"ఎవర్నండోయ్ పట్టు పట్టేది?" అన్నాడు రమణరావు.
"మిమ్మల్ని మాత్రం కాదులే" బొజ్జ ఎగిరెగిరిపడేలా నవ్వాడు ఇన్ స్పెక్టర్.
"నరేంద్రగారు చాలా ప్రఖ్యాత డిటెక్టివ్. ఆంధ్రదేశంలో వారి పేరు వినని వారు ఉండరనుకొంటాను" అన్నాడు రమణరావు.
"మరీ అంతెత్తున మునగచెట్టు ఎక్కించకండి. నంరేంద్ర సినిమా హీరోనా లేక తెలుగు థ్రిల్లర్ రైటరా ప్రతి వాళ్ళకూ తెలియడానికి అన్నాడు విజయ్.
"అలా అనకండి. వారిని చాలాసార్లు కోర్టులో చూశాను.ఈరోజే వారి పరిచయ భాగ్యం లభించింది" అన్నాడు రమణరావు.
"మంచిమాటకారే!" అనుకొన్నాడు నరేంద్ర రమణరావు చూస్తూ.
రమణరావు పొడవుగా, తెల్లగా, నాజూకుగా ఉండిచూపరులను ఇట్టే ఆకర్షిస్తాడు. తెల్లషర్టూ, తెల్ల ప్యాంటులో, వాషింగ్ పౌడర్ అడ్వర్ టైజ్ మెంటు మోడల్ లా ఉంటాడు. ఆచితూచి మాట్లాడతాడు.
"కృష్ణమూర్తి ఏమిటి అంత విసురుగా వెళ్ళిపోతున్నాడు?" కమలాంబ కేసి తిరిగి అడిగాడు రమణరావు.
కమలాంబ సమాధానం ఇవ్వలేదు. వాకిలి కేసి చూస్తూ ఉండి పోయింది.
"నేను పలకరించినా పలకలేదు. నన్ను చూడగానే మీ లాయర్ గారు కూడా లేచి వెళ్ళిపోయారు?"
"మన విషయాలు తర్వాత మాట్లాడుకుందాంలెండి" అన్నది కమలాంబ.
"నరేంద్రగారిని నేను ఇంతకు ముందు చూడలేదు. నిన్న ఉదయమే మా ఆఫీసుకు వస్తే చూశాను" అన్నాడు సోమసుందరం సంభాషణను మరో వైపుకు మళ్ళిస్తూ.
"నిన్న ఉదయం మీ ఆపీసుకు వచ్చారా?" రమణరావు ఆశ్చర్యంగా అడిగాడు.
"అవును. అదే రాధారాణి గురించి తెలుసుకోవడానికి...."
"ఓ అదా! పాపం! ఆడదని కూడా చూడకుండా నిండు ప్రాణం తీశాడు దుర్మార్గుడు" అన్నాడు రమణరావు జాలి ఉట్టిపడే కంఠంతో.
"ఆ ! రమణరావుగారూ! నిన్న సాయంకాలం నాకోసం ఫోన్ చేశానన్నారు ఎందుకూ?"
"అరే మీ షర్టు గుండి ఒకటి ఊడిపోయినట్టుంది?" అన్నాడు విజయ్ బంగారు గొలుసుతో తెల్లషర్టుకు పెట్టుకొన్న బంగారు గుండీలని చూస్తూ.
రమణరావు ముఖం ఒక్కసారిగా ఈడ్చికొట్టినట్టు అయింది.
"అవునండి. ఒకటి ఊడిపోయింది. వారం రోజుల నుంచి అది తీసుకెళ్ళి గొలుసుకు పెట్టించాలనుకొంటూనే ఉన్నాను. కాని బొత్తిగా తీరిక చిక్కడం లేదు" అంటూ విజయ్ షర్టుకేసి తీక్షణంగా చూశాడు.
"ఏమిటండీ బాబు! నా గుండీ చూస్తున్నారు? మీది కొట్టేశాననుకొన్నారా ఏం?" అన్నాడు విజయ్.
ఇన్ స్పెక్టర్ ఇద్దర్నీ మార్చి మార్చి చూశాడు.
"ఏమిటి అద్వయితం అలా చూస్తున్నావ్? మనవాడికి ఈమధ్య ఆ బంగారు గుండీ ఎక్కడో దొరికిందిలే. అప్పట్నుంచి దాన్ని తగిలించుకొని తిరుగుతున్నాడు. మిగతా రెండూ చేయించుకొని పెట్టుకోమంటే ఇదే వెరైటిగా ఉంటుందిలే అంటాడు. విజయ్ మొండితనం గురించి నీకూ తెలుసుగా?" అది కూడా అపరాధ పరిశోధనకు పనికివస్తుంది అంటాడు" అన్నాడు నరేంద్ర.
