డాను. చివరకు వీడు కూడా...' ఆపైన గొంతులో నుంచి మాటలు మధ్య మధ్య తెగుతూ బయటపడ్డాయి.
    'వాడు ఏం కాని పని చేశాడు? వాళ్ళకూ ఏవేవో ఆలోచనలు వుంటాయి.
    'వాళ్ళ ఆలోచనలకు మనము అడ్డంగా వుంటామా?'
    'అది అనుకోవాల్సింది మనం కాదు.'
    'ఈ మూడు నెలల్లో వాళ్లకు ఏం ఇబ్బంది కలిగింది మనవల్ల? దేనికి అడ్డం వచ్చాం. కోడల్ని నేను ఎంత అపురూపంగా చూసుకున్నాను?' ఆమె కంఠ స్వరం బొంగురుపోయింది.
    కామేశ్వరరావుకు ఏమని సర్ది చెప్పాలో స్పురించలేదు. మౌనంగా ఉండిపోయాడు.
    'పిల్లల్ని కని, వాళ్ళ చుట్టూ ఎన్నెన్నో ఆశల్ని అల్లుకుంటూ వాళ్ళ ప్రపంచమే తమ ప్రపంచంగా, వాళ్ల సుఖ సంతోషాలే తమ సుఖ సంతోషాలుగా భావిస్తూ, నానా కష్టాలు పడి, వాళ్లను ప్రయోజకుల్ని చేసింది ఈనాడు చూడడానికేనా?' ఆమె స్వరంలో కోపం, దుఃఖం ఒకదాన్నొకటి ఒరుసుకున్నాయి.
    'కన్న పిల్లల్ని, పెంచి ప్రయోజకుల్ని చెయ్యడం తల్లి దండ్రుల బాధ్యత.'
    'ఆ తర్వాత? తల్లి దండ్రుల బాధ్యత ఎవరు తీసుకోవాలి? వాళ్ళకి బాధ్యతలూ, బరువులూ వుండవా? తీవ్రంగా వుంది ఆమె కంఠం.
    'మేము మీ కోసం ఎన్నో చేశాం కాబట్టి మీరు కూడా మా బాధ్యతను నెత్తికెత్తుకోండి అని తల్లిదండ్రులు పిల్లల్ని అడగాలా?'  
    'అడగడం ఎందుకు? అది వాళ్ల బాధ్యత, వాళ్లు గుర్తించాలి'. అందరూ అలాగే చేస్తున్నారా? మా అన్నయ్య మా అమ్మను, నాన్నను ఎంత ప్రేమగా చూసేవాడో మీకు తెలియదా??"
    'కారణం మీ వదిన ఎలాంటి గొడవలు లేవదియ్యలేదు కనుక.
    'మొదట్లో మా వదిన కొంత నసిగింది. కాని మా అన్నయ్య ఏం చెప్పాడో తెలియదు - ఆ తర్వాత కొంతకాలం సర్దుకుపోయింది - తర్వాత స్వంత తల్లిదండ్రుల్లాగానే చూసింది. కోడళ్లలో ఏముండదు. అంతా కొడుకుల్లోనే...'
    'అందరూ ఒక లాగే వుండరు. ఇదుగో సుందరీ! ఒక విషయం గుర్తుంచుకో. అడ్డాల్లో వున్నప్పటిలాగే బిడ్డలు గడ్డాలు వచ్చాక కూడా వుండాలంటే కుదరదు. వాళ్ళ జీవితం వాళ్ళది. వాళ్ళ అభిరుచులు వాళ్లవి. భ్రమలు పెంచుకోకు. ఎక్కువ ఆశలు పెంచుకోకు, వాళ్ళ తరపు నుంచి కూడా ఆలోచించు.'
    'ఇంకా మనం వాళ్ళ గురించే ఆలోచించాలా! వాళ్లు మన గురించి ఆలోచించనక్కర్లేదా?'
    'ఇప్పుడు మన బిడ్డలు మాత్రం ఏం చేశారు ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో ఉన్నారు. మనల్ని చూడనన్నారా? ఇంకా నేను సంపాదిస్తున్నాను. చిన్నవాడు చదువుతున్నాడు. వాడు ఎక్కడో స్థిర పడతాడు. ఆ తర్వాత మనం ఎవరి దగ్గర వుండాలనుకుంటే వాళ్ళ దగ్గరే వుండొచ్చు. వాళ్ళు కాదంటారా?'
    'అనరంటారా?'
    'ఇప్పట్నుంచే ఆ ఆలోచనలు ఎందుకు చెప్పు!'
    'అది కాదు నా బాధ...'
    'నీ బాధ నాకు అర్ధం కాదనుకుంటున్నావా పిచ్చిదానా?'
    'మన కష్టాలు తీరాయి. మనం చాలా అలసిపోయాం జీవితంలో. చివరి రోజుల్లో మనకు కావాల్సింది కాస్త విశ్రాంతి. కాస్త ఆదరణ. కోడళ్లతో, కొడుకులతో. మనవలూ, మనవరాళ్ల మధ్య చివరిరోజులు సంతృప్తిగా బతకాలని కలలు కన్నాను.'
