"ఫామితీ ఫ్రెండేమిటి? దూరపుబందువేమిటి? అసలు సంగతి చెప్పు" అన్నాడు కృష్ణమూర్తి.
కమలాంబ కృష్ణమూర్తి కేసి చురచుర చూసింది.
కృష్ణమూర్తి సన్నగా పొడవుగా ఆకర్షణీయంగా ఉన్నాడు.
"అసలు సంగతేమిటి?" శంకర్రావును అడిగాడు నరేంద్ర.
"ఆవిడనే అడగండి" అన్నాడు శంకర్రావు.
"నువ్వు నోరుమూసుకొని కూర్చోలేవా? ఎందుకా అనవసరం ప్రసంగామంతా?" కసురుతుంది కమలాంబ.
"దీనిదుంప తెగ మొగడ్ని డబాయించినట్టే డబాయిస్తుందే?" మనసులోనే అనుకొన్నాడు ఇన్ స్పెక్టర్ అద్వయితం.
"అదేమిటత్తయ్యా అలా అంటావ్?"
"అత్తయ్యా దుత్తయ్యా! అలా పిలవద్దని చెప్పానా?" కోపంగా మందలించింది కృష్ణమూర్తిని కమలాంబ.
కృష్ణమూర్తి ముఖం కందగడ్డలా అయింది కోపంతో.
"ఇవ్వాళ కాకపోతే రేపైనా అలా పిలవాల్సినవాణ్ణేగా?"
"అదేమటి? ఇవ్వాళ అత్తయ్య కాని ఆవిడ రేపు అత్తయ్య ఎలా అవుతుంది?" సాలోచనగా అడిగాడు నరేంద్ర.
"వాడి ముఖం! పివ్చోడు బదో వాగుతూ ఉంటాడు"అన్నది కమలాంబ.
"ఇవ్వాళ పిచ్చోడుగా కన్పిస్తున్నానా? రామకృష్ణ చావకపోతే రేపు నా పెళ్ళి నీ కూతురితో జరిగివుండేది" కోపంగా అన్నాడు కృష్ణమూర్తి.
"పెళ్ళా?" ఇన్ స్పెక్టర్ విస్మయంగా అడిగాడు.
"అవునండి. కృష్ణమూర్తితో లావణ్య పెళ్ళి నిశ్చయం అయింది. శుభలేఖలు కూడా వేంచడం జరిగింది" అన్నాడుశంకర్రావు బాధగా.
"నిన్ను నోరుమూసుకోమన్నానా? వెళ్ళి స్నానంచేసి కోర్టుకు తయారవు" మందలించింది కమలాంబ శంకర్రావును.
శంకర్రావు లేపలేదు.
చిన్నముఖం చేసుకొని కృష్ణమూర్తి ఖాళీ సోఫాలో జారిగిలపడ్డాడు.
"నువ్విలా వచ్చి కూర్చో" అతడి పక్కన కూర్చోబుతున్న లావణ్యను ఉద్దేశించి అన్నది కమలాంబ.
లావణ్య పిల్లిలా వెళ్ళి తల్లి పక్కన కూర్చోబోతున్న లావణ్యను ఉద్దేశించి అన్నది కమలాంబ.
"మీ అమ్మాయి లావణ్యకూ, కృష్ణమూర్తికీ పెళ్ళి నిశ్చయం అయిందన్నమాట"
"అదేం లేదులెండి" అని సమాధానం ఇచ్చింది నరేంద్రకు కమలాంబ
"అదేమిటలా అంటారు? శుభలేఖలు కూడా వేశారటగా?" అన్నాడు అద్వయితం.
"అవునండీ ఇప్పుడు ఈమెగారు ధోరణి మార్చేశారు. కారణం అర్థం కావడం లేదు" అన్నాడు శంకర్రావు అతడి గుబురు కనుబొమ్మల కింద ఎర్రటి కళ్ళు కమలాంబ తీవ్రంగా చూశాయి.
"ఇదండి డిటెక్టివ్ గారూ వీళ్ళ ధోరణి! ఒకవైపు నేను ఒక్కగా నొక్క తమ్ముడ్ని పోగొట్టుకొని ఏడుస్తుంటే పెళ్ళి పెళ్లాని నా ప్రాణాలు తోడేస్తున్నారు ఇద్దరూ కలిసి" ఏడుపు ముఖం పెట్టి అన్నది కమలాంబ.
"కృష్ణమూర్తి మీద మీకంత ఇంటరెస్టెందుకూ?" తీవ్రంగా చూస్తూ శంకర్రావును అడిగాడు ఇన్ స్పెక్టర్.
"ఎందుకేమిటి? ఆయన నా మేనమామ" అన్నాడు కృష్ణమూర్తి.
