పంచభూతాల గుణములు!!

 

 

పంచభూతాల గుణములు!!


నిర్గుణము అంటే ఏ గుణము లేకపోవడం. ఏదో ఒక గుణము ఉంటే అది పరమాత్మతత్వము కాదు. భూమికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనే ఐదు గుణాలు ఉ న్నాయి. భూమి గుణము గంధము అంటే మట్టివాసన. దాని పైన ఉన్నది జలము. దానికి వాసన లేదు. అంటే ఒక గుణము లేదు. దాని పైన ఉన్నది అగ్ని. దానికి వాసన, రుచి రెండూ లేవు. అంటే రెండు గుణాలు లేవు. దాని పైన ఉన్నది వాయువు. దానికి వాసన, రుచి, రూపము లేవు. దాని పైన ఉన్నది ఆకాశము. దానికి వాసన, రుచి, రూపము, స్పర్శలేవు. ఆకాశము పైన ఉన్నది పరమాత్మ. ఆకాశమునకు ఉన్న శబ్ద గుణము కూడా పరమాత్మకు లేదు. కాబట్టి పరమాత్మ నిర్గుణుడు. ఏ గుణము లేనివాడు. అందుకని సగుణోపాసన ముందు ఆచరించి, నిష్కామ కర్మలను చేస్తూ, కర్మఫలములను భగవంతుడికి అర్పిస్తూ, క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపు మళ్లాలి అదే ప్రతి మానవుడి కర్తవ్యము.


దీనికి భగవానుడు ఒక చక్కటి మార్గం ఉపదేశించాడు. దానినే మన్మయా అని అన్నారు. అంటే ఎల్లప్పుడూ పరమాత్మనే ధ్యానించాలి. దైనందిన కార్యక్రమాలు ఏం చేస్తున్నా. పరమాత్మను. ప్రధానంగా మనసులో నిలుపుకోవాలి. సాధారణంగా మానవులకు ఏపని చేస్తున్నా, పరమాత్మ తప్ప అందరూ గుర్తుకువస్తారు. మానవులకు కోరికలు కోరుకునేటప్పుడు మాత్రమే పరమాత్మ గుర్తుకు వస్తాడు. మిగిలిన సమయాలలో భార్య, సంతానము, బంధువులు, మిత్రులు, పక్కింటి వాళ్లు, తీరని కోరికలు గుర్తుకువస్తాయి కానీ భగవంతుడు మాత్రం గుర్తుకు రాడు. కాబట్టి ప్రతి మానవుడికీ ఏ పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా ఏం చేసినా ప్రధానంగా మనసులో ఈశ్వరధ్యానం ఉంటే చాలు.


దీనికి చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక తల్లి పసిబిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి నిద్రబుచ్చి ఎక్కడో పని చేసుకుంటూఉంది. ఆమె ఏ పని చేస్తున్నా మనసు మాత్రం ప్రధానంగా బిడ్డమీదనే ఉంటుంది. చిన్న సవ్వడి అయినా, చిన్న ఏడుపు లాంటిది వినిపించినా ఏ పని చేస్తున్నా సరే ఆ పని వదిలిపెట్టి పరుగు పరుగున ఉయ్యాల దగ్గరకు వెళుతుంది. మనం కూడా ఏ పని చేస్తున్నా మన మనసును ప్రధానంగా పరమాత్మయందు లగ్నం చేయాలి. ఎన్ని పనులు చేస్తున్నా ఇదంతా ఆ పరమేశ్వరుని కొరకు చేస్తున్నాను అనే బుద్ధితో చేయాలి.


మంచి పనులు చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. అప్పుడు నిరుత్సాహ పడిపోకూడదు. మరి ఏం చేయాలి. భగవంతుని ఆశ్రయించాలి. “మామ్ ఉపాశ్రితా: "అంటే దేవా! నీవే నాకు ఆధారము. నీవే ఈ అడ్డంకులు తొలగించి నన్ను కాపాడాలి అని పరమాత్మను ఆశ్రయించాలి. ఎలాగా అంటే దేవతలు దానవులు కలిసి మంథర పర్వతంతో క్షీరసాగర మధనం చేస్తుంటే, ఆ మంథర పర్వతం మునిగిపోతోంది. అప్పుడు వారు పరమాత్మను ఆశ్రయించారు. పరమాత్మ కూర్మంగా ఆ మంధర పర్వతము కింద ఉండి దానిని మునిగిపోకుండా ఆపాడు. అలాగే మనం కూడా పరమాత్మను ఆశ్రయిస్తే మన ప్రమేయం లేకుండానే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. 


ఒకవేళ అడ్డంకులు ఉన్నా వాటి గురించి మరిచిపోతాము. పరమాత్మ నాకు అండగా ఉన్నాడు నాకే తక్కువ అంటూ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాము. (తక్కువేమి మనకూ రాముడు చెంతనుండు వరకూ అని రామదాసు ఎలుగెత్తి పాడాడు) అప్పుడు మనకు రాగము, ద్వేషము, భయము, కోపము ఉండవు. రాగము అంటే సంగమము, అటాచ్మెంట్. అది ఇష్టం ఇది ఇష్టంలేదు అనే భావన. రావాల్సింది రాకపోతే కోపము, వచ్చింది పోతుందేమో అన్న భయము, నాకు ఇష్టంవచ్చింది రాలేదే అన్న దిగులు. మనసు పరమాత్మ మీద ఉంటే ఇవన్నీ ఉండవు. మనసు ప్రశాంతంగా నిర్మలంగా, పరిశుద్ధంగా ఉంటుంది.


ఈ పరిశుద్ధమైన మనసుకు జ్ఞానం తోడు కావాలి. జ్ఞానం అనేది ఒక తపస్సు. శాస్త్రములు చదివినందువలన, అధ్యయనం చేసినందువలన, అర్థం చేసుకొన్నందువల్ల, జ్ఞానం వస్తుంది. దానినికూడా ఒక తపస్సులాగా అధ్యయనం చేయాలి. అందుకే దానిని "జ్ఞాన తపసా” అంటే జ్ఞానతపస్సు అని అన్నారు. ఈ ప్రకారంగా మనసును పరమాత్మలో లగ్నం చేసి, పరమాత్మను ఆశ్రయించి, రాగము, భయము, కోపము వదిలిపెట్టి, జ్ఞానమును ఒక తపస్సులాగా సంపాదించుకుంటే, అటువంటి వాడు “పూతా మద్భావమాగతా:” అంటే పునీతుడు, పవిత్రుడు. అవుతాడు. అటువంటి వాడు నా స్వరూపాన్ని, నా స్థితిని పొందుతాడు. ఈ ప్రకారంగా పరమాత్మను పొందిన వారు చాలా మంది ఉన్నారు.

                          ◆వెంకటేష్ పువ్వాడ.