సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను పొరపాటున కూడా దానం చేయకూడదు..!
సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులను పొరపాటున కూడా దానం చేయకూడదు..!
ఏ మతం అయినా సరే.. దానం, దైవ ఆరాధన చేయాలని చెబుతుంది. పరులకు సహాయపడమని చెబుతుంది. హిందూ మతంలో ఈ దానానికి మరింత ప్రాముఖ్యత ఉంది. కేవలం ఇతరులకు సహాయపడటం అనే కారణంగానే కాకుండా దైవ కృప కోసం, గ్రహ శాంతి కోసం, జీవితంలో జాతక పరిష్కారాల కోసం దానాలు చేయమని చెబుతుంది. అయితే దానాలు చేయడానికి కూడా కొన్ని నియమాలు విదించింది. దానం అనేది ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయకూడదు? అనే విషయాలను శాస్త్రాలు తెలియజేశాయి. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కొన్ని దానాలు అస్సలు చేయకూడదు అనే నిబంధన ఉంది? ఇంతకీ సూర్యాస్తమయం తర్వాత ఏ దానాలు చేయకూడదు తెలుసుకుంటే..!
డబ్బు, నగలు..
కొందరు డబ్బు, నగలు దానం చేస్తుంటారు. అయితే సూర్యాస్తమయం తర్వాత డబ్బు, నగలు దానం చేయడం అస్సలు మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. డబ్బును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అలాగే లక్ష్మీదేవి సాయంత్రం సమయంలో ప్రతి ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. అందుకే సాయంత్రం అవ్వగానే ఇల్లు వాకిలి ఊడ్చి, దీపం పెట్టి, తలుపు తెరచి ఉంచుతారు. అలాంటి లక్ష్మీ స్వరూపం అయిన డబ్బును సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా దానం చేయడం అంటే లక్ష్మీదేవిని బయటకు పంపడమే. అందుకే సూర్యాస్తమయం తర్వాత డబ్బు కానీ, లక్ష్మీ స్వరూపంగా భావించే నగలు కానీ దానం చేయకూడదని చెబుతుంటారు. ఇలాంటివి ఏవైనా చేయాల్సి వస్తే పగటి పూట చేయడం మంచిదని అంటున్నారు.
పాలు, పెరుగు..
పాలు చంద్రునితో ముడిపడి ఉంటాయి. ఇది మనశ్శాంతిని, కుటుంబ ఆనందాన్ని సూచిస్తుంది. రాత్రిపూట పాలు దానం చేయడం వల్ల చంద్రుని ప్రభావం బలహీనపడుతుందట. దీని వలన ఇంట్లో ఉద్రిక్తత, ఆర్థిక నష్టం జరుగుతుంది. మరోవైపు, పెరుగు సంపదను, సౌకర్యాన్ని ఇచ్చే గ్రహం అయిన శుక్రుడిని సూచిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత పెరుగు దానం చేయడం వల్ల వైవాహిక జీవితంలో, కుటుంబ సభ్యుల మధ్య సంతోషం విషయంలో ప్రతికూల ప్రభావం చూపుతుందట. అయితే పగటిపూట ఈ రెండింటిని దానం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు లభిస్తాయి.
ఉప్పు..
సాధారణంగా మత సాంప్రదాయం ప్రకారం ఉప్పును అప్పుగా ఇవ్వడం, దానం చేయడం చేయకూడదని చెబుతారు. ఇక సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అస్సలు చేయకూడదు అంటారు. ఉప్పును ప్రతికూల శక్తిని గ్రహించే పదార్థంగా పరిగణిస్తారు. అందుకే ఎవరికైనా దిష్టి తగిలింది అనగానే ఉప్పు తీసుకుని దిష్టి తీస్తుంటారు. ఉప్పు రాహువు, కేతువులకు సంబంధించినదిగా చెబుతారు. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా ఉప్పు దానం చేయడం లేదా ఇవ్వడం వల్ల ఇంట్లో ప్రతికూలత పెరుగుతుందట. కుటుంబ వివాదాలు, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయట.
పసుపు..
పసుపును జ్ఞానం, శ్రేయస్సు, గౌరవాన్ని సూచించే బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. సాయంత్రం లేదా రాత్రి పసుపును దానం చేయడం వల్ల బృహస్పతి గ్రహం బలహీనపడుతుందట, ఇది వ్యక్తి గౌరవాన్ని, ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుందట. ముఖ్యంగా గురువారం నాడు ఈ నియమాన్ని పాటించడం చాలా ముఖ్యం అని భావిస్తారు.
ఉల్లి, వెల్లుల్లి..
వెల్లుల్లి, ఉల్లిపాయలను తామస ఆహారాలుగా పరిగణిస్తారు. ఇవి కేతు గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత వాటిని దానం చేయడం లేదా మార్పిడి చేయడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుందట. ఇది పనిలో అడ్డంకులు, ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని చెబుతారు.
*రూపశ్రీ.