జ్ఞానం కర్మలను ఎలా క్రమబద్దం చేస్తుంది??

 

జ్ఞానం కర్మలను ఎలా క్రమబద్దం చేస్తుంది??

జ్ఞానం మనిషిలో అంధకారాన్ని పోగొడుతుంది. ఎంతో మూర్ఖుడు, అజ్ఞానంలో పడిన వాడు కూడా జ్ఞానం కలగగానే తనను తన జీవితాన్ని మార్చుకుంటాడు. అలన్తి సగక్తి జ్ఞానానికి ఉంటుంది. మరి జ్ఞానం గురించి భగవద్గీతలో కృష్ణుడు ఏమి చెప్పాడు అంటే ఇదిగో కింది విధంగా చెప్పాడు.

యథైధాంసి సమిద్ధో౨ గ్నిర్భస్మసాత్కురుతే౨ర్జున౹

జ్ఞానాగ్నిస్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా॥

బాగా మండుతున్న అగ్ని తనలో వేసిన కట్టెలను ఏ విధంగా భస్మం చేస్తుందో, అలాగే జ్ఞానము అనే అగ్ని సర్వ కర్మలను భస్మము చేస్తుంది. 

ఈ శ్లోకములో జ్ఞానము అంటే అగ్ని అని అన్నారు. జ్ఞానమును అగ్నితో పోల్చారు. అగ్ని ఎలా అయితే కట్టెలను కాల్చి బూడిద చేస్తుందో అలాగే, జ్ఞానము కూడా కర్మలను కాలుస్తుంది. అని అన్నారు.  ఇంతకు ముందు మనం చేసిన పాపములు ఎలా నాశనం అవుతాయో చెప్పబడింది. ఇప్పుడు ఈ జన్మలో మనం చేసిన కర్మలు ఎలా నాశనం అవుతాయో చెబుతున్నాడు పరమాత్మ. మనం దుఃఖములో ఉన్నాము. ఆ దుఃఖము పోవాలంటే జన్మ రాకూడదు. జన్మ రాకూడదు అంటే కర్మలు, కర్మబంధనములు ఉండకూడదు. కర్మబంధనములు ఉండకూడదు అంటే జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం అనే అగ్నిలో వేసి కర్మలను, కర్మబంధనములను కాల్చివేయవచ్చు. ఆ అగ్ని కూడా ఎటువంటిది అంటే సమిద్దోగ్ని అంటే బాగా మండుచున్న అగ్ని. అంటే నివురు గప్పిన నిప్పుకాదు. నివురు గప్పిన నిప్పు అలా మండి, ఇలా చల్లరిపోతుంది. కానీ జ్ఞానము అనే అగ్ని అలా ఉండకూడదు అది మానవునిలో ఎప్పుడూ  ప్రజ్వరిల్లుతూ ఉండాలి.

ఇంకొక పదం కూడా వాడారు సర్వ కర్మాణి అని. అంటే సకల కర్మలు, ఆ కర్మల వలన కలిగిన బంధనములు. అంటే మానవుడు ఎటువంటి కర్మచేసినా సరే ఆ కర్మల వలన కలిగే బంధనములను జ్ఞానము తొలగిస్తుంది. జ్ఞానము అంటే ఏమిటి? ఆత్మతత్వమును తెలుసుకోవడం. ప్రాపంచిక విషయములు అన్నీ అశాశ్వతములు, అసత్యములు. పరమాత్మ ఒక్కటే సత్యము. ఆ పరమాత్మ అందరి హృదయాలలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. కాబట్టి ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి శాశ్వతుడు అయిన పరమాత్మలో మనసును లగ్నం చేయడం. ఇదే అసలైన జ్ఞానము.

ఇంక కర్మలు మూడు రకాలు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఒకసారి జ్ఞానం కలిగితే సంచిత కర్మ పూర్తిగా కాలి పోతుంది. అసలు మొలకెత్తదు. రెండవది ఆగామి కర్మ. ఒక సారి జ్ఞానం కలిగితే ఆగామి కర్మలను మనం నివారించవచ్చు. ప్రారబ్ధ కర్మ జ్ఞానం కలిగే కొద్దీ క్రమక్రమంగా క్షీణించి పోతుంది. ఈ ప్రారబ్ధ కర్మ జ్ఞానిని ఏమీ చేయలేదు. అంటే జ్ఞాని బయట ప్రపంచంలో ఏమిచేసినా అతనికి ఆ కర్మబంధనములు అంటవు. కాబట్టి ఈ జనన మరణ చక్రములో నుండి బయట పడదలచుకున్నవాడు ముందు కర్మయోగము తరువాత జ్ఞానయోగము అవలంబించి కర్మలను, ఆ కర్మల వలన కలిగే బంధనములను జ్ఞానము అనే అగ్నిలో దగ్ధం చేయాలి.

                                       ◆ వెంకటేష్ పువ్వాడ.