అసలైన జ్ఞానానికి ఓ చక్కని వివరణ!

 

అసలైన జ్ఞానానికి ఓ చక్కని వివరణ!

ఆపద్దతం హససి కిం ద్రవిణార్ధ మూఢ 

లక్ష్మీః స్థిరా న భవతీతి కిమత్ర చిత్రమ్ 

ఏతాన్ ప్రపశ్వని ఘటాలులయన్ర చట్రే 

రిక్తా భవన్తి భరితాః భరితా శ్చ రిక్తాః

పూర్వకాలంలో జలయంత్రా లుండేవి. వర్తులాకారంలో ఉండే ఆ యంత్రానికి కుండలు కట్టి ఉండేవి. యంత్రం తిరుగుతూంటే కుండలు నీటితో నిండేవి. వాటి నుండి నీరు బయటికి వెళ్ళిపోగానే మరో రౌండులో మళ్ళీ కుండలు నిండేవి. ధనం వచ్చిపోవటాన్ని జలయంత్రంలో కుండలు నిండి, ఖాళీ అయిపోయి మళ్ళీ నిండటంతో పోలుస్తున్నారు ఇక్కడ. 

ఐశ్వర్యంతో ఒళ్లు తెలియని ఓ మూఢుడా, ఆపదల్లో ఉన్నవాడిని చూసి ఎందుకు నవ్వుతావు? లక్ష్మి ఒక చోట స్థిరంగా ఉండదు. జలయంత్రాలకు అమర్చిన ఈ తిరిగే ఘటాలను చూడు, నీళ్ళు లేనివి నిండుతూంటాయి. నీళ్ళున్నవి ఖాళీ అయిపోతుంటాయి. ఇది శ్లోకార్థం.

ధనం జగతికి మూలం. ధనం వల్ల అన్ని సౌఖ్యాలూ అమరుతాయి. కానీ అధికంగా ధనం చేరటం వల్ల అది మనుషులను పశువులను చేస్తుంది. ధనం ఉన్నవాడే కాదు, ధనం కోసం అతడి చుట్టూ ఉన్న మనుషులు కూడా పశువులు అయిపోతారు. ధనం ఎక్కడా స్థిరంగా ఉండదు. ఎలా వస్తుందో, ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ధనాన్ని దాచిపెట్టాలని లోభిలా ప్రయత్నించి లాభం లేదు. అందువల్ల వ్యక్తి పాపాన్ని మూట కట్టుకోవటమే కాదు, అతని పిసినారితనం చూసి దాచిపెట్టిన ధనం ఇతరుల పాలవుతుంది. కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేయాలి. సద్వినియోగం కాని ధనం వల్ల ఉపయోగం లేదు. ఇటువంటి నిజాలు బోధించిన మన పూర్వికులు మానవ మనస్తత్వాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకున్నవారు కాబట్టి ఇంతటితో ఆగలేదు. ధనం అంటేనే అసహ్యం, విరక్తి భావనలను కలిగించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం విజ్ఞానంతో కూడిన అసహ్యం, విచక్షణతో కూడిన విరక్తి కలిగించటానికీ పెద్ద పీట వేసింది తప్ప, భయపెట్టి సాధించటానికి కాదు.

మానవుడి మనస్తత్వంలో 'స్వార్థం' ప్రధానపాత్ర వహిస్తుంది. బృహదారణ్య కోపనిషత్తులో ఓ సంఘటన ఉంది. యాజ్ఞవల్యుడు సన్న్యాసం స్వీకరిస్తూ, తన భార్యలను చివరి కోరికలు కోరుకోమంటాడు. ఒక భార్య ధనధాన్యాలు కోరుకుంటుంది. మరో భార్య 'నిజమైన జ్ఞానం' కోరుకుంటుంది. ఆమెకు యాజ్ఞవల్యుడు బోధించిన జ్ఞానసారాంశం ఏమిటంటే…

 'మనిషి పైపైన ఎన్ని ముసుగులు వేసుకున్నా, ఎన్ని సిద్ధాంతాల వెనుక దాచినా, ఆత్మానందం కోసమే ప్రయత్నిస్తాడు. ఈ ఆత్మానందానికి భౌతికరూపమే 'స్వార్థం'. 'స్వార్థం' లేకుండా మనిషి జీవించలేడు. 'ఇది నాది' అనుకోకపోతే మనిషి ముందుకు కదలలేడు. మనిషిలో ఈ భావనను నశింపజేసి సామూహిక భావనలను బలవంతాన కలిగించే ప్రయత్నాలు అనేకుమంది చేశారు భంగపడ్డారు. ఎందుకంటే ఇది 'నాది' అనుకోనిదే మనిషి ఏమీ చేయలేడు. 'నా కోసం' 'నా కుటుంబం కోసం అన్న భావన మనిషికి ఊపునిస్తుంది. ఈ భావన అధికమై, హద్దులు దాటితే వ్యక్తి స్వార్ధపరుడవుతాడు. మానవుడి స్థాయి నుండి దిగజారతాడు. ఈ భావనను అదుపులో ఉంచుకుంటూ 'నాది' కాస్త ఉన్నా మిగతా 'మనది' అనుకొనే ప్రయత్నాలు చేసేవాడు. మానవుడుగా ఎదుగుతాడు. ఈ నాది అన్న భావనను సంపూర్ణంగా త్యజించి, మించిన వ్యక్తి ఉత్తముడవుతాడు. తాత్వికపరంగా చూసినా 'అహం' అన్న భావనను నశింప చేయటమే జ్ఞానానికి దారి తీస్తుంది. మోక్షకారణం అవుతుంది.

                                          ◆నిశ్శబ్ద.