"నువ్వు నోరుమూసుకొని బయటికి వెళ్ళు" కృష్ణమూర్తిని కొరకొర చూస్తూ అన్నాది కమలాంబ.
"ఓహొ! అంతవరకూ నచ్చిందన్నమాట?"
"ఏం? బెదిరిస్తున్నావా? చూశారా ఇన్ స్పెక్టర్ గారూ ఇతడి ధోరణి? మీ ముందే బెదిరిస్తున్నాడు" అన్నది కమలాంబ.
"ఏదో లెండి పాపం కుర్రాడు. పిల్లనిస్తానని ఆశపెట్టి ఇప్పుడు మొండి చెయ్యి చూపిస్తున్నారు అందుకే బాధపడ్తున్నాడు" అన్నాడు ఇన్ స్పెక్టర్.
లాఠీ జాడిస్తాడనుకొన్న అద్వయితం అలా మాట్లాడటం నరేంద్రకు ఆశ్చర్యం కలిగించింది. ఫర్వాలేదు బ్యాలెన్స్ లోనే ఉన్నాడనుకొని నవ్వుకొన్నాడు.
"బాగా చెప్పారండి ఇన్ స్పెక్టర్ గారూ! అలాగడ్డి పెట్టండి" అన్నాడు కృష్ణమూర్తి.
"ముందు నువ్వు బయటి కెళ్తవా లేదా?" కోపంగాఅరిచింది కమలాంబ.
"వాడ్నేందుకు అలా కసురుకుంటావ్? మధ్యలో వాడేం చేశాడూ?" అన్నాడు శంకర్రావు.
"తమ్ముడు చచ్చి నేనేడుస్తుంటే పెళ్ళో అని మీరేడుస్తారేం?" ఏడుపు గొంతుతో అన్నది కమలాంబ.
"రామకృష్ణ చనిపోవడంవల్లనే పెళ్ళి ఆపుచేశారా?" నిశితంగా ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు నరేంద్ర.
కమలాంబ తల ఊపింది.
"మళ్ళీ ఎప్పుడు చెయ్యాలనుకుంటున్నారూ?" విజయ్ అడిగాడు.
"తొందరేముందిలెండి" తేలిగ్గా కొట్టేస్తూ అన్నదికమలాంబ.
"శుభలేఖలు కూడా వేశారటగా?"
"అదే అర్థంకావడం లేదు. అంతకుముందు తనకూతుర్నిచేసుకోమని ఒకటే గొడవచేసింది. కృష్ణమూర్తి ఒత్తిడి చేసింది. తీరపెళ్ళిపత్రికలు వేశాక చిరాకుపడసాగింది. ఏదోవంకతో ఆ పెళ్ళి ఆపాలనికూడా ప్రయత్నించింది. సరిగా ఇప్పుడే రాకరాక వచ్చిన తమ్ముడ్ని ఎవరో చంపారు. ఆ వంకతో పూర్తిగా మొరాయిస్తున్నది" అన్నాడు శంకర్రావు.
కమలాంబ ముఖం కోపంతో కందగడ్డగా అయింది. అతడి కేసిమింగే సేట్టుగా చూసింది.
"ఏరా కృష్ణ! నేను చెప్పింది అబద్దమా?" అన్నాడు శంకర్రావు.
"అక్షరాలా నిజం ముందేమో కూతుర్ని నా మీదుకు ఉసిగొల్పింది. నన్ను వలలో వేసుకుంది. తీరా పెళ్ళి శుభలేఖలు కూడా వేశాక ప్లేటు ఫిరాయించింది. నా పరువేం కావాలి? అన్నాడు కృష్ణమూర్తి.
కమలాంబ మూతి తిప్పింది.
"కృష్ణమూర్తి లేచి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు.
"కృష్ణా! కృష్ణా!" అంటూ లావణ్య అతడి వెనకే బైటికి వెళ్లబోయింది.
"లావణ్య! నువ్వు లోపలకు ఫో!" కమలాంబ కూతుర్ని గద్దించింది.
లావణ్య వెనక్కు తిరిగివచ్చి, అయిష్టంగా తల్లి పక్కన కూర్చుంది.
విజయ్ లావణ్య ముఖంలోకి జాలిగా చూశాడు.
"శంకర్రావుగారూ! రామకృష్ణ ఆస్తి వ్యవహారాలన్నీ మీరే చూసే వారని చెప్పారు గదూ?"
"అవునండీ."
"మరి! రామకృష్ణ వీలునామా మీ చేతరాయించకుండా ఎవరితోనో ఎందుకురాయించినట్టు?" నరేంద్ర అడిగాడు.
"ఏం చెప్పమంటావ్?" అన్నాడు కమలాంబ ముఖంలోకి చూశాడు శంకర్రావు.