"ఛా! మీరు నా గుడీ కొట్టేయం ఏమిటి? అది ఇంట్లోనే ఉంది కేవలం గొలుసుకు పిట్ చేయించాలి." అన్నాడు రమణరావు.
"బతికించారు పోండి. లేకపోతే ఈ ఇన్ స్పెక్టర్ నేను మీ గుండీ కొట్టేశానని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి ఉండేవాడు."
ఆ మాటకు అందరూ గొల్లున నవ్వారు.
రమణరావు మాత్రం నవ్వలేదు. "చచ్చుజోక్" అన్నట్టుగా చూశాడు.
"అంతలో డ్రెస్ చేసుకొని శంకర్రావు డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు.
శంకర్రావు కూడా బంగారు గొలుసుతో షర్టుకు బంగారుగుండీలు పెట్టుకున్నాడు. పై రెండూ ఉన్నాయి, మూడో గుండీ లేదు.
"అరే మీ గుండీ కూడా ఒకటి పోయినట్టుంది?" అన్నాడు విజయ్ ఆశ్చర్యంగా చూస్తూ.
"అవునండీ. ఎక్కడో పోయింది. కొత్తది చేయించుకోవాలి" అనేసి శంకర్ర్రావు చరచరా బయటికి వెళ్ళిపోయాడు.
కమలాంబకి ఈ సంభాషణంతా చాలా చిరాకు కలిగిస్తోంది.
"ఇక గుండీల ప్రసంగం ఆపుదామా?" అన్నాడు నరేంద్ర గంభీరంగా.
"ఆ! అసలు సంగతి చెప్పారు గాడు?" రమణరావును చూస్తూ అడిగాడు అద్వయితం.
"అసలు సంగతా?" రమణరావు ఏదోఆలోచిస్తూ యదాలావంగా అన్నాడు.
"అదేనయ్యా! నాకు ఫోన్ చేశానన్నావుగా?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"అదా?" అంటూ చుట్టూ ఉన్నవాళ్ళను చూశాడురమణరావు.
ఫర్వాలేదు. చెప్పండి. ఇక్కడ కొత్తవాళ్ళెవరూలేరులే" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"ఏం? అది అంత రహస్యమా?" అడిగాడు నరేంద్ర.
"అంత పెద్ద రహస్యం కాదులెండి" అన్నాడు రమణరావు.
రమణరావు మధ్య మధ్య విజయ్ ను దొంగచూపులు చూడటం గమనించాడు నరేంద్ర.
నరేంద్ర విజయ్ కేసి చూసి చిరునవ్వు నవ్వాడు.
విజయ్ "నేనూ గమనిస్తున్నానులే" అన్నట్టుగా నవ్వాడు,
"రహస్యం కాకపోతే సందేహం ఎందుకు చెప్పండి" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"రామకృష్ణ తన ఆస్తిని గురించిన వీలునామా నాచేత రాయించాడు."
"రామకృష్ణను మీరెప్పుడు కలుసుకున్నారు?" నరేంద్ర అడిగాడు
"రామకృష్ణను నేను కలుసుకోలేదు. రామకృష్ణే నన్ను కలుసుకున్నాడు."
"ఎవరు ఎవర్ని కలుసుకుంటే నేంలే! అసలు సంగతి చెప్పండి" అన్నాడు ఇన్ స్పెక్టర్ విసుగ్గా.
"మొన్న 6 గంటల ప్రాంతంలో రామకృష్ణ మా ఇంటికి వచ్చాడు.
"రామకృష్ణ మీకు ఇదివరకే తెలుసా? ఇంతకాలంగా తెలుసు? సాయంత్రం 6 గంటలకు వచ్చాడా?"
"తెలియ. అతడ్ని మొన్ననే మొదటిసారిగా చూశాను" అన్నాడు రమణరావు.
"వీలునామా రాయించడానికి మీ దగ్గరికే ఎందుకొచ్చాడో చెప్పగలరా? మీకంటే పేరున్న ఎందరో లాయర్లు ఈ హైదరాబాదులో ఉండగా?" అడిగాడు నరేంద్ర.
"అతడికి ఆ సమయంలో కావాల్సింది పేరుగల లాయర్ కాదు. నమ్మకం గల లాయరు" ఎంత అణచుకోవాలన్న ఆ కంఠంలో కొంత విసుగు వినిపించింది.
ఇన్ స్పెక్టర్ గొల్లున నవ్వాడు.
"ఎందుకు నవ్వుతున్నారు? నేను నమ్మతగిన మనిషిని కానని మీ భావమా? రమణారావు తీవ్రంగా అడిగాడు.
"రామ! రామ! నేను అలా అన్నానా?"
"మరెందు కంతగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు?
"మీకు అంతకు ముందు రామకృష్ణ తెలియదన్నారు. వారు మిమ్మల్ని ఎరగరు. మీరు నమ్మకస్తులని మీ దగ్గరకు వచ్చారంటే..." ఓ క్షణం ఆగి "ఆ మాటకొస్తే రామకృష్ణ లాయర్ శంకరరావు దగ్గరకు రావాలి" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"అతనంటే మాతమ్ముడికి కోపం అని ముందే చెప్పానుకదండీ?" విసుగ్గా అన్నది కమలాంబ.
"అతడంటే కోపం ఉండవచ్చును. కాని లాయర్ శంకరరావ్ కంటే ఆత్మీయులు మీకు లేరనీ తెలుసు ఆస్తి రాసింది మీ పేరున కనక శంకర్రావుచేత ఎందుకు రాయించలేదనేదేనా సందేహం."
నరేంద్ర ప్రశంసాపూర్వకంగా అద్వాయితాన్ని చూశాడు. "పర్వాలేదు. నీ బుర్ర ఇవ్వాళ చాలాచురుగ్గా పనిచేస్తుంది" అన్నట్టుగాచూశాడు.
నరేంద్ర సిగరెట్ తీశాడు.
"సిగరెట్ తాగితే మీకేమైనా అభ్యంతరమా?" అని కమలాంబ అడిగాడు.
"అదేం లేదండీ" అంటూ తన ముందు బల్లమీద ఉన్న యాష్ ట్రేని తెచ్చి నరేంద్ర దగ్గరున్న టీపాయ్ మీద పెట్టింది.
"నువ్వక్కడెందుకే. నువ్వులోపలకెళ్ళు." కూతుర్ని కసురుకుంది.
లావణ్య లేచి లోపలకు వెళ్ళిపోయింది.
"ఆ! ఇక చెప్పండి దమ్ము పీల్చి సిగరెట్ పొగఊదుతూ అన్నాడు నరేంద్ర.
"నాకు రామకృష్ణ తెలియని మాట వాస్తవమే. సోమసుందరం పింపించాడని వచ్చాడు. ఇతను కూడా నాకు ఫోన్ చేసి ఫలానా అతను వస్తున్నాడనీ, కావాల్సిన సహాయం చెయ్యమనీ చెప్పాడు."
"రామకృష్ణ వస్తున్నాడని చెప్పారా సోమసుందరంగారు?" సాలోచనగా అడిగాడు నరేంద్ర.
"కాదు, రామానందస్వామి వస్తున్నాడని చెప్పాడు. తర్వాత అతనే తన అసలు పేరు రామకృష్ణ అని నాకు చెప్పాడు.
"మీకు రామకృష్ణ త్లుసా?" ఇన్ స్పెక్టర్ సోమసుందరాన్ని అడిగాడు.
"నాకూ తెలియదు. అతడి అసలు పేరు కూడా తెలియదు."
"అయితే మీ దగ్గరకు ఎందుకు వచ్చినట్టూ?"
"మొన్న సాయంత్రం మూడు మూడున్నర గంటలకు అతడు మా ఆఫీసుకు వచ్చాడు తన పేరు రామానందస్వామి అని చెప్పాడు. రాధారాణిని చూడాలన్నాడు" అని ఆగి నరేంద్ర ముఖంలోకి చూశాడు .
"చెప్పండి."
"నేను అతడికి ఆ దారుణవార్త చెప్పాను. అంతకు ముందే వెళ్ళి మార్చ్యురీలో ఆమె శవాన్ని చూసి వచ్చానని చెప్పాను. ఆ వార్త విని అథదుఇ నెత్తిన పిడుగుపడిన వాడిలా అయిపోయాడు. ఓ అర్థగంట వరకు నోట మాటరాలేదు. ఆ తర్వాత కుమిలి కుమిలి ఏడ్చాడు. అతడ్ని చూస్తే నాకు చాలా బాధవేసింది. రాధారాణి మీకేమౌతుందని ప్రశ్నించాను. తనకేం కాదన్నాడు మళ్ళీ ఆమే తన సర్వస్వం అన్నాడు. అప్పుడే అదేదో ప్రేమ వ్యవహారం అనుకొన్నాను. అతడు ఢిల్లీ నుంచి ప్లైట్ లో కిందటి రాత్రే వచ్చానని చెపాడు. అప్పుడు నాకు అర్థం అయింది...." ఆగి ఊపిరి పీల్చుకున్నాడు.
"ఏమిటి అర్థం అయింది?"