"ఆ సాయంత్రం రాధారాణి ఎయిర్ పోర్టుకు బయలుదేరింది అతడికోసమేనని. నాకు స్నేహితురాలు వస్తుందని చెప్పిందిపాపం రామానందకు కలుసుకాకుండానే దారుణహత్యకు గురి అయింది."
"అలా అని మీకేం తెలుసు?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"రాధారాణి హత్య చేయబడింది గదా? కొత్తగా నన్నుప్రశ్నిస్తారేం?" విసుగ్గా అన్నాడు సోమసుందరం.
"అది కాదు రామకృష్ణను కలుసుకోకుండానే హత్యకు గురి అయిందని మీకెలా తెలుసు?" గద్దించినట్టుగా అడిగాడు ఇన్ స్పెక్టర్
"కలుసుకుంటే అతడు తెల్లవారి మా ఆపీసుకు ఎందుకువస్తాడూ" ఎదురుప్రశ్న వేశాడు తీవ్రస్వరంతో.
"అతడు మీ ఆపీసుకు 3 గంటలకు వచ్చాడు. రాత్రి ఎయిర్ పోర్టుకు వెళ్ళి ఆమె రిసీవ్ చేసుకున్నాక అతడే ఆమెను చంపి ఉండవచ్చుగా?"
సోమసుందరం "కావచ్చు. ఆ విషయం నాకుతట్టనేలేదు సుమా?" అన్నాడు.
ఆ తర్వాత ఇంకేమన్నాడు?"
"తనకు ఒక మంచి లాయర్ కావాలన్నాడు. నమ్మకం కలవాడు కావాలన్నాడు. రమణరావు దగ్గరకు పంపిచాను. అతడ్ని గురించి వివరాలు అడిగితే చెప్పలేదు. సర్వం త్యజించిన మహర్షిలా నవ్వాడు."
"మీరు అతడ్ని రమణరావు దగ్గరకే ఎందుకుపంపించారు?"
"రమణరావు మా లీగల్ అడ్వాజరు. నాకు బాగా తెలిసినవాడు మంచివాడు. అందుకే ఈయన దగ్గరకు పంపించాను" అన్నాడు సుందరం తాపీగా.
"ఏమండీ మీ తమ్ముడు ఎలాంటివాడు?" నరేంద్రకమలాంబను అడిగాడు.
"చాలా మంచివాడు."
"రాధారాణి అతడే హత్య చేశాడంటే మీరు నమ్ముతారా?"
"ఏమో! నేనేం చెప్పగలను> వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో? భార్య మోసం చేసింది. ప్రాణ స్నేహితుడు మోసం చేశాడు. ఈ రాధారాణి కూడా ప్రేమించినట్లుగా నటించి ఏం ద్రోహం చేసిందో? తమ్ముడ్ని చూసి మూడేళ్ళుదాటి పోయింది ఏ కాలంలో ఎంతగా మారిపోయాడో ఏమో?" అన్నది కమలాంబ.
"అంటే ఆ హత్య మీ తమ్ముడే చేసి ఉండవచ్చునంటారు?"
'అది చెప్పాల్సింది మీరు?" విసుగ్గా అన్నది కమలాంబ.
"మీ తముడ్ని ఎవరు హత్య చేసి ఉంటారు?"
"నేనెలా చెప్పగలను?" అని రమణరావు కేసి చూసింది.
"కనీసం అనుమానం అయినా ఉండొచ్చుగా?"
"మా తమ్ముడ్ని హత్య చెయ్యాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అతడి ఆస్తి మీ చూపు ఉన్నవాళ్ళకు ఉంటుంది" అన్నది తీవ్రంగా కమలాంబ.
"ఆ చూపు ఎవరికీ ఉందంటారు?"
"అతడు చనిపోతే ఆస్తి వస్తుందని ఆశపడే వాళ్ళే ఈ పనిచేసి ఉంటారు?"
"తన ఆశలు అడియాశలు అయ్యాయనీ, మళ్ళీ తిరిగి ఆశ్రమానికే వెళ్ళిపోతానని చెప్పాడు. తన వాళ్ళెవర్నీ చూడటం తనకు ఇష్టం లేదన్నాడు. ఆ వీలునామా తన అక్కగారికి అందించమని చెప్పి వెళ్ళిపోయాడు." అన్నాడు రమణరావు.
"తిరిగి ఎప్పుడు వెళ్తానన్నాడూ?"