"శంకర్రావంటే తమ్ముడికి కోపమండీ?" అన్నది కమలాంబ.
"ఎందుకు కోసం?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
"అదే అతడు మా ఇంట్లో చనువుగా ఉంటాడని" నసిగింది కమలాంబ.
"ఓ ఐ సి" సాలోచనగా అన్నాడు నరేంద్ర.
"మరి మీ మీది కోపం లేదా?"
"ఎందుకు లేదూ? అందుకేగా? మూడేళ్ళ తర్వాత తిరిగి వచ్చి నాకంటికి కూడా కన్పించలేదు" అన్నది కమలాంబ.
"అంతకోసం ఉన్నవాడు మీకు ఆస్తి ఎందుకు రాస్తాడూ?" ఆమె ముఖంలోకి లోతుగా చూస్తూ అడిగాడు నరేంద్ర. కమలాంబముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేకుండా పోయింది పెదవులు ఆరిపోయి నట్టుగా నాలుకకో తడుపుకుంది. కొద్ది క్షణాల్లోనే తమాయించుకున్నది.
"మీ అపరాధ పరిశోధకులకూ, పోలీసులకూ మమతలూ,మనుకారాలూ అంటే ఏమిటో తెలియదుకుంటాను. వాడికి ఇంకెవరూ లేరు నన్నుకాదని ఎంత కోపం ఉన్నా తన యావదాస్తి బయటివాళ్ళకు రాస్తాడా?" నిలదీసినట్టుగా అడిగింది.
"అసలు ఆస్తిరాయాలని ఎందుకనిపించిందో? తనను ఎవరైనా ఆ రాత్రి హత్య చేస్తారని ముందే ఊహించాడా?"
"ఆ సంగతి నాకు తెలియదు లాయరు రమణారావుగారికి ఏమైనా చెప్పాడేమో?"
"మీరు రమణరావును అడగలేదా?"
"నాకు తమ్ముడి చావుతో మతిపోయినట్టయింది. తన ఆస్తినంతా నాకు రాశాడని విని దుఃఖం ఆగిందికాదు."
"ఆస్తి రాస్తే దుఃఖం ఎందుకూ?" ఇన్ స్పెక్టర్ అన్నాడు వ్యంగ్యంగా.
"అటువంటి సున్నితమైన విషయాలు చెప్పినా మీకు అర్థం కావులెండి" కసికసిగా అన్నది కమలాంబ,
అంతలో పోర్టికోలో కారాగిన చప్పుడైంది. కారుదిగి ఇద్దరు వ్యక్తులు గబగబా లోపలకు వచ్చారు. "రండి, రండి" లేచి నిల్చుని సంతోషంగా ఆహ్వానించింది కమలాంబ.
ఇన్ స్పెక్టర్నూ, నరేంద్రనూ చూసి ఇద్దరూ ఓ క్షణం నిలబడి పోయారు ముఖాలు వెలవెలా పోయాయి.
వాళ్లను చూసి శంకర్రావు లేచి పెద్ద పెద్ద అంగలు వేసుకొంటూ, ధనధన శబ్దం చేస్తూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు.
"హల్లో! ఇన్ స్పెక్టర్ మీరు ఇక్కడే ఉన్నారా, మీ కోసం సాయంత్రం రెండుసార్లు ఫోన్ చేశాను. వీరు తెలుసుగా సోమసుందరం గారు, రావూస్ టెక్స్ స్టయిల్స్ మేనేజరు" అని తనతో ఉన్న వ్యక్తిని పరిచయం చేశాడు రమణరావు.
"సోమసుందరంగారు తెలియకపోవడం ఏమిటి? ఆ వీరు నరేంద్ర ప్రఖ్యాత అపరాధ పరిశోధకులు. వారు వీరి అసిస్టెంట్ విజయ్ కుమార్" రమణరావుకు ఇన్ స్పెక్టర్ పరిచయం చేశాడు.
"ఈ గుంటనక్కగాడికి కూడా రాధారాణి హత్యతో సంబంధం ఉన్నట్టే ఉంది ఒక పట్టు పడితే నిజం కక్కేస్తాడు" సోమసుందరాన్ని చూస్తూ అనుకొన్నాడు అద్వయితం.
నరేంద్ర ఇన్ స్పెక్టర్ ముఖంలోకి చూస్తూ "నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలిసిందిలే" అన్నట్టు నవ్వాడు.
అద్వయితం కూడా చిరునవ్వుతోనే "ఒక పట్టుపట్టమంటావా ఏం? మనసులో అనుకుంటున్నాననుకొంటూ పైకే అనేశాడు నరేంద్రను చూస్తూ.