దశమహావిద్యలు అంటే ఏమిటి?

 

 

దశమహావిద్యలు అంటే ఏమిటి?

 

 

ఇటీవలి కాలంలో ‘దశమహావిద్యలు’ అనే మాట తరచుగా వినిపిస్తోంది. ఈ దశమహావిద్యలు అనేవి అనాదిగా మన హైందవ మంత్ర, తంత్ర జగత్తులో వున్నప్పటికీ, అవి ఏ కొద్దిమందికో తెలిసిన విషయాలు. ఏ కొద్దిమందో సాధన చేసే అంశాలు. సోషల్ మీడియా విస్తృతి బాగా పెరిగిన ఈ మధ్యకాలంలో ఈ దశమహావిద్యల గురించిన సమాచారం విరివిగా అందుతోంది. ఈ మహావిద్యలను సాధన చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అసలేమిటీ దశమహావిద్యలు?

దశమహావిద్యలు అంటే మహా శక్తివంతురాలైన అమ్మవారిని కాళీ, చిన్నమస్త, తార, మాతంగి, త్రిపుర సుందరి, కమల, భువనేశ్వరి, ధూమావతి, భైరవి, బగళాముఖి... ఇలా పది శక్తుల రూపంలో రూపాంతరం చేసి, ఏ శక్తిని ఆవిధంగా సాధన చేయడమే ఈ విద్యల ఆంతర్యం. 

1. కాళి - నల్లటి వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయ సంప్రదాయం చెబుతోంది. తంత్ర మార్గంలో శ్రీకాళీ మహా విద్యని సాధన చేస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శత్రునాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2. తార - దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్‌శుద్ధి, ఐశ్వర్యం, కష్ట నివారణ సాధకుడికి లభిస్తుంది.

3. త్రిపుర సుందరి - అరుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతస్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే సాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసిక శాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4. భువనేశ్వరి - దశ మహావిద్యలలో నాలుగవ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి త్రినేత్రంతెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5. భైరవి - దశమహావిద్యలలో ఐదవ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణిఅయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6. ప్రచండ చండిక - దశ మహావిద్యలలో ఆరవ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో ఛిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7. ధూమావతి - దశ మహావిద్యలలో ఏడవ మహావిద్య. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8. బగళాముఖి - పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందిన ఎనిమిదవ మహావిద్య. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యాన్ని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్తంభింపచేసి, వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9. మాతంగి - మాతా.. మరకత శ్యామా.. మాతంగీ అని పిలుచుకునే శ్రీ మాతంగీదేవి మరకత వర్ణంతో ప్రకాశిస్తుంది. తొమ్మిదవ మహావిద్య. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్‌శుద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10. కమలాత్మిక - పద్మాసనంలో కూర్చుని వుండి, స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో పదవ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈ దేవికి మార్గశిర అమావాస్య తిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.