"ఎర్లీ మార్నింగ్ ప్లైట్ కు ఢిల్లీ వెళ్ళిపోతానన్నాడు పాపం? ఈ లోపలే ఎవరో నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకొన్నారు అన్నాడు రమణరావు.
"అతను ఉందే ఆశ్రమం పేరుగానీ. ఊరు పేరుగాని చెప్పాడా?" నరేంద్ర అడిగాడు.
"చెప్పలేదు."
"మీరు అడగలేదా?"
"అడిగాను. కాని అతడు చెప్పలేదు" అన్నాడు రమణరావు.
"మీరడగలేదా సోమససుందరంగారూ?"
"అడగలేదండీ. నాకసలు ఆ ఆలోచనే రాలేదు. అతడి బాధ చస్తుంటే నాబుర్రకు మరో ఆలోచనే తట్టలేదు."
"థ్యాంక్యూ! సోమసుందరంగారూ! అన్నాడు విజయ్.
"ఇక వెళ్దామా ఇన్ స్పెక్టర్" అంటూ నరేంద్ర లేచి నిల్చున్నాడు.
"ఓ.కె." అంటూ అద్వయితం, అతడి వెనక విజయ్ లేచారు.
"ఈ ముసలి నక్కను అరెస్టు చేస్తే ఎలా ఉంటుంది?" అన్నాడు ఇన్ స్పెక్టర్ బయటికి నడుస్తూ.
"బాగానే ఉంటుంది. కాని ఏ ఆధారంతో చేస్తావ్?"
"ఆధారాలు దొరుకుతాయి. ఇప్పుడు రెండో కేసుకు కూడా నాకు కొస దొరికినట్టుగానే ఉంది. వస్తాను" అంటూ అద్వయితం జీపులో కూర్చున్నాడు. నరేంద్ర కారు స్టీరింగు ముందు కూర్చున్నాడు. పక్క సీట్లో విజయ్ కూర్చున్నాడు.
9
మధ్యాహ్నం భోజనాలు అయాయి.
నరేంద్ర డ్రాయింగ్ రూంలో కూర్చుని సిగరెట్ తాగుతూ, సుడులు తిరుఘ్తూ పైకి పోతున్న పొగను చూస్తున్నాడు ఆ పొగలా అతడి బుర్రలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.
హంతకుడు ఎవరు?
శంకర్రావా?
సోమసుందరమా?
రమణరావా?
సోమసుందరం హంతకుడు కాడు. అతడికి అంత దైర్యంలేదు పైగా ఆ కొండల్లో వెంటబడి ఒక యువతిని చంపలేడు. అయితే హంతకుడెవరో అతడికి తెలుసు. ఈ కుట్రలో అతడికి భాగం ఉండి ఉండాలి.
ఇక మిగిలింది శంకర్రావు, రమణరావు, కృష్ణమూర్తి? నో, కృష్ణమూర్తికి హత్య చెయ్యాల్సిన అవసరంలేదు. అతడికి కావాల్సింది లావణ్యతో వివాహం.
కమలాంబకు తమ్ముడ్ని ఎవరు హహ్త్య చేశారో తెలిసివుండాలి. అద్వయితం అనుమానం తన మీద కూడా ఉంది. సూర్యనారాయణ సంగతేమిటి?
శంకరరావుకు రాధారాణిని చంపాల్సిన పనిలేదు. రాధారాణి హహ్త్య సూర్యనారాయణ చేసే అవకాశంలేదు. కారణం అతడికి రామకృష్ణ తిరిగి వస్తున్నాడని కానీ, రాధారాణిని ప్రేమిస్తున్నాడని కానీ తెలిసే అవకాశంలేదు.
విజయ్ వచ్చి ఎదురు కుర్చీలో కూర్చుంటూ "నరేంద్ర! ఏమిటాలోచిస్తున్నావ్?" అని అడిగారు.
నరేంద్ర చివ్వున తలెత్తి చూశాడు.
"హంతకుడు ఎవరనీ నీ ఉద్దేశ్యం?" అడిగాడు నరేంద్ర.
"హంతుకుడు ఒక్కడు కాడు, ఇద్దరు."
"ఎలా?"
"ఏలా ఏముంది? సూర్యనారాయణ రామకృష్ణను హత్య చేసి ఎలిచీ కోసం నీ దగ్గర కొచ్చాడు."
"మరి రాధారాణి హత్య చ్సినవాడు?"
"శంకర్రావు."
"అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?"
"గుండీ చెప్పేసిందిగా?"
"ఏం చెప్పింది గుండీ! రమణరావు షర్టుకు కూడా గుండీ ఒకటి తెగిపోయిదండి." అన్నాడు నరేంద్ర.
"రమణరావు మీ గుండీ ఒకటి లేదన్నప్పుడు తెగిపోయింది ఫిక్స్ చేయించాలి అన్నాడు, శంకర్రావు ఎక్కడో పోయింది కొనాలి అంటూ ఒక్క క్షణం ఆగకుండా బయటికి వెళ్ళిపోయాడు." అన్నాడు విజయ్.
"హంతకుడు ఎక్కడో పోయింది అని డిటెక్టివ్ తో చెప్తాడా హత్య జరిగిన ప్రదేశంలో పోయిందని తెలిసి?" అన్నాడు నరేంద్ర చిరునవ్వు నవ్వి!
విజయ్ ముఖం చిన్న బుచ్చుకొన్నాడు సమాధానం తోచక.
"కమాన్ ఆలోచించు" అన్నాడు నరేంద్ర.
"రమణరావు రాధారాణిని ఎందుకు హత్యచేస్తాడు?"
"మనం తెలుసుకొవాల్సింది అదే" అన్నాడు నరేంద్ర.
"అంటే మరణరావే హంతుకుడంటావా"
"అలా అనడంలేదు. నిన్ను ఆలోచించమంటున్నాను." అని నరేంద్ర కుర్చీలో వెనక్కు వాలి సిగరెట్ వెలిగించుకొన్నాడు.
"నేను మాత్రం శంకరావునే అనుమానిస్తున్నాను."
"గుడ్. నీకో ముఖ్యమైన పని ఇస్తున్నాను."
"ఏమిటి?"
"ఇంతకుముందు మనం నల్లకుంట కమలాంబఇంట్లో చూసినవాళ్ల గత చరిత్రలు తెలుసుకోవడానికి ప్రయత్నించు. సోమసుందరం, రమణరావు, శంకరావు, కమలాంబ, కృష్ణమూర్తి, లావణ్య వీళ్ళకున్న సంబందాలేమితో తెలుసుకో. లావణ్య-కృష్ణమూర్తుల పెళ్ళి ఆగి పోవడంలో ఏదో మిస్టరీ ఉంది. కమలాంబ చెప్పిన కారణంలో అంటే తమ్ముడి మరణంవల్ల పెళ్ళి ఆగిపోయిందని చెప్పడంలో ఏదో ఓటి మోత విన్పించింది. అసలు కారణం అది కాదని తెలుస్తూనే ఉంది." ఓ క్షణం ఆగి నరేంద్ర సిగరెట్ తీసి వెలిగించుకొని దమ్ము పీల్చాడు.
"మరి సూర్యనారాయణ, అనసూయల గురించి తెలుసుకోవలసిన అవసరం లేదంటావా? అదోలా పలికింది విజయ్ స్వరం.
నరేంద్ర ముఖం గంభీరంగా మారింది.
"అతడి సంగతేదో అద్వయితం చూసుకుంటానన్నాడుగా? నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. సరే గుండీ. రాధారాణి హంతకుడ్ని ఎటూపట్టిస్తుంది. అందుకే అంటారు ఎంత తెలివైన హంతకుడు కూడా, హత్య ప్రదేశంలో ఏదో ఒక క్లూ వదలి వెళ్తాడని అది పట్టుకొనే మనం ముందుకు సాగాలి. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు సామాన్యులుకారు. కాస్త ఆ జాగ్రత్తగా ఉన్నావో, అద్వయితానికి మరో శవం దొరుకుతుంది."
"పోలీస్ జీపు వచ్చినట్టుంది. అద్వయితం వచ్చాడు" అన్నాడు విజయ్.
బూట్లు టక్ టక్ లాడిస్తూ, చేతికర్ర తిప్పుకుంటూ అద్వయితం డ్రాయింగ్ రూంలోకి ప్రవేశించాడు.
"ర్మిటి మళ్ళీ వచ్చావ్?" నిశితంగా చూస్తూ అన్నాడు నరేంద్ర.
"నాకు విజయ్ తో మాట్లాడాల్సిన పని ఉంది అతడ్ని తీసుకెళ్తాను" అన్నాడు అద్వయితం.
"ఏమిటి కథ?" నవ్వుతూ అడిగాడు నరేంద్ర.
అద్వయితం చెప్పడానికి సందేహించినట్టు గ్రహించాడు నరేంద్ర.
"ఓ.కే. వెళ్లు విజయ్. నేను చెప్పిన సమాచారం కూడా నేకరించు" అన్నాడు నరేంద్ర.
"ఏం సమాచారం?" అద్వయితం అనుమానంగా చూస్తూ అడిగాడు.
"అదే కమలాంబ, శంకర్రావు, కృష్ణమూర్తి, రమణమూర్తి మొదలైన వారి గురించి ఇవరాలు సేకరించాలి" అన్నాడు నరేంద్ర.
"మీ వాడికి ఈ శ్రమ అనవసరం. తెల్లవారే లోపున నేను హంతకుడ్ని అరెస్టు చేయ్యబోతున్నాను" గంభీరంగా ముఖం పెట్టి అన్నాడు అద్వయితం.
నరేంద్ర ఇన్ స్పెక్టర్ భుజంతడుతూ "విష్ యూగుడ్ లక్" అన్నాడు.
"హంతకుడు అంటే ఏ హంతకుడు? రాధారాణిని చంపిన వాడినా, లేక రామకృష్ణను చంపినా వాడినా నువ్వు తెల్లారేసరికి అరెస్టు చెయ్యబోయేది?" విజయ్ ప్రశ్నించాడు.
"రామకృష్ణను చంపినవాడినే. రాధారాణి హత్యకు నాకు తలా తోకా కన్పించడంలేదు." జుట్టు పీక్కుంటూ అన్నాడు ఇన్ స్పెక్టర్.
"రామకృష్ణ హత్య కేసులో నీకు తోక దొరికిందన్నమాట ఇంకేం ఆ తోక పట్టుకొని ముందుకు సాగిపో" ఎగతాళిగా అన్నాడు విజియ్.
"పోతాను! ఎందుకు పోనూ?"
"పోతాను కాదు. పోతూనే ఉన్నాను అను అసలు అది కరెక్టుతోకో కాదో కాస్త ఆలోచించుకుని ముందుకు పోతే మంచిదని నా సలహా!" అన్నాడు నరేంద్ర.
"మిస్టర్ నరేంద్రా! ఈ కేసులో నాకు నీసలహా అవసరం అవుతుందని అనుకోను. విజయ్ నేనూ ఈ కేసు చూసుకుంటాం. నువ్వా రాధారాణి కేసు చూసుకో" అన్నాడు అద్వయితం.
ఆ మాటకు విజయ్ ముఖం మాతాబూలా వెలిగిపోయింది. అవును! ఈ కేసులో తను నరేంద్రతో ప్రమేయం లేకుండా ఇన్వ్ స్టిగేట్ చేస్తే, అసిస్టెంటు లెవల్ నుంచి డిటెక్టివ్ లెవల్ కు ఎదిగి, డిటెక్టివ్ ల లిస్టు లోరి ఎక్కేయవచ్చు. రామకృష్ణ హంతకుడెవరో తనకు ఖచ్చితంగా తెలుసు. అద్వాయితానికి కూడా అతడి మీదే అనుమానం.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?" నరేంద్ర విజయ్ ముఖంలోకి చూస్తూ అడిగాడు.
విజయ్ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు.
"నీ ఆలోచనలు నాకు తెలుసులే" అన్నట్టు చిరునవ్వు నవ్వాడు నరేంద్ర.
"విజయ్ ను తీసుకెళ్ళనా?" అద్వయితం నరేంద్రను అడిగాడు.
"వెళ్ళు విజయ్ గో.ఏ, హెడ్. విష్ గుడ్డ్ లక్" అన్నాడు నరేంద్ర విజయ్ను ప్రోత్సహిస్తూ.
విజయ్ ఉత్సాహంగాలేచాడు.
"నేను చెప్పిన విషయాలు మర్చిపోకు. ఆ సమాచారం కూడా సేకరించు." వెళ్తున్న విఅజయ్ ను ఆపి చెప్పాడు నరేంద్ర.
"అలాగే!" అని అద్వయితం వెనకే వెళ్ళే జీప్ ఎక్కాడు. విజయ్ పోలీస్ జీప్ బయటికి దూసుకుపోయింది.