భార్యాభర్తల మధ్య గొడవలా.. ఇంట్లో ఈ ఒక్క ఫొటో తప్పకుండా ఉంచితే సమస్యలు తగ్గుతాయి..!

 


హిందూ ధర్మంలో కుటుంబ వ్యవస్థకు చాలా  ప్రాధాన్యం  ఉంది. కుటుంబం ఆనందంగా, శాంతియుతంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం, అవగాహన ఉండాలని శాస్త్రాలు కూడా  బోధిస్తాయి. అయితే నేటి కాలంలో చిన్నచిన్న అపార్థాలు, అభిప్రాయ భేదాలు, ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల కారణంగా దాంపత్య జీవితంలో కలహాలు ఏర్పడుతున్నాయి.భార్యాభర్తల మధ్య గొడవలు, అభిప్రాయ బేధాలు ఉన్నప్పుడు.. చాలామంది వాటి పరిష్కారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.  ఎంతో మంది భార్యాభర్తలు తమ మధ్య గొడవలు ఉండకూడదని ఆధ్యాత్మికంగా ఎన్నో పరిహారాలు కూడా పాటిస్తుంటారు.  వాటిలో పెద్దలు, పండితులు చెప్పే శక్తివంతమైన పరిహారం.. ఇంట్లో శివపరివారం ఫోటో ఉంచుకోవడం.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

శివపరివారం పటం లేదా ఫొటో..

ఇంట్లో శివపరివారం ఫొటో ఉంచుకోవడం వల్ల  కుటుంబంలో సానుకూల శక్తులు పెరిగి, దాంపత్య బంధం బలపడుతుందని నమ్ముతారు.

శివపార్వతుల దాంపత్యం..

హిందూ పురాణాలలో శివపార్వతుల దాంపత్యం చాలా ఆదర్శమైనది. పార్వతీదేవి పరమశివుని పొందడానికి అనేక సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. ఆమె భక్తికి, అంకితభావానికి మెచ్చిన పరమశివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత కూడా వారి జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి. అయినప్పటికీ  పరస్పర గౌరవాన్ని, ప్రేమను, ఒకరి పట్ల మరొకరు నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అందుకే శివపార్వతుల దాంపత్యం అన్ని దాంపత్యాలకు ఆదర్శంగా పరిగణించబడుతుంది. శివపార్వతులను ఆది దంపతులు అనడం వెనుక కారణం కూడా ఇదే.

శివపరివారం..

శివ పరివారం అంటే.. పరమేశ్వరుడు ఆయన ధర్మపత్ని పార్వతి దేవి,  వారి కుమారులు వినాయకుడు, కుమారస్వామి.. పరమేశ్వరుడి వాహనం అయిన నంది.. ఇలా అందరూ కలిసి ఉన్న ఫొటోనే శివ పరివారం చిత్రం అని అంటారు. ఈ ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలని కూడా చెబుతారు.

పరమశివుడు – సహనం, జ్ఞానం..

పరమశివుడు అపారమైన సహనానికి ప్రతీక. కోపం వచ్చినప్పటికీ ధర్మాన్ని విడిచిపెట్టడు. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం కనుగొనాలని ఆయన మనకు బోధిస్తాడు.

పార్వతీదేవి – ప్రేమ, అంకితభావం..

పార్వతీదేవి మాతృత్వానికి, ప్రేమకు, కుటుంబ పరిరక్షణకు ప్రతీక. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, త్యాగం, బాధ్యత కలిగి ఉండాలని ఆమె సందేశం.

గణేశుడు – విఘ్నాల నివారణ..

గణపతి అన్ని విఘ్నాలను తొలగించే దేవుడు. కుటుంబంలో వచ్చే అపార్థాలు, అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు తొలగాలని భక్తులు ప్రార్థిస్తారు.

కుమారస్వామి – ధైర్యం, క్రమశిక్షణ..

సుబ్రహ్మణ్యస్వామి ధైర్యం, నియమం, బాధ్యతకు ప్రతీక. కుటుంబ సభ్యులు తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించాలని సూచిస్తాడు.

నంది – విశ్వాసం, భక్తి..

నంది ఎల్లప్పుడూ శివుని సేవలో ఉండే పరమ భక్తుడు. దాంపత్య జీవితంలో విశ్వాసం, నిబద్ధత, ఓర్పు ఎంత ముఖ్యమో నంది సూచిస్తాడు.

శివపరివారం చిత్రం ఎందుకు ఉండాలి?

శివపరివారం చిత్రంలో శివుడి కుటుంబం అందరూ ఉంటారు.  ప్రతి ఇంట్లో ఈ ఫొటో ఉంటే.. ఆ శివుడి కుటుంబం లాగా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఉంటారని నమ్మకం.  శివ పరివారంలో ఉండే వారి వ్యక్తిత్వాలు.. సాధారణ కుటుంబంలో ఉండే ప్రతి వ్యక్తి అలవర్చుకుంటే.. ఆ కుటుంబం కూడా ఎంతో గొప్పగా, ఉన్నతంగా మారుతుంది.

ముఖ్యంగా బార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు లేదా సమస్యలకు చాలామంది వెంటనే ఆది దంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులనే పూజిస్తారు.  శివ పరివారం ఫోటో ఇంట్లో ఉంటే.. భార్యాభర్తలు కూడా శివ పరివారం లాంటి కుటుంబాన్ని నిర్మించుకోగలుగుతారని పెద్దల మాట.

                                                                                                                                                *రూపశ్రీ.