పూజలో మిగిలిపోయిన పదార్థాలను ఏం చేయాలి.. చాలా మందికి తెలియని నిజాలివి!

 

పూజలో మిగిలిపోయిన పదార్థాలను ఏం చేయాలి.. చాలా మందికి తెలియని నిజాలివి!

హిందూ ధర్మంలో పూజకు చాలా ప్రాధాన్యత ఉంది.  ఏ దేవుడి పూజ చేసినా పువ్వులు, నూనె, నెయ్యి,  అగరువత్తులు, పసుపు, కుంకుమ.. వంటివి వినియోగిస్తారు. అయితే ఒక పూజ కోసం ప్రత్యేకంగా తీసుకున్న పదార్థాలను తిరిగి మళ్ళీ ఇంకొక పూజలో వాడటం నిషేధంగా పరిగణిస్తారు. వీటిలో కొన్ని పదార్థాలను తిరిగి ఉపయోగించుకోవచ్చు కానీ.. కొన్ని వస్తువలు మాత్రం తిరిగి ఉపయోగించకూడదు. అవేంటో తెలుసుకుంటే..

పూజ చేసేటప్పుడు మిగిలిన వస్తువలను తిరిగి ఉపయోగించకుండా పారేయవచ్చని అనుకుంటారు, అయితే పూజ వస్తువులను పారవేసేటప్పుడు, పరిశుభ్రత,  మతపరమైన సంప్రదాయాలను మాత్రమే కాకుండా  పర్యావరణం గురించి కూడా  జాగ్రత్తలు తీసుకోవడం  చాలా ముఖ్యం. అందువల్ల పూజ కోసం ఎప్పుడూ స్వచ్ఛమైన,  సహజమైన పదార్థాలను వాడాలి.   ప్లాస్టిక్ లేదా ఇతర హానికరమైన పదార్థాలను నివారించాలి.

నూనె లేదా నెయ్యి..

పూజలో ఉపయోగించిన నెయ్యి పూర్తిగా అయిపోకపోతే దానిని నిల్వ చేసి తదుపరి పూజలో దీపం వెలిగించడానికి ఉపయోగించవచ్చు. దీపంలో నెయ్యిని తిరిగి ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే, నూనె విషయంలో జాగ్రత్త వహించాలి. దీపం పూర్తిగా కాలిపోయేలా పూజకు తగినంత నూనెను మాత్రమే వాడాలి. పూజ తర్వాత మిగిలిపోయిన నూనెను మరే ఇతర ప్రయోజనం కోసం లేదా వంట కోసం ఉపయోగించడం మంచిది కాదట.


అక్షింతలు, పసుపు, కుంకుమ..

పూజలలో ఉపయోగించిన అంక్షతలు,  పసుపు, కుంకుమ తిరిగి ఉపయోగించకూడదు. వాటిని తులసి మొక్క లేదా రావి చెట్టుకు సమర్పించడం మంచిది. కావాలనుకుంటే వాటిని శుభ్రమైన నీటిలో కూడా నిమజ్జనం చేయవచ్చు. పక్షులకు అక్షంతలు  ఆహారంగా వేయవచ్చు.  అయితే ఇందుకోసం బియ్యానికి నెయ్యి, పసుపు అదికంగా వేయకూడదు.

పూజ కోసం చేసిన నైవేద్యాలు, పండ్లు..

పూజ కోసం చేసిన నైవేద్యాల వెనుక ఉన్న అంతరార్థం వాటిని నలుగురికి పంచడమే. ఇది గొప్ప మానవతా గుణం. కొందరు పూజలు చేసుకుని ఎవరికీ పెట్టకుండా అలాగే మిగలబెడుతుంటారు. ఏవైనా మిగిలి ఉంటే, వాటిని ఆవులకు లేదా సమీపంలోని ఇతర జంతువులు,  పక్షులకు తినిపించాలి. పూజకోసం చేసిన  ఆహార పదార్థాలను చెత్తబుట్టలో వేయడం మంచిది కాదు.. ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి దాన్ని గౌరవించాలి.

దుస్తులు..

పూజలో దేవి దేవతలకు వస్త్రాలు సమర్పించాల్సినప్పుడు చీరలు,  రవికె గుడ్డలు, పంచెలు సమర్పిస్తుంటారు. వాటిని తిరిగి మళ్లీ ఏ పూజలోనూ వాడకూడదు. వాటిని ఏవరైనా అవసరంలో ఉన్నవారికి, పేదలకు దానం  చేయవచ్చు. ఇది చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది.

పువ్వులు, దండలు..

పూజ కోసం తెచ్చిన పువ్వులు, దండలను  పూజ సమయంలో ప్రోక్షణ చేస్తారు.  అందుకే పూజలో పూలు మిగిలిపోతే వాటిని తిరిగి వేరే పూజ కోసం లేదా నిత్య పూజలో దేవుళ్లను అలంకరించడానికి వాడకూడదు. అంతే కాదు వాటిని ఎట్టిపరిస్థితులలో చెత్త బుట్టలో వేయకూడదు.  మిగిలి పోయిన పువ్వులను మట్టిలో పాతిపెట్టవచ్చు. లేదంటే ఏదైనా దైవికమైన వృక్షం మూలంలో వేయవచ్చు.  

పత్తి లేదా వత్తులు..

పూజ కోసం తీసుకున్న వత్తులు మిగిలిపోతే వాటిని తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి ఉపయోగించవచ్చట.  లేదంటే మట్టిలో పాతిపెట్టడం కూడా మంచిదేనట. కానీ పొరపాటున కూడా ఈ వత్తులను పారేయకూడదట.

                                        *రూపశ్రీ.