ఆ క్షణంలో అతనికి ఒక్కటే అనిపించింది. ఈ పరిస్థితుల్లో నీలవేణిని ఈ ఇంటినుంచి బైటకి పంపకూడదు. పంపిస్తే తను చాలా తప్పు చేసినవాడు అవుతాడు.
వెంటనే సెల్ తీసి పెళ్ళికొడుక్కు, అతని మేనమామకి సారీ చెప్పాడు.
అయితే ఆ సారీ ఫలితం రెండు రోజుల తరవాత తెలిసింది.
ఆ కుర్రాడు బ్యాంకులో తనకు కనిపించిన ప్రతి ఒక్కరికీ వేణు భార్యతో అభిప్రాయభేదాలు వచ్చి ఆమెని ఇంటినుంచి వెళ్ళగొట్టాడని, మళ్ళీ పెళ్ళి చేసుకోడానికి ఆవిడ విడాకులు ఇవ్వకుండా వేణు మీద కక్ష తీర్చుకుంటోందని, అందుకే తన సుఖానికీ, సంతోషానికీ నీలవేణిని వాడుకుంటున్నాడని, ఆమెకి పెళ్ళి చేసి పంపిస్తే తన ఆటలు సాగవు కాబట్టి ఏదో వంకతో ఆమె పెళ్ళి క్యాన్సిల్ చేసి ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడని.
"ఏం వేణూ! బాధ్యతలు లేకుండా, ఖర్చు లేకుండా ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదోయ్. లక్కీఫెలోవి" అని కొందరు మిత్రులు వెటకారంగా నవ్వుతోంటే వేణుకి ఈ విషయాలు తెలిశాయి.
అది విన్న వేణు ఉగ్రుడైపోయాడు. తనని తాను కంట్రోల్ చేసుకోడం అసాధ్యమే అయింది. బ్యాంకులో సెలవు చీటీ పంపించి ఇంటికి వెళ్ళిపోయాడు.
అప్పుడు నీలవేణి వంటగదిలో ఉంది. సాంబారు ఘుమఘుమలు వస్తున్నాయి.
వేణు విసురుగా వంటగది గుమ్మంలోకి వెళ్ళి నిలబడి గట్టిగా అన్నాడు "నువ్వు రేపు నీ పెళ్ళికి రెడీ అవు."
"నీలవేణికి అంత అకస్మాత్తుగా అతనలా ఎందుకన్నాడో అర్ధం కాక తెల్లబోయి చూడసాగింది.
"అర్ధం కాలేదా? నీ సర్వీసెస్ మాకు అవసరం లేదు. రేపు గుళ్ళో నీ పెళ్ళికి రెడీ అవు."
చూస్తుండగానే ఆమె కళ్ళు నీటితో నిండిపోయి బొటబొటా కన్నీళ్ళు కారిపోయాయి.
కన్నీళ్ళ మధ్య వణుకుతున్న పెదాలతో అంది. "ఎందుకు? నా వలన ఏదన్నా తప్పు జరిగిందా?"
"తప్పు లేదు, రైటు లేదు. నీ పెళ్ళి చెయ్యాలి నేను. అయినా సంబంధం కుదిరాక నీకోసం ఏళ్ళ తరబడి ఎవరు ఎదురుచూస్తారు?"
నీలవేణి తల వంచుకుని శిలలా నిలబడిపోయింది.
"రేపు ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్ళి చేసేయాలి. ముహూర్తాలు, అవీ నాకు తెలియవు. దేవుడి ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంతే!" అంటూ అక్కడినుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
బ్యాంకుకి వెళ్ళిన వేణు మ్ద్య్యలో ఎందుకు వచ్చాడో, అంత అకస్మాత్తుగా తన పెళ్ళి అని ఎందుకు నిర్ణయించాడో అర్ధం కాని నీలవేణి వెర్రిదానిలా నిలబడిపోయింది. అణువణువూ వణికిపోతుంటే స్టవ్ ఆఫ్ చేసి వచ్చి తన గదిలో అచేతనంగా కూర్చుండిపోయింది.
వేణు మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే అతని ప్రవర్తనకి, మాటలకి నిర్వచనం తెలియక ఎవరిని అడగాలో అర్ధం కాక అయోమయంగా గడిపిన నీలవేణికి హఠాత్తుగా మాధవి ఇచ్చిన నెంబరు గుర్తొచ్చి ఆమెకి ఫోన్ చేయడం కోసం మెట్లు దిగి హాల్లోకి వచ్చింది.
అప్పుడు వినిపించింది ఆమెకి నీరసంగా తాయారమ్మ గదిలోంచి నీలవేణీ అన్న పిలుపు.
ఆవిడకి భోజనం టైం అయిందని గుర్తొచ్చిన నీలవేణి ఆవిడ గదిలోకి పరిగెత్తింది.
* * * * *
మరికొంతకాలం గడిచింది. అర్చనని జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ ప్రాజెక్ట్ కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వేశారు.
విజయవాడలో రిలీవ్ అయి ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలెక్టర్ ని కలిసింది.
ఆవిడ పేరు హరిణి.
ఎంతో అందమైన యువతి. డైరెక్ట్ గా ఐ.ఏ.యస్.కి సెలెక్ట్ అయి ఖమ్మం వచ్చింది.
అర్చనతో స్నేహంగా మాట్లాడింది.
"మీరెలాంటి ఇబ్బందీ పడకండి. ఫీల్ ఫ్రీ" అంది స్నేహంగా.
విజయవాడలో అర్చన అనుభవాలు అడిగి తెలుసుకుంది.
ఇద్దరూ వారి వారి విద్యా, వృత్తి గురించిన విషయాలు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలో పి.ఎ. కలెక్టర్ మీటింగ్ కి వెళ్ళాలని గుర్తుచేయడంతో హరిణి మరోసారి అర్చనకి షేక్ హ్యాండిచ్చి, బెస్టాఫ్ లక్ చెప్పి మీటింగ్ కి వెళ్ళిపోయింది.
ఆవిడ వైభోగం చూసిన అర్చన మనసులో ఒక్క క్షణం నాకీ రోజు ఎప్పుడొస్తుంది అనిపించింది. వెంటనే అంతరాత్మ త్వరలో అని సమాధానం ఇచ్చినట్టు అనిపించి నవ్వుకుంది.
* * * * *
భద్రాచలం....
శ్రీరాముడు సతీసమేతంగా కొలువై ఉన్న ప్రదేశం. పదిహేడవ శతాబ్దంలో కంచర్ల గోపన్న చేత నిర్మించబడిన పవిత్ర ప్రదేశం. అనంతరం భద్రాచల రామదాసుగా చరిత్రలో మిగిలిపోయాడు గోపన్న. అంతేకాక మహర్షి భద్రాద్రి తఃపస్సుకు మెచ్చిన రాముడు సీతాన్వేషణానంతరం రావణుడిని వధించి, సీతను తోడ్కొని వస్తూ మహర్షి భద్రాద్రికి మోక్షం ప్రసాదించాడని, ఆయన పేరుతోటే భద్రాద్రి పిలవబడుతోందని అంటారు. అలాగే పోకల దమ్మక్క అనే మహిళకు స్వప్నంలో కనిపించి తన విగ్రహాల ఆచూకీ తెలిపాడని, అవే నేటి భద్రాచలంలోని విగ్రహాల కథలు.
అఫీషియల్ డ్యూటీ మొదలుపెట్టేముందు రాముడిని దర్శించుకోవాలని పి.ఏ.కి చెప్పింది. వెంటనే అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి.
కలెక్టరుగారు వస్తున్నారు అంటూ అక్కడ ప్రతివాళ్ళు చేసిన హడావుడి, ఆర్భాటం అర్చనకి తమాషాగా అనిపించింది. నడుస్తుంటే కాళ్ళకింద రెడ్ కార్పెట్ పరచకపోయినా పరిచినంత హడావుడి చేశారు.
చుట్టూ విస్తరించిన గోదావరి నది మధ్యలో కొండమీద వెలసిన కోదండరాముడు, శ్రీరాముడు, అయోధ్యారాముడు.
ఆంద్రదేశంలోని పుణ్యక్షేత్రాల్లో తిరుపతి తరవాత అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పేరుపొందిన భద్రాచలంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టం అనిపించింది అర్చనకి.