Read more!

భారతీయ ఆధ్యాత్మికత గురువు గురించి ఏమి చెబుతుంది?

 

భారతీయ ఆధ్యాత్మికత గురువు గురించి ఏమి చెబుతుంది?

భర్తృహరి ఓ శ్లోకం రాసారు. ఆయన రాసిన శ్లోకానికి అర్థాన్ని ఓ సారి గమనిస్తే.... రత్నం అది ఉన్న చోటే ఉంటుంది. ప్రపంచం దాని వద్దకు వెళ్ళి దాన్ని గుర్తిస్తుంది. 'పరమహంస లక్షణం కూడా ఇదే. ఇప్పుడు మన సమాజంలో అనేక అవధూతలు, ప్రవక్తలు, దైవావతారాలు, పరమహంసలు ప్రజలలో రకరకాలు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల నుండి ధనం వసూలు చేస్తూ ఆశ్రమాలు కట్టుకొంటున్నారు. పుట్టినరోజు పండుగలు చేసుకుంటున్నారు. కానీ భారతీయ ధర్మంలోని 'పరమహంసోపనిషత్తు' ప్రకారం, నిజమైన పరమహంస రత్నంలాంటి వాడు. ఆయన ఎటూ వెళ్లడు, ఎవరినీ ఏదీ యాచించడు. ప్రజలే ఆయన దగ్గరకు వెళ్తారు. ప్రజలే ఆయన ఖ్యాతిని దశదిశల వ్యాపింపచేస్తారు. ఆయన మహత్తర ఆధ్యాత్మికదీప్తులతో పునీతులవుతారు. ఆయన ఎవరి దగ్గర నుంచీ ఏదీ స్వీకరించడు. ముఖ్యంగా ధనం!

తస్మాత్ భిక్షర్విరణ్యం రనేన న దృష్టం చ న స్పష్టం చ న గ్రాహ్యం చ! 

సన్యాసికి ఇల్లు లేదు, మఠం లేదు. ఎవరి దగ్గర నుంచీ ఏదీ యాచించకూడదు. అతడికి శిష్యులు ఉండకూడదు. ధనం ఉండకూడదు. సన్న్యాసి ధనం వైపు ఆశతో చూస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ధనం తాకితే చండాలుడవుతాడు. ధనం గ్రహిస్తే ఆత్మహంతకుడవుతాడు. కాబట్టి సన్న్యాసి అయినవాడు ధనం వైపు చూడకూడదు. ధనం తాకకూడదు. ధనం గ్రహించకూడదు అంటుంది పరమహంసోపనిషత్తు.

పరమహంసోపనిషత్తు ప్రామాణికంగా అనుకుంటే, ఇప్పటివారిలో ఎందరు నిజమైన పరమహంసలో నిగ్గుతేలుతుంది. అందుకే ఇటువంటి వారు తామరతంపరగా వెలిగి, వారి శిష్యపరమాణువులు తామరతంపరంగా పెరుగుతున్నా, భక్తి మురుక్కాలువల్లో, డ్రైనేజీలా పొంగిపొర్లుతోంది తప్ప ఆధ్యాత్మికాలోచనల అభివృద్ధి, వ్యక్తిత్వవికాసప్రభావాలు సమాజంలో కనిపించడం లేదు.

రమణమహర్షి ఏనాడూ ఎవరినీ ఏదీ యాచించలేదు. ఆయన గుహలో ఓ మూల తపస్సు చేసుకుంటుంటే, ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఆశ్రమం కట్టారు. ఆదరించారు. కానీ ఆయన గుహలో ఎలా ఉన్నాడో, అంతమంది నడుమ ఆశ్రమంలోనూ అలానే ఉన్నాడు.

అరబిందో కూడా అంతే. ఒక్కసారి'పాండిచ్చేరి చేరిన తరువాత ఆయన సంవత్సరానికి ఒక రెండుసార్లు అతి అయిష్టంగా దర్శనం ఇచ్చేవాడు. మళ్ళీ తన ధ్యానలోకంలోకి వెళ్ళిపోయేవాడు. ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఆయన ఎవరినీ ఏమీ యాచించలేదు. కానీ ప్రపంచంపై ఆధ్యాత్మికభావనల జల్లులు కురిపించాడు.

రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వర్ కాళికాలయానికే అంకితం. ఆయన దగ్గరకు ప్రపంచం వెళ్ళింది తప్ప ఆయన ఎవరి దగ్గరకూ వెళ్ళలేదు. తాను ప్రపంచం దగ్గరకు వెళ్ళకూడదు కాబట్టి తన ప్రతినిధిగా వివేకానందను ప్రపంచపర్యటనకు ప్రోత్సహించాడు.

వివేకానంద సైతం అనుక్షణం అన్నింటినీ త్యజించాలన్న సన్న్యాసభావనకూ, గురువాజ్ఞ పాటించక తప్పదన్న భావనకూ నడుమ సంఘర్షణతో తన లక్ష్యాన్ని చిత్తశుద్ధితో సాధించాడు. ధనాన్ని అంటరాని వస్తువు లాగే చూశాడు. గురూజీ గోళ్వల్కర్ సైతం తనలోని ఆధ్యాత్మికభావాలను అణచి సామాజిక నిర్మాణాన్ని దైవకార్యంలా భావించి కర్తవ్యనిర్వహణ చేశారు.

ఇలా నిజమైన గురువులను నిగ్గు తేల్చుకుని గుర్తించటం అత్యంత ప్రధానపాత్ర వహిస్తుంది. అందుకే 'గురుబ్రహ్మ, గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీగురవే నమః' అంటూ గురువును ఉన్నతస్థానంలో ఉంచింది భారతీయ ధర్మం. నిజమైన గురువు ఉత్తమ మార్గం చూపుతాడు. ఇతరులు అయితే... తమ మీద ఆధారపడే బలహీనులుగా మనుషులను మలుస్తారు. ప్రతి వ్యక్తి గమనించవలసిన అంశం ఇది. ఎప్పుడైతే తాను స్వశక్తి మీద కాక ఇతరులపై ఆధారపడుతున్నాడని గ్రహించాడో, వెంటనే అత్యవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని అర్ధం చేసుకోవాలి. ఇదీ భారతీయ ఆధ్యాత్మిక ధర్మం గురువు విషయంలో బోధించే విషయం. 

                                ◆నిశ్శబ్ద.