ఇతరులను సరిదిద్దడం ఎంతవరకు సరైన పని!

 

ఇతరులను సరిదిద్దడం ఎంతవరకు సరైన పని!

చాలామంది ఇతరుల విషయంలో తొందరగా రియాక్ట్ అవుతుంటారు. వారు తప్పు చేస్తున్నారని, తప్పుగా ఉంటున్నారని వారి తప్పు వారికి చెప్పి వారి ప్రవర్తన మార్చాలని అనుకుంటారు. కానీ ఇతరులను సరిచేసే స్వభావాన్ని మనం మార్చుకోవాలి. ఇతరులను సరిచేయడం, నియంత్రించడంలో విఫలమైతే చాలా కలత చెందుతాం. జీవితంలో కొన్ని విషయాలను జారవిడవాలి. అంటే మన కర్తవ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నట్లు కాదు. దీని భావమేమంటే మన కార్యక్రమాల పరిధిలోకి రాని విషయాలలో మనం జోక్యం చేసుకోకూడదు. మన స్వధర్మానికి మనం కట్టుబడి ఉండాలి. కానీ ఇతరుల స్వధర్మంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయకూడదు. 

ఇతరులను సరిచేయడం, శిక్షించడం ఒక నాయకునికీ, సంస్కరణకర్తకూ స్వధర్మం అవుతుంది, అంతేగాని ప్రతి ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ విషయాన్ని సరియైన దృక్పథంతో అర్థం చేసుకోవాలి. ఇది బాధ్యతల నుండి పారిపోవడమని అనిపించవచ్చు కానీ కచ్చితంగా అది కానే కాదు. మనం జీవితంలో తీసుకున్న పాత్రను బట్టే మన బాధ్యతలు కూడా ఉంటాయి. సమాజంలోని వ్యక్తులందరినీ సరిచేయడం ఆధ్యాత్మిక సాధకుని బాధ్యత కాదు. నైతిక, పారమార్థిక విలువలకు ఆలవాలంగా ఇతరులకు ఆదర్శంగా ఉండటమే అతని బాధ్యత. ఆ విధంగా ఉండటం వల్లే అతను సమాజంలో మార్పు తీసుకురాగలడు. జీవన విధానం ద్వారా ఇతరులలో మౌనపరిణామం తీసుకువస్తాడు.

మనస్సును పరిశుద్ధం చేసు కోవాలంటే ఇంతకు ముందు పేర్కొన్న దృక్పథాలను అలవరచుకొని సర్దుబాటుతనంతో ముందుకు సాగాలి. వస్తువులు గాని, వ్యక్తులు గాని, ఆఖరుకు పరిస్థితులు. గాని మనల్ని కలతపరచలేవు. వాటి పట్ల మన దృక్పథం, మన - స్పందనలే నిజంగా మన ప్రశాంతతను భంగం చేస్తాయి. మన మనోభావమే అత్యంత ముఖ్యమైనది. ప్రపంచంలోని ఇతర భాగాలలో, ప్రదేశాలలో ఏం జరుగుతోందన్నదాని గురించి మనమేమీ పట్టించుకోం. మనకేం జరుగుతోందన్న దాని గురించి, మన జీవితంలో జరిగే వివిధ సంఘటనలకు మన ప్రతిస్పందన గురించే మనం ఆలోచించాలి. కాబట్టి మనకు కావలసింది. పరిస్థితులు, వ్యక్తుల పట్ల సర్దుబాటు దృక్పథం.

                                    ◆నిశ్శబ్ద.