అరుంధతి న్యాయం అంటూ ఉంటారు.. అది మన జీవితానికి ఎలా దోహదం చేస్తుందంటే!

 

అరుంధతి న్యాయం అంటూ ఉంటారు.. అది మన జీవితానికి ఎలా దోహదం చేస్తుందంటే!

వసిష్ఠ మహర్షి సప్తఋషులలో ఒకరు. ఆయన భార్య అరుంధతి. ఆమె మహాపతివ్రత. సప్తఋషి మండల నక్షత్ర సమూహంలో వసిష్ఠుని ప్రక్కన అరుంధతి తారగా ప్రకాశిస్తూ ఉంటుంది. ముని పత్నులెవ్వరికీ దక్కని విశిష్ట స్థానం ఆమెకు లభించింది. ఈనాటికీ వివాహ సమయాల్లో వధూవరులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించడం మన సంప్రదాయం.

ఈ అరుంధతీ నక్షత్రం ఆకాశంలో మిణుకు మిణుకు మంటూ ప్రకాశిస్తూ ఉంటుంది. వరుడు మొదటి పర్యాయం వధువును ఇంటికి తీసుకొనివచ్చినప్పుడు, అతడు ఆమెకు అరుంధతీ నక్షత్రంను చూపుతాడు. ఆమె ఆ చిన్న నక్షత్రాన్ని సులభంగా గుర్తించడానికి వీలుగా ముందు చెట్టుకొమ్మను గానీ, దగ్గరలో ఉన్న మరేదైనా ఎత్తైన ప్రదేశాన్నిగానీ చూపిస్తూ ఆ మార్గంలోనే ఆకాశంలోకి చూపుసారించమని చెబుతాడు. ఈ విధంగా అతడు ఆమె అరుంధతీ నక్షత్రాన్ని దర్శించేలా చేస్తాడు. ఈ పద్ధతిని 'అరుంధతీ న్యాయం' అంటారు.

ఒక మహిళా కళాశాలలో ఒక ఉపాధ్యాయిని విద్యార్థినులకు భారత నారీమణుల పాతివ్రత్యం గురించి, భారతీయ సంస్కృతీ వైభవం గురించి బోధిస్తోంది. అలా ఆ ఉపాధ్యాయిని అరుంధతి పాతివ్రత్యం గురించి వివరిస్తూ... "అరుంధతిని చూడడం ఎంత కష్టమో” అని చెప్పగానే, ఒక విద్యార్థిని లేచి నిలబడి "అదేంటి మేడం! అలా అంటారు. మీకంత కష్టంగా ఉంటే చెప్పండి, నేను మీకు ఈ రోజే. 'అరుంధతి'ని చూపిస్తాను. నేను ఇప్పటికి నాలుగుసార్లు చూశాను" అని అంది.

ఆ అమ్మాయి మాటలు విని మనకు నవ్వొచ్చినట్లు, ఆ ఉపాధ్యాయినికి చాలా కోపం వచ్చి ఉంటుంది. అసలు విషయానికి చెప్పుకుంటే..  మన జీవిత ఆశయాన్ని చేరుకోవడానికి అరుంధతీ న్యాయ ప్రాధాన్యం చాలా ఉంది.

ఉన్నతి పొందాలనుకునే ఏ వ్యక్తి అయినా మొదట ఆదర్శాన్ని ఎంచుకోవాలి. కానీ ఉన్నత ఆదర్శాలు అంత త్వరగా కంటికి కనపడవు. కనపడ్డా అంత సులభంగా తలకెక్కవు. మనం రెండు రకాల ప్రపంచాలలో జీవిస్తున్నాం. ఒకటి కంటికి కనిపించే బాహ్యప్రపంచం, అది స్థూలం. మరొకటి కంటికి కనపడని అంతర ప్రపంచం, అది సూక్ష్మం. అంతర ప్రపంచాన్ని చేరుకోవడానికి అన్వేషణ మొదట బాహ్య ప్రపంచం నుండే మొదలవుతుంది. మన సుఖ సంతోషాలకు ఈ బాహ్య ప్రపంచమే ఆధారమనిపిస్తుంది.

'మనిషి' అంటే 'మనిషి' (కాంచనం-కామం) అని భావించి, జీవితాంతం విషయ సుఖాలలో మునిగితేలే వారు చార్వాకుల సంతతికి చెందుతారు. అప్పుచేసి పప్పుకూడు తింటూ, మన పబ్బం గడిస్తేచాలు అనుకునే 'చార్వాకులు' సూర్యచంద్రులు ఉన్నంత వరకు మహాభేషుగ్గా కాలం గడిపేస్తారు.

కానీ ఎలాంటి చార్వాకుల సంతతికి చెందినవాడైనా ఎప్పుడో ఒకప్పుడు తనలో అంతర్నిహితంగా ఉన్న దివ్యాత్మను దర్శించడానికి ప్రయత్నిస్తాడు. పూజ, జపధ్యానాలను అనుష్ఠిస్తూ పరమాత్మను దర్శించడానికి అన్వేషణ ప్రారంభిస్తాడు. అప్పుడు ఈ బాహ్య ప్రపంచం ఒక అడ్డంకిగా అనిపించదు. అది ఒక సమస్యగా కాక స్పందనగా మారుతుంది. ఈ జగత్తులో దేనిని చూసినా ఆ పరమాత్ముడే గుర్తుకు వస్తాడు. అనంత చైతన్యమే గోచరిస్తుంది. వకీలు కనిపించగానే న్యాయస్థానం తలపుకు వచ్చినట్లు, గుళ్ళు గోపురాలు భగవంతుణ్ణి గుర్తుకు తెస్తాయి. 

బాహ్య ప్రపంచంలోని గుర్తుల ఆధారంతో ఆకాశంలో ప్రకాశిస్తున్న అరుంధతీ నక్షత్రాన్ని గుర్తించినట్లు, స్థూల ప్రపంచం ఆధారంతో మన అంతరంగంలో ప్రకాశిస్తున్న దివ్యాత్మను దర్శించాలన్న సత్యాన్ని బోధిస్తోంది 'అరుంధతీ న్యాయం'.

                                  ◆నిశ్శబ్ద.