Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 12


    నరసింహారావుగారి మనసునిండా 'వాసు' ఆలోచనలే ముసురుకున్నాయ్. అందుకే ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడకుండా రకరకాల ఆలోచనలు అందరిలోనూ గూడుకట్టుకుంటే మౌనంగా ఇల్లు  చేరుకున్నారు.  సుబ్బలక్ష్మి మాత్రం తనకు  నచ్చిన పుస్తకాలన్నీ తెచ్చుకుంది లైబ్రరీనుంచి. అవి  తిరగేస్తూ కూర్చుంది. కారు  ఇంటి ముందు ఆగింది. ఆయమ్మ అందరికీ  భోజనాలు ఏర్పాటు చేసింది. సుబ్బలక్ష్మి రెండో అన్నయ్య మాధవ్ వచ్చాడు. కుశల ప్రశ్నలూ, భోజనాలూ అయ్యాక భార్యకి  'అప్పెండి సైటీస్' ఆపరేషను చెయ్యాలనీ, దానికి కొంత డబ్బు కావాలనీ అడిగాడు. సుబ్బలక్ష్మిని  తీసికెళతా నన్నాడు.
    కాలేజీ పోతుందని వెళ్ళనంది సుబ్బలక్ష్మి. నరసింహరావుగారిచ్చిన అయిదువందలకీ, మరో అయిదునోట్లు కలిసి కొన్ని చీరలూ, రావికెలూ, బియ్యం, పప్పూ, ఉప్పులతోసహా మూటగట్టి ఇచ్చింది సుబ్బలక్ష్మి. కళ్ళతో చూస్తున్న కామాక్షమ్మగారు గానీ, సుమతికానీ కాదనలేక పోయారు. తరుచు సుబ్బలక్ష్మి అన్నలో. వదినలో రావడం, ఎంతో అంత పట్టుకుపోవడంపరిపాటై పోయింది. కామాక్షమ్మగారు తనలోతను సణుక్కోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది. సుమతి ఒకటి, రెండుసార్లు చెప్పినా నరసింహరావుగారు మెదలకుండా ఊరుకోవడం చూసి సుమతి కూడా చెప్పడం  మానేసింది. సుబ్బలక్ష్మి  విచ్చలవిడికి అడ్డంకులు లేకుండా పోయింది. ఎప్పుడంటే అప్పుడు స్నేహితులను  భోజనాలకి  పిలవడం, అప్పటి కప్పుడు ఆయమ్మచేత వంట చేయించడం, అది  బాగులేదనో, ఇది బాగులేదనో ఆయమ్మమీద అధికారం చెలాయించడం సుమతి గమనించలేక పోలేదు. తల్లిలా  పెంచిన  ఆయమ్మని  ఎవరు  ఏమన్నా సహించలేని సుమతి సుబ్బలక్ష్మితో ఒకటి రెండుసార్లు ఘర్షణపడక తప్పలేదు. అది చూసిన నరసింహరావుగారు తన పుట్టింటినించి తెచ్చిన మనిషిని సుబ్బలక్ష్మి వాడు కోవడం ఇష్టంలేక స్త్రీ సహజమైన అసూయతో సుమతి ఎదురు  తిరుగుతిరుగుతోందేమోనని అపోహపడ్డారే కానీ సుబ్బలక్ష్మి స్వభావాన్ని గుర్తించలేక పోయారు. ఆమెని మందలింకలేక పోయారు. మామగారి మౌనం సుమతికి అవమానంగా అనిపించింది. అయినా ఏం  చేస్తుంది? కన్న  తల్లినీ, దండ్రినీ పోగొట్టుకుని, కట్టుకున్న భర్తకి దూరంగా వుండి, కడుపులోని బాధ ఎవరితో చెప్పుకుంటుంది? సుమతికి తోడుగా కన్నీళ్ళే మిగిలాయి.
    చిన్నప్పటినుంచీ పెంచిన మమకారాన్ని తుంచుకోలేక సుమతి బాధపడుతుంటే చూళ్లేక సతమతమయిపోతోంది ఆయమ్మ.