    'ఇప్పుడు మాత్రం ఏమైంది. ఒక్కొక్క కొడుకు దగ్గర కెళ్ళు. నీ కిష్టమైనన్ని రోజులు హాయిగా కాలక్షేపం చెయ్యి.'
    'అప్పుడు మాత్రం వాళ్ళు. వాళ్ళ సుఖాలకు అడ్డంగా వున్నామని అనుకోరా ఏం?'
    కామేశ్వరరావు ఆలోచిస్తూ వుండిపోయాడు.
    'ఎందుకమ్మా ఏడుస్తున్నావ్!' అప్పుడే బయటి నుంచి వచ్చిన రమేశ్ తల్లి కన్నీళ్లు తుడుచుకోవడం చూసి అడిగాడు.
    'అబ్బే ఏడవడం లేదు. కంట్లో నలక పడితేనూ...?' సుందరమ్మ గాభరా పడింది.
    'రెండు కళ్ళల్లో ఒకేసారి నలకలు పడ్డాయా?'
    'ఆ! ఆ! అవున్రా!'
    'నేను ఇంకా పసివాడ్ని కాదమ్మా!'
    'పద! భోజనం వడ్డిస్తాను, మీ నాన్న కూడా ఇంకా తినలేదు. ఇద్దరూ రండి వడ్డిస్తాను.'
    'నాన్నా! అమ్మ ఎందుకు ఏడుస్తుంది.'
    భార్యాభర్తలు ముఖముఖాలు చూసుకున్నారు.
    'అన్నయ్య వేరే కాపరం పెడ్తున్నాడనేగా నీ బాధ? సుందరమ్మ కొడుకు ముఖంలోకి అదోలా చూసింది. కామేశ్వరరావు కుతూహలంగా చూశాడు.
    'దీనికి మీరింత బాధ పడాల్సిందేముంది?'
    'ఏమీ లేదా! ఏమీ లేదట్రా!'
    'లేదమ్మ! అంత బాధపడాల్సిందేమీ లేదు. ఒకే చోట, ఒకే ఇంట్లో ఉండడం కంటే దూరంగా వుంటేనే ప్రేమాభిమానాలు నిలుస్తాయి. ఒకరిపట్ల ఒకరిగి గౌరవం వుంటుంది. పెద్దవాళ్ళ దగ్గర వుంటే వాళ్ళకు పూర్తి స్వేచ్చ వుండదు. వాళ్ళ కాపురాన్ని వాళ్లు తమ అభిరుచికి అనుకూలంగా మలచుకోవాలనే కోరిక వుంటుంది. అదీ కాక...' తల్లి ముఖంలోకి చూసి ఠక్కున ఆగిపోయాడు. ఆమె ముఖం తెల్ల కాగితంలా కన్పించింది.
    కామేశ్వరరావు విస్మయంగా చూశాడు. వీడికి నిండా పద్దెనిమిదేళ్ళు లేవు ఎంత బాగా ఆలోచిస్తున్నాడు? ఎంత లౌకిక అనుభవం వున్నవాడిలా మాట్లాడాడు. వీడ్ని ఇంకా తను పసివాడనే అనుకుంటున్నాడు. ఒక నిమిషం ముందుగా తను ఈ విషయాన్ని ఇలా ఆలోచించాడా ఎప్పుడైనా, ఇప్పటికాలం... ఈ పిల్లలు... ఈ చదువులు....
    'ఏం నాన్నా అంతగా ఆలోచిస్తున్నారు? నేను తప్పుగా అన్నానా?'
    'లేదురా రమేశ్. చాలా బాగా ఆలోచించావ్. నువ్వు చెప్పిందే కరెక్ట్!'
    'అవున్రా కన్నా! చాలా బాగా ఆలోచించావ్! మీ నాన్న కూడా నీకు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇంకా చెప్పరా నీ అన్నలకంటే నువ్వు ఇంకా ముందున్నావు ఆలోచనల్లో.'
    'అమ్మా! నామీద కోపం వచ్చిందా?'
    'కోపమా! అబ్బే! నీ తెలివి తేటలకు గర్విస్తున్నానురా కన్నా! నువ్వూ ఆ అన్నలకు తమ్ముడివేగా నాయనా! ఇప్పట్నుంచీ వేరే కాపురం పెట్టడం గురించి ఆలోచిస్తున్నావు గదూ!'
    'అమ్మా!'
    'వెళ్ళరా! వెళ్ళు! నువ్వూ వెళ్ళు. నీ పెళ్లాం కొంగు పట్టుకొని వెళ్ళిపోరా? నువ్వు ప్రయోజకుడి వయ్యాక ఇంక నీకు మాతో పని ఏముంది నాయనా! వెళ్ళు! ఇప్పుడే వెళ్ళు. ఈ క్షణంలోనే వెళ్ళు. నేను ఏడుస్తాననుకుంటున్నావేమో! ఏడవను. సంతోషంగా సాగనంపుతాను. ఎప్పుడు వెళ్తావో చెప్పు.'
    సుందరమ్మ హిస్టీరియా వచ్చినట్లు మాట్లాడుతోంది. రమేశ్ భయపడిపోయాడు.  

 Previous Page Next Page