గుడిలో గంట ఎప్పుడు మోగించాలి.. దీనికి కూడా నియమాలున్నాయా!
గుడిలో గంట ఎప్పుడు మోగించాలి.. దీనికి కూడా నియమాలున్నాయా!
హిందూ మతంలో గంటకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇంట్లో అయినా, గుడిలో అయినా గంట మోగించడం తప్పకుండా జరుగుతుంది. పూజల సమయంలో మాత్రమే కాకుండా గుడికి వెళ్లినప్పుడు కూడా గంట మోగిస్తుంటారు. గంట మోగించడం అనేది కేవలం మతానికి, భక్తికి సంబంధించినది కాదు.. దీని వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది. స్కంద పురాణం సహా అనేక గ్రంథాలు గంట శబ్దం గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ప్రస్తావించాయి. అసలు గంట మోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? గంటను ఎప్పుడు, ఎలా మోగించాలి? ఎలా మోగించడం వల్ల సరైన ఆధ్యాత్మిక, దైవిక, శాస్త్రీయ ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే..
గుడిలో గంట ఎప్పుడు మోగించాలి?
దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు గంట మోగించడం చాలా మంచిదని చెబుతారు. గంట శబ్దం మనస్సును ప్రాపంచిక పరధ్యానాల నుండి దూరం చేస్తుంది, భక్తుడు ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడుతుంది. దీని వల్ల పూర్తి భక్తితో పూజలు చేయడానికి వీలు కల్పిస్తుంది. హారతి సమయంలో గంట మోగించడం కూడా చాలా మంచిది. పూజ సమయంలో గంట మోగిస్తే పూజ మరింత శక్తివంతంగా మారుతుందట.
ఇంట్లో గంట మోగించడం..
ప్రతి హిందువు ఇంట్లో దేవుడి గది తప్పకుండా ఉంటుంది. ఇంట్లో కూడా ఉదయం, సాయంత్రం పూజ ప్రారంభించే ముందు గంట మోగించాలి. ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుందని, వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు. పురాణాలలో గంట శబ్దం సృష్టిలో వెలువడిన మొదటి ధ్వని శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది, ఇది మానసిక అశాంతిని, ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తుంది.
గంట ఎప్పుడు మోగించకూడదు..
వాస్తు, మత విశ్వాసాల ప్రకారం గుడి నుండి బయటకు వెళ్ళేటప్పుడు గంట మోగించడం మంచిది కాదు. లోపలికి వెళ్ళేటప్పుడు గంట మోగించడం వల్ల దేవతలను ఆవాహన చేయడం జరుగుతుందట. అదే తిరిగి వచ్చేటప్పుడు అలా చేయడం వల్ల పూజ సమయంలో లభించే శాంతి, సానుకూలతకు భంగం కలుగుతుందట. కాబట్టి పూజ తర్వాత ప్రశాంతమైన మనస్సుతో దేవతలకు నమస్కరించి వచ్చేయాలి.
ఈ నియమాలు తప్పనిసరి..
శాస్త్రాల ప్రకారం గంటను పదే పదే లేదా ఎక్కువసేపు మోగించకూడదు. సాధారణంగా రెండు నుండి మూడు సార్లు గంట మోగిస్తే సరిపోతుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు గంటను ఎడమ చేతితో మోగించాలి. రాత్రిపూట గంటను బిగ్గరగా మోగించకూడదు. గంట శబ్దం కొన్ని క్షణాలు ప్రతిధ్వనిస్తూ సానుకూల ప్రకంపనలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇంటిని శుద్ది చేస్తుంది. ఇది లయబద్దంగా వీలైనంత సరళంగా ఉండాలి. అప్పుడు ఇల్లంతా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది.
*రూపశ్రీ.