    కన్నకొడుకు దూరంగా వున్నా, కోడలైనా సంతోషంగా కళ్లెదుట తిరగడం చూడలేక పోతున్నాననే బెంగతో, సుబ్బలక్ష్మి చేసే పనులపట్ల అసహ్యంతో నలిగిపోతోంది కామాక్షమ్మగారు. 
    ఇంటిలో పెరుగుతూన్న అసంతృప్తిని గమనించక పోలేదు నరసింహారావుగారు. ఒకటి రెండుసార్లు సుబ్బలక్ష్మికి బుద్ది చెప్పినా, బ్రతకనేర్చిన సుబ్బలక్ష్మి అతనిమాటల్ని  పట్టించుకోలేదు. సుబ్బలక్ష్మిని వాళ్ళ వూరికి పంపించేద్దామనుకున్నారు కానీ తాను జానకమ్మ కిచ్చిన మాట నిలుపుకోలేక పోతున్నాననే భావన కలిగేసరికి ఆ ప్రయత్నం మానుకున్నారు. అసలే వాసూ లేకపోవడంవల్ల కలిగిన ఒంటరితనం, ఇంటిలో అశాంతి అతనికి పిచ్చెక్కినట్టుంటోంది. సుబ్బలక్ష్మి తన స్నేహితులని పరిచయం చేసినప్పుడు కాలక్షేపానికి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ కాలాన్ని గడుపుతున్నారు. ఇతర వేళల్లో విశాఖ క్లబ్బులో పేకాడ్డం అలవాటు చేసుకున్నారు.
    పేకాటకి పెళ్ళాం, బిడ్డలని మరపించే శక్తి వుంది కాబోలు. అందుకే ధర్మరాజంతటి వాడు పేకాటలో ధర్మపత్నినే ఒడ్డి ఓడి పోయాడు. పాపం! నరసింహారావుగా రెంత!! కష్టాలను చిటికలో మరచిపోయి క్లబ్బులో కాలక్షేపానికి అలవాటు  పడ్డారు కామాక్షమ్మగారి బెంగ మరింత ఎక్కువయింది. కళ్ళు పోడుచుకున్నా నిద్దర పట్టక నిద్రమాత్రలకి అలవాటు  పడి, నిద్రలోనైనా బాధల్ని మరచిపోయి హాయిగా పడుకోవాలని ఆరాటపడుతోంది. మాత్రలకి దాసోహం అంది.
    అన్నింటికీ అతీతంగా వున్నది చింటూ ఒక్కడే. లక్కపిడతలాంటి నోరు, బీరపువ్వులాంటి నవ్వూ, వున్నమి చంద్రుడిలా వెన్నెలావెలుగులు కురిపిస్తున్నాడు. సుమతి జీవితంలో పన్నీటిజల్లు   జల్లి చల్లదనాన్నందిస్తున్నాడు. వాడికో ఆడుకొంటూ ఈ లోకాన్నే మరచిపోతుంది ఆయమ్మ. మరీ తోచనప్పుడు లైబ్రరీకి వెళ్ళడం, బాబుతో సాయంకాలాలు కారులో షికారు కెళ్ళడం ఇవే సుమతి రోజులోని కార్యక్రమాలు.
                              *        *        *
    రోజులు గడుస్తూన్నై, కాలచక్రంలో మరో నాలుగుమాసాలు దాటిపోయాయి. చింటూ కూర్చోడానికి ప్రయత్నాలు చేస్తూ, పడుతూ, లేస్తూన్నాడు. 'టెలిగ్రాం' అన్న కేక విని పరుగెత్తుకు వెళ్ళింది సుమతి. సంతకంచేసి పుచ్చుకుని విప్పి చదివింది.
    "అరై వింగ్ .....ఆన్ ....పీప్త్ ....గోవింద్" అని  వుంది. సంతోషంతో గుండె దడదడ లాడింది. కాళ్ళు ఒణుతూన్నట్టనిపించింది. గబగబా లోపలికెళ్ళి ఈవార్త అత్తగారికీ, ఆయమ్మకీ చెప్పింది. 'టెలిగ్రాం' తీసికెళ్ళి మామగారిచేతి కిచ్చింది. అతనికళ్ళు సంతోషంతో మెరిసిపోయాయి.
