ఇం : అరే నువ్వా ! ఎంత ఆశ్చర్యం ? నిన్ను యిలా కలుసుకుంటానని అనుకోలేదు సుమా!
(ఇద్దరూ గట్టిగా చేతుల కలుపుతారు.)
రచ : ఎన్ని సంవత్సరాలకు నిన్ను చూశాను?
ఇం : అవును. దాదాపు ఏడు సంవత్సారాల తర్వాత!
రచ : ఇంతకాలం ఎక్కడున్నావ్ ? భోపాల్ లోనేనా?
ఇం : కాదు. (భోపాల్ ఉద్యోగం సంవత్సరం తిరక్కుండానే ఊడిపోయింది) ఆ తర్వాత చాలా ప్రదేశాలు తిరిగాను. బొంబాయి, జలంధర్, మీరట్, ఉదయ పూర్ - ఒకటేమిటి ...తిరిగే ఉద్యోగం... ఒకటే బదిలీలు....
రచ : నీకు తిరగటం యిష్టమేగా ?
ఇం : ఇష్టమా ? ఏమో !
రచ : కొయ్యకు కంగారు, పెరూ, ఎస్కిమో ...అవన్నీ మర్చిపోయావా ?
ఇం : అవన్నీ నీకు యింకా గుర్తున్నాయా? సరళ భూగోళ పరిచయం....
రచ : ఏం నువ్వు మర్చిపోయావా ?
ఇం : మర్చిపోలేదు. కాని మారిపోయాననుకుంటున్నాను. ఆనాడు ఒక రూపాయ పన్నెండణాలు జేబులో వేసుకొని మద్రాసు బయలుదేరి వుంటే ఇవ్వాళ ఎలా వుండేవాణ్ణో చెప్పలేను. భూగోళందాటి భూమిలేదు అనిపిస్తుంది -ముఖ్యంగా మన దేశంలో.
రచ : పరదేశంలో.
ఇం : పరదేశాలు యింకా వెళ్ళలేదు. మలయా వెళ్ళటానికి ఇంటర్వ్యూకు హాజరయ్యాను. కాని ఆ వుద్యోగం దొరకలేదు.
రచ : దొరికితే వెళ్ళేవాడివా?
ఇం : ఎందుకెళ్ళను ?
రచ : పెళ్ళి చేసుకునట్టు లేదు ?
ఇం : ఏదీ టైం వుంటేగా ? నీ విషయం?
రచ : ఇద్దరం ఒకే బాటలో వున్నాం.
ఇం : అందరూ ఎలా వున్నారు?
రచ : అందరంటే ?
ఇం : అదే.... అమల్ , విమల్ , కమల్.
రచ : అందరూ బాగానే వున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. సంసారాలు చేస్తున్నారు.
ఇం : నీ మాటల్ని బట్టి అందరూ బాగా వున్నట్టు అన్నించడం లేదు.
రచ : అదేం లేదు. అందరూ బాగానే వున్నారు. నాకు వాళ్ళంటే ఎలాంటి అసూయా లేదు. నీకు కలుగుతుందా?
ఇం : ఏమో ! చెప్పలేను.
రచ : మానసి ఎలావుంది?
ఇం : మానసి ? అరే, అవునుగదూ! నువ్వు ఆమెను మానసి అనేవాడివి గదూ! బాగానే వుంది.
రచ : ఎక్కడ వుంటుంది ?
ఇం : పెళ్ళి చేసుకుందా లేదా అని తెలుసుకోవాలనేగా నీ వుద్దేశ్యం ? ఇంకా చేసుకోలేదు. నిజామాబాద్ లో ఒక స్కూల్లో పనిచేస్తూంది.
రచ : ఇంకా విశేషాలు ఏమిటి?
ఇం : నీకెలాంటి విశేషాలు కావాలో ముందు చెప్పు.
రచ : నువ్వు చెప్పదల్చుకున్నదే చెప్పు.
ఇం : నిజానికి విశేషాలంటూ ఏమీలేవు. నేను ఉద్యోగం చేస్తున్నాను. ఆమె ఉద్యోగం చేస్తూంది. నేను ఉత్తరం రాస్తాను. ఆమె జవాబు యిస్తుంది. సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటాం! మేమిద్దరం ముందే ప్లాను వేసుకొని శెలవు తీసుకుంటాం. బెంగుళూర్ లో కలుసుకుంటాం.
రచ : మీరిద్దరూ వివాహం చేసుకుంటారా?
ఇం : చేసుకోము అని చెప్పలేను. కాని యింతవరకు చేసుకోలేదు.
రచ : వివాహం ఎందుకు చేసుకోరు?
ఇం : ప్రత్యేకించి యిదీ అని చెప్పలేను. పరీక్ష పాసుకాగానే చేసుకుంటే బాగానే వుండేది. అదుగో___ఆ మైదానంలో కూర్చొని ఎన్ని కలలు కన్నానో... ఎన్ని ప్లాన్లు ఆలోచించానో? ఒక రోజు ఏమయిందో తెలుసా?
[మానసి ప్రవేశిస్తుంది దగ్గరగా వచ్చి కూర్చుంటుంది. రచయిత ఒక మూలకు - చీకట్లోకి వెళ్ళిపోతాడు.]
మా : ఇంద్ర్ ..... నా వల్లకాదు....
ఇం : ఏం కాదు?
మా : ఎందుకింత మొండి పట్టుదల చెప్పు! నాకు కొంత సమయం యివ్వు ఆలోచించుకోవటానికి.
ఇం : సమయం -సమయం -సమయం ! నువ్వు ఆరునెల్లుగా అడుగుతున్న మాటే యిది!
మా : నన్నేం చెయ్యమంటావ్ ? నువ్వే చెప్పు! నీకున్న సాహసం నాకు లేదు.
ఇం : సాహసం లేదు అనకు, ఇష్టంలేదు అను.
మా : ఇష్టం వున్న పనులన్నీ చెయ్యగలమా?
ఇం : అన్నిటి సంగతి నాకు తెలియదు. ఇష్టం వుంటే పెళ్ళిచేసుకోవచ్చు అని మాత్రం నాకు తెలుసు.
మా : మగవాళ్ళు ఏమైనా....
ఇం : మగవాళ్ళు ఏదైనా చెయ్యగలరు - అనేగా అనబోతున్నావ్ ?స్త్రీలు ఆలోచించగలరు. సమయంలో అడగగలరు.
మా : ఎందుకంత కోపం?
ఇం : కోపమెందుకు ? రేపు నేను మాద్రాస్ వెళుతున్నాను. ఇదేదో తేల్చుకుందాం అనుకుంటున్నాను.
మా : మద్రాసు వెళ్ళటానికీ....దీనికీ సంబంధం ఏమిటి?
ఇం : అదంతా నాకు తెలియదు. ఒక్క సంగతి మాత్రం చెప్పదల్చుకున్నాను.
మా : ముందు మద్రాసు వెళ్ళి ఆ తర్వాత చెప్పదల్చు కున్నదేదో తేల్చుకో !
ఇం : నన్నంటావ్ ? నీకే కోపం వచ్చింది.
మా : కోపం కాదు ఇంద్ర ! బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. జీవితం అంటే పిల్లల ఆట కాదు.
(ఇంద్ర చూస్తూ వుంటాడు. చీకటి - మనసి వెళ్ళిపోతుంది. రచయితమీద వెలుతురు పడుతుంది. ఇంద్ర లేచి రచయిత దగ్గరకు వస్తాడు.)
ఇం : మేమిద్దరం కూడా జీవితాన్ని పిల్లల ఆటగా అంగీకరించలేక పోతున్నాం. చాలా ఆలోచించాను. లాభ నష్టాల లెఖ్కవేశాను. ఇంకా వేస్తున్నాను. జీవితం నిజంగా పిల్లల ఆట అయి కూర్చుంటుందేమోనని అనిపిస్తోంది. జీవితం..... అమూల్యమైన జీవితం! పేపరు చదువుతుంటావా?
రచ : అప్పుడప్పుడు.
ఇం : ఒకసారి ఎప్పుడో చదివాను. అమెరికాలో అణు- అస్త్రాలంటే ఒక ఆటలా అయిందట. రైల్వేసిగ్నల్ లా ఓకే స్విచ్ వుంటుందట. దాంట్లోనే అన్ని యింటర్ లింక్స్ వుంటాయిట. ఏ పొరపాటునో ఒక ఆటం బాంబో పేలితే ప్రపంచమే నాశనం అవుతుందని తెలుసా?