Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 18

    చంద్రానికి, సునందకు ఒకేసారి పెళ్లి చేశారు. సూర్యనారాయణ స్పురద్రూపి. అంతమంచి సంబంధం వచ్చినందుకు అందరూ ఆశ్చర్యపోయారు.
    పెళ్లికి కొడుకులూ, కోడళ్ళూ వచ్చారు. పెళ్లి జరుగుతున్నప్పుడు ఎక్కడ్నుంచి వచ్చాడో సత్యం వచ్చాడు. సూర్యనారాయణతో మాట్లాడి, పెళ్లిపీటలమీదే చెల్లెల్ని పలకరించి ఎలా వచ్చాడో అలాగే వెళ్లిపోయాడు. సుందరమ్మ కొడుకుని పట్టుకుని గొల్లుమన్నది. కామేశ్వరరావు పలకరించలేదు.
    "వచ్చి పదినిముషాలన్నా కాలేదు. వెళ్ళిపోతానంటావేంరా? మా మీద కోపం తగ్గలేదా?" సుందరమ్మ బాధపడింది.
    "మీమీద కోపం ఏమిటమ్మా? నేను ఎక్కువ సేపు ఇక్కడ వుండకూడదు. పోలీసులు నాకోసం వెదుకుతున్నారు."
    "పోలీసులా! ఏం చేశావురా కన్నా? ఎవర్నయినా...."
    "హత్య చెయ్యలేదులే" వెళ్తాను. వీలుంటే మళ్ళీ వస్తాను." అంటూ మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు.
    సత్యం వెళ్లిపోయాడని తెలిసి కామేశ్వరరావు బాధపడ్డాడు. నిముషాలమీద తిరిగి వెళ్ళిపోతాడని కామేశ్వరరావు భావించలేదు.
    కూతుర్ని అత్తవారింటికి పంపిస్తూ భోరుభోరున ఏడ్చింది సుందరమ్మ.
    చంద్రం భార్య కాపరానికి వచ్చింది. సుందరమ్మకు సంతృప్తిగా వుంది. రెండు నెలలు గడిచాయి. సుందరమ్మ కోడల్ని అపురూపంగా చూసుకుంది. కోడలు పిల్ల "అత్తయ్యా! అత్తయ్యా!" అని పిలుస్తూ వుంటే సుందరమ్మ ఆనందానికి అవధుల్లేవు.
    ఆరోజు సాయంత్రం వసారాలో కూర్చుని సుందరమ్మ లాంతర్లు తుడుస్తున్నది.
    చంద్రం చిన్నగా వచ్చి తల్లి పక్కగా నేల మీద కూర్చున్నాడు. సుందరమ్మ కొడుకు ముఖంలోకి మురిపెంగా చూసింది.
    చంద్రం అంటే సుందరమ్మకు మొదటినుంచీ ప్రత్యేకమైన అభిమానం. సుందరమ్మ ఏ పనిచేస్తున్నా ఇంట్లో వుంటే చంద్రం ఆమెకు సహాయం చేసేవాడు. కూరగాయలు కూడా తరిగి ఇచ్చేవాడు. వంట చెయ్యడం కూడా నేర్చుకున్నాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే వంట గదిలోకి రానిచ్చేవాడు కాదు. తనే వంట చేసేవాడు.
    తన పక్కన కూర్చున్న కొడుకును చూస్తూ వీడు మారలేదు. పెళ్లయినా మారలేదు. వీడిదారే వేరు. తనకు అంతకంటే ఏంకావాలి? ఒక్క కొడుకైనా తమతో వుంటున్నాడు.
    "ఏరా! లాంతర్లు తుడుస్తావా?" నవ్వుతూ అన్నది సుందరమ్మ.
    "అమ్మా..." ఏదో చెప్పబోయి సందేహించినట్టుగా ఆగిపోయాడు.
    "ఏం బాబూ! ఏం కావాలి?"
    చంద్రం సందేహిస్తూ వుండిపోయాడు.
    "చెప్పరా కన్నా! నా దగ్గిర సందేహం ఎందుకు?"
    "మరి నువ్వు బాధ పడకూడదు"
    వీడు ఏం చెప్పబోతున్నాడు! ఆశ్చర్యంగా కొడుకు ముఖంలోకి చూసింది.
    "చెప్పు! ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పరా!"
    "రేపు మేము వెళ్తున్నాము"
    "ఎక్కడికి? కోడల్ని తీసుకొని అత్తగారింటికి వెళ్తున్నావా! పిచ్చి సన్యాసి! నేనేం అనుకుంటానురా! వెళ్లిరండి! ఈ మాట చెప్పడానికి అంత ఇదైపోతావేమిట్రా కన్నా!"
    "కాదమ్మా! మరి...
    సుందరమ్మ కొడుకు ముఖంలోకి లోతుగా చూసింది. వీడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? "శెలవు ఇచ్చారుగా? వెళ్ళిరండి. నాలుగురోజులు సర్దాగా తిరిగిరండి."
    "అదికాదమ్మా!"
    "మరి?"
    "రేపు మంచిరోజట. ఇంటికి అడ్వాన్సు కూడా ఇచ్చాను."
    సుందరమ్మ నెత్తిమీద సుత్తి దెబ్బ పడినట్టుగా అయింది. కొడుకు ముఖంలోకి వెర్రిచూపులు చూసింది. కొత్తగా అక్షరాలు నేర్చుకుంటున్న పసివాడు, సంయుక్తాక్షరాలకేసి చూసినట్టుగా చూసింది.
    "ఊళ్ళోనే వుంటాంగా బాధపడ్తావెందుకమ్మా!"
    సుందరమ్మ కొడుకు ముఖంలోకి చూస్తూ వుండిపోయింది.
    "రేపు పదిగంటలకు నువ్వొచ్చి పాలు పొంగించాలి" అనేసి, దిగ్గున లేచి, బయటికి వెళ్ళిపోయాడు.
    సుందరమ్మ యాత్రికంగా తలతిప్పి చూసింది కోడలు కమల గడపలో నిల్చుని ఉంది.
                                 *   *   *
    "ఏమిటలా వున్నావ్?"
    "ఎలా వున్నానూ?" తలెత్తకుండానే భర్త పళ్లెంలో గరిటతో అన్నం పెట్టింది సుందరమ్మ.
    "బాగా ఏడ్చినట్టున్నావ్?"
    సుందరమ్మ మాట్లాడకుండా కూర వడ్డించింది.
    "కళ్లు ఉబ్బి వున్నాయి. ముఖం వాచి వుంది. ఏం జరిగింది?"
    సుందరమ్మ పెల్లుబుకుతున్న దుఃఖాన్ని అణచుకొనే ప్రయత్నంలో తల దించుకొని కూర్చుండి పోయింది.
    "ఏమిటి సుందరీ! ఏమైంది! ఎందుకంతగా బాధపడ్తున్నావ్?"
    ఒక్కసారిగా నిండుకుండ బద్దలైనట్టుగా భోరుమన్నది.
    "ఛ! ఏమిటా ఏడుపు ఎవరో చచ్చినట్టు" మందలిస్తున్నట్టుగా అన్నాడు కామేశ్వరరావు.
    సుందరమ్మ పైట కొంగుతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది.
    "ఊరుకో! అసలు ఏం జరిగిందోచెప్పు."
    సుందరమ్మ ఏడుస్తూనే ఉంది. గుండెలు అలసిపోయేలా ఏడుస్తున్నది.
    కామేశ్వరరావు ఆలోచనలో పడ్డాడు. చటుక్కున ఏదో గుర్తొచ్చింది.
    "ఓ అదా సంగతి? చంద్రం వెళ్ళిపోతున్నానని చెప్పాడా?"
    అంతదుఃఖంలోనూ చివ్వున తలెత్తి, చురుగ్గా చూసింది భర్తముఖంలోకి.
    "రేపు వెళ్తున్నామని చెప్పాడా?"
    "మీకు... మీకు... ముందే తెలుసా?"
    "తెలుసు."
    భర్త ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది.
    "తెలుసా?"
    "తెలుసు"
    సుందరమ్మ భర్త ముఖంలోకి చురుగ్గా చూసింది.
    "అంటే... అంటే మీకు ముందే తెలుసా? వాడు వేరు కాపురం పెట్టబోతున్నాడని ముందే తెలుసా? వాడు వేరు కాపురం పెట్టబోతున్నాడని ముందే తెలుసా? వాడూ, పెద్దవాడు, రెండోవాడు లాంటి వాడేనని మీకు ముందే తెలుసా? మరి నాకు చెప్పలేదేం!'
    'ముందు నుంచే ఎందుకు ఏడిపించడం అని చెప్పలేదు'.
    'మీకెప్పుడు చెప్పాడు'.
    'వాడు నాకు చెప్పలేదు'.
    'మరి! మీకెలా తెలిసింది?'
    'పెళ్ళికి ముందు నుంచే వాడు ఇంటికోసం వెదుకుతున్నట్లు తెలిసింది. అడ్వాన్సు కూడా ఇచ్చాడని తెలిసింది. కాని వెంటనే, పెళ్ళిపీటల మీద నుంచి లేవగానే, వేరింటి కాపురం పెట్టడానికి మొహమాటపడినట్టున్నాడు. మూడు నెలల తర్వాత వెళ్తున్నాడు.  

 Previous Page Next Page