    "పాపం, పాసింగవుట్ పెరేడ్ కి రమ్మంటే ఎవ్వరమూ వెళ్ళలేకపోయాం, పాడు 'ప్లూ' నా కప్పుడే వచ్చింది. చింటూకి అప్పుడే వంట్లో బాగాలేకపోయింది. పోవీలే! వచ్చేస్తున్నాడు" అన్నారు సంతోషంగా.
    'టెలిగ్రాం' చూడగానే మనిషిని  చూసినంత సంబరం కలిగింది. ఇంటిల్లిపాదికీ, కొన్ని క్షణాలు అందరూ, అన్నీ  మరచిపోయి ఆనందంలో తేలిపోయారు. గోవిందు రావడానికి మరి రెండు రోజులే టైముంది. గోవిందు కిష్టమైన జంతికలూ, చేగోడీలూ, మైసూరుపాకూ దగ్గరుండి చేయిస్తున్నారు కామాక్షమ్మగారూ, సుమతీ.
    ఐదోతారీఖు రానే వచ్చింది. తలంటి నీళ్ళు పోసుకుని బింటూతో సహా అమ్మవారిగుడి  కెళ్ళొచ్చింది సుమతి. తనే  స్వయంగా వంటచేసి పెట్టింది కామాక్షమ్మ. సాయంత్రం అయిదింటికల్లా చింటూకి ముస్తాబు చేసింది. తెల్లటి ఎఱ్ఱంచు పోచంపల్లి పట్టుచీరలో తలనిండా కనకాంబరాలు తురుముకుని, మెళ్ళో ముత్యాలదండా, చెవులకు ముత్యాలదుద్దులూ నవ వధువులా వుంది సుమతి.
    నిమ్మపండు రంగు జార్జెట్ చీర, రవిక, అవేరంగు గాజులూ, మెళ్ళో పగడాలదండా, పగడాల దుద్దులూ, వదులుగా అల్లిన జడ, చిన్న తిలకం బొట్టూ తయారైంది సుబ్బలక్ష్మి "మీ రెవ్వరూ నన్ను పరిచయం చెయ్యకండి. బావ నన్ను గురుతుపడతాడో లేదో చూద్దాం" అంది.
    ఆయమ్మ తప్ప అందరూ బయలుదేరారు విమానాశ్రయానికి.
    విమానం రావడానికి ఇంకా పదిహేను నిముషాలు టైముంది. అక్కడున్న సోఫాల్లో కూర్చున్న రందరూ చింటూ నెత్తుకుని అటూఇటూ పచార్లు చేస్తోంది సుబ్బలక్ష్మి. ఆ కొద్దిసేపట్లోనే ఎవరెవరో ఆడా, మగా తెలిసినవాళ్ళు కనబడ్డారు సుబ్బలక్ష్మికి. 'ణా ఫ్రెండ్సు' అంటూ అందరికీ పరిచయం చేసింది.
    సుబ్బలక్ష్మి ఈ వూరోచ్చిన కొద్దిరోజులలోనే ఇంతమందితో స్నేహం చేసుకుంది. ఎప్పటినుంచో తెలిసినదానిలా ఎంతో చొరవగా మాట్లాడుతుంది. ఎప్పటినుంచో తెలిసినదానిలా ఎంతో చొరవగా మాట్లాడుతుంది కొత్తాపాతా లేకుండా. ఆమె  నై జానికి ఆశ్చర్యపోయింది సుమతి.
    'మెడ్రాస్ ప్లైట్ అరైనింగ్ ఇన్ టూ మినిట్స్ ' అనౌన్సు చేశారు. అందరూ లేచి నుంచున్నారు. సంతోషంతో తూలిపోతున్నట్టయింది సుమతికి. విమానంలోంచి దిగుతూన్న ఒక్కొక్కరినే వెయ్యి కళ్ళతో చూస్తున్నా రందరూ. "అదుగో....గోవింద్" అరచింది సుమతి. నల్లటి ఫాంటు, తెల్లటి షర్టూ, వెడల్పాటి గీతలటై! మెట్లుదిగి నడిచోస్తున్నాడు గోవింద్.

 Previous Page Next Page