పూజ చేసేటప్పుడు ఆసనం పై కూర్చోవాలి అంటారు ఎందుకు!
పూజ చేసేటప్పుడు ఆసనం పై కూర్చోవాలి అంటారు ఎందుకు..
ఏ ఆసనం ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుందంటే!
హిందూమతంలో, పూజ , మంత్ర జపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పూజ అయినా, మంత్ర జపం అయినా, కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ ముఖ్యమైన నియమాలలో ఒకటి., పూజ మరియు మంత్ర జపం ఆసనంపై కూర్చుని చేయాలి. చాలామంది తరచుగా నేలపై కూర్చుని పూజలు , మంత్ర జపాలు చేస్తుంటారు. కానీ ఆసనం లేకుండా కూర్చుని పూజ చేయడం వల్ల కలిగే హాని చాలా మందికి తెలియదు. అంతేకాదు.. ఆసనాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆసనం వేసుకోకుండా పూజ, జపం చేస్తే ఏమవుతుంది? ఏ అసనాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి? తెలుసుకుంటే..
ఆసనం ఎందుకు ముఖ్యం?
ఆసనంపై కూర్చుని పూజ చేయడం దేవదేవతలను గౌరవించడం అని పండితులు చెబుతారు. అటువంటి పూజ సంపూర్ణమైనదిగా , శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది.
ఆసనంపై కూర్చుని పూజ చేయడం లేదా మంత్రాలు జపించడం ద్వారా జ్ఞానం, శాంతి, అదృష్టం, సంపద , సిద్ధులు లభిస్తాయి.
ఆసనంపై కూర్చుని పూజ చేయడం వల్ల శరీరం సౌకర్యవంతమైన స్థితిలో ఉంటుంది, ఇది మనస్సును పూజలో పూర్తిగా లీనం చేసి ఏకాగ్రతతో ఉండటానికి వీలు కల్పిస్తుంది.
ఆసనంపై కూర్చుని పూజ చేయడం ద్వారా శారీరక, ఆధ్యాత్మిక పరిశుభ్రత సురక్షితంగా ఉంటుందట.
ఆసనంపై కూర్చొని పూజ చేయడం, మంత్రాలు జపించడం ద్వారా భూమి, ఆకాశాల శక్తుల మధ్య సమతుల్యత కాపాడబడి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
భూమికి అయస్కాంత శక్తి ఉంది, ఆసనం లేకుండా పూజ లేదా మంత్ర పఠనం చేసినప్పుడు, దాని ప్రభావం మొత్తం భూమికి బదిలీ అవుతుంది. ఆసనం లేకుండా ఏ దైవ కార్యం చేసినా ఫలితమివ్వదు. అందువల్ల, పూజ , మంత్ర పఠనం ఆసనంపై కూర్చొని చేయాలి.
ఏ ఆసనాలు ఏ ఫలితాన్ని ఇస్తాయి?
కుశ గడ్డితో చేసిన ఆసనం..
శాస్త్రాల ప్రకారం, పూజ చేయడానికి లేదా మంత్రాలు జపించడానికి కుశ ఆసనం అత్యంత శుభప్రదమైనదిగా మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనినే దర్బ ఆసనం అని అంటారు. ఈ ఆసనం అన్ని ప్రతికూలతలను తొలగించి, పనులు పూర్తి చేయడానికి సహాయపడుతుంది.
ఉన్ని చాప లేదా ఆసనం..
ఉన్ని చాపపై కూర్చోవడం శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది , చలికాలంలో ఈ ఆసనంపై కూర్చోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. శీతాకాలంలో ఉన్ని చాపపై కూర్చుని దేవుడిని పూజించడం మంచిదని భావిస్తారు.
పట్టు లేదా నూలు చాప..
పట్టు పీఠాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు, దానిపై కూర్చుని పూజ చేయడం వల్ల ఆ కర్మఫలం పూర్తిగా లభిస్తుంది. పట్టు ఆసనం శుభప్రదంగా పరిగణించబడుతుంది. సాయంకాల ప్రార్థనలకు నూలు ఆసనం అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు.
ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి..
ఇంట్లో లేదా గుడిలో పూజ చేస్తుంటే, సుఖాసనంలో కూర్చోవాలి. పూజ , కర్మకాండలకు పద్మాసనం లేదా వజ్రాసనం కూడా అనువైనవి. వీపును నిటారుగా, తలను నిటారుగా ఉంచి కూర్చోవాలి.
*రూపశ్